ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలను ‘మళ్లీ మొదట్నుంచి నిర్వహించాల్సిందే’ - Press Review

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం మళ్లీ రాజకీయాలను వేడెక్కించిందని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.

ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు 11 పార్టీలతో విడివిడిగా సమావేశమయ్యారు.

పాత నోటిఫికేషన్‌ను, ఏకగ్రీవాలనూ పూర్తిగా రద్దుచేసి మళ్లీ మొదట్నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 9 పార్టీలు కోరగా, రెండు మాత్రం ప్రభుత్వాన్ని సంప్రదించాలని, టీకా వచ్చిన తర్వాతే ఎన్నికలు పెట్టాలని అన్నాయి.

ఈ సమావేశానికి దూరంగా ఉన్న వైకాపా నేతలు విడిగా మీడియాతో మాట్లాడుతూ.. మూడు నాలుగు కేసులు ఉన్నప్పుడే ఎన్నికలను రద్దుచేశారని, ఇప్పుడు రోజుకు మూడువేల కేసులు వస్తుంటే ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నించారు.

సాయంత్రం రమేశ్‌ కుమార్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సమావేశమైనప్పుడు కూడా.. కరోనా సెకండ్‌వేవ్‌ వచ్చే అవకాశం ఉన్నందున ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తాము సుముఖంగా లేమన్నారు. ఎన్నికలు జరగాల్సిందేనని, అయితే తాము కూడా ఇప్పటికిప్పుడే నిర్వహించాలని అనుకోవడం లేదని ఎస్‌ఈసీ అన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ: నేడు ధరణి పోర్టల్ ఆవిష్కరణ

తెలంగాణలో భూమి రికార్డులన్నింటినీ నమోదుచేసే ‘ధరణి’ పోర్టల్‌ను మధ్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చింతలపల్లి తాసిల్దార్‌ కార్యాలయంలో ప్రారంభించనున్నట్లు నమస్తే తెలంగాణ తెలిపింది.

యాభై రోజులుగా రాష్ట్రంలో నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఇకపై కొత్త తరహాలో మొదలుకాబోతోంది.

గ్రామీణ, మండల కేంద్రాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కొత్త చట్టం ప్రకారం ‘ధరణి’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ధరణిలో నిక్షిప్తమైన సమాచారం ఆధారంగా తాసీల్దార్లు రిజిస్ట్రేషన్లు చేస్తారు.

రైతులు భూమి రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆటోమెటిక్‌గా పూర్తవుతుంది. బ్యాంకుల్లో డబ్బులు దాచుకొని.. తిరిగి తీసుకొనేంత సులువుగా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ ప్రక్రియను సరళతరం చేశారు.

దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే భూ పరిపాలనలో కోర్‌ బ్యాంకింగ్‌ విధానం అమలు అవుతున్నది. ఇకపై సమస్యలకోసం ఏ కార్యాలయానికి వెళ్లనవసరంలేకుండా ఆన్‌లైన్‌లో తెలిపితే పరిష్కారమయ్యేలా ధరణి రూపకల్పన జరిగింది.

మరోవైపు కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ ద్వారా ధరణిని నిర్వహించడానికి తాసిల్దార్లకు ఇచ్చిన శిక్షణ పూర్తయింది. ధరణికి సంబంధించిన మాడ్యూల్‌ను ఉన్నతాధికారులు అన్ని జిల్లాలకు పంపించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పరీక్షించి చూశారు. ట్రయల్స్‌కు ముందుగా జిల్లా కలెక్టర్లనుంచి, తాసిల్దార్లు, నయాబ్‌ తాసిల్దార్లు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వరకు అన్ని స్థాయిల అధికారులుచ సిబ్బందితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మార్గదర్శనం చేశారు.

ట్రయల్స్‌లో 20 నుంచి 40 వరకు రిజిస్ట్రేషన్లు చేశారు. చివరగా ఈ నెల 27న వీరందరికీ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అంతా ఓకే కావడంతో గురువారం పోర్టల్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తున్నారు.

స్మార్ట్‌ఫోన్: దసరాకు నిమిషానికి రూ.1.5 కోట్లస్మార్ట్‌‌ఫోన్లు విక్రయం

దసరా పండుగ సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్లు హాట్‌‌‌‌కేకుల్లా అమ్ముడైపోయాయని వెలుగు దినపత్రిక తెలిపింది.

