ప్రణయ్ హత్య: కుల దురహంకారం... కోటి రూపాయలు సుపారీ... బిహార్ నుంచి హంతకుడు

సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకు కారణం కులాంతర వివాహమేనని, ప్రణయ్ భార్య అమృత తండ్రి తిరునగరి మారుతీరావు ఈ హత్య చేయించాడని నల్గొండ ఎస్‌పీ రంగనాథ్ చెప్పారు.
గుజరాత్ మాజీ హోంమంత్రి హిరేన్ పాండ్యా హత్య కేసులో నిందితులుగా ఉండి విడుదలైన. మొహమ్మద్ బారీ, అస్గర్ అలీలతో ప్రణయ్‌ను హత్య చేయించటానికి మారుతీరావు కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నాడని తెలిపారు.
వారు మర్డర్ ప్లాన్ చేసి బీహార్‌కు చెందిన సుభాశ్ శర్మ అనే పాత నేరస్తుడితో ఈ హత్య చేయించారని చెప్పారు. మూడు నెలల పాటు సాగిన ఈ కుట్రతో మారుతీరావు తమ్ముడు శ్రవణ్‌కు కూడా సంబంధం ఉందన్నారు. మారుతీరావుకు బారీకి మధ్య కరీం అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించాడని, మారుతీరావు డ్రైవర్ సముద్రాల శివగౌడ్‌కు కూడా హత్య కుట్ర గురించి తెలుసని వివరించారు.
ఎస్‌పీ మంగళవారం నల్లగొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రణయ్ హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులనూ అరెస్ట్ చేశామని చెబుతూ, వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇది తమ కుమార్తె కులాంతర వివాహాన్ని వ్యతిరేకించిన తండ్రి చేయించిన హత్య తప్పితే.. ఇందులో రాజకీయ కుట్ర ఏమీ లేదన్నారు.
ఏడుగురు నిందితులు...
ఎ-1 తిరునగరి మారుతీరావు (అమృత తండ్రి)
ఎ-2 శుభాష్ శర్మ (హంతకుడు)
ఎ-3 మొహమ్మద్ బారీ (హత్య కుట్ర అమలులో పాత్రధారి)
ఎ-4 అస్గర్ అలీ (హత్య కుట్ర అమలులో పాత్రధారి)
ఎ-5 అబ్దుల్ కరీం (మారుతీరావు - బారీల మధ్య మధ్యవర్తి)
ఎ-6 తిరునగరి శ్రవణ్ (అమృత బాబాయ్)
ఎ-7 సముద్రాల శివగౌడ్ (డ్రైవర్)

ఫొటో సోర్స్, amrutha.pranay.3/facebook
ప్రణయ్ హత్యకు సంబంధించి ఎస్‌పీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే...
''మిర్యాలగూడకు చెందిన అమ్మాయి, అబ్బాయి తొమ్మిది, పదో తరగతుల నుంచే ప్రేమించుకున్నారు. ఇద్దరూ ఇంజనీరింగ్ మధ్యలో ఆపేశారు. వీరి ప్రేమ విషయం తెలిసి అమ్మాయి తండ్రి, బాబాయి.. ఆ అబ్బాయిని హెచ్చరించారు. అమ్మాయి ఈ ఏడాది జనవరిలో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ప్రణయ్, అమృత హైదరాబాద్‌లోని ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకున్నారు. అమ్మాయికి 21 ఏళ్లు. మైనర్ కాదు. ఇద్దరూ తిరిగి మిర్యాలగూడ వచ్చి ఉన్నారు. మొదట అభద్రతా భావంతో పోలీసుల దగ్గరికి వచ్చారు. పోలీసుల సూచన మేరకు ఇంటి దగ్గర సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు.
అమృత కులాంతర వివాహం మింగుడుపడని మారుతీరావు. అబ్బాయిని చంపించాలనుకున్నాడు. ఈ ఏడాది జూన్ నుంచి ఆయన మొహమ్మద్ బారీతో కాంటాక్ట్‌లో ఉన్నాడు.

