పాకిస్తాన్: హింసాత్మక ఘర్షణలు, సైన్యం మోహరింపు
నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు శనివారం ఉదయం ప్రారంభించిన పోలీస్ ఆపరేషన్‌ను రాత్రి నిలిపివేశారు.
రాజధాని ఇస్లామాబాద్‌లో ఉన్న కీలకమైన భవనాలకు భద్రత కల్పించేందుకు సైన్యాన్ని మొహరించారు.
యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్వటర్, ఇతర సోషల్ మీడియా యాప్‌లను, స్థానిక వార్తా ఛానెళ్ల ప్రసారాలను, ఇంటర్నెట్‌లో ప్రసారాలను కూడా నిలిపివేశారు. ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతున్నాయి.
పంజాబ్ ప్రావిన్సులో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను సోమ, మంగళవారాల్లో కూడా మూసివేయనున్నారు.
చాలా నగరాల్లో ఆందోళనలు మొదలవుతున్నాయి. రావల్పిండి సమీపంలో ఒక పోలీసు చెక్‌పోస్టుకు నిప్పంటించారు.
ఫైజాబాద్ ఇంటర్‌ఛేంజ్ వద్ద మత గురువు ఖాదిం హుస్సేన్ రిజ్వి, నిరసనకారుల ధర్నా కొనసాగుతోంది.

ఫొటో సోర్స్, EPA
ఉదయం వరకు జరిగిన పరిణామాలు:
పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి పదవి నుంచి వైదొలగాలంటూ కొద్ది రోజులుగా ఇస్లామాబాద్‌లో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం ఆర్మీ సాయం కోరింది.
శనివారం ఫైజాబాద్ వద్ద పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో దాదాపు 200 మంది గాయపడ్డారు. వారిలో పలువురు మృతి చెందినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
పంజాబ్ ప్రావిన్సులోని మంత్రి నివాసంలోకి నిరసనకారులు చొచ్చుకెళ్లారు. అయితే, ఆ సమయంలో మంత్రితో పాటు, అతని కుటుంబ సభ్యులెవరూ లేరని పాకిస్తానీ మీడియా వెల్లడించింది.
లాహోర్, దక్షిణ కరాచీతోపాటు దేశంలోని ఇతర ప్రాంతాలకూ ఆందోళనలు పాకుతున్నాయి. దాంతో పరిస్థితి చేయి దాటిపోకుండా చూసేందుకు ఆర్మీని రంగంలోకి దించాలని ఆదేశించినట్లు పాక్ హోంమంత్రి తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
అసలేం జరిగింది?
పాకిస్తాన్ ఎన్నికల సంస్కరణ చట్టం-2017లో చేసిన తాజా సవరణకు వ్యతిరేకంగా ఈ ఆందోళన ప్రారంభమైంది.
ఓ సవరణ మొహమ్మద్ ప్రవక్త గౌరవానికి భంగం కలిగించేలా ఉందని, ముస్లిం మత సంస్థలు తెహ్రీక్ ఏ లబ్బయిక్ యా రసూల్ అల్లాహ్, సున్ని తెహ్రీక్ ఆందోళనలకు పిలుపునిచ్చాయి.
దేశ న్యాయశాఖ మంత్రి జాహెద్ హమీద్ రాజీనామా చేయాలని 20 రోజులుగా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని ఫైజాబాద్ సమీపంలో శనివారం పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










