‘చైనా సైనికుడి ఎడ‌మ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’

    • రచయిత, కేకే తివారీ
    • హోదా, మేజ‌ర్ జ‌న‌ర‌ల్ (రిటైర్డ్)

1962 అక్టోబ‌రు 19 రాత్రి నేను గూర్ఖాల‌తోపాటు గ‌డిపాను. మ‌ర్నాడు ఉద‌యం రాజ్‌పుత్‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్దామ‌ని అనుకున్నాను. అయితే నేను అనుకున్న‌ట్లు జ‌ర‌గ‌లేదు.. చైనా చెప్పిన‌ట్లు చేయాల్సి వ‌చ్చింది.

మ‌రుస‌టి రోజు రాజ్‌పుత్‌ల దగ్గ‌ర‌కు వెళ్లాను.. అయితే అది యుద్ధ ఖైదీగా. ఉద‌యం భారీ బాంబు శ‌బ్దాల‌ మోత‌ల న‌డుమ నేను నిద్ర‌లేచాను.

నేను ఎలా వెళ్లానో తెలియ‌దు కానీ.. నా బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఇంకొక‌ బంక‌ర్‌లోకి వెళ్లాను. అక్క‌డ ప్ర‌ధాన కార్యాల‌యంతో రేడియోల ద్వారా అనుసంధానం అయ్యేందుకు మా రెజిమెంట్‌కు చెందిన ఇద్ద‌రు సైనికులు ప్ర‌య‌త్నిస్తున్నారు.

టెలిఫోన్ తీగ‌ల‌న్నింటినీ ఎవ‌రో తెంచేశారు. అయితే ఎలాగోలా ప్ర‌ధాన కార్యాల‌యంతో రేడియో క‌నెక్ష‌న్ కుదిరింది. ఇక్క‌డ భారీగా బాంబులు పేలుతున్నాయ‌ని వారికి నేను తెలియ‌జేశాను.

అంత ద‌గ్గ‌ర‌గా ఓ చైనా సైనికుణ్ని చూడ‌టం అదే తొలిసారి

కొద్దిసేప‌టికి తూటాలు ఆగిపోయాయి. అంతా నిశ్శ‌బ్దంగా అనిపించింది. మ‌ళ్లీ కొంత‌సేప‌టి త‌ర్వాత చిన్న కొండ‌ల చాటు నుంచి కాల్పులు మొద‌ల‌య్యాయి. చైనా సైనికులు ఎర్ర రంగు ఖాకీ దుస్తులు ధ‌రించి బంక‌ర్‌వైపు కాల్పులు జ‌ర‌ప‌డాన్ని నేను చూశాను.

నేను, ఇద్ద‌రు సిగ్న‌ల్ మెన్‌లు మాత్ర‌మే మిగిలామ‌ని.. అంద‌రూ మ‌మ్మ‌ల్ని వ‌దిలేసి వెళ్లిపోయార‌ని.. అప్పుడే నాకు అర్థ‌మైంది.

అంత ద‌గ్గ‌ర‌గా ఓ చైనా సైనికుణ్ని చూడ‌టం అదే తొలిసారి. నా గుండె ద‌డ వేగం పెరిగింది. చైనా సైనికుల మొద‌టి బృందం మ‌మ్మ‌ల్ని దాటుకొని వెళ్లిపోయింది.

దీంతో బంక‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చి.. ప్ర‌ధాన కార్యాల‌యం వైపుగా ప‌రిగెడ‌దామ‌ని అనుకున్నాం. ఇంత‌లోనే రెండో బృందం మా వైపు రావ‌డాన్ని చూశాం.

వారు ఆగిఆగి కాల్పులు జ‌రుపుతున్నారు. అంతేకాదు ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం బంక‌ర్ల‌ను గాలిస్తున్నారు. లోప‌ల భార‌త సైనికులు ఎవ‌రూ ప్రాణాల‌తో లేకుండా గ్రెనేడ్లు విసురుతున్నారు.

