కరోనావైరస్: ఇండొనేసియాలో క్షణం క్షణం... భయం భయం

ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశాల్లో ఒకటైన ఇండొనేసియా ఇటీవలే తన సరిహద్దులు మూసివేసింది. కానీ, ఇప్పటికే ఆలస్యమైందని నిపుణులు భయపడుతున్నారు.

దేశంలో వైరస్ కేసుల వాస్తవ సంఖ్యలను అధికారిక లెక్కలు మరుగుపరుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. విజృంభిస్తున్న వైరస్‌తో పెరిగే కేసులను దేశ వైద్య వ్యవస్థ ఏమాత్రం తట్టుకోలేదని ఆందోళన చెందుతున్నారు. బీబీసీ ప్రతినిధులు రెస్టీ వోరో యునియార్, అఘ్నియా అడ్జికా అందిస్తున్న కథనం.

ఇండొనేసియాలో మొదటి కరోనావైరస్ కేసు మార్చిలో నమోదైంది. కానీ.. ఆసియాలో కరోనావైరస్ మరణాల్లో చైనా తర్వాత ఇక్కడే అధికంగా ఉన్నాయి. చనిపోయిన వారిలో ఇద్దరు డాక్టర్లు సహా 12 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. ఆ వైద్యుల వయసు ముప్పై ఏళ్లు మాత్రమే.

ఈ విషయం.. వెస్ట్ జావా లోని బాండుంగ్‌లో గల ప్రభుత్వ వైద్య కేంద్రంలో పనిచేస్తున్న నొవిటా పుర్వాంటి, ఆమె సహ నర్సులకు తెలుసు. వారు డబ్బులు పోగుచేసుకుని రెయిన్‌కోట్లు, రెండు మెడికల్ గాగుల్స్ కొనుక్కున్నారు.

‘‘ఎన్95 మాస్కు కొనలేను. అది చాలా ఖరీదు. దొరకటం కూడా కష్టం. ప్రభుత్వం నుంచి రక్షణ పరికరాలు వచ్చే వరకూ వీటిని మేం పంచుకుని వాడుకుంటున్నాం’’ అని ఆమె వివరించారు.

కరోనావైరస్ మీద ముందు వరుసలో పోరాడుతున్న వైద్య సిబ్బంది పరిస్థితి ఇది. దేశవ్యాప్తంగా దాదాపు ఇలాంటి దుస్థితే నెలకొంది.

నర్స్ నోవిటాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ‘‘నేను రోజూ రోగులను ముట్టుకుంటుంటాను. వారికి వైరస్ ఉందో లేదో తెలియదు. చాలా ఆందోళనగా ఉంటుంది. నిద్ర పట్టదు’’ అని ఆమె చెప్పారు.

ఇండొనేసియాలో కరోనావైరస్ సోకిన వారిలో కేవలం రెండు శాతం కేసులు మాత్రమే బయటపడుతున్నాయని లండన్‌కు చెందిన సెంటర్ ఫర్ మాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఇన్‌ఫెక్చ్యుయస్ డిసీజెస్ ఈ వారంలో విడుదల చేసిన ఒక అధ్యయనం చెప్తోంది.

అంటే, దేశంలో వాస్తవ కేసుల సంఖ్య 89,000 ఉండాలి. కానీ.. వ్యాది నిర్ధారణ పరీక్షలు అత్యల్పంగా ఉండటం వల్ల అసలు కేసుల సంఖ్య తెలుసుకోవటం కష్టం.

కరోనావైరస్ వల్ల చనిపోయిన వారి శరీరాలను మృతదేహాల్లో చుట్టి ఖననం చేయాలని జకార్తా గవర్నర్ ప్రజలకు సూచించారు. ‘‘వాళ్లలో కొందరికి పరీక్షలు చేసి ఉండొచ్చు. కొందరి చేసి ఉండకపోవచ్చు. కానీ ఫలితాలు ఇంకా రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు.

పెరుగుతున్న మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారని పీడియాట్రిక్ సొసైటీ తెలిపింది. ‘‘ఖచ్చితమైన గణాంకాలు తెలుసుకోవటం కష్టంగా ఉంది. కానీ ఒక మూడేళ్ల వయసు చిన్నారి సహా కనీసం నలుగురు పిల్లలు చనిపోయినట్లు మాకు తెలుసు’’ అనిఆ సంస్థ అధ్యక్షుడు డాక్టర్ అమన్ పులుంగన్ తెలిపారు.

