ఉసెన్ బోల్ట్‌ను తలపిస్తున్న సెన్సెక్స్... 5 రోజుల్లో 1000 పాయింట్ల లాభం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వరికూటి రామకృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
స్టాక్ మార్కెట్ పరుగు చూస్తుంటే ఉసెన్ బోల్ట్‌ను తలదన్నేలా ఉంది.
కోహ్లి మాదిరిగా సెంచరీలు, రోహిత్ మాదిరిగా డబుల్ సెంచరీలు ఒక్క ఇన్నింగ్స్‌లోనే కొట్టేస్తోంది.
రంకె వేస్తే చాలు అలా.. అలా.. రికార్డులు బద్ధలవుతున్నాయి.. గత అయిదు రోజులుగా సూచీల జోరును చూస్తున్న ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది.
5 సెషన్లలో 1000 పాయింట్లు
సెన్సెక్స్ గురించి ఏమని వర్ణించగలం.. ఇంకేమని చెప్పగలం.
మొన్న 35,000 పతాకాన్ని ఎగరవేస్తే అబ్బో అనుకున్నాం.
22 రోజుల్లో 1000 పాయింట్లు పెరిగిందంటే ఆహా అని ఆశ్చర్యపోయాం.
మరి నేడు 36,000 పాయింట్లను అలవోకగా దాటేసింది.
ఎన్ని రోజుల్లో అనుకుంటున్నారు.. కేవలం 7 రోజుల్లో.
ఇంకా చెప్పాలంటే 5 ట్రేడింగ్ సెషన్లు మాత్రమే.

ఫొటో సోర్స్, Getty Images
అన్నకు తగ్గ తమ్ముడు
అన్న దూకుడును తమ్ముడూ అందిపుచ్చుకున్నాడు. సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా చెలరేగి పోయింది. తొలిసారిగా 11,000 మైలురాయిని దాటేసింది.
2017 జులై 15న నిఫ్టీ 10,000 పాయింట్లకు చేరింది. అంటే దాదాపు 193 రోజుల్లో 1,000 పాయింట్లు పెరిగింది.
డబుల్, ట్రిపుల్ సెంచరీలు
రికార్డులు బద్ధలు కొట్టే ఈ ప్రయాణంలో సెన్సెక్స్, నిఫ్టీలు రోజూ అర్ధ సెంచరీలు, డబుల్ సెంచరీలు కొట్టాయి.
మంగళవారం సెన్సెక్స్ వీరేంద్ర సెహ్వాగ్‌లా ఏకంగా ట్రిపుల్ సెంచరీ కొట్టేసింది.
342 పాయింట్లు పెరిగి 36,140 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 118 పాయింట్లు పెరిగి 11,084 వద్ద స్థిరపడింది.
ఇవి కూడా చదవండి:
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.








