You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబునాయుడు: తనను రేపోమాపో అరెస్టు చేస్తారని ఈ మాజీ సీఎం ఎందుకు అంటున్నారు... ఐటీ నోటీసుల సంగతేంటి?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
2021-22 సంవత్సరానికి సంబంధించి దాదాపు రూ.118 కోట్ల ఆదాయం విషయంలో 153సీ కింద ఈ నోటీసులు ఇచ్చారు. వీటిని ఆగస్టు 4న ఇచ్చినట్టు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబు సమాధానం చెప్పాలంటూ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
జగన్ లాబీయింగ్‌తో జారీ అయిన తప్పుడు నోటీసులంటూ టీడీపీ ప్రతి విమర్శలకు దిగుతోంది.
ఇంతకీ ఆ నోటీసులు ఎందుకిచ్చారు, అందులో ఏముందన్నది కీలకంగా మారింది. రెండుమూడు రోజుల్లో నన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అంటూ తాజాగా రాయదుర్గంలో చంద్రబాబు చేసిన కామెంట్‌తో ఈ విషయం మరింత ఆసక్తికరంగా మారింది.
నోటీసులో ఏముంది
ఈ ఏడాది ఆగస్టు 4న చంద్రబాబుకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది.
దాన్ని ఐటీ శాఖ హైదరాబాద్ సర్కిల్ అధికారులు జారీ చేశారు. అందులో దాదాపు 46 పేజీలున్నాయి.
ఆగస్టు 4న నోటీసులు ఇచ్చి 11న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు.
అప్పటికే నాలుగు సార్లు నోటీసులు ఇవ్వగా, వాటికి చంద్రబాబు నుంచి సమాధానాలు వచ్చినట్టు నోటీసులలో ప్రస్తావించారు.
ఐటీ శాఖ తన నోటీసులలో పేర్కొన్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
ఐటీ శాఖ చట్టం, 1961.. సెక్షన్ 132 ప్రకారం 2019 నవంబరు 1న మనోజ్ వాసుదేవ్ పార్థసానీ(ఎంవీపీ), అతని అసోసియేట్స్ కార్యాలయంలో ఐటీ శాఖాధికారులు తనిఖీలు చేశారు.
ఎంవీపీ గతంలో షాపూర్జీ పల్లోంజీ వంటి కంపెనీలకు కన్సల్టెంట్‌గా పనిచేశారు.
ఈ సోదాలలో ఎంవీపీ ఫోన్, కన్సల్టెంట్స్‌కు చెందిన కంప్యూటర్లలో నేరారోపణకు సంబంధించిన పత్రాలు స్వాధీన చేసుకున్నారు.
‘‘బోగస్ ఇన్వాయిస్‌లతో మనోజ్ వాసుదేవ్ పార్థసానీ, మంగేష్ రాణె, అతుల్ సోనీ, వినయ్ నంగాలియా కలిసి డబ్బును కంపెనీలోకి తీసుకువచ్చినట్లు గుర్తించాం’’ అని ఐటీ శాఖ చెప్పింది.
‘‘2019 నవంబరు 1, నవంబరు 5న ఎంవీపీ నుంచి వాంగ్మూలం రికార్డు చేశాం. దీన్ని ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 132(4) ప్రకారం రికార్డు చేయడం జరిగింది.
దిల్లీ, ముంబయిల్లో వాంగ్మూలం రికార్డు చేశాం.
ఈ సందర్భంగా బోగస్ కాంట్రాక్టుల, వర్క్ ఆర్డర్లతో షాపూర్జీ పల్లోంజీ, అఫ్కాన్స్ ఇన్ ఫాస్ర్టక్చర్ ప్రైవేటు లిమిటెడ్, ఎల్ అండ్ టీ కంపెనీలకు డబ్బులు తీసుకొచ్చారు.
ఇందుకుగాను పనులను సబ్ కాంట్రాక్టులుగా విభజించారు.
