You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పేరెంటింగ్: తల్లిదండ్రుల తగవులు పిల్లలపై ఎలా ప్రభావం చూపుతాయో మీకు తెలుసా?
తల్లిదండ్రులు తగవులు పడటం.. వాదులాడుకోవటం మామూలే. అయితే అవి పిల్లలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందనేదాంట్లో చాలా తేడాలున్నాయి. మరి.. తల్లిదండ్రులు తమ తగవులు పిల్లలకు చేసే చేటును తగ్గించటానికి ఏం చేయవచ్చు?
ఇంట్లో జరిగే వ్యవహారాలు పిల్లల దీర్ఘకాలిక మానిసకాభివృద్ధి, ఆరోగ్యాల మీద నిజంగా ప్రభావం చూపుతాయి.
తల్లిదండ్రులకు తమ చిన్నారితో సంబంధం ఎలా ఉంటుందనేదే కాదు.. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయనేది కూడా చిన్నారి సంక్షేమంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మానసిక ఆరోగ్యం నుంచి చదువుల్లో రాణించటం వరకూ.. భవిష్యత్తులో చిన్నారుల సంబంధ బాంధవ్యాల వరకూ ప్రతి అంశం మీదా అవి ప్రభావం చూపగలవు.
అయితే.. అన్ని గొడవలూ ఒకే రకమైన ప్రభావం చూపవు. ఒక ‘పాజిటివ్’ వివాదం మంచి ప్రభావం చూపే అవకాశమూ ఉంది.
సమస్యలు ఎప్పుడు మొదలవుతాయంటే..
చాలాసార్లు.. తల్లిదండ్రుల వాగ్వాదాలు చిన్నారులపై పెద్దగా ప్రభావం చూపవు.
కానీ.. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు క్రోధావేశాలు వ్యక్తం చేసుకుంటూ పెద్దగా కేకలు వేసుకున్నపుడు.. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ‘మౌనముద్ర‘ దాల్చినపుడు.. కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు.
ఈ అంశంపై బ్రిటన్‌తో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు.. ఇంట్లో పరిశీలనలు, దీర్ఘకాలిక పరిశోధనలు, ప్రయోగాత్మక అధ్యయనాలు నిర్వహించాయి. తరచుగా సంఘర్షణలను చూసే, వినే చిన్నారులు - ఆరు నెలల వయసు పిల్లలు సైతం - గుండె కొట్టుకునే వేగం పెరగటం, ఒత్తిడి హార్మోన్లు స్పందించటం వంటి వాటికి లోనుకావచ్చని ఆ అధ్యయనాలు చెప్తున్నాయి.
తీవ్రంగా లేదా తరచుగా ఘర్షణ పడే తల్లిదండ్రులతో కలిసి నివసించే పసివారు, చిన్నారులు, యుక్తవయస్కుల్లో.. మెదడు అభివృద్ధికి ఆటంకం ఏర్పడటం, కలత నిద్ర, ఆదుర్దా, కుంగుబాటు, ప్రవర్తనా లోపం, ఇతర తీవ్ర సమస్యలు కనిపించవచ్చు.
ఘర్షణ స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ దానిని కొనసాగిస్తున్న తల్లిదండ్రులతో ఉండే పిల్లల మీద కూడా ఇటువంటి ప్రభావాలు పడే అవకాశముంది.
అయితే.. ఘర్షణలను నిర్మాణాత్మకంగా చర్చించుకునే, పరిష్కరించుకునే తల్లిదండ్రులతో నివసించే పిల్లల్లో ఈ ప్రభావాలు తక్కువగా కనిపిస్తాయి.
స్వభావమా? శిక్షణా?
పిల్లలపై చూపే ప్రభావం అన్నివేళలా అనుకున్న విధంగానే ఉండదు.
ఉదాహరణకు.. విడాకులు, విడిపోవాలని నిర్ణయించుకున్న తల్లిదడ్రుల ప్రభావం.. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని ఎక్కువగా నమ్ముతుంటారు.
కానీ.. ఇలా విడిపోవటం కన్నా గానీ.. దానికి ముందు, విడిపోయే క్రమంలో, ఆ తర్వాతా తల్లిదండ్రుల మధ్య జరిగే వాగ్వాదాలే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఇప్పుడు భావిస్తున్నారు.
