You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
భారత్-చైనా సరిహద్దు: గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికులు మరణించారా? ఆ దేశం ఏమంటోంది?
తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయ ప్రాంతంలో భారత్, చైనాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)పై కొన్ని దశాబ్దాల అనంతరం మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి.
భారత్, చైనా సైనికుల మధ్య అక్కడ సోమవారం (జూన్ 15వ తేదీ) రాత్రి జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది బిహార్ రెజిమెంట్‌కు చెందినవారు.
మొదట ముగ్గురు సైనికులు మరణించినట్లు సమాచారం వెల్లడైంది. తీవ్ర గాయాలపాలైన మరో 17 మంది కూడా మరణించినట్లు ఆ తర్వాత భారత సైన్యం స్వయంగా ప్రకటించింది.
‘‘రెండు దేశాల సీనియర్ కమాండర్ల మధ్య సమావేశం జరిగింది. ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అంగీకారం కుదిరింది. చర్చల ప్రకారం అంతా సాగుతుందని మేం భావించాం. కానీ, జూన్ 15 రాత్రి చైనా సైన్యం ఒక్కసారిగా తీరు మార్చుకుంది. ఏకపక్ష నిర్ణయం తీసుకుని యథాస్థితికి భంగం కలిగించింది. దీని ఫలితంగానే రెండు పక్షాల మధ్య హింస చెలరేగింది. రెండు వైపులా అనవసరంగా ప్రాణాలు పోయాయి. ఒప్పందాన్ని చైనా నిజాయతీగా పాటించలేదు’’ అని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ అన్నారు.
20 మంది సైనికుల ప్రాణాలు పోవడంతో భారత్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయం గురించి మాట్లాడాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.
మోదీ ఓ వీడియో సందేశం ద్వారా ఈ అంశం గురించి మాట్లాడారు. భారత సైనికుల ప్రాణ త్యాగం వృథా పోదని అన్నారు. భారత సైనికులు చంపుతూ చనిపోయారని మోదీ అన్నారు. చైనా వైపు కూడా ప్రాణ నష్టం జరిగిందని పరోక్షంగా ఆయన చెప్పారు.
చైనా సైనికులు చనిపోయారా?
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో చైనా సైనికులు కూడా మరణించారని భారత మీడియాలో మంగళవారం కథనాలు వచ్చాయి. కొన్ని సంస్థలు వారి సంఖ్యను కూడా పేర్కొన్నాయి. అయితే, ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బుధవారం ఈ వార్తల గురించి ఓ ప్రశ్న అధికారులకు ఎదురైంది. ‘భారత మీడియాలో వస్తున్న వార్తలను ధ్రువీకరిస్తున్నారా?’ అని పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధి అడిగారు.
దీనికి బదులుగా... ‘‘మీకు వెల్లడించేందుకు నా వద్ద సమాచారమేదీ లేదు. ఘటన జరిగినప్పటి నుంచి రెండు దేశాలూ చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకునేందుకు, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాయి’’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి చావో లిజియాన్ చెప్పారు.
హింస ఎందుకు చెలరేగింది?
‘‘ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ప్రగతిశీల, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లున్న దేశాలైన భారత్, చైనాల మధ్య విభేదాల కన్నా ఉమ్మడి ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. తమ తమ పౌరుల ప్రయోజనాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా సరైన మార్గంలో సంబంధాలను కొనసాగించడం రెండు దేశాలకూ అవసరం. ఒక అంగీకారానికి వచ్చి, దాన్ని పాటించాలి. భారత్ మాతో కలిసి పనిచేస్తుందని, కలిసి ముందుకు సాగుతుందని మాకు నమ్మకం ఉంది’’ అని లిజియాన్ అన్నారు.
‘సరిహద్దుల్లో మళ్లీ ఇలాంటి హింస తలెత్తదని ఆశించవచ్చా?’ అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ... ‘‘కచ్చితంగా మేమైతే పోట్లాటను కోరుకోవడం లేదు’’ అని వ్యాఖ్యానించారు.
గల్వాన్ లోయకు సంబంధించి ఇదివరకు వివాదాలు రాలేదు. మరి, ఒక్కసారిగా సమస్య ఎందుకు వచ్చింది? గల్వాన్ లోయపై సార్వభౌమత్వం ఎప్పుడూ చైనాకే ఉందని, ఇందులో వివాదమేమీ లేదని ఆ దేశ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఓ ప్రకటన చేసింది. వీటన్నింటి గురించి పీటీఐ వార్తా సంస్థ లిజియాన్‌ను ప్రశ్నించింది.
