న్యూజీలాండ్‌: 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?

మహిళా నాయకులు నేతృత్వం వహిస్తున్న కొన్ని దేశాలలో కోవిడ్ 19 కేసులు తక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, ఫోర్బ్స్ పత్రిక రాసిన వ్యాసంలో న్యూజీలాండ్ ప్రధాని జసిందా ఆర్డెన్‌ని కూడా ప్రశంసించింది.

జసిందా ఆర్డెన్ ఎవరు?

జసిందా ఆర్డెన్ న్యూజీలాండ్ లేబర్ పార్టీ తరుపున ప్రధానిగా అక్టోబర్ 2017 లో ఎన్నికయ్యారు. ఆమె ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లేబర్ పార్టీకి తగినంత మద్దతు లేకపోవడంతో ఫస్ట్ పార్టీ, గ్రీన్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి గృహం, మెరుగైన వైద్యం , కనీస వేతనాలు, పర్యావరణ అంశాలు, పేదరికం గురించి ఎక్కువగా మాట్లాడారు.

గత సంవత్సరం న్యూజీలాండ్లో చోటు చేసుకున్న క్రైస్ట్ చర్చి మసీదు కాల్పుల సమయంలో , కోవిడ్ 19 సమయంలో ఆమె వ్యవహరించిన తీరుకి, నాయకత్వ శైలికి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

కోవిడ్-19 సమయంలో ఆమె ఎలా వ్యవహరించారు?

లాక్ డౌన్ లో పాటించాల్సిన విధానాలను ప్రజలకు వివరిస్తూ ఆమె దయతో వ్యవహరించారు.

ఆమె ప్రజలను ఉద్దేశించి చేసే అన్ని ప్రసంగాలలో దృఢంగా ఉండండి, దయతో ఉండండి అనే సందేశంతో ముగించేవారు .

ఆమె లాక్ డౌన్ ప్రకటించగానే ప్రజలతో నేరుగా మాట్లాడాలనే ఉద్దేశంతో ఫేస్ బుక్ లైవ్ కూడా చేశారు.

ఆమె ఎపుడూ నవ్వు ముఖంతో , తన జీవితంలో జరుగుతున్న వ్యక్తిగత వివరాలను అందరితో పంచుకుంటూ ఫేస్ బుక్ లో తరచూ కనిపించేవారు. అలాగే, ప్రజల ప్రశ్నలకి సమాధానం ఇస్తున్నప్పుడు వైరస్ తో పొంచి ఉన్న ప్రమాదం గురించి ఎప్పుడూ తేలికగా మాట్లాడలేదు.

ఆమె ప్రజలతో వ్యవహరించిన తీరు ఆమెకి మెప్పు తెచ్చి పెట్టింది.

న్యూజీలాండ్ లో జసిండా ఆర్డెన్ ఇంటి దగ్గరే ఉండి లాక్ డౌన్లో ఈస్టర్ ఎలా చేసుకోవాలో కూడా పిల్లలకు వివరించారు.

ఆమెతో పాటు ఆమె కేబినెట్లో పని చేస్తున్న మంత్రులు, ప్రజా వ్యవస్థల అధికారులు మరో 6 నెలల వరకు నెల జీతంలో 20 శాతం తగ్గించి తీసుకుంటామని ప్రకటించారు.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులేవీ లేవని అధికారులు తనకు చెప్పగానే తాను డ్యాన్స్ చేశానని ఆ దేశ ప్రధాని జసిందా ఆర్డెన్ విలేకరులతో అన్నారు.

దేశంలో ఈ స్థితి నెలకొనడానికి వైద్యులు, ప్రజలు సహకరించారని ఆమె అందరికీ ధన్యవాదాలు తెలిపారు. దీనిని జయించ గలమని న్యూజీలాండ్ ప్రజలు నిరూపించారని ఆమె అన్నారు.

మరో వైపు కొంత మంది జర్నలిస్టులు మాత్రం ఆమె పత్రికా సమావేశాల్లో విలేకరుల ప్రశ్నలకు సమయం ఇవ్వలేదని, సమాచారం మీద ఎక్కువ స్పష్టత ఇవ్వలేదని విమర్శించేవారు.

న్యూజీలాండ్ అవలంబించిన విధానాలు ఏమిటి?

న్యూజీలాండ్ మొదట మార్చి 25 నుంచి లాక్‌డౌన్ అమలు చేసింది. ఇందుకోసం నాలుగంచెల అప్రమత్తతా వ్యవస్థను ఏర్పాటుచేసింది.

నాలుగో అప్రమత్తతలో (మొదటి దశ) దాదాపు అన్ని వ్యాపారాలు, స్కూళ్లు అన్నీ మూతపడ్డాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు.

అలా అయిదు వారాలు నియంత్రించాక ఏప్రిల్ చివర్లో మూడో స్థాయి అప్రమత్తత (రెండో దశ)లోకి అడుగుపెట్టారు. నిత్యావసరాలు కాని దుకాణాలు కూడా కొన్ని తెరిచారు. రెస్టారెంట్లలో టేక్ అవేల వరకు అనుమతించారు.

అప్పటికి దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టనారంభించాయి. ఆ దశలో మే మధ్యలో రెండో స్థాయి అప్రమత్తతలోకి వచ్చారు.

