సూరత్‌లో అత్యాచారానికి బలైన బాలికది ఆంధ్రప్రదేశేనా?

    • రచయిత, రిషీ బెనర్జీ, దీపక్ చుడాసమా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

సూరత్‌లో గుర్తు తెలియని దుండగుల అత్యాచారానికి బలై మృతి చెందిన బాలికది ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చని గుజరాత్ పోలీసు అధికారులు చెబుతున్నారు.

కఠువా దారుణంతో మొదలై, ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న చిన్నారులపై అత్యాచారం, హత్య ఘటనలతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది.

11 రోజుల క్రితం సూరత్‌లోని పాండెసరా ప్రాంతంలో ఉన్న ఓ క్రికెట్ స్టేడియం సమీపంలో దాదాపు తొమ్మిదేళ్ల వయసున్న బాలిక శవాన్ని పోలీసులు కనుగొన్నారు.

బాలికపై 86 గాయాల గుర్తులున్నాయి.

బాలికను దాదాపు వారం రోజులు బంధించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు అంటున్నారు.

ఆ బాలిక తల్లిదండ్రులెవరు? ఏ ప్రాంతం వారు? అన్న విషయాలు ఎవరికీ తెలియలేదు.

అయితే తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక కుటుంబం సూరత్ పోలీసులను ఆశ్రయించింది.

ఆ పాప తమ కూతురేనని ఆ కుటుంబం అంటోంది.

గత సంవత్సరం అక్టోబర్ నుంచి తమ కూతురు కనిపించకుండా పోయిందని వారు చెప్పినట్టు సమాచారం.

వారు తమకు చూపించిన ఫొటోలు బాధిత బాలిక ఫొటోలను పోలి ఉన్నాయని సూరత్ పోలీస్ కమిషనర్ సతీశ్ శర్మ బీబీసీతో చెప్పారు.

అయితే, వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాతే దీనిని ధ్రువీకరించగలమని ఆయన అన్నారు.

సూరత్ వ్యాపారుల వినూత్న స్పందన - చీరల ప్యాకెట్లపై బాలిక ఫోటోల ముద్రణ

బాధిత బాలిక ఎవరైందనేది గుర్తించేందుకు సూరత్‌లోని వస్త్ర వ్యాపారులు, కొన్ని సామాజిక సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి.

సూరత్ నగరం వస్త్ర పరిశ్రమకూ, ప్రత్యేకించి చీరల వ్యాపారానికి పేరు గాంచిందందనే విషయం తెలిసిందే.

వివిధ రాష్ట్రాల నుంచి హోల్‌సేల్ వ్యాపారులు సూరత్‌కు వచ్చి చీరలు కొనుగోలు చేస్తుంటారు.

అంతేకాదు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులు సూరత్‌లోని వివిధ పరిశ్రమల్లో పని చేస్తారు.

ఈ నేపథ్యంలో చీరల వ్యాపారులు బాధిత బాలిక ఫొటోలను చీరల ప్యాకెట్స్‌పై, బండిల్స్‌పై ముద్రించడం ద్వారా అవి అన్ని చోట్లకూ చేరేలా చూశారు.

మరోవైపు, బాలిక తల్లిదండ్రులెవరో తెలిపిన వారికి 5 లక్షల బహుమానం ఇస్తామని సూరత్ బిల్డర్ల సంఘం ప్రకటించింది.

'ఈ ఘటన మమ్మల్ని కుదిపేసింది'

ఈ ఘటన తమను బాగా కలచివేసిందని సూరత్‌కు చెందిన వస్త్ర వ్యాపారి లలిత శర్మ బీబీసీతో అన్నారు.

ఆ బాలిక ఎవరో గుర్తించడం, ఆమెకు న్యాయం జరిగేలా చూడడం తమ బాధ్యతగా భావించినట్టు ఆయన చెప్పారు.

"చీరల ప్యాకెట్లపై బాలిక ఫొటోను ముద్రిస్తే, ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకూ అవి వెళ్తాయి కాబట్టి అలా అది బాలిక తల్లిదండ్రుల వరకూ చేరొచ్చని మేం భావించాం" అని శర్మ వివరించారు.

ఇప్పటి వరకు 25 వేల ప్యాకెట్లు బాలిక ఫొటోలతో దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాయనీ, మరో లక్ష ఫొటోలు సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

బాలికను గుర్తించే దాకా, నిందితులను అరెస్ట్ చేసే దాకా చీరల బండిల్స్‌పై బాలిక ఫొటోను ఇలా ముద్రిస్తూనే ఉంటామని మరో వ్యాపారి రాజీవ్ శర్మ చెప్పారు.

వస్త్ర వ్యాపారులు చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామని సూరత్ పోలీసు కమీషనర్ సతీష్ శర్మ బీబీసీతో అన్నారు.

"సమాజంలోని వివిధ వర్గాలు ఇలా ముందుకు వస్తే పోలీసు దర్యాప్తుకు ఇదెంతో ఉపయోగపడుతుంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

పోలీసు అధికారులు కూడా బాలిక ఫొటోను దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల ఎస్‌పీలకు చేరేలా చేశారు.

ఆ క్రమంలోనే ఆ ఫొటో బాధితురాలి తల్లిదండ్రులకు చేరినట్టు భావిస్తున్నారు.

వారు తమ కూతురి ఫొటోలు కొన్ని తీసుకొని సూరత్‌కు వచ్చి పోలీసు అధికారులను సంప్రదించారు.

ఆ ఫొటోలు మృతురాలి ఫొటోతో సరిపోలినట్టు కనిపిస్తున్నప్పటికీ డీఎన్ఏ పరీక్ష తర్వాతే నిర్ధరించగలమని సూరత్ పోలీసు అధికారులు బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)