You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రంజాన్ నెలలో ఉపవాసం చేస్తే శరీరానికి ఏం జరుగుతుంది?
రంజాన్ మాసం మొదలైందంటే ఉపవాసాలకూ సమయం ఆసన్నమైనట్టే. రంజాన్ సందర్భంగా లక్షలాది ముస్లింలు 30రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా ఉపవాసం చేస్తారు.
వేసవిలో నార్వేలాంటి కొన్ని దేశాల్లో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది. దాంతో ముస్లింలు రోజులో దాదాపు 20గంటలపాటు ఆహారం తీసుకోకుండా గడపాల్సి వస్తుంది.
మరి ఇలా అన్ని గంటలపాటు ఆహారం తీసుకోకుండా ఉండటం మంచిదేనా? నెల రోజులు సాగే ఉపవాసం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయి? ఆ విషయాలు తెలియాలంటే ఆ 30రోజుల్లో మన శరీరానికి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.
తొలి రెండ్రోజులూ కష్టం
నిజానికి చివరిగా భోజనం చేసిన 8గంటల తరవాత కానీ శరీరం 'ఉపవాస స్థితి'లోకి వెళ్లదు. అప్పటిదాకా మనం తీసుకున్న ఆహారం నుంచే శరీరం పోషకాలను శోషించుకుంటుంది.
ఆ తరవాత శరీరం శక్తి కోసం కాలేయం, కండరాలలో నిక్షిప్తమైన గ్లూకోజ్‌పైన ఆధారపడటం మొదలుపెడుతుంది.
అప్పటికీ ఆహారం తీసుకోకపోతే గ్లూకోజ్ స్థాయులు కూడా తగ్గిపోతాయి. దాంతో పేరుకుపోయిన కొవ్వే శరీరానికి తదుపరి శక్తి వనరుగా మారుతుంది.
కొవ్వు కరగడం మొదలవగానే ఆ ప్రభావం శరీర బరువుపైనా పడుతుంది. క్రమంగా కొలెస్ట్రాల్ స్థాయులతో పాటు బరువు కూడా తగ్గడం మొదలవుతుంది. దీనివల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
కానీ రక్తంలో చక్కెర శాతం తగ్గడం వల్ల నీరసం ఆవరిస్తుంది. తలనొప్పి, అలసట, నోటి దుర్వాసన లాంటి సమస్యలూ తలెత్తుతాయి. ఆకలి తీవ్రత కూడా ఈ దశలో చాలా ఎక్కువగా ఉంటుంది.
3-7 రోజుల మధ్య
తొలి రెండ్రోజుల ఉపవాస సమయంలో శరీరం దానికి అలవాటు పడటానికి ప్రయత్నిస్తుంది. క్రమంగా కొవ్వుని కరిగించి దాన్ని శక్తిగా మార్చుకోవడం మొదలుపెడుతుంది.
కానీ వేసవి కాబట్టి చెమట కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే ఉపవాస విరామం సమయంలో ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
విరామంలో తీసుకొనే ఆహారంలో సమపాళ్లలో ఉండే పోషకాలతో పాటు కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూడాలి.
8-15రోజుల మధ్య
ఉపవాసం మూడొ దశకు చేరేసరికి శరీరం ఆ స్థితికి అలవాటు పడి ఉంటుంది. దాంతో ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా అలసటకు గురయ్యే అవకాశం తగ్గిపోతుంది.
ఈ ఉపవాసం వల్ల ఇతర లాభాలూ ఉంటాయంటారు కేంబ్రిడ్జ్‌లోని అడెన్‌బ్రూక్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ డా.రజీన్ మహ్‌రూఫ్.
'సాధారణ రోజుల్లో ఎక్కువ కెలొరీలు తీసుకోవడం వల్ల శరీరం వాటిని కరిగించడంపైనే దృష్టిపెడుతుంది. దాంతో ఇతర శారీరక క్రియలు మందగిస్తాయి. ఉపవాస సమయంలో ఇలాంటి చర్యలన్నీ మళ్లీ క్రమ పద్ధతిలోకొస్తాయి. అందుకే ఉపవాస సమయంలో ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి కూడా పెరుగుతుంది' అంటారు రజీన్.
16-30 రోజుల మధ్య
రంజాన్ మాసం రెండో సగానికి వచ్చేసరికి శరీరం పూర్తిగా ఉపవాసానికి అలవాటుపడి ఉంటుంది. కాలేయం, కిడ్నీ, చర్మం, పేగుల లాంటివన్నీ వ్యర్థాలను శుద్ధి చేసుకునే దశకు చేరుకుంటాయి.
'శరీరంలోని అవయవాలన్నీ తమ గరిష్ట స్థాయిలో పనిచేయడం మొదలుపెడతాయి. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత కూడా మెరుగయ్యే అవకాశం ఉంటుంది.
ప్రొటీన్లపైనే ఆధారపడకుండా ఇతర మార్గాల ద్వారా శక్తిని పొందేందుకు శరీరం ప్రయత్నిస్తుంది. ఎక్కువ రోజుల పాటు ఉపవాసం చేయడంవల్లే శరీరంలో ఈ మార్పు చోటుచేసుకుంటుంది' అని డా.రజీన్ చెబుతారు.
రంజాన్ మాసంలో పగటిపూటే ఉపవాసం చేస్తారు కాబట్టి రాత్రిళ్లు మళ్లీ శరీరానికి అవసరమైన ఆహారాన్ని అందించే అవకాశం ఉంటుంది. దీనివల్ల పోషకాల లేమితో కండరాలకు జరిగే నష్టాన్ని నివారించడంతో పాటు బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది.
అయితే ఉపవాసం నిజంగా మంచిదేనా?
ఉపవాసం మంచిదే కానీ కొన్ని షరతులు వర్తిస్తాయంటారు డాక్టర్.రజీన్.
'ఉపవాసం వల్ల మన ఆహార అలవాట్లు, భోజన వేళలపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఇది మంచి పరిణామమే. ఒక నెలపాటు ఉపవాసం మంచిదే. కానీ నిరంతరం ఉపవాసం చేయడం మాత్రం సరికాదు' అంటారాయన.
'దీర్ఘకాలంపాటు ఉపవాసం చేస్తే బరువు తగ్గడం మాట అటుంచి, ఇతర దుష్పరిణామాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఓ దశలో శరీరం కొవ్వు నుంచి శక్తిని సేకరించడం మానేసి కండరాలపై ఆధారపడటం మొదలుపెడుతుంది. అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలా కండరాలపై శక్తికోసం ఆధారపడుతుందంటే, శరీరం 'కరవు' స్థితికి చేరుకున్నట్టే లెక్క' అని రజీన్ చెబుతారు.
అందుకే రంజానేతర రోజుల్లో దీర్ఘకాల ఉపవాసం కాకుండా, వారంలో 2రోజులు ఉపవాసం ఉంటూ మిగతా రోజుల్లో ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవడం శ్రేయస్కరమని అంటారు రజీన్.
రంజాన్ ఉపవాసాన్ని సరిగా ఆచరిస్తే బరువు తగ్గడంతో పాటు శరీరం పునరుత్తేజాన్ని పొందే ఆవాకాశాలు కూడా పుష్కలం అన్నది ఆయన మాట.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)