You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీబీఎస్ఈ పేపర్ లీక్: విద్యార్థులకు మళ్లీ పరీక్ష
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) హైస్కూల్ పరీక్షా ప్రశ్నాపత్రాలు లీక్ కావటంతో.. విద్యార్థులు మరోసారి ఈ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ప్రాథమిక విచారణలో ఈ ప్రశ్న పత్రం లీక్ దిల్లీ, హరియాణాలకే పరిమితమైనట్లు గుర్తించారు.
దీంతో మళ్లీ పరీక్షను కూడా ఈ ప్రాంతాల్లోని విద్యార్థులకే నిర్వహించనున్నారు.
సీబీఎస్ఈ మాథమేటిక్స్, ఎకనమిక్స్ ప్రశ్నపత్రాలు పరీక్షలకు ముందుగానే లీకయ్యాయని, వాట్సాప్ ద్వారా పంపిణీ అయ్యాయని ఆరోపణలు రావటంతో పోలీసులు 32 మందిని ప్రశ్నించారు.
ఈ రెండు పేపర్ల పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
దేశంలో స్కూల్, కాలేజీ పరీక్షల్లో చీటింగ్‌కు పాల్పడటం, ప్రశ్న పత్రాలను ముందుగా కొనేందుకు లంచాలు ఇవ్వడం వంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
2015లో బిహార్‌లో పరీక్షలు రాస్తున్న తమ పిల్లలకు జవాబులు అందించటానికి వారి తల్లిదండ్రులు, స్నేహితులు స్కూల్ గోడలు ఎక్కిన ఘటన ఫొటోలతో సహా వెలుగుచూడటంతో 300 మందిని అరెస్ట్ చేయటంతో పాటు 750 మంది విద్యార్థులపై బహిష్కరణ వేటు వేశారు.
ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీల్లో అడ్మిషన్ల విషయంలో సీబీఎస్ఈ పరీక్షల ఫలితాలు చాలా కీలకమైనవి.
ఈ పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్ కావటం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రశ్న పత్రాల ఆన్‌లైన్ భద్రతను బలోపేతం చేస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ హామీ ఇచ్చారు.
‘‘ప్రశ్నపత్రాల లీక్ పట్ల తల్లిదండ్రులు, విద్యార్థుల ఆవేదన, ఆగ్రహాన్ని నేను అర్థం చేసుకోగలను. లీక్ అవటానికి కారణమైన నేరస్తులను ఉపేక్షించం. వీరిని పోలీసులు త్వరలోనే పట్టుకుంటారు. వ్యవస్థను మరింత మెరుగుపరిచి లోపాలు లేకుండా చేస్తామని హామీ ఇస్తున్నా’’ అని ఆయన గురువారం మీడియాతో పేర్కొన్నారు.
ఈ లీక్ వ్యవహారంలో కాలేజీ విద్యార్థులు, ట్యుటోరియల్ సెంటర్ల యజమానులు 30 మందికి పైగా తాము ప్రశ్నించినట్లు దిల్లీ పోలీసులు చెప్పారు.
మరోవైపు.. ఈ ప్రశ్న పత్రాల లీక్ ఉదంతం డిజిటల్ సెక్యూరిటీ విషయంలో అధికార భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణలో పడేలా చేసింది.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ లీక్‌ను ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ట్విటర్‌లో విమర్శలు సంధించారు.
ప్రధాని మోదీ అధికారిక మొబైల్ అప్లికేషన్.. యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని వారి ఆమోదం లేకుండా థర్డ్ పార్టీకి పంపిస్తుందన్న ఆరోపణలు రావటంతో ఈ వారం ఆరంభంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి.
మార్చి 26వ తేదీన జరిగిన సీబీఎస్ఈ 12వ తరగతి ఎకనమిక్స్ పరీక్ష మొదలు కావటానికి కొన్ని గంటల ముందు ఆ ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో పంపిణీ అయిందని అధికారులు చెప్పారు.
మార్చి 28వ తేదీన జరిగిన సీబీఎస్ఈ 10వ తరగతి మాథమ్యాటిక్స్ పరీక్ష కూడా అలాగే లీకైనట్లు పేర్కొన్నారు.
సీబీఎస్‌ఈ పరీక్షలకు సంబంధించి మరొక ప్రశ్నా పత్రం కూడా లీకైనట్లు దిల్లీ ప్రభుత్వానికి మార్చి 15న ఫిర్యాదులు అందాయి.
సీబీఎస్ఈ తొలుత ఈ లీక్ వార్తలను తిరస్కరించింది. కానీ ఆ తర్వాత లీక్ వాస్తవమేనని అంగీకరించింది.
‘‘మేం విద్యార్థుల మంచి కోసం కృషి చేస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులకు అనుకూలంగా మేం ఒక నిర్ణయం తీసుకున్నాం’’ అని సీబీఎస్ఈ అధికారి అనితా కార్వాల్ గురువారం పేర్కొన్నారు.
ఇటీవల.. బిహార్‌లో స్కూల్ పరీక్షల్లో చీటింగ్‌ను నివారించటానికి.. పీరక్షలకు వచ్చే విద్యార్థులు బూట్లు, సాక్సులు తొడుక్కొని రాకూడదని ఆంక్షలు విధించటంతో పాటు చీటింగ్‌కు పాల్పడితే జైలు శిక్ష, జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టారు.
పలువురు విద్యార్థులను బహిష్కరించటంతో పాటు.. పరీక్షల్లో మోసం చేయటానికి సహకరించిన వారి తల్లిదండ్రులను అరెస్ట్ చేశారు.
ఆ పొరుగునే ఉన్న ఉత్తరప్రదేశ్‌లో సైతం.. పరీక్షలు రాయటానికి వచ్చే విద్యార్థులను పూర్తిగా తనిఖీ చేయటం, పరీక్షలను సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించటం ప్రవేశపెట్టారు.