కుళాయి నుంచి నీళ్లు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది..

అప్పుడు నా ద‌గ్గ‌ర 9ఎంఎం పిస్తోలు ఉంది. ఒక్క తూటా కూడా పేల్చ‌ని ఆ తుపాకీని వారికి దొర‌క్కుండా చేయాల‌ని అనుకున్నాను. ఎంత ద‌య‌నీయ ప‌రిస్థితుల్లో ఉన్నా.. ఈ తుపాకీలోని తూటాలన్నీ వాడేయాల‌ని అనుకున్నాను.

చైనా సైనికులు బంక‌ర్‌వైపు వ‌స్తుండ‌గా.. మొత్తం తూటాల‌న్నీ వారిపై గురిపెట్టాను. వారిలో ఒక‌రికి ఎడ‌మ క‌న్నుపై తూటా త‌గిలింది. వెంటనే వాడు కింద‌ప‌డి దొర్లాడు.అత‌డు చ‌నిపోయాడ‌ని అనుకుంటున్నా. ఎందుకంటే అత‌డు క‌నీసం అర‌వ‌లేదు కూడా. ఇంకో సైనికుడి భుజంలో తూటా దించాను. అత‌డు కూడా కింద ప‌డ్డాడు.

ఆ త‌ర్వాత ఒక్క‌సారిగా.. చైనా సైనికులు మా బంక‌ర్‌వైపు బుల్లెట్ల వ‌ర్షం కురిపిస్తూ, అరుస్తూ దూసుకొచ్చారు. మాలో ఒక సిగ్న‌ల్‌మ్యాన్‌కు తీవ్రంగా తూటా గాయాల‌య్యాయి.

కుళాయి నుంచి వేగంగా నీళ్లు బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు ఆయ‌న శ‌రీరం నుంచి ర‌క్తం రావ‌డం నాకు ఇప్ప‌టికీ గుర్తుంది.

అప్పుడు ఇద్ద‌రు చైనా సైనికులు మా బంక‌ర్‌లోకి దూకారు. రైఫిల్ వెనుక పిడితో న‌న్ను కొట్టారు. బంక‌ర్ నుంచి బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి చిత‌క‌బాదారు. వారితోపాటు తీసుకెళ్లి.. ఒక ద‌గ్గ‌ర కూర్చోమ‌న్నారు.

చైనా సైనికులు చాలా అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు.

వ‌చ్చీరాని ఇంగ్లిష్ మాట్లాడ‌గ‌లిగే ఓ సైన్యాధికారి కొద్దిసేప‌టి త‌ర్వాత నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చాడు. భుజంపైనున్న నా ర్యాంకును చూసి.. చాలా అగౌర‌వంగా ప్ర‌వ‌ర్తించాడు.

నా ప‌క్క‌నే ఓ గూర్ఖా సైనికుడు ప‌డున్నాడు. అత‌డు నా వైపుచూసి న‌న్ను గుర్తుపట్టి.. కొంచెం నీళ్లు ఇవ్వ‌మ‌ని అడిగాడు.

అత‌డికి సాయం చేసేందుకు నేను ముందుకు దూకాను. అయితే చైనా కెప్టెన్ న‌న్ను కొట్టి.. వ‌చ్చీరాని ఇంగ్లిష్‌లో తిట్టాడు. "స్టుపిడ్ క‌ల్న‌ల్ కూర్చో.. నువ్వు యుద్ధ‌ఖైదీవి నేను చెప్పేవ‌ర‌కూ క‌ద‌లొద్దు. క‌దిలితే కాల్చేస్తా"అని అరిచాడు.