ఫొటో సోర్స్, Nlgcops Nalgonda District Police/Facebook
కారులో కిరాయి మంతనాలు.. రూ. కోటి సుపారీ...
మారుతీరావు తరఫున కరీం వెళ్లి బారీ, అస్ఘర్‌లతో మాట్లాడాడు. మారుతీరావు, బారీలు జూన్, జూలై నెలల్లో ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఒకసారి నల్లగొండలో, మరోసారి హైదరాబాద్‌లో కలిశారు. జూలై మొదటి వారంలోనే.. అస్గర్, మొహమ్మద్ బారీ.. మిర్యాలగూడ ఆటోనగర్ దగ్గరకు వెళ్లారు. అక్కడికి మారుతీరావు, కరీం వెళ్లి వారిని కలిశారు. కారులోనే కూర్చుని మాట్లాడుకున్నారు.
ప్రణయ్‌ను హత్య చేయటానికి బారీ, అస్గర్‌లు రెండున్నర కోట్ల రూపాయలు అడిగారు. కోటి రూపాయలకు డీల్ కుదిరింది. అడ్వాన్స్ కింద వారు రూ. 50 లక్షలు అడిగితే మారుతీరావు 15 లక్షల రూపాయలు ఇస్తామన్నాడు. ఆ కారులోనే మిర్యాలగూడ వెళ్లి బారీకి, అస్గర్‌లకి పిల్లవాడి (ప్రణయ్) ఇల్లు చూపించారు.
జూలై 9, 10 తేదీల్లో కరీం రూ. 15 లక్షలు డబ్బు తీసుకుని హైదరాబాద్ సమీపంలోని రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర బారీ, అస్గర్‌లను కలిశాడు. కారులోనే వారికి ఆ డబ్బులు అందించాడు. అస్గర్, బారీలు మారుతీరావుతో మాట్లాడారు. డబ్బులు అందాయని చెప్పారు. ఆ డబ్బుల్లో బారీ రూ. 8 లక్షలు తీసుకున్నాడు. అస్గర్ ఆరు లక్షలు తీసుకోగా.. కరీం లక్ష రూపాయలు తీసుకున్నాడు.
అడ్వాన్స్ డబ్బు తీసుకున్న తర్వాత హత్యకు ప్రణాళిక రచించటం మొదలుపెట్టారు. ఒక పాత స్కూటీ కొన్నారు. దానికి నకిలీ నంబర్ పెట్టారు. బారీ బోగస్ పేర్ల మీద మూడు సిమ్ కార్డులు కొన్నాడు. అస్గర్ మూడు ఫోన్లు కొన్నాడు. వాటితో హత్య ప్రణాళిక గురించి మాట్లాడుకునేవారు.
ఈ లోపల అమృత గర్భిణి అని తెలిసి, ఆమెకు గర్భస్రావం చేయించటానికి మారుతీరావు ప్రయత్నాలు చేశాడు. తాను ప్రణయ్‌ను హత్య చేయించే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి.. తన కూతురుకు బిడ్డ పుడితే తర్వాత ఇబ్బంది అవుతుందని భావించాడు. అమృతకు గర్భస్రావం చేయాలని డాక్టర్ జ్యోతి మీద చాలా ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ డాక్టర్ తిరస్కరించారు.
మొదటిసారి.. అన్నదమ్ముల్లో అబ్బాయెవరో అర్థంకాక...
మరోవైపు, ప్రణయ్ హత్యకు ఆగస్టు 9 నుంచి రెక్కీ మొదలుపెట్టారు. ఆగస్టు 14న మొదటి ప్రయత్నం చేశారు. ఆ రోజు అమృత బ్యూటీ పార్లర్ దగ్గరకు వచ్చినపుడు ప్రణయ్ కూడా వచ్చాడు. అక్కడ ప్రణయ్‌ని హత్య చేయాలనుకుని బారీ, అస్గర్, సుభాష్ శర్మ ముగ్గురూ అక్కడికెళ్లారు. కానీ ప్రణయ్‌తో పాటు అతడి సోదరుడు కూడా అక్కడ ఉండటంతో ఇద్దరిలో ఎవరు ప్రణయ్ అనేది అర్థం కాక విరమించుకున్నారు.