అలాగే.. ఏదైనా ఘర్షణ విషయంలో చిన్నారులు ఎలా స్పందిస్తారనే దాంట్లో జన్యువులు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని కూడా విశ్వసిస్తుంటారు.
ఒక చిన్నారి మానసిక ఆరోగ్యానికి ‘స్వభావం’ అనేది కేంద్రమనేది నిజం. ఆందోళన నుంచి కుంగుబాటు, మానసిక రుగ్మత వరకూ అనేక సమస్యల్లో దీనిదే కీలక పాత్ర.
అయితే.. ఇంటి వాతావరణం, అక్కడ వారు పొందే ‘శిక్షణ’ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది కాగలదు.
అంతర్లీనంగా జన్యు కారణాల వల్ల ఉత్పన్నమయ్యే మానసిక అనారోగ్యాన్ని.. కుటుంబ జీవితం మరింత దిగజార్చటం లేదా మెరుగు పరచటం చేయగలదన్న ఆలోచన ఇప్పుడు పెరుగుతోంది.
తల్లిదండ్రులు కలిసి నివసిస్తున్నా విడిగా ఉన్నా.. పిల్లలు వారి తల్లిదండ్రులతో జన్యుపరమైన సంబంధం ఉన్నవారరైనా కాకపోయినా (సరోగసీ ద్వారా పుట్టిన లేదా దత్తత తీసుకున్న పిల్లలు).. ఆ తల్లిదండ్రుల మధ్య సంబంధాల నాణ్యత ఎలా ఉంది అనేదే పిల్లల మానసిక ఆరోగ్యానికి కేంద్ర బిందువుగా కనిపిస్తోంది.
పిల్లల విషయంలో వివాదాలు
ఇందులో తల్లిదండ్రులు తెలుసుకోవలసింది ఏమిటి?
మొదట.. తల్లిదండ్రుల మధ్య వాదోపవాదాలు, పరస్పరం విభేదించటం అతి సాధారణమైన విషయమేనని గుర్తించటం ముఖ్యం.
అయితే.. తరచుగా, తీవ్రమైన, పరిష్కారం లేకుండా ఘర్షణలు పడినపుడు.. అవి పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయి.
ఆ గొడవలు ఆ పిల్లల గురించే అయితే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఆ గొడవకు తామే కారణమని పిల్లలు తమను తాము నిందించుకునే పరిస్థితులు.
వీటివల్ల పడే ప్రతికూల ప్రభావాల్లో.. పిల్లలు సరిగా నిద్రపోలేకపోవటం, పసివారిలో మెదడు అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడటం, ప్రైమరీ స్కూలు పిల్లల్లో ఆందోళన, నడవడిక సమస్యలు, కొంచెం పెద్ద పిల్లలు, యుక్తవయస్కుల్లో కుంగుబాటు, చదువుల్లో వెనుకబడటం, తమకు తాము హాని చేసుకోవటం వంటి ఇతర తీవ్ర సమస్యలు వంటివి ఉండొచ్చు.
గృహ హింస, తీవ్ర ఘర్షణలు.. వాటిని చవిచూసే పిల్లలకు చెరుపు చేస్తాయని మనకు శతాబ్దాలుగా తెలుసు.
అయితే.. పిల్లలకు కీడు జరగటానికి.. తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలతో కూడిన హింసాత్మక ప్రవర్తననే ప్రదర్శించాల్సిన అవసరం లేదు.
తల్లిదండ్రులు దూరం జరిగి, ఒకరిపట్ల ఒకరు ప్రేమానురాగాలను వ్యక్తపరచని ఉదంతాల్లోనూ.. పిల్లలు భావోద్వేగపరంగా, ప్రవర్తనాపరంగా, సామాజిక అభివృద్ధి పరంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
సమస్యలు అక్కడితో అంతంకావు.
ఈ ప్రభావం కేవలం ఆ పిల్లల సొంత జీవితాలను మాత్రమే ప్రభావితం చేయవు. సంబంధాలు సరిగా లేకపోవటం.. ఒక తరం నుంచి మరొక తరానికి సంక్రమిస్తాయని పరిశోధనలు చెప్తున్నాయి.
