జింబాబ్వే ఎన్నికలు: నిరసనల్ని అణచివేస్తున్న ప్రభుత్వం.. నిగ్రహం పాటించాలన్న ఐరాస, బ్రిటన్, అమెరికా

ఫొటో సోర్స్, Getty Images
జింబాబ్వే ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. ఎన్నికల ఫలితాల సమయంలో హింస చెలరేగింది. ప్రతిపక్ష ఎండీసీ కూటమి మద్దతుదారులు దేశ రాజధాని హరారేలో విధ్వంసానికి దిగటంతో సైనిక బలగాలు కాల్పులు జరిపాయి. ఈ హింసలో ముగ్గురు చనిపోయారు.
ప్రభుత్వం అణచివేత చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. నిగ్రహం పాటించాలని ఐక్యరాజ్య సమితి, జింబాబ్వేను ఒకప్పుడు పరిపాలించిన బ్రిటన్ పిలుపునిచ్చాయి. దేశంలో చెలరేగిన హింస పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి.
ముగాబే శకం ముగిసిన తర్వాత జరిగిన మొదటి పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార జాను-పీఎఫ్ పార్టీకి మెజార్టీ సీట్లు లభించాయి.
అయితే, ప్రతిపక్ష ఎండీసీ కూటమి మాత్రం ఈ ఎన్నికల్లో జాను-పీఎఫ్ పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడిందని చెబుతోంది.
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడలేదు. అయితే, ప్రతిపక్ష ఎండీసీ కూటమి తమ అభ్యర్థి నెల్సన్ చమిసా గెలుపొందారని, ప్రస్తుత అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వాను ఓడించారని అంటోంది.
జింబాబ్వే రాజకీయ నాయకులంతా నిగ్రహం పాటించాలని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ అభ్యర్థించారు. దేశంలో చెలరేగిన హింస పట్ల తీవ్రంగా ఆందోళన చెందినట్లు బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రి హర్రిట్ బాల్డ్‌విన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సైన్యం నిగ్రహం పాటించాలని హరారేలోని అమెరికా రాయబార కార్యాలయం సైతం ట్వీట్ చేసింది. మెరుగైన భవిష్యత్తుకు అవసరమైన ‘చారిత్రక అవకాశం’ ఇప్పుడు జింబాబ్వే వద్ద ఉందని తెలిపింది.
కాగా, సైన్యం చర్యలపై విచారణ చేపట్టాలని మానవ హక్కుల బృందం ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ జింబాబ్వే ప్రభుత్వాన్ని కోరింది. ‘‘ఎన్నికల తర్వాత సైన్యం భావ ప్రకటనా స్వేచ్ఛను అణగదొక్కింది. నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఉండాలి’’ అని ఆమ్నెస్టీ తెలిపింది.
ఎన్నికల తర్వాత ఏం జరిగింది?
మొత్తం 210 సీట్లున్న జింబాబ్వే పార్లమెంటు ఎన్నికల్లో అధికార జాను-పీఎఫ్ పార్టీ 122 సీట్లు గెలుచుకోగా.. ప్రతిపక్ష ఎండీసీ కూటమికి 53 సీట్లు లభించినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించిందని అధికారిక మీడియా జడ్‌బీసీ తెలిపింది.
అయితే.. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సరిచూసుకోవటానికి.. మొత్తం 23 మంది అభ్యర్థుల్లో కొందరి ప్రతినిధులు ఇంకా రాలేదని.. అందువల్ల ఈ ఫలితాలను ఇంకా ప్రకటించలేదని బీబీసీ ప్రతినిధి షింగాయ్ న్యోకా తెలిపారు.

కానీ.. సోమవారం జరిగిన ఈ ఎన్నికల్లో తమ అధ్యక్ష అభ్యర్థి నెల్సన్ చామిసా గెలిచినట్లు ఎండీసీ కూటమి చెప్తోంది. అధ్యక్ష, పార్లమెంటు ఎన్నికలను అధికార జాను-పీఎఫ్ పార్టీ రిగ్ చేసిందని ప్రతిపక్ష ఎండీసీ కూటమి ఆరోపిస్తోంది.
ఈ విషయంలో చెలరేగిన హింస.. ప్రతిపక్షానికి పట్టున్న రాజధాని హరారేకి పరిమితమైందని.. ఇతర ప్రాంతాలు ప్రశాంతంగానే ఉన్నాయని పాత్రికేయులు పేర్కొన్నారు.
జింబాబ్వేకు సుదీర్ఘ కాలం అధ్యక్షుడిగా కొనసాగిన రాబర్ట్ ముగాబే పదవీచ్యుతుడైన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. ఓటర్లుగా నమోదుచేసుకున్న ప్రజలు 50 లక్షల మందికి పైగా ఉండగా.. ఈసారి అధికంగా 70 శాతం పోలింగ్ నమోదైంది.
అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఎవరైనా నేరుగా గెలుపొందాలంటే.. పోలైన ఓట్లలో కనీసం 50 శాతం పైగా ఓట్లు అవసరం. అలా ఓట్లు రానిపక్షంలో.. మొదటి, రెండో స్థానంలో ఉన్న అభ్యర్థుల మధ్య సెప్టెంబర్ 8వ తేదీన మళ్లీ ఎన్నిక నిర్వహిస్తారు.

