You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
40 ఏళ్లుగా భూమినే నమ్ముకున్న రైతుకు సత్కారం చేసిన కుమారులు
- రచయిత, ప్రవీణ్ కాసం
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆ ఇళ్లంతా సందడిగా ఉంది.. బంధువులు, స్నేహితులతో కళకళలాడుతోంది.. ఇంటి ముందున్న వేదికపై వృద్ధ దంపతులు దండలు మార్చుకుంటున్నారు. అతిథులంతా చప్పట్లు కొడుతున్నారు.
అయితే, అదేమీ షష్టిపూర్తి మహోత్సవమో, వివాహ వార్షికోత్సవమో కాదు.. రైతన్న రిటైర్మెంట్.. అవును, వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమం.
40 ఏళ్లు భూమినే నమ్ముకొని తమను జీవితంలో స్థిరపడేలా చేసిన ఓ రైతుకు వారి కొడుకులు చేసిన వినూత్న సత్కారం.
తెలంగాణలోని ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన రైతు, బానోత్ నాగులు.. ఆయనకు ముగ్గురు కొడుకులు.
పెద్ద కొడుకు రాందాస్ విజయవాడలో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా, రెండో కుమారుడు రవి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. మూడో కుమారుడు శ్రీను ఎంఏ బీఈడీ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు.
ఇన్నాళ్లూ తమ కోసం కష్టపడిన తల్లిదండ్రులకు విశ్రాంతినివ్వాలని, వారి శ్రమను తగిన రీతిలో గౌరవించాలని ముగ్గురు కొడుకులు నిర్ణయించుకున్నారు.
అందులో భాగంగా, మే 29న బంధువులు, స్నేహితులు, రాజకీయ నాయకులు, వ్యవసాధికారులను తమ ఇంటికి ఆహ్వానించి పెద్ద వేడుక నిర్వహించారు.
తల్లిదండ్రులను వేదికపై ఆహ్వానించి వ్యవసాయ విరమణ సన్మాన మహోత్సవం పేరుతో వారిని ఘనంగా సన్మానించారు.
'నాన్న కష్టానికి గుర్తింపుగా, మరెందరికో స్ఫూర్తిగా'
40 ఏళ్లుగా వ్యవసాయం చేసి తమను ఉన్నత చదవులు చదివించిన నాన్నకు మేం ఇచ్చే చిన్న గౌరవం ఈ పదవీ విరమణ సన్మానమని నాగులు కుమారుడు రవి బీబీసీకి చెప్పారు.
‘‘చిన్నప్పుటి నుంచి ఆయన చాలా కష్టపడి మమ్మల్ని పెంచారు. అందుకే ఆయన కోసం ఏదైనా చేయాలనుకున్నాం. ఇంట్లో వాళ్లతో చర్చించి ఇలా పదవీ విరమణ సత్కారం ఏర్పాటు చేశాం’అని ఆయన తెలిపారు.
''ఉద్యోగులు 60 ఏళ్లు దాటితే పదవీ విరమణ ఉంటుంది. అదే రైతుకు అలాంటిదేమీ ఉండదు. వ్యవసాయం చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఈ రంగంలో ఉన్నవాళ్లకు కూడా ఒక వయసు రాగానే విశ్రాంతినివ్వాలి'' అనేది తన అభిప్రాయం అని రవి చెప్పారు.
''నాన్నను, ఆయన వృత్తిని గౌరవించాలనే ఉద్దేశంతోనే మేం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. తల్లిదండ్రులను పట్టించుకోని కుమారులు దీన్ని చూసి కొంతైనా మారితే చాలు. కొందరైనా దీన్ని స్ఫూర్తిగా తీసుకుంటారని భావిస్తున్నాం'' అని రవి పేర్కొన్నారు.
వ్యవసాయ మంత్రి నుంచి అభినందనలు
నాగులుకు నిర్వహించిన వ్యవసాయ విరమణ సన్మాన కార్యక్రమానికి వారి బంధువులు, స్నేహితులతో పాటు వ్యవసాయ అధికారులు కూడా హాజరయ్యారు.
