You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సెరెనా విలియమ్స్: నిరుడు గర్భవతిగా ఒక ఫైనల్‌లో.. నేడు అమ్మగా మరో ఫైనల్‌లో
- రచయిత, రుజుత లుక్టుకే
- హోదా, బీబీసీ ప్రతినిధి
రెండు నెలల గర్భంతో నిరుడు ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడిన అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ నేడు పది నెలల పాప తల్లిగా మరో గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఆడారు.
జులై 14వ తేదీ శనివారం లండన్‌లో జరిగిన వింబుల్డన్ మహిళల ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీ క్రీడాకారిణి ఏంజెలిక్ కెర్బర్‌తో 36 ఏళ్ల సెరెనా తలపడ్డారు. 6-3, 6-3 తేడాతో ఆమె పరాజయం పాలై, రెండో స్థానంలో నిలిచారు.
ఈ టైటిల్‌ను గెలిస్తే, అత్యధికంగా 24 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు సాధించిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ పేరిట ఉన్న రికార్డును సెరెనా అందుకునేవారు. ఇప్పటి వరకు సెరెనా ఏడు వింబుల్డన్ టైటిళ్లు గెలిచారు.
2017 జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ విజేతగా నిలిచిన సెరెనా నాటి విజయంతో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకున్నారు. తాను రెండు నెలల గర్భవతిననే విషయాన్ని ఆమె అప్పట్లో గోప్యంగా ఉంచారు. ఇప్పటివరకు ఆమె ఆడిన చివరి గ్రాండ్ స్లామ్ ఫైనల్ అదే.
కాన్పు తర్వాత వారం రోజుల్లో నాలుగు ఆపరేషన్లు
సెరెనాకు సెప్టెంబరులో అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు సిజేరియన్ కాన్పు చేశారు. ఆడశిశువు పుట్టింది. పాప పేరు అలెక్సిస్ ఒలింపియా ఒహానియన్.
ప్రసవం తర్వాత సెరెనాకు ఊపిరితిత్తుల్లోని ధమనిలో రక్తపు గడ్డలు ఏర్పడటంతో ప్రసవం జరిగిన వారం రోజుల్లోనే నాలుగు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది.
శిశువుకు జన్మినిచ్చిన తర్వాత ఒక తల్లిగా వింబుల్డన్ ఫైనల్ ఆడుతుండటం తనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని సెరెనా బీబీసీ స్పోర్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
''నాది చాలా కష్టమైన కాన్పు. ప్రసవం తర్వాత నాలుగు ఆపరేషన్లు జరిగాయి. మొదట్లో నడవడం కూడా చాలా కష్టంగా ఉండేది'' అని ఆమె తెలిపారు.
సెరెనా పట్టుదల, టెన్నిస్‌పై ఆమె ప్రేమ అంతా ఇంతా కాదు. సెప్టెంబరులో కాన్పు అయితే, డిసెంబరులోనే మళ్లీ టెన్నిస్ కోర్టులోకి దిగారు. ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు.
సెరెనా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం ఆమె కోచ్‌ను కూడా ఆశ్చర్యపరిచాయి.
ఎగ్జిబిషన్ మ్యాచ్ తర్వాత సెరెనా ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోనూ ఆడటం మొదలుపెట్టారు. మయామి ఓపెన్‌లో, ఇండియానా వెల్స్‌లో, గత నెల్లో ఫ్రెంచ్ ఓపెన్‌ల్ సెరెనా రాకెట్ పట్టారు.
డబ్ల్యూటీఏ నిబంధనలూ కారణమే
సెరెనా తిరిగి ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోకి త్వరగా రావడానికి మహిళా టెన్నిస్ అసోసియేషన్(డబ్ల్యూటీఏ) ర్యాంకింగ్ నిబంధనలు కూడా కారణమే.
సెరెనా 2017 ఏప్రిల్‌లో మాతృత్వ సెలవుపై వెళ్లారు. అప్పుడు ఆమె ప్రపంచ ర్యాంకింగ్‌లలో నంబర్ 1 స్థానంలో ఉన్నారు.
డబ్ల్యూటీఏ సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆమె ర్యాంకు 181. ఈ ఏడాది అధికారికంగా ఆడటం మొదలుపెట్టినప్పుడు ఆమె ర్యాంకు 451కి పడిపోయింది.
ప్రొఫెషనల్ సర్క్యూట్‌కు దూరంగా ఉండటం వల్లే సెరెనా ర్యాంకు పడిపోయింది. ఆమె సీడింగ్‌పైనా ప్రభావం పడింది.
మాతృత్వ సెలవుపై ఉన్న క్రీడాకారులకు 'ప్రొటెక్టివ్ ర్యాంకింగ్' విధానం కొంత మేర రక్షణ కల్పిస్తుంది. అయితే ఇది సీడింగ్‌పై సానుకూల ప్రభావం చూపదు. ఫలితంగా తక్కువ సీడింగ్ ఉన్న లేదా అన్‌సీడెడ్ క్రీడాకారులు టోర్నమెంటు ప్రారంభ దశలోనే అగ్రశ్రేణి క్రీడాకారులతో తలపడాల్సి వస్తుంది.
