You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్వీడన్: పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం... ప్రధాని పదవి కోల్పోయిన స్టెఫాన్ లోవీన్
స్వీడన్ మధ్యేవాద-వామపక్ష ప్రధానమంత్రి స్టెఫాన్ లోవీన్ పార్లమెంటులో బలం కోల్పోయి పదవీచ్యుతుడయ్యారు.
సాధారణ ఎన్నికలు జరిగి హంగ్ పార్లమెంట్ ఏర్పడిన కొన్ని వారాలకే స్వీడన్ డెమాక్రాట్స్ (ఎస్.డి) ఆయనను తొలగించడానికి నడుం బిగించి విజయం సాధించింది.
పార్లమెంటులో లోవీన్‌కు వ్యతిరేకంగా 204 మంది ఎం.పిలు వోటు వేశారు. కేవలం 142 మంది ఆయనకు అనుకూలంగా నిలిచారు.
ఇప్పుడు పార్లమెంటు కొత్త ప్రధాని పేరును ప్రతిపాదించాల్సి ఉంది. కాబోయే ప్రధానిగా సెంటర్-రైట్ నేత ఉల్ఫ్ క్రిస్టర్సన్ పేరు బలంగా వినిపిస్తోంది.
కొత్త ప్రధానమంత్రి ఎన్నిక ప్రక్రియకు కొన్ని వారాలు పట్టే అవకాశం ఉండడంతో, అంతవరకూ లోవీన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు.
ఇకపై ఏం జరుగుతుంది?
సోషల్ డెమాక్రాట్స్ నేత అయిన లోవీన్ 2014లో అధికారంలోకి వచ్చారు. ఈ నెలలోనే జరిగిన ఎన్నికలలో ఆయన నేతృత్వంలోని సెంటర్-లెఫ్ట్ కూటమి 144 స్థానాలు గెల్చుకుంది. క్రిస్టర్సన్ నాయకత్వంలోని ప్రత్యర్థి కూటమి అయిన సెంటర్-రైట్ కన్నా వారికి ఒక్క సీటు ఎక్కువ వచ్చింది. ఈ రెండు పక్షాల్లో ఏదీ కూడా 62 స్థానాలు గెల్చుకున్న ఎస్.డితో చేయి కలపడానికి ఇష్టపడలేదు.
ఎస్.డి మద్దతుతో క్రిస్టర్సన్‌కు చెందిన మోడరేట్ పార్టీ సభ్యుడు ఆండ్రియాస్ నార్లెన్ సోమవారం నాడు పార్లమెంటు కొత్త స్పీకర్‌గా ఖరారయ్యారు.
ఊగిసలాటకు మారుపేరుగా మారిన స్వీడన్ పార్లమెంటులో ఇప్పుడు స్థిరమైన ప్రభుత్వం ఏర్పడడమన్నది కష్టంగా మారింది.
ఎందుకంే, లోవీన్ పార్టీ తాను సెంటర్-రైట్ మైనారిటీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇచ్చేది లేదని ఇప్పటికే స్పష్టం చేసింది.
మరోవైపు, ఎస్.డితో కనుక డీల్ పెట్టుకుంటే పార్టీ నుంచి వైదొలగుతామని సెంటర్-రైట్ బ్లాక్‌కు చెందిన నలుగురు సభ్యులు ప్రకటించారు.
ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నాలు నాలుగు సార్లు విఫలమైతే మళ్ళీ ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. స్వీడన్ చరిత్రలో ఇంతవరకూ అలాంటి పరిస్థితి రాలేదు.
ఇవి కూడా చదవండి:
- దళిత, మైనారిటీలలో పేదరికం వేగంగా తగ్గుతోంది. కానీ...
- చైనాలో 'బస్ పూలింగ్'.. ప్రయాణికుల చెంతకు బస్సు
- ప్రశాంతంగా నిద్ర పోవాలనుకునే వారి కోసం పది విషయాలు
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- రంజాన్ నెలలో ఉపవాసం చేస్తే శరీరానికి ఏం జరుగుతుంది?
- ఈ గోల్కొండ వజ్రం ఖరీదు చెప్పగలరా?
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)