బాల్ ట్యాంపరింగ్: స్టీవ్ స్మిత్‌కు జరిమానా, ఓ మ్యాచ్‌ నిషేధం

బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న బెన్‌క్రాఫ్ట్

ఫొటో సోర్స్, SKY SPORTS

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడిన నేపథ్యంలో.. ఆ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు ఐసీసీ జరిమానా విధించింది. ఓ టెస్ట్ మ్యాచ్ నిషేధం విధించింది.

ఒక మ్యాచ్ ఫీజును జరిమానాగా చెల్లించాలని స్మిత్‌ను ఐసీసీ ఆదేశించింది.

అంతకు ముందు స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తాజా మ్యాచ్‌ ముగిసే వరకు తమ పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

ఈ మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసేవరకే వీరు ఈ పదవుల్లో ఉండరు. కానీ మ్యాచ్‌లో ఇతర క్రీడాకారుల్లా కొనసాగుతారు.

కామెరూన్ బెన్‌క్రాఫ్ట్ బాల్‌ ట్యాపంరింగ్‌కి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ అంశంపై విచారణ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో స్మిత్ కెప్టెన్ పదవి నుంచి వైదొలగాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం, క్రికెట్ ఆస్ట్రేలియా ఆదేశించాయి.

దీంతో స్మిత్, వార్నర్‌లు పదవి నుంచి వైదొలిగారు.

అనంతరం ఐసీసీ స్మిత్‌పై ఒక మ్యాచ్ నిషేధం విధించింది.

స్మిత్, వార్నర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్మిత్, వార్నర్

ఈ మ్యాచ్ ముగిసేవరకు అంటే నాలుగు, అయిదో రోజు ఆటకు టిమ్ పైన్ కెప్టెన్‌గా ఉంటారు.

ఈ ట్యాంపరింగ్ వ్యవహారం చాలా బాధాకరమని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ జేమ్స్ సదర్లాండ్ పేర్కొన్నారు.

శనివారం కేప్‌టౌన్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తాము బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడినట్లు బెన్‌క్రాప్ట్ అంగీకరించారు.

ట్యాంపరింగ్ ప్లాన్ గురించి తమకు ముందే తెలుసని స్మిత్ కూడా పేర్కొన్నారు.

జేమ్స్ సదర్లాండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జేమ్స్ సదర్లాండ్

ఈ అంశంపై సదర్లాండ్ మాట్లాడుతూ.. అసలు ఏం జరిగిందో పూర్తిగా విచారణలో తేలాక స్పందిస్తామని తెలిపారు.

ఈ బాల్ ట్యాంపరింగ్ పై ఐసీసీ కూడా కేసు నమోదు చేసింది. మరోవైపు ఈ ట్యాంపరింగ్ ఘటన తనను తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని.. అసలు నమ్మలేకపోతున్నానని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్‌బుల్ పేర్కొన్నారు.

ఈ ఘటనపై పలువురు తాజా, మాజీ క్రికెటర్లు సోషల్ మీడియాలో స్పందించారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)