అదొక విష వలయం. నేటి తరం చిన్నారులు, తర్వాతి తరం తల్లిదండ్రులు, కుటుంబాలు సంతోషకరమైన జీవితాలు గడపాలంటే ఈ విషవలయాన్ని బద్దలు కొట్టాల్సి ఉంటుంది.
‘ప్రయివేటు’గా వాగ్వాదం
ఇలాంటి గొడవల వల్ల జరిగిన కీడును తగ్గించే అంశాలూ ఉన్నాయి.
పిల్లలు రెండేళ్ల వయసు నుంచీ - ఇంకొంచెం చిన్న వయసు నుంచే - తమ తల్లిదండ్రుల ప్రవర్తనను పిల్లలు నిశితంగా పరిశీలిస్తుంటారని పరిశోధనలు చెప్తున్నాయి.
తల్లిదండ్రులు తమ వాగ్వాదాలను పిల్లలు గమనించటం లేదని అనుకున్నప్పుడు, తాము పిల్లల కంటపడకుండా ’ప్రయివేటు‘గా పోట్లాడుకుంటున్నామని నమ్ముతున్నపుడు కూడా.. ఆ గొడవలను పిల్లలు అధిక శాతం గమనిస్తూనే ఉంటారు.
అయితే.. ఈ ఘర్షణలకు కారణాలు, వాటి పర్యవసానాలను పిల్లలు ఎలా అర్థం చేసుకుంటారు, ఎలా భాష్యం చెప్పుకుంటారు అనేది ముఖ్యమైన విషయం.
పిల్లలు తమ గత అనుభాలను బట్టి.. ఈ ఘర్షణలు ఇంకా ముదురుతాయా? వాటిలో తాము కూడా చిక్కుకుంటామా? అసలు కుటుంబ స్థిరత్వానికే ముప్పుగా పరిణమించగలవా? అనేదానిని నిర్ణయించుకుంటారు. కుటుంబ స్థిరత్వం ప్రమాదంలో పడటమనేది కొందరు చిన్న పిల్లలకు చాలా ఆందోళన కలిగించే విషయం.
ఈ ఘర్షణ ఫలితంగా తల్లిదండ్రులతో తమ సంబంధాలు క్షీణించే అవకాశాల గురించి కూడా పిల్లలు ఆందోళన చెందవచ్చు.
బాలురు, బాలికలు విభిన్నంగా స్పందించవచ్చునని కూడా పరిశోధన సూచిస్తోంది. బాలికల్లో భావోద్వేగపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఎక్కువగా ఉంటే.. బాలురికి ప్రవర్తనా పరమైన సమస్యల ప్రమాదం ఎక్కువ.
అలాగే.. వాదనలను విజయవంతంగా పరిష్కరించుకునే తల్లిదండ్రుల నుంచి పిల్లలు సానుకూల పాఠాలు నేర్చుకుంటారు. అది.. కుటుంబ జీవితంలోనే కాకుండా సామాజిక జీవితంలోనూ తమ భావోద్వేగాలు, సంబంధాల్లో సమస్యలను పరిష్కరించుకోవటానికి వారికి తోడ్పడుతుంది.
తల్లిదండ్రుల మధ్య సంబంధాలను బలోపేతం చేసేలా తీసుకునే చర్యలు.. పిల్లల భవిష్యత్తు ఆరోగ్యకరగా ఉండటానికి దోహదం చేస్తాయి. తమ సంబంధాలు పిల్లలపై ఎలా ప్రభావం చూపగలవో తల్లిదండ్రులు అర్థం చేసుకునేందుకు తోడ్పటం ద్వారా.. నేటి ఆరోగ్యవంతమైన చిన్నారులకు, రేపటి ఆరోగ్యవంతమైన కుటుంబాలకు బాటలు పరవవచ్చు.
ఈ అధ్యయనం మీద యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్‌లో సైకాలజీ ప్రొఫెసర్ గోర్డన్ హారోల్డ్ ఇటీవల ‘ద జర్నల్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అండ్ సైకియాట్రీ’లో సమగ్ర సమీక్ష ప్రచురించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)