ఎన్నికల పరిశీలకులు ఏమంటున్నారు?
అధ్యక్ష ఎన్నికల ఫలితాల ప్రకటనలో జాప్యాన్ని యూరోపియన్ యూనియన్ పరిశీలక బృందం విమర్శించింది. అయితే.. ఈ ఫలితాలను ప్రకటించటానికి జింబాబ్వే ఎలక్టోరల్ కమిషన్‌కు శనివారం వరకూ సమయం ఉంది.
ఈ ఎన్నికల్లో మీడియా పక్షపాతం, ఓటర్లకు బెదిరింపులు, ఎలక్టోరల్ కమిషన్ మీద అపనమ్మకం వంటి కొన్ని సమస్యలను తాము పరిశీలించినట్లు ఈయూ బృందం పేర్కొంది. జింబాబ్వేలో ‘‘రాజకీయ వాతావరణం మెరుగుపడింది.. కానీ సమాన అవకాశాలు లేవు.. విశ్వాసం లోపించింది’’ అని చెప్పింది.
జింబాబ్వే ప్రభుత్వం ఈయూ, అమెరికా పర్యవేక్షకులను తమ దేశంలోకి అనుమతించటం గత 16 ఏళ్లలో ఇదే మొదటిసారి.
ఇదిలావుంటే.. ఈ ఎన్నికలు ‘‘చాలా శాంతియుత వాతావరణంలో, చాలా పోటీతత్వంతో’’ జరిగాయని ఆఫ్రికన్ యూనియన్ పరిశీలక బృందం పేర్కొంది.
రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి?
అధ్యక్ష ఎన్నికల్లో నెల్సన్ చామిసా గెలిచినట్లు ప్రధాన ప్రతిపక్షం చెప్పటంతో ఆ పార్టీ మద్దతుదారులు మంగళవారం వీధుల్లో సంబరాలు జరుపుకున్నారు.
అధ్యక్షుడు ఎమర్సన్ నంగాగ్వా గెలిచేలా చేయటానికి అధికార జాను-పీఎఫ్ పార్టీ ఓట్లను రిగ్ చేయటానికి ప్రయత్నిస్తోందని ఎండీసీ కూటమి ఆరోపించింది. అధికారిక ఫలితాల ప్రకటనలో జాప్యాన్ని అంగీకరించబోమని పేర్కొంది.
ప్రతిపక్షం ఆరోపణలను జాను-పీఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి:
- జింబాబ్వేతో భారత్‌కున్న బంధమేంటి?
- ముగాబే ముందున్న మార్గాలివే!
- ముగాబే దిగిపోయారు, ఇక జింబాబ్వే మారిపోతుందా?
- భారతదేశంలో సైనిక తిరుగుబాటు ఎందుకు సాధ్యం కాదు?
- గ్రేస్ ముగాబే పొలంలో బంగారం తవ్వేస్తున్నారు!
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడ దాకా!
- తొలిరాత్రి కన్యత్వ పరీక్ష: నెత్తురు కనిపించకపోతే ఆమెకు నరకమే!
- కరణ్ థాపర్: ‘మోదీ ముఖంలో కోపం, అడ్వాణీ కళ్లలో నీళ్లు, భుట్టో చూపులో ప్రేమ.. అన్నీ చూశా’
- BBC Special: బోనాల్లో 'రంగం' చెప్పే స్వర్ణలత ఎవరు?
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- ఎన్ఐఎన్: హైదరాబాద్ ఆహారంలో ఎక్కువగా ‘పురుగు మందులు’, పిల్లలపై అధిక ప్రభావం
- #UnseenLives: వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు
- BBC Special: విశాఖ రైల్వే జోన్ వస్తుందా, రాదా? వస్తే కలిగే ప్రయోజనాలు ఏమిటి?
- తొలకరి జల్లుల్లో మట్టి వాసనకు కారణం ఇదే
- 'నువ్వు ఆడపిల్లవి, ఈ పని ఎలా చేస్తావు?' అన్నారు... కానీ 4వేల దహన సంస్కారాలు నిర్వహించాను
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