అదే సమయంలో, ప్రణయ్, అమృతలు ఆగస్ట్ 17న పెళ్లి రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకూ అమృత కులాంతర పెళ్లి గురించి పెద్దగా ఎవరికీ తెలియదని ఈ రిసెప్షన్‌తో ఊర్లో అందరికీ తెలిసిందని మారుతీరావు ఫీలయ్యాడు. ప్రణయ్‌ని హత్య చేసే పనిని వేగవంతం చేసే ప్రయత్నం చేశాడు. వారి రిసెప్షన్ సమయంలో ఊర్లో ఇబ్బంతికర పరిస్థితి వస్తుందని భావించి, ఆగస్ట్ 16 నుంచి 23 వరకూ హైడ్రోసిల్ ఆపరేషన్ కోసం హైదరాబాద్ లో ఆస్పత్రిలో చేరాడు.
సుభాశ్ శర్మ రెక్కీ కోసం ఆగస్టు 22న ప్రణయ్, అమృతల ఇంటికి వచ్చాడు. కారు కిరాయికి ఇస్తారా అని హిందీలో అడిగాడు. ప్రణయ్ తండ్రికి కొంత అనుమానం వచ్చింది. అయినా సీరియస్‌గా పట్టించుకోలేదు.
కిడ్నాప్ చేసి చంపుదామని ప్లాన్ చేశారు...
బారి, అస్గర్‌లు సెప్టెంబర్ మొదటి వారంలో అబ్బాయి, అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపుదామని అనుకున్నారు. హైదరాబాద్ నుంచి నలుగురిని పిలిపించారు. ఆ వచ్చిన వాళ్లు తాగుతుండటంతో, వారితో ఆ పని కాదని ఆ ప్రయత్నం విరమించుకున్నారు.
ఈ హత్య కుట్ర విషయాన్ని మారుతీరావు తన భార్యకు (అమ్మాయి తల్లి) ఎక్కడా చెప్పలేదు. తల్లి మామూలుగా మాట్లాడుతుండటంతో అమృత తాము ఎప్పుడు ఎక్కడికి వెళ్లి వచ్చేదీ ఆమెకు చెప్తుండేది. ఆమె ఆ విషయాలను మామూలుగానే తన భర్త మారుతీరావుకు చెప్పేది. ఆమె దగ్గర అమాయకంగా సమాచారం తీసుకుని ఆ వివరాలను బారీకి చేరవేసేవాడు మారుతీరావు.
ప్రతి శనివారం ఆస్పత్రికి వెళ్లేవారు. సెప్టెంబర్ 13న వినాయకచవితి రోజు అమృత తన తల్లితో మాట్లాడింది. మరుసటి రోజు 14న ఆస్పత్రికి వెళుతున్నామని చెప్పింది. ఆమె ఆ విషయాన్ని మారుతీరావుకు చెప్పింది. మారుతీరావు అస్గర్ అలీకి చెప్పాడు.
సెప్టెంబర్ 14వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆస్పత్రి దగ్గర ప్రణయ్‌ని హత్య చేశారు. సుభాశ్ శర్మ ముందుగా వచ్చాడు. తర్వాత ఆటోలో అస్గర్ వచ్చాడు. స్పాట్ లో అస్ఘర్ ఉండడు. సుభాశ్ శర్మ ఒక్కడే స్పాట్ లో ఉంటాడు. బారీ ఇదంతా పురమాయిస్తూ మారుతీరావుతో టచ్‌లో ఉంటాడు.
అలిబీ కోసం మారుతీరావు ప్రయత్నాలు...