అమెజాన్, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో అయితే ప్రతి నిమిషం రూ.1.5 కోట్ల విలువైన స్మార్ట్‌‌‌‌ఫోన్లు అమ్ముడైనట్టు ఈకామర్స్ మార్కెట్ రీసెర్చర్ రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా వెల్లడించింది.

రెడ్‌‌‌‌సీర్ కన్సల్టింగ్ డేటా ప్రకారం.. ఈ ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రూ.29 వేల కోట్లుగా(4.1 బిలియన్ డాలర్లుగా) నమోదైనట్టు వెల్లడైంది. అంచనా వేసిన 4 బిలియన్ డాలర్ల కంటే కూడా ఈసారి సేల్స్ మించిపోయాయి.

గతేడాది ఫెస్టివ్ సీజన్‌‌‌‌లో ఆన్‌‌‌‌లైన్ అమ్మకాలు రూ.19,909 కోట్లుగా(2.7 బిలియన్ డాలర్లుగా) ఉన్నాయి. ఈ నవరాత్రి దసరా సీజన్‌‌‌‌లో స్మార్ట్‌‌‌‌ఫోన్ అండ్ కన్జూమర్ ఎలక్ట్రానిక్ బ్రాండ్స్, రిటైలర్స్ సేల్స్ గతేడాదితో పోలిస్తే 10–20 శాతం పెరిగినట్టు వెల్లడైంది.

నవరాత్రి జోష్‌‌‌‌తో దివాళి సేల్స్ కూడా చాలా బాగుంటాయని రిటైలర్స్, కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. మిడ్ రేంజ్, ప్రీమియం ప్రొడక్ట్‌‌‌‌లను కస్టమర్లు ఎక్కువగా కొనేందుకు ఆసక్తి చూపడంతో మొత్తంగా తమ వ్యాపారాలు పెరిగినట్టు ఎల్‌‌‌‌జీ, శాంసంగ్, షియోమి, వివో, సోనీ, పానాసోనిక్, క్రోమా, విజయ సేల్స్, గ్రేట్ ఈస్ట్రన్ రిటైల్, సంగీతా మొబైల్స్ చెప్పాయి. చాలా బ్రాండ్ల ఆన్‌‌‌‌లైన్ సేల్స్ రెండింతలు పెరిగినట్టు పేర్కొన్నాయి.

ఏపీ పోలీస్‌ నంబర్‌ వన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్‌ శాఖ జాతీయ స్థాయిలో మరో అరుదైన రికార్డు సాధించింది. అత్యుత్తమ ప్రతిభతో ‘స్కోచ్‌’ అవార్డుల్లో సగానికిపైగా కైవసం చేసుకుంది. వరుసగా రెండోసారి కూడా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి తన సత్తా చాటింది.

దిశ, పోలీస్‌ సేవా యాప్‌లకు బంగారు పతకాలు రాగా.. మరికొన్ని విభాగాల్లో రజత పతకాలను రాష్ట్ర పోలీస్‌ శాఖ దక్కించుకుంది. పోలీస్‌ శాఖలో టెక్నాలజీ వినియోగంపై స్కోచ్‌ గ్రూప్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌లో భాగంగా బుధవారం జాతీయ అవార్డులను ప్రకటించింది. ఈ వివరాలను ఏపీ పోలీస్‌ ప్రధాన కార్యాలయం మీడియాకు విడుదల చేసింది.

స్కోచ్‌ గ్రూప్‌ మొత్తం 83 జాతీయ స్థాయి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్ర పోలీస్‌ శాఖ రికార్డు స్థాయిలో 48 అవార్డులను దక్కించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో కేరళ(9), మహారాష్ట్ర(4), పశ్చిమ బెంగాల్‌(4), హిమాచల్‌ప్రదేశ్‌(3), మధ్యప్రదేశ్‌(2), తమిళనాడు(2), ఛత్తీస్‌గఢ్‌(2) ఉన్నాయి.

ఇక తెలంగాణ, అరుణాచల్‌ ప్రదేశ్, అసోం, బిహార్, గుజరాత్, హరియాణా, ఒడిశా, పంజాబ్‌ తదితర రాష్ట్రాలు ఒక్కొక్కటి చొప్పున అవార్డులు దక్కించుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)