You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చర్చనీయాంశమైన 'పాలిచ్చే తల్లి' ఫొటో!
పిల్లాడికి చనుబాలను అందిస్తున్న ఓ మోడల్ ఫొటోను 'గృహలక్ష్మి' పత్రిక కవర్‌పేజీపై ప్రచురించింది. ఆ ఫొటోపై సోషల్ మీడియాలో భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కేరళ నుంచి వెలువడే 'గృహలక్ష్మి' మ్యాగజీన్ కవర్ కోసం గిలూ జోసెఫ్ అనే మోడల్ ఓ చిన్నారికి పాలు పడుతూ కెమెరా వైపు చూస్తూ పోజిచ్చారు.
‘అలా తదేకంగా చూడకండి, మేం పిల్లలకు పాలివ్వాలి’ అని కేరళలోని తల్లులు చెబుతున్నారన్నది కవర్ పేజీపైన ఉన్న అక్షరాల సారాంశం.
ఓ భారతీయ మ్యాగజీన్ కవర్ పేజీ మీద తల్లి చనుబాలను అందిస్తున్న ఫొటో ప్రచురితం కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు.
అయితే ఈ ఫోటోలో కనిపిస్తున్న మోడల్ నిజంగా ఓ తల్లి కాకపోవడమే చర్చకు దారితీసింది. తల్లికాని మహిళను ఇలాంటి ఫొటో కోసం వాడటాన్ని సామాజిక మాధ్యమాల్లో తప్పు పడుతున్నారు.
పబ్లిక్‌లో కూడా తల్లులు ఇబ్బంది లేకుండా పిల్లలకు చనుబాలను అందించడంపై అవగాహన పెంచడమే తమ ఉద్దేశమని 'గృహలక్ష్మి' ఎడిటర్ మాన్సీ జోసెఫ్ తెలిపారు.
‘కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తి, బిడ్డకు తన భార్య చనుబాలను అందిస్తున్న ఫొటోను ఫేస్‌బుక్‌లో పంచుకుంటూ, బహిరంగ ప్రదేశాల్లో తల్లులు పిల్లలకు పాలిస్తే తప్పేంటనే చర్చకు తెరతీశారు. ఫలితంగా ఆయన సోషల్ మీడియాలో బెదిరింపులకు గురయ్యారు.
అందుకే మేం ఈ సంచికను పిల్లలకు పాలు పట్టే తల్లులందరికీ అంకితమివ్వాలని నిర్ణయించుకున్నాం’ అని ఆయన అన్నారు.
ఈ మ్యాగజీన్‌కు, ఆ మోడల్‌కు సోషల్ మీడియాలో చాలామంది మద్దతు తెలిపారు.
‘బిడ్డకు చనుబాలను అందిస్తున్న ఓ తల్లి ఫొటో ఇది. వావ్.. చాలా ధైర్యం ప్రదర్శించారు’ అని వివేక్ నంబియార్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
దేశంలో చీర కట్టుకునే తల్లులు చెంగును అడ్డం పెట్టుకొని పిల్లలకు పాలు పడతారు. కానీ ఇతర దుస్తులు ధరించే ఆడవాళ్లకు ఈ అవకాశం లేదు.
‘చాలా తెగువ చూపించారు. చనుబాలను అందించే తల్లులందరినీ ఇది ప్రోత్సహించాలి’ అని సంజయ్ ముఖర్జీ ట్వీట్ చేశారు.
మరో పక్క నిజమైన తల్లిని కాకుండా ఓ మోడల్‌ని ఈ ఫొటో కోసం ఉపయోగించడంపై విమర్శలు ఎదురయ్యాయి.
దీన్నొక చౌకబారు సెన్సేషనలిజమ్‌గా అంజనా నాయర్ అనే బ్లాగర్ అభివర్ణించారు.
కానీ ఫోటోకు మోడలింగ్ చేసిన గిలూ జోసెఫ్ తన చర్యను సమర్థించుకున్నారు. ‘నేను విమర్శల్ని ముందే ఊహించాను. అయినా గర్వంగా, స్వేచ్ఛగా తల్లులు బిడ్డకు పాలివ్వాలనే విషయాన్ని సూటిగా చెప్పడం కోసం ఆ విమర్శల్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను’ అని గిలూ జోసెఫ్ బీబీసీతో చెప్పారు.
‘మీ బిడ్డకు మీరు పాలిస్తే ఏ దేవుడికి కోపమొస్తుంది’ అని గిలూ జోసెఫ్ అన్నట్లు ఓ మ్యాగజీన్ పేర్కొంది.
ఈ కవర్‌పేజి ఓ చైతన్యవంతమైన చర్య అని కేరళకు చెందిన రచయిత పాల్ జచారియా అన్నారు. ‘ఇది విప్లవాత్మకం కాకపోవచ్చు. కానీ అన్ని చర్చల్లా ఈ చర్చా ఎడిటర్ క్షమాపణలతో ముగిసిపోకూడదని అనుకుంటున్నా’ అని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)