ఈ ఏడాది ఆడిన మూడు టోర్నమెంట్లలోనూ సెరెనా ప్రారంభ దశలోనే ఓడిపోయి వెనుదిరిగారు. వింబుల్డన్‌లో నిబంధనలు కొంచెం భిన్నంగా ఉండటంతో ఈ టోర్నమెంటులో సెరెనాకు 25వ సీడింగ్ లభించింది.
గర్భధారణ, ప్రసవం శారీరకంగానే కాదు, మానసికంగానూ మహిళపై చాలా ప్రభావం చూపిస్తాయి. వీటిని డబ్ల్యూటీఏ పరిగణనలోకి తీసుకొన్నట్లు లేదు.
నిబంధనలపై చర్చ
సెరెనాకు ఎదురైన అనుభవాల నేపథ్యంలో, డబ్ల్యూటీఏ ర్యాంకింగ్, సీడింగ్ నిబంధనలు చర్చనీయమయ్యాయి.
లోగడ కిమ్ క్లిజ్‌స్టర్స్, విక్టోరియా అజరెంకా లాంటి పెద్ద క్రీడాకారులు మాతృత్వ సెలవు ముగించుకొని వచ్చిన తర్వాత వారు 'సీడ్స్'లో లేకపోయినా డబ్ల్యూటీఏ నిబంధనలపై పెద్దగా నిరసన వ్యక్తం కాలేదు.
మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో, ఈ నిబందనలను సమీక్షించాలనే డిమాండ్ ఊపందుకొంటోంది. డబ్ల్యూటీఏపై ఒత్తిడి పెరుగుతోంది. ర్యాంకింగ్, సీడింగ్ నిబంధనలు గాయాలకు, ప్రసవానికి వేర్వేరుగా ఉండాలనే వాదన వినిపిస్తోంది. వీటిని సమీక్షించే సూచనలు కనిపిస్తున్నాయి.
కష్టకాన్పు, తర్వాత నాలుగు శస్త్రచికిత్సలు సెరెనాను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆమె వీటన్నిటినీ అధిగమించి, మళ్లీ ఆటలో సత్తా చాటి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. సెరెనా ప్రతిభాసామర్థ్యాలు, పట్టుదల, ఆత్మవిశ్వాసాలను తోటి క్రీడాకారులతోపాటు ఇతరులు ప్రశంసిస్తున్నారు. నిబంధనల విషయంలో ఆమెకు అండగా నిలుస్తున్నారు.
ప్రస్తుత నంబర్ 1 సిమోనో హాలెప్, ప్రపంచ మాజీ నంబర్ 1 మరియా షరపోవా సెరెనాకు మద్దతు ప్రకటించారు. మహిళల టెన్నిస్ డ్రాలో మొదటి 32 మందిలో సెరెనా పేరును చేర్చాలని వింబుల్డన్ నిర్వాహకులను వింబుల్డన్ మాజీ ఛాంపియన్ జాన్ మెకన్రో కోరారు.
స్పందించిన ఇవాంకా
గర్భధారణ-ప్రసవం వల్లే ర్యాంకింగ్, సీడింగ్ విషయంలో సెరెనాకు ఇబ్బందులు ఎదురుకావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా స్పందిస్తూ- శిశువుకు జన్మనివ్వడం ఎవరికీ వృత్తిపరంగా సమస్యలు తెచ్చిపెట్టకూడదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ అణుకేంద్రం గుట్టు ‘రా’ ఎలా కనిపెట్టింది?
- భార్యపై భర్త రేప్ గురించి ఎందుకింత గొడవ
- హిమాలయన్ వయాగ్రా: కిలో రూ.70 లక్షలకు కొంటున్నారు
- ‘అది భార్యాభర్తల పడక సీన్... అలా నటించడానికి నాకేమీ సిగ్గనిపించలేదు’
- అమెరికాలో సెక్స్ రాకెట్.. టాలీవుడ్‌పై నీలి నీడలు
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు: రేణూ దేశాయ్
- 'యూదు దేశం'గా ఇజ్రాయెల్: వివాదాస్పద బిల్లుకు పార్లమెంటు ఆమోదం
- 'భవిష్యత్తు ఉండాలంటే నిర్మాతలతో, దర్శకులతో పడుకోక తప్పదన్నారు'
- బ్రిటన్‌లో టీనేజర్లలో గర్భధారణ తగ్గడానికి కారణాలివేనా
- మీకున్న ప్రైవసీ ఎంత? మీ వ్యక్తిగత సమాచారం ఎంత భద్రం?
- అమిత్ షా జాబు.. చంద్రబాబు జవాబు
- చేపలు తినొచ్చా.. తినకూడదా? ఈ రసాయనాల గొడవేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)