ఆ త‌ర్వాత నామ్కా చూ న‌ది వైపుగా మ‌మ్మ‌ల్ని తీసుకెళ్లారు. మొద‌టి మూడు రోజులు మాకు తిన‌డానికి ఏమీ ఇవ్వ‌లేదు. త‌ర్వాత ఉడ‌క‌బెట్టిన ఉప్పుడు బియ్యం, వేపిన ముల్లంగి దుంప‌లు ఇచ్చారు.

హృద‌యాన్ని క‌దిలించే దృశ్యాలు

అక్టోబ‌రు 26న మేం చెన్ యె యుద్ధ‌ఖైదీల శిబిరానికి వ‌చ్చాం. మొద‌టి రెండు రోజులు మ‌మ్మ‌ల్ని చీక‌ట్లో నీళ్ల‌మ‌య‌మైన గ‌దిలో ఒంట‌రిగా ఉంచారు. త‌ర్వాత తీవ్రంగా గాయ‌ప‌డ్డ క‌ల్న‌ల్ రీఖ్‌ను కూడా నా గ‌దిలోకి తీసుకువ‌చ్చారు.

ఆ శిబిరంలో.. మ‌మ్మ‌ల్ని నాలుగు భాగాలుగా విభ‌జించారు. అధికారులు, సైనికుల్ని విడిగా ఉంచారు. ప్ర‌తి బృందానికీ వంట‌గ‌ది విడిగాఉండేది. అక్క‌డ చైనా సైనికులు సూచించిన భార‌త సైనికులు.. అంద‌రికీ వంట చేసేవారు.

అల్పాహారం ఉద‌యం 7 నుంచి 7.30 వ‌ర‌కు పెట్టేవారు. మ‌ధ్యాహ్న భోజ‌న స‌మ‌యం ప‌ది నుంచి 11 వ‌ర‌కు. రాత్రి భోజ‌నం మాత్రం సాయంత్రం మూడు నుంచి మూడ‌న్న‌ర మ‌ధ్య‌లో ఉండేది.

మేం ఉంటున్న గ‌దుల‌కు త‌లుపులు, కిటికీలు లేవు. బ‌హుశా చైనా సైనికులు వీటిని వంట చెర‌కుగా ఉప‌యోగించి ఉండొచ్చు. నేను గ‌దిలోనే ఎక్కువ స‌మ‌యం గ‌డిపేవాణ్ని.

అందమైన చైనా డాక్టర్‌తో ప్రేమలో పడ్డాం

మొద‌టి రెండు రాత్రులూ చ‌లిలో వ‌ణికిపోయాం. మ‌మ్మ‌ల్ని తీసుకొచ్చేట‌ప్పుడు ఒక గ‌డ్డిమోపు క‌నిపించింది. దీన్ని వాడుకోవ‌చ్చా? అని చైనా సైనికుల్ని అడిగితే.. స‌రేన‌న్నారు. ఆ గ‌డ్డి మోపును దుప్ప‌టిగా, ప‌రుపుగా వాడుకున్నాం.

న‌వంబ‌రు 8న త‌వాంగ్‌ను చైనా ఆధీనంలోకి తీసుకుంద‌ని తెలియ‌గానే మేం చాలా బాధ‌ప‌డ్డాం. అప్ప‌టివ‌ర‌కు యుద్ధం ఏ దిశ‌గా వెళ్తోందో మాకు తెలియ‌లేదు.

1942, న‌వంబ‌రు 4న నేను భార‌త సైన్యంలో చేరిన‌ట్టు వారికి ఎలాగో తెలిసింది. నా 20వ వార్షికోత్స‌వాన్ని జ‌రిపేందుకు ఓ చైనా అధికారి 4 న‌వంబ‌రు 1962న నా దగ్గరకు చిన్న వైన్ బాటిల్‌తో వ‌చ్చాడు.

భార‌త సైనికులను ప్ర‌భావితం చేసేందుకు చైనా సైనికులు.. పండుగ‌ల నాడు మంచి ఆహారం ఇచ్చేవారు. భార‌త సినిమాలూ చూపించేవాళ్లు.