‘‘ఎల్ఏసీ వద్ద చైనా వైపే ఘటన జరిగింది. ఈ విషయంలో చైనా నిరూపించుకోవాల్సిందేమీ లేదు’’ అని ఆయన చెప్పారు.
కానీ, గల్వాన్ లోయ తమదని చైనా చేసిన వాదనను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.
సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అంగీకారం కుదిరినప్పుడు ఉద్రిక్తతలు ఎలా ఏర్పడ్డాయని రాయిటర్స్ వార్తా సంస్థ ప్రతినిధి చావో లిజియాన్‌ను ప్రశ్నించారు.
‘‘భారత్, చైనా సైనికపరంగా, దౌత్యపరంగా సంప్రదింపులు జరుపుతున్నాయి. జూన్ 6న రెండు పక్షాల మధ్య కమాండర్ల స్థాయిలో చర్చలు జరిగాయి. శాంతిపూర్వకంగా పరిష్కారానికి రావాలని రెండు దేశాలూ ఇందులో అంగీకరించుకున్నాయి. కానీ, జూన్ 15న దీన్ని భారత సైనికులు ఉల్లంఘించారు. అక్రమ కార్యకలాపాల కోసం ఎల్ఏసీ దాటారు. చైనా సైనికులను రెచ్చగొట్టి, వారిపై దాడి చేశారు. రెండు పక్షాల మధ్య హింస చెలరేగడానికి ఇదే కారణం. చైనా ఈ విషయమై తీవ్ర అభ్యంతరం లేవనెత్తింది. భారత్ తమ సైనికులను కఠినంగా నిలువరించాలని సూచించింది. ఏకపక్షంగా చేపట్టే ఎలాంటి చర్యలైనా సమస్యను మరింత పెద్దదిగా చేస్తాయి’’ అని లిజియాన్ అన్నారు.
భారత్‌ను చైనా మోసం చేసిందా?
కమ్యూనిస్టు నియంతృత్వ పాలనలో చైనా ఓ దుండగ రాజ్యంగా మారిందని ప్రముఖ విశ్లేషకుడు బ్రహ్మ చెలానీ ట్విటర్‌లో అన్నారు.
‘‘ద్వైపాక్షిక ఒప్పందాలను గానీ, అంతర్జాతీయ నియమాలను గానీ చైనా గౌరవించదు. ఇతర దేశాలపై ఉపయోగించుకునేందుకే ద్వైపాక్షిక ఒప్పందాలను వాడుకుంటుంది. చైనా మాత్రం వాటికి కట్టుబడి ఉండదు. భారత్ కూడా ఇదే వలలో చిక్కుకుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
‘‘1993 నుంచి ఇప్పటివరకూ చైనాతో భారత్ ఐదు సరిహద్దు నిర్వహణ ఒప్పందాలు భారీ హంగామా నడుమ చేసుకుంది. వీటిలో ఏదీ చైనా అతిక్రమణలకు అడ్డుగా నిలవలేకపోయింది. చైనా తాజా అతిక్రమణ ఇది. గుట్టుగా ఆ దేశం భారత భూభాగాన్ని అక్రమించింది. అది ఎప్పటి నుంచో తమ భూభాగంగా ఉందని ఇప్పుడు అంటోంది. గల్వాన్ లోయ తమదని చైనా వాదించడం ఇదే మొదటిసారి. 1962 యుద్ధం తర్వాత గల్వాన్ లోయ, దాని సమీపంలోని వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న ఎత్తైన ప్రాంతాల్లోకి చైనా ఎప్పుడూ చొరబడలేదు. వాటిపై సైనికులను మోహరించుకుండా ఉంచి, భారత్ పెద్ద తప్పు చేసింది. వ్యూహాత్మకంగా ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది’’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- 20 మంది భారత సైనికులు మరణించారు.. భారత సైన్యం అధికారిక ప్రకటన
- భయమేమీ లేదని అమ్మకు భరోసా ఇచ్చాడు.. మరుసటి రోజే చైనా సైనికుల చేతిలో చనిపోయాడు
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- నేపాల్‌తో చైనా స్నేహం భారత్‌కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్‌ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి గంటల్లో ఏం జరిగిందంటే..
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: టీవీ అతనిని తారని చేసింది... అదే టీవీ అతనిని పదే పదే చంపింది...
- సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 50 కలలు.. భౌతిక శాస్త్ర ప్రయోగాలు, విశ్వం, ప్రకృతి గురించి కన్న కలల్లో నెరవేరనివి ఎన్నంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)