పాకిస్తాన్‌లో హిందువులపై దాడి వైరల్ వీడియో.. నిజానిజాలేమిటి?

ఫొటో సోర్స్, Viral Video Screengrab
- రచయిత, ప్రశాంత్ చావల్
- హోదా, ఫ్యాక్ట్ చెక్ టీం, బీబీసీ దిల్లీ
పాకిస్తాన్‌లోని హిందువులపై పోలీసులు దాడి చేస్తున్నారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో దాదాపు 15 లక్షల మందికి పైగా చూశారు.
పాకిస్తాన్‌లో హిందువులకు ఏం జరిగిందో చూడండి అంటూ ఆ వీడియోను బీజేపీ మిషన్ 2019 ఫేస్‌బుక్ పేజీలో పెట్టారు. కొన్ని రోజుల కిందటే పబ్లిష్ అయిన ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఒక్క పేజీ నుంచే దాదాపు 40 వేల మంది షేర్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook Search
ఈ వీడియో కింద చాలా మంది నెటిజన్లు ''2019లో మళ్లీ నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే భారత్‌లో ఉన్న హిందువుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది' అని కామెంట్లు చేశారు.
ఈ వీడియోలో పాక్ దళాలు ఒక ఇంటిని చుట్టుముట్టి అక్కడ ఉన్నవారిపై లాఠీచార్జ్ చేయడం కనిపిస్తుంది.
ఈ వీడియోపై బీబీసీ బృందం చేసిన పరిశోధనలో కల్పిత ప్రస్తావనలను జోడించి ఈ వీడియోను వైరల్ చేశారని స్పష్టం అయింది. భారత్‌లోనే కాకుండా ఐరోపా, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్‌లో కూడా ఈ వీడియో వైరల్ అయింది.
'పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో జరిగిన ఘటనను యూట్యూబ్‌లో పెట్టారు. ఈ వీడియోలో పోలీసులు దాడి చేసింది హిందువుల మీద కాదు'' అని ఇస్లామాబాద్‌లోని బీబీసీ ప్రతినిధి ఒమర్ దరాజ్ నిర్ధారించారు.

ఫొటో సోర్స్, Viral Video Screengrab
మొదటి పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే..
రివర్స్ సెర్చ్ టెక్నిక్ ద్వారా ఈ వీడియో 2014 అక్టోబర్ 5 నాటి యూట్యూబ్ వీడియోగా మేం కనుగొన్నాం. బిలాల్ అఫ్ఘన్ అనే వ్యక్తి ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు.
''పాకిస్తాన్ పోలీసులు ఇళ్లపై దాడి చేసి ప్రజలను దారుణంగా కొట్టారు'' అని యూట్యూబ్ పోస్టులో ఆయన పేర్కొన్నారు. అయితే, వారు ఏ మతం వారో ఆ యూట్యూబ్ వీడియోలో పేర్కొనలేదు.
ఇదే వీడియోనే షియా న్యూస్ వెబ్‌సైట్ 2014 నవంబర్‌లో పోస్ట్ చేసి పాక్‌లోని అఫ్గాన్ శరణార్థులపై ఆ దేశ పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఒక కథనాన్ని ప్రచురించింది.
ఈ వీడియోపై మేం కాబుల్‌లో ఉన్న బీబీసీ పష్తో సర్వీస్ రిపోర్టర్ నూర్ గుల్ షఫక్‌ను సంప్రదించాం.
ఆ వీడియోలో ప్రజలు మాట్లాడుతున్న భాష, వారి వేషధారణను ఆధారంగా చేసుకొని అది 2014లో జరిగిన సంఘటన కాదని, అఫ్ఘాన్ శరణార్థులు కూడా కాదని స్పష్టం చేశారు. 2014-15లో అఫ్ఘనిస్తాన్‌లోనూ ఈ వీడియో వైరల్‌గా మారిందని చెప్పారు.
పాక్‌లో అఫ్ఘాన్ శరణార్థులను దారుణంగా హింసిస్తున్నారంటూ అప్పట్లో ఈ వీడియోను వైరల్ చేశారని గుర్తు చేశారు.