హత్య జరగటానికి రెండు గంటల ముందే బయల్దేరి నల్లగొండకు వచ్చాడు.. తనకు హత్యతో సంబంధం లేదని అలిబీ క్రియేట్ చేయటానికి. మధ్యలో డీఎస్‌పీ, జాయింట్ కలెక్టర్ కనపడితే అవసరం లేకున్నా వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేశాడు. హత్య తర్వాత మారుతీరావుకు అస్గర్ అలీ ఫోన్ చేసి మర్డర్ చేసేశామని, అబ్బాయి చనిపోయాడని చెప్పాడు. మిగతా డబ్బులు కూడా అరేంజ్ చేయాలన్నాడు.
ప్రణయ్‌ని మర్డర్ చేసిన తర్వాత సుభాశ్ శర్మ, అస్గర్‌లు స్కూటీ మీద సాగర్ రోడ్డు మీదుగా నల్లగొండ వెళ్లారు. అక్కడి నుంచి శర్మ బస్సులో బెంగళూరు వెళ్లి. అక్కడి నుంచి పాట్నా వెళ్లాడు. మారుతీరావు తమ్ముడు శ్రవణ్‌కు, డ్రైవర్ శివకు ఈ మర్డర్ ప్లాన్ ముందు నుంచీ తెలుసు.
ఈ హత్య కేసును వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేసి నాలుగు రోజుల్లో ఛేదించాయి. నిందితులు ఏడుగురినీ వేర్వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకున్నాం. సుభాశ్ శర్మను ట్రాన్సిట్ రిమాండ్ మీద సమస్థీపూర్ నుంచి పట్నా తీసుకువచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకువస్తారు.
ఇది పరువు హత్య కాదు.. ఆయన పరువు ఇప్పుడు పోయింది....
అమ్మాయిది వైశ్య కులం.. అబ్బాయిది మాల కులం. మారుతీరావు ఆర్థికంగా బలవంతుడు. అబ్బాయిది మధ్యతరగతి కుటుంబం. చదువు కూడా మధ్యలోనే మానేశాడు. ఎలా ఒప్పుకుంటానని మారుతీరావు పోలీసు విచారణలో చెప్పాడు. ఏదేమైనా.. కులం, ఆర్థిక హోదాలకు సంబంధించిన హత్య. ఇది పరువు హత్య కాదు. అతడి పరువు ఇప్పుడు పోయింది.. కాబట్టి దీనిని పరువు హత్య అనటం సరికాదు. హత్య, ఎస్‌సీ, ఎస్‌టీ అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాం.
మారుతీరావు అక్రమాలపై ఫిర్యాదు చేస్తే దర్యాప్తు చేస్తాం
మారుతీరావు తాను బస్తాలు మోసి పైకి వచ్చానని చెప్తున్నాడు. కానీ.. రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో మోసాలతో పైకివచ్చాడని మిర్యాలగూడలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. నిర్దిష్టమైన ఫిర్యాదుల మీద దర్యాప్తు చేస్తాం. రెవెన్యూ అధికారులతోనూ మాట్లాడుతున్నాం. మారుతీరావు వల్ల ప్రభావితులైన వారు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిందిగా కోరుతున్నాం. వీటిపై దర్యాప్తు చేసి.. చర్యలు చేపడతాం.
హంతకుడూ మాజీ నేరస్థుడే...
బీహార్‌కి చెందిన సుభాశ్ శర్మ.. దొంగతనాలు చేశాడు. ఒక దోపిడీ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు. బీహార్‌లో శర్మ మిత్రుడు ఒకరు.. అస్గర్‌కు కాంటాక్ట్. అలా శర్మని పిలిపించారు. ఈ హత్య కేసులో అతడు ఎక్కడా ఒకచోట స్థిరంగా ఉండలేదు. నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ ఇలా పలుచోట్ల హోటళ్లలో ఉండేవాడు. వస్తూ వెళ్తూ ఉండేవాడు.