శిబిరంలో ఓ అంద‌మైన చైనా డాక్ట‌ర్ కూడా ఉండేది. ఆమె రీఖ్‌ను చూడ‌టానికి వ‌స్తూ ఉండేది. నిజం చెప్పాలంటే మేమంతా ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డాం.

రెడ్‌క్రాస్ నుంచి పార్సిల్‌

డిసెంబ‌రు చివ‌రినాటికి యుద్ధంలో ప‌ట్టుబ‌డిన ఖైదీల కోసం రెడ్ క్రాస్ రెండు పార్సిల్స్ పంపింది. ఒక‌దానిలో వెచ్చ‌టి దుస్తులు, ట‌వ‌ల్‌, బూట్లు ఉన్నాయి. రెండో దాంట్లో ఆహార ప‌దార్థాలు, చాక్లెట్లు, పాలు, జామ్‌, బ‌ట‌ర్‌, చేప‌లు, పంచ‌దార‌, సిగ‌రెట్లు, బిస్కెట్లు, విట‌మిన్ మాత్ర‌లు ఉన్నాయి.

నవంబ‌రు 16న తొలిసారి ఇంటికి లేఖ‌లు రాసేందుకు మ‌మ్మ‌ల్ని అనుమ‌తించారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్‌ల‌కు టెలిగ్రామ్‌లు కూడా పంపించుకోవ‌చ్చ‌ని చెప్పారు. అయితే మా లేఖ‌ల్ని వారు చ‌దివేవారు. అందుకే చైనాకు అభ్యంత‌ర‌క‌రంగా ఉండే వ్యాఖ్య‌లేమీ రాసేవాళ్లంకాదు.

ఒక‌ లేఖ చివ‌ర్లో నాకు వెచ్చ‌టి దుస్తులు, ఆహార ప‌దార్థాల‌ను రెడ్‌క్రాస్ ద్వారా పంపాల‌ని కోరాను. మా పాప అభా... ఈ లేఖ‌ను అర్థంచేసుకొని వాళ్ల అమ్మ‌కు చెప్పేది. నాన్న‌కు చాలా చ‌లిగా ఉంద‌ని, ఆక‌లి వేస్తోంద‌ని వివ‌రించేది.

కొన్నిసార్లు చైనా సైనికులు భార‌త పాట‌లు పెట్టేవారు. ‘ఆజా రే మే తో క‌బ్ సే ఖ‌డీ ఇస్ పార్’ అంటూ ల‌తా మంగేష్క‌ర్ పాట‌ను ప‌దేపదే వినిపించేవారు. అది విన్న‌ప్పుడ‌ల్లా మా ఇల్లు గుర్తొచ్చేది.

బ‌హ‌దూర్ షా జ‌ఫర్ గ‌జ‌ల్స్‌

ఒక‌రోజు బ‌హ‌దూర్ షా జఫ‌ర్ గ‌జ‌ల్స్‌ను ఓ చైనా మ‌హిళ పాడిన‌ప్పుడు చాలా ఆశ్చ‌ర్యంగా అనిపించింది.

దిల్లీ నుంచి రంగూన్‌కు తీసుకెళ్లాక జఫ‌ర్ రాసిన పాట‌ల‌ను నాతో ఉండే ర‌త‌న్‌, ఆమె క‌లిసి పాడేవారు. ఉర్దూ మాట్లాడే ఆమె బ‌హుశా ల‌ఖ్‌న‌వూలో చాలా ఏళ్లు ఉండి ఉండొచ్చు.

అక్క‌డ అద్భుత‌మైన‌ చైనా సూదుల వైద్యాన్ని మేం చూశాం. నా స్నేహితుడు రీఖ్‌.. మైగ్రేన్ త‌ల‌నొప్పి పూర్తిగా పోయింది. అది సూది మందు వ‌ల్లో లేదా ఆ అంద‌మైన డాక్ట‌ర్ వ‌ల్లో మీరే ఊహించుకోండి.