ఫొటో సోర్స్, Viral Video Screengrab
ఇంతకీ ఈ వీడియో ఎక్కడిది
ఈ వీడియోలోని సన్నివేశం 2013 మే లేదా జూన్‌లో జరిగిన ఘటన అయి ఉండొచ్చని బీబీసీ ప్రతినిధి ఒమర్ దరాజ్ తెలిపారు.
పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న మూడో అతిపెద్ద నగరం ఫైసలాబాద్‌లో ఈ ఘటన జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన దళాలు కొంతమందిని వారి ఇంటి లోపలికి ప్రవేశించి దాడి చేశాయి.
''ఫైసలాబాద్‌లో మొదటి నుంచి కరెంట్ కోతలు ఎక్కువ. 2013లో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. రోజుకు 16 గంటల కరెంట్ కోతలు ఉండటంతో ఆగ్రహించిన ప్రజలు నగరంలోని ప్రభుత్వ ఆస్తులను, పెట్రోల్ పంపులను ధ్వంసం చేశారు'' అని ఆయన చెప్పారు.
''విద్యుత్ కోతలపై మహిళలు, పిల్లలు కూడా 2013లో రోడ్డెక్కారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో విధ్వంసకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లి మరీ వారిపై దాడులు చేశారు'' అని ఈ వీడియో పూర్వాపరాలను ఆయన వివరించారు.
అప్పడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఉన్న షహజాబ్ షరీఫ్ ఈ ఘటనను ఖండించారు. దీనిపై పూర్తి వివరాలను అందజేయాలని పోలీసులను ఆదేశించారు.
పాకిస్తాన్‌కు చెందిన టీవీ చానెల్ వరల్డ్ న్యూస్ ప్రకారం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురు పోలీసులను ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని వారికి నోటీసులు ఇచ్చింది.
పోలీసులు దాడిచేసింది స్థానికులైన ముస్లింలపైన అని ఆ టీవీ చానెల్ తన కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
వైరల్ అవుతూనే ఉంది
ఇదే వీడియోను 2018 జనవరిలో జరిగిన ఉప ఎన్నికల సమయంలోనూ భారత్‌లో వైరల్ చేసినట్లు మా పరిశోధనలో తేలింది.
2017లో కూడా ఈ వీడియోను యూరప్ దేశాలలో వైరల్ చేశారు. ఈ వీడియోను ట్విటర్‌లో చూసి చాలా మంది మానవహక్కుల కార్యకర్తలు స్పందించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్‌లో భాగంగానే వారు ఇలా చేస్తున్నారంటూ కొంతమంది ఆరోపించారు.

ఫొటో సోర్స్, Twitter
యూరప్‌లో ఈ వీడియోను వైరల్ చేస్తూ పాక్‌లో క్రైస్తవులపై జరుగుతున్న దాడిగా దీన్ని చిత్రించే ప్రయత్నం చేశారు.
పీస్ వరల్డ్ వైడ్ అనే యూట్యూబ్ పేజీ ఈ వీడియోను 2015 మేలో పోస్ట్ చేసి బాధితులు క్రిస్టియన్లు అని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- 'సర్కార్'లో చెప్తున్న సెక్షన్ 49(పి)తో దొంగ ఓటును గెలవడం సాధ్యమేనా?
- జాతీయగీతానికి మదనపల్లెకూ ఉన్న సంబంధమిది
- క్విట్ ఇండియా ఉద్యమం: ఆ ఊళ్లో ఇంటి పేరును ఆజాద్ అని మార్చుకున్నారు
- 90 ఏళ్ల క్రితం కులం గురించి భగత్‌సింగ్ ఏం చెప్పారు?
- రూ.10 కాయిన్స్: ఏవి చెల్లుతాయి? ఏవి చెల్లవు?
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