'మా నాన్నను సన్మానించిన విషయం తెలిసి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. మా నాన్నతో ఫోన్లో మాట్లాడి అభినందించారు. చాలా మంది రాజకీయనాయకులు, వ్యవసాయ అధికారులు కూడా వచ్చారు'' అని రవి తెలిపారు.
'భూమితో బంధం పోతుందని బాధపడ్డారు'
''తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరంన్నర పొలాన్ని మా నాన్న తన కష్టంతో 10 ఎకరాలకు పెంచారు. రైతు విరమణ ప్రతిపాదన తెచ్చిప్పుడు భూమితో బంధం పోతుందని ఆయన బాధపడ్డారు'' అని రవి చెప్పారు.
అన్నదాతగా, కన్న తండ్రిగా ఆయన మా కడుపు నింపారు. ఇప్పుడు ఆయనకు విశ్రాంతినిచ్చి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది అని ఆయన పేర్కొన్నారు.
వ్యవసాయాన్ని వదిలేసినా ఊరిని మాత్రం వదిలివెళ్లను
- నాగులు, విశ్రాంత రైతు
‘‘40 ఏళ్లు వ్యవసాయం చేశాను. ఎన్నో కష్టనష్టాలు అనుభవించాను. పంటలు బాగా పండి లాభాలొచ్చిన రోజులూ ఉన్నాయి.. పెట్టుబడులు కూడా కోల్పోయిన సందర్భాలున్నాయి. వ్యవసాయం అనుకూలించినా, అనుకూలించకపోయినా కూడా దీన్నే నమ్ముకుని జీవితం సాగించాను.
సాగు ఆధారంగానే నా పిల్లలను పెంచి వారికి మంచి భవిష్యత్ ఇచ్చాను. ఇప్పుడు వారు నన్ను ఇంతకాలం పడిన కష్టం చాలు విశ్రాంతి తీసుకోమని కోరారు.
వ్యవసాయాన్ని వదిలేయాలంటే మొదట బాధగా అనిపించింది. కానీ, నేనూ అలసిపోయాను. అందుకే వారి మాట కాదనలేక అంగీకరించాను.
ఇప్పటికీ వ్యవసాయం చేయాలనిపిస్తుంది, అయినా, పిల్లల మాటను గౌరవించి విరమించుకున్నాను. మొత్తం భూమిని కౌలుకిచ్చేశాను.
అయితే, వ్యవసాయాన్ని వదిలేసినా మా ఊరిని మాత్రం వదలను. పిల్లలు వారుండే హైదరాబాద్ వచ్చేయమని కోరుతున్నారు. కానీ.. ఇక్కడే ఉంటాను.
నా పిల్లల పెళ్లి ఎంతో ఘనంగా చేశాను. వారిప్పుడు అంతకంటే ఘనంగా నా ఈ వ్యవసాయ విరమణ వేడుకను జరిపారు.’’
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: విలీనం నుంచి విభజన దాకా..
- అక్కడ లీటరు పెట్రోలు రూ.67పైసలే
- #BeingMuslim- ముస్లింలు తమవాళ్ల మధ్య తప్ప ఎక్కడా ఉండటానికి ఇష్టపడరు, ఎందుకు-
- ఇది భాగస్వామిని మోసం చేయడమా? కాదా?
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఎన్జీ రంగా యూనివర్శిటీ విద్యార్థులు కొత్త కాలేజీలు ఎందుకు వద్దంటున్నారు?
- వ్యవసాయం గురించి ఏమాత్రం తెలియని పార్టీ బీజేపీ: పి.సాయినాథ్
- వ్యవసాయం: కనీస మద్దతు ధరల గురించి యువత తెలుసుకోవాల్సింది ఏంటి?
- నాబార్డ్ రిపోర్ట్: వ్యవసాయ ఆదాయంలో దిగజారిన ఆంధ్రప్రదేశ్, జాతీయ సగటు కన్నా కాస్త మెరుగ్గా తెలంగాణ
- ‘తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి’ కానీ..
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)