దూరదూరంగా ఉండే దీవుల సమాహారం...

ఇండొనేసియా విస్తీర్ణం, సముద్రంలో దూరదూరంగా ఉండే 17,000 దీవులు.. పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో మామూలుగానే వైద్య సహాయం అందటం చాలా కష్టం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి 1,000 మందికి కేవలం ఒక్క ఆస్పత్రి పడక మాత్రమే ఉంది. ఈ పడకలు చైనాలో నాలుగు రెట్లు అధికంగా ఉంటే.. దక్షిణ కొరియాలో 11 రెట్లు అధికంగా ఉన్నాయి.

ఇక ప్రతి 10,000 మందికి నలుగురు డాక్టర్లు ఉన్నారు. ఇండొనేసియాతో పోలిస్తే ఇటలీలో 10 రెట్లు అధిక సంఖ్యలో ఉననారు. దక్షిణ కొరియాలో సైతం ఆరు రెట్లు ఎక్కువ మంది ఉన్నారు.

దేశంలో వికేంద్రీకృత ప్రభుత్వ వ్యవస్థ, గందరగోళంగా ఉండే అధికార వ్యవస్థలతో.. ఆరోగ్య సందేశాలను ప్రజలకు చేరవేయటం కూడా సవాళ్లతో కూడుకున్నదే.

ఈ దేశంలో ఆరోగ్య రక్షణ వ్యయం కూడా అతి తక్కువగానే ఉంది.

ఐదు వారాల కిందట.. తమ దేశంలో ఎవరికీ తెలియకుండా వైరస్ వ్యాపిస్తోందన్న సూచనలను ఇండొనేసియా అధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. చైనాలోని ఉహాన్ నుంచి విహార దీవి బాలికి నేరుగా నడిచే విమానాలను నిలిపివేయటంలో కూడా చాలా జాప్యం చేశారు.

‘‘దేశంలో కేసులను గుర్తించటం లేదనటం అవమానకరం. ఇండొనేసియాలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదంతా ప్రార్థనల మహిమ’’ అని దేశ ఆరోగ్యమంత్రి తెరావన్ అగస్ పుట్రాంటో వ్యాఖ్యానించారు. దేశంలో సమసీతోష్ణ వాతావరణం వల్ల కేసులు లేవని ఇతర ప్రభుత్వ పెద్దలు కొందరు చెప్పుకొచ్చారు.

కానీ, కొన్ని వారాలకే పరిస్థితి తలకిందులైంది.

వైరస్ వ్యాప్తి గురించిన సమాచారాన్ని ప్రభుత్వం వడపోసిందని.. ప్రజల్లో భయాందోళనలు చెలరేగకుండా ఉండటానికి, సమాజంలో అశాంతి నెలకొండా ఉండటానికి అలా చేశామని దేశాధ్యక్షుడు జోకో విడోడో గత నెలలో అంగీకరించారు.

ఇప్పుడు దేశ సరిహద్దులు మూసివేశారు. చాలా మంది డిమాండ్ చేస్తున్నట్లుగా రాష్ట్రాల్లో కూడా లాక్‌డౌన్‌లు విధించటానికి ప్రాంతీయ ప్రభుత్వాలకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తున్నారు.

జకార్తాకు ముప్పు

ప్రత్యేకించి జకార్తాలో ఉద్యోగాలు కోల్పోయిన జనం ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున వలస వెళ్లకుండా నగరాన్ని లాక్‌డౌన్ చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. అలాగే మే నెలలో రంజాన్ ఉపవాసం ముగిసే సమయంలో కూడా వలసలు భారీగా ఉంటాయనే ఆందోళన నెలకొంది.

ప్రస్తుతానికి ఇండొనేసియాలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణకు జాకార్తా కేంద్ర బిందువుగా ఉంది. కానీ ఇటీవలి వారాల్లో వేలాది మంది రాజధాని నుంచి తమ స్వస్థలాలకు వెళ్లటంతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య హెచ్చవుతూ పోయే ప్రమాదం పెరిగింది.

కానీ దేశాధ్యక్షుడు జోకో విడోడో గత వారం లాక్‌డౌన్ విధించకుండా.. ప్రజల మధ్య సామాజిక దూరం నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తామని జాతినుద్దేశించి టెలివిజన్‌లో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు.