జూన్ 22 నుంచి మొదటి స్థాయి అప్రమత్తత దశలోకి తేవాలనుకున్నప్పటికీ గత 17 రోజులుగా కొత్త కేసులు లేకపోవడంతో లెవల్ 1 ప్రకటించి లాక్ డౌన్ ఎత్తివేశారు.

లెవల్ 1లో నిబంధనల ప్రకారం స్కూళ్లు, కార్యాలయాలు అన్ని తెరచుకుంటాయి. వివాహాలు, అంతిమ సంస్కారాలు, ప్రజారవాణాపై ఉన్న నియంత్రణలన్నీ తొలగిపోతాయి.

భౌతిక దూరం పాటించాలన్న నియమం లేనప్పటికీ పాటిస్తే మంచిదన్నది ప్రభుత్వం చెప్పింది.

సైన్స్ , సహానుభూతి పై ఆధార పడ్డారు

మార్చ్ 13 వ తేదీ నాటికి క్రైస్ట్ చర్చి షూటింగ్ లో మరణించినవారి జ్ఞాపకార్ధం మొదటి వార్షికోత్సవం జరగాల్సి ఉంది. అయితే, అప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 గురించి హెచ్చరించడంతో ఆమె ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఆమె శాస్త్రీయ సలహాలను పాటించారు.

ఆ వెంటనే బయటి దేశాల నుంచి న్యూజిలాండ్ వచ్చే ప్రజలు ఎవరైనా కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్రపంచంలోనే ఈ మహమ్మారికి సత్వరమే స్పందించి చర్యలు తీసుకున్న దేశాలలో న్యూ జీలాండ్ ఒకటి

మరి కొన్ని రోజుల్లోనే లాక్ డౌన్ ప్రకటించారు. కఠినమైన లాక్‌డౌన్‌తోపాటూ విస్తృత పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ఆపరేషన్లు నిర్వహించింది.

న్యూజీలాండ్ జనాభా మొత్తం న్యూ యార్క్ నగర జనాభా కన్నా తక్కువ కావడం, దేశ సరిహద్దులు మూసివేయడానికి అనుకూలంగా ఉండటం వైరస్ ని అరికట్టడానికి బాగా తోడ్పడ్డాయి.

తలసరిగా ఈ దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కావడానికి ప్రభుత్వం ఇచ్చిన సందేశాలలో స్పష్టత ఉండటం కూడా ఒక కారణం.

జసిందా ప్రజలని ఉద్దేశించి చేసిన ప్రతి ప్రసంగంలో 50 లక్షల మంది ప్రజలంతా కలిసి కోవిడ్ తో పోరాడేందుకు ఐక్యం అవుదామని పదే పదే పిలుపునిచ్చారు.

"జసిందా ఆర్డెన్ అద్భుతమైన వక్త, ప్రజలను అర్ధం చేసుకోగలిగే మనస్తత్వం ఉన్న నాయకురాలని" ఒటాగో యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్ విభాగంలో పని చేస్తున్న ప్రొఫెసర్ మైఖేల్ బేకర్ అన్నారు.

ఆమె చెప్పిన మాటలని ప్రజలు నమ్మడమే కాకుండా ఈ మహమ్మారి సమయంలో పాటించాల్సిన విధానాలను కూడా ప్రతి ఒక్కరు పాటించడం కూడా న్యూ జీలాండ్ విజయానికి కారణమైంది.

మహమ్మారి సమయంలో సత్ఫలితాలు రావాలంటే నాయకత్వం, శాస్త్రీయ విజ్ఞానం కలిసి పని చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం వెనక ఆ దేశ డైరెక్టర్ జనరల్ అఫ్ హెల్త్ సూచనలు, సలహాలు ఉన్నట్లు రేడియో న్యూజీలాండ్ లో పని చేస్తున్న ఒక జర్నలిస్ట్ చెప్పారు.

వైద్యుల సలహాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వానికి వైద్య రంగానికి మధ్య ఉన్న సమన్వయం ఆ దేశంలో కేసులను అరికట్టడానికి పనికొచ్చిందని అభిప్రాయపడ్డారు.

సురక్షితమైన స్థితిలో ఉన్నప్పటికీ కోవిడ్ ముందు నాటి రోజుల మాదిరి జీవితాలు గడపడానికి ఏమంత సులభ మార్గాలు లేవని చెప్పారామె. మళ్లీ కేసులు రావని చెప్పలేమని, పూర్తిగా నిర్మూలన గురించి మాట్లాడలేమని, అయితే, ప్రయత్నం చేస్తున్నామని జసిందా చెప్పారు.

కోవిడ్‌ను ఎదుర్కోవడానికి చూపిన నిశ్చయబలం, ప్రత్యేక దృష్టి ఇప్పుడు ఆర్థిక పునర్నిర్మాణంపైనా చూపనున్నట్లు చెప్పారు.

‘‘ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు లేనంత మాత్రాన పని పూర్తయిందని అనుకోలేం.. అయితే, కచ్చితంగా ఒక మైలు రాయి దాటామని మాత్రం చెప్పగలను.. ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకొంటున్నాను’’ అన్నారామె.

ఫిబ్రవరి చివర్లో న్యూజీలాండ్‌లో తొలి కరోనా కేసు వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశంలో మొత్తం 1154 కేసులు నమోదు కాగా 22 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)