గుజరాత్ మాజీ హోంమంత్రి హత్యకేసులో నిందితులు
అస్గర్ అలీ.. హిరేన్ పాండ్యా (గుజరాత్ మాజీ హోంమంత్రి) హత్య కేసులో నిందితుడు. మొహమ్మద్ బారీ కూడా అదే కేసులో నిందితుడు. వీరిని కింది దోషులుగా ప్రకటించినప్పటికీ.. పైకోర్టు విడుదల చేసింది. వాళ్ల మీద నిఘా వైఫల్యం విషయాన్ని కూడా పరిశీలిస్తున్నాం. మున్ముందు ఇటువంటి లోటుపాట్లు లేకుండా నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తాం.
రాజకీయ కోణం లేదు...
ఈ హత్య కేసు ప్రాథమిక దర్యాప్తులో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్లు ఏమీ తెలియలేదు. ఆరోపణలు ఉన్న ప్రతి వాళ్ల కాల్ డేటా పరిశీలించాం. వేముల వీరేశం మీద వచ్చిన ఆరోపణలనూ దర్యాప్తు చేశాం. అవి పెళ్లి సమయంలో జరిగిన పరిణామాలు.. ఆయన అబ్బాయి తండ్రి, పెదనాన్నలను పిలిచి మాట్లాడాడు. 'నేను దళితుడినే.. అగ్రవర్ణానికి సంబంధించిన అమ్మాయిని చేసుకున్నాను. మీరు కూడా పెద్దల ఆమోదం తీసుకుని ఉంటే బాగుండేద'ని చెప్పినట్టు చెప్తున్నారు. బెదిరించాడనీ చెప్తున్నారు. దీనిపై ఎంక్వైరీ చేస్తాం.
భరత్ అనే అడ్వకేట్.. మారుతీరావుకు బంధువు. అమృతకి గర్భస్రావం చేసే విషయంలో మారుతీరావు మాట్లాడించాడు. 'మీరు ఇంకా పిల్లలుగా ఉన్నారు.. ఇంకా స్థిరపడలేదు.. కెరీర్ బిల్డప్ చేసుకున్న తర్వాత.. పిల్లల్ని ప్లాన్ చేసుకోవాల'ని అతడు మాట్లాడాడు.
ఇందులో ఎటువంటి రాజకీయాలూ లేవు. మారుతీరావు టీఆర్ఎస్‌లో చేరాడు. బారీ ఎంఐఎం పార్టీలో ఉన్నాడు. కరీం కాంగ్రెస్ లో చేరాడు. కేవలం డబ్బు చూపించి చేసిన పనే తప్ప రాజకీయాలు లేవు.
పోలీసుల నిర్లక్ష్యం లేదు
ప్రణయ్ హత్య విషయంలో పోలీసుల నిర్లక్ష్యం లేదు. 'మా తండ్రి, మా తల్లి మాతో బాగానే మాట్లాడుతున్నార'ని అన్నపుడు.. మేం కుటుంబ వ్యవహారాల్లో ఎంటరవలేం కదా? వాళ్లే వచ్చి చెప్పటం లేదు. డీఎస్‌పీకి కూడా పెళ్ళి రిసెప్షన్ ఆహ్వానం ఇచ్చారు. ఆయన హెచ్చరించారు. రిసెప్షన్‌కి సెక్యూరిటీ పంపించారు. కానీ మానిటరింగ్ దెబ్బతిన్నది. "మమ్మల్ని చంపటానికి లేదా మాకు హాని చేయటానికి ప్రయత్నిస్తున్నార"ని వాళ్లు చెప్పినా అప్రమత్తం అయ్యేవాళ్లం. శర్మ ఒకసారి బైక్ మీద వచ్చినపుడు అనుమానం వచ్చిందని ముందే చెప్పి ఉంటే,. మేం చర్యలు చేపట్టే వాళ్లం. అతడు రావటం వారి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది కూడా.
ఈ హత్యలో నయీం ముఠా లేదు. నయీం అనేవాడు పోయాడు. క్రిమినల్ ని క్రిమినల్ గా చూపిద్దాం. పెద్దగా చూపించొద్దు. అదే వాడికి కావలసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