‘‘ఆర్థిక కార్యకలాపాలను సజీవంగా ఉంచాలనే మేం కోరుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించటం అత్యంత ముఖ్యం’’ అని చెప్పారు.

కానీ.. అత్యధిక జనం సమ్మర్థమైన, ఇరుకు ప్రాంతాల్లో నివసించే దేశంలో ఉమ్మడి కుటుంబాలు చాలా సన్నిహితంగా ఉండే సమాజంలో సామాజిక దూరం పాటించగలగటం ఒక విలాసవంతమైన విషయం.

రాజధాని నగరంలో రెండు వారాలుగా స్కూళ్లు, వినోద కేంద్రాలను మూసివేశారు. రద్దీగా ఉండే మాళ్లు, రోడ్లు బోసిపోయాయి.

కానీ.. జనంలో అత్యధికులు ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు లేకపోవటంతో ప్రజా రవాణా ఇంకా బిజీగానే కొనసాగుతోంది.

మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య వ్యవస్థ తట్టుకోగలదా?

మారుమూలకు ఉండే పపువా ప్రాంతంలో ఆరోగ్య వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. అక్కడ ఇప్పటికే బయటివారిని రానీయకుండా సరిహద్దులు మూసివేశారు.

‘‘మహమ్మారిని ఎదుర్కోవటానికి మేం సిద్ధంగా లేం’’ అని పపువా కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ అధిపతి సిల్వానస్ సుమూలే పేర్కొన్నారు.

పపువాలోని ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ఇప్పటికే నిండిపోయాయని ఆయన చెప్పారు. ‘‘ఇక్కడ జనానికి కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే మేం ఏం చేయగలం? మా సొంత పౌరులకు చికిత్స చేయటమే ఇప్పుడు చాలా కష్టంగా ఉంది’’ అని తెలిపారు.

ఇక్కడున్న 202 ఐసొలేషన్ వార్డుల్లో కేవలం రెండు వార్డులు మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి.

ముందు వరుసలో ఉండి పోరాడే వైద్య సిబ్బందికి మరింత భద్రత తక్షణావసరమని వైద్య నిపుణులు చెప్తున్నారు.

‘‘సరైన రక్షణ పరికరాలు లేకపోతే డాక్టర్లు, నర్సలు చనిపోతారు. ఇటలీలో కోవిడ్-19 రోగుల్లో 9.5 శాతం మంది వైద్య సిబ్బందే ఉన్నారు. ఇక్కడ పరిస్థితి దానికన్నా దారుణంగా ఉండొచ్చు’’ అని ఇండొనేసియా డాక్టర్ల సంఘం అధ్యక్షుడు జుబేరీ జోర్బాన్ హెచ్చరిస్తున్నారు.

జకార్తాలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. డాక్టర్లు సొంతంగా రక్షణ పరికరాలు కొనుక్కోవటమో, రెయిన్‌కోట్లనే రక్షణ కవచాలుగా మలచుకోవటమో చేస్తున్నారు.

నైనుక్ అనే 37 ఏళ్ల నర్సు తనకు వైరస్ సోకి ఉంటుందని తన భర్తతో చెప్పారు. ఆ కాసేపటికే ప్రభుత్వం దేశంలో తొలి కేసు నమోదైందని, అది ఆమేనని ప్రకటించింది.

‘‘నాకు వైరస్ సోకింది. నేను బతుకుతానా?’’ అని ఆమె తన భర్త అరుల్‌ను అడిగారు.

‘‘కంగారు పడకు. అంతా అల్లా చేతుల్లో ఉంది... అని ఆమెకు చెప్పాను. కేవలం ధైర్యంగా ఉండమని చెప్పలిగాను అంతే’’ అని ఆయన తెలిపారు.

ఆమె ఆస్పత్రిలో ఒంటరిగా మార్చి 12వ తేదీన చనిపోయారు.

జకార్తాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆమె 12 ఏళ్లు పనిచేశారు. అక్కడ కోవిడ్-19 రక్షణ పరికరాలు లేకుండానే ఆమె విధులు నిర్వర్తించినట్లు అరుల్ చెప్పారు.

‘‘నేను ప్రేమించే వాళ్లకు సేవ చేయటానికి నేను బతికున్నా.. ఆ పని చేస్తూనే చనిపోయా’’ అని తన భార్య చెప్పినట్లు తెలిపారు.

అదనపు వివరాలు: కలిస్టాసియా విజయ, యులి సాపుత్ర, రెబెకా హెన్షికె

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)