భార‌త్‌కు పంపేముందు చైనాను చూపించాల‌ని చైనా సైనికులు నిర్ణ‌యించారు. వుహాన్‌లో మ‌రో ప‌ది మంది భార‌త అధికారులు మ‌మ్మ‌ల్ని క‌లిసేందుకు వ‌చ్చారు. వారిలో మేజ‌ర్ ధ‌న్ సింగ్ థాపా ఒక‌రు. ఆయ‌న్ను ప‌ర‌మ‌వీర్ చ‌క్రతో భార‌త ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

బీబీసీ రేడియో వినే స్వేచ్ఛ‌

మేం రేడియో వినేందుకు ఇక్క‌డ అనుమ‌తించారు. అప్పుడు ఆల్ ఇండియా రేడియో, బీబీసీల‌ను తొలిసారి చైనాలో విన్నాం.

చైనాలో ప‌ర్య‌టించేట‌ప్పుడు.. ఓ చైనా సైనికుడు మంచి మంచి బ‌ట్ట‌లు వేసుకొని రోజంతా మాతోనే ఉండేవాడు. అత‌ణ్ని మేం జ‌న‌ర‌ల్ అని పిలిచేవాళ్లం.

ఆయ‌న్ను మ‌రో చైనా వ్య‌క్తి ఎప్పుడూ అనుస‌రించేవాడు. కుర్చోడానికి కుర్చీలు వేయ‌డం, టీ తీసుకురావ‌డం అత‌డి ప‌ని. అత‌ణ్ని మేం జ‌న‌ర‌ల్‌కు అర్ద‌లీ (చెప్రాసీ) అనేవాళ్లం.

మ‌మ్మ‌ల్ని భార‌త్‌కు తిరిగి పంపించేందుకు సిద్ధంచేసిన ద‌స్తావేజుల‌పై సంత‌కాన్ని ఆ చెప్రాసీనే పెట్టాడు. అత‌డికి జ‌న‌ర‌ల్ పెన్ను అందించాడు.

ఉద‌యం తొమ్మిది గంట‌‌లకు మేం కున్మింగ్ నుంచి బ‌య‌లుదేరాం. మ‌ధ్యాహ్నం 1:20కు క‌ల‌కత్తా చేరబోయాం. అయితే మా విమానం గాల్లో చాలాసేపు చ‌క్క‌ర్లు కొట్టింది.

విమానం చ‌క్రాలు తెర‌చుకోవ‌ట్లేద‌ని, బ‌హుశా ప్ర‌మాదం సంభ‌వించే ముప్పుంద‌ని పైల‌ట్ చెప్పారు.

చివ‌ర‌గా మ‌ధ్యాహ్నం 2:30కు ద‌మ్‌ద‌మ్ ఎయిర్‌పోర్ట్‌లో దిగాం. ఎలాంటి ప‌రిస్థితి వ‌చ్చినా.. ఎదుర్కొనేందుకు అక్క‌డ అగ్నిమాప‌క సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.

చైనాలో ఇన్ని క‌ష్టాలు ప‌డి భార‌త్‌కు వ‌స్తుండ‌గా గాల్లోనే చ‌నిపోతే వింత‌గా ఉంటుంద‌ని మేం అనుకున్నాం.

(2012లోమేజ‌ర్ జ‌న‌ర‌ల్ (రిటైర్డ్) కేకే తివారీతో సంభాష‌ణ ఆధారంగా బీబీసీ ప్ర‌తినిధి రెహాన్ ఫ‌జ‌ల్‌ ఈ వార్త రాశారు. 2016లో మేజ‌ర్ జ‌న‌ర‌ల్ (రిటైర్డ్) కేకే తివారీ పుదుచ్చేరిలో క‌న్నుమూశారు.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)