అందుకు బోగస్ కాంట్రాక్టులు ఇవ్వడం చేశాం.
ఈ బోగస్ సబ్ కాంట్రాక్టు కంపెనీలకు ఇన్ ఫ్రాస్ర్టక్చర్ ప్రాజెక్టులకు చెందిన డబ్బులు ఇచ్చారు.
ఆ తర్వాత షాపూర్జీ పల్లోంజీ వంటి కంపెనీలకు నిధులు డబ్బులు రూపంలో వచ్చి.. అక్కడి నుంచి ప్రమోటర్స్ కు పంపిణీ చేయడం జరుగుతుంది’’ అని ఎంవీపీ వాంగ్మూలంలో చెప్పినట్లుగా ఐటీ శాఖ పేర్కొంది.
చంద్రబాబుకు సంబంధం ఏంటి?
ఎంవీపీతో చంద్రబాబు సంబంధాల గురించి ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులలో సెక్షన్ 7లో రాసుకొచ్చింది.
2016లో అంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న పి. శ్రీనివాస్ తో ఎంవీపీకి పరిచయం ఏర్పడిందని ఐటీ శాఖ నోటీసుల్లో రాసింది.
తమ సోదాల సందర్భంగా పి.శ్రీనివాస్ తో ఉన్న పరిచయం, లావాదేవీల విషయంపై ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు ఐటీ శాఖ చెప్పింది. ఈ విషయంపై ఎంవీపీ నుంచి వచ్చిన సమాధానం అంటూ ఇలా రాసింది.
‘‘2016 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ కు ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులు వచ్చినప్పుడు తొలిసారిగా శ్రీనివాస్‌ను కలిశాను.
ఆ తర్వాత షాపూర్జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ కన్సల్టెంట్ గా 2017, 2018లో కొన్నిసార్లు కలిశాను.
2019 ఫిబ్రవరి మధ్యలో నన్ను విజయవాడకు శ్రీనివాస్ పిలిచారు.
ఎన్నికలు వస్తున్నాయని టీడీపీకి ఫండ్స్ ఇవ్వాలని అడిగారు.
మా మధ్య సమావేశాలు సహజంగా తాత్కాలిక సచివాలయంలోనే జరిగాయి’’ అని ఎంవీపీ వాంగ్మూలం ఇచ్చారని ఐటీ శాఖ నోటీసుల్లో రాసింది.
చంద్రబాబుతో జరిగిన పరిచయంపై ఎంవీపీని అడిగినట్లుగా ఐటీ శాఖ చెప్పింది.
‘‘ఏపీటిడ్కో తరఫున చేపట్టిన ప్రాజెక్టుల కోసం సమావేశాలు, ప్రజెంటేషన్లపై చంద్రబాబును తాత్కాలిక సచివాలయంలో కలవడం జరిగింది. ఏపీ టిడ్కో తరఫున 2017 ఫిబ్రవరిలో షాపూర్జీ పల్లోంజీ కంపెనీకి 1.43లక్షల ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2019 మార్చి నాటికి 23వేల ఇళ్ల ను పూర్తి చేయడం జరిగింది.
అలాగే, ఏపీ టిడ్కో తరఫున ఈడబ్లూఎస్ హౌసింగ్, హైకోర్టు డెవలప్మెంట్, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణం కూడా చేపట్టారు.
ఇవి ప్రభుత్వం తరఫున జరిగిన సమావేశాలు కావడంతో ఏపీటిడ్కో, ఏపీసీఆర్డీఏ అధికారులతోపాటు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధులతో నేనూ పాల్గొన్నా.
మొదటిసారి చంద్రబాబును 2019 ఫిబ్రవరిలో ఆయన నివాసంలో కలిశాను. ఆ సమయంలో షాపూర్జీ పల్లోంజీ చేపట్టిన వర్క్/ప్రాజెక్టు పురోగతిపై చర్చించడం జరిగింది. ఆ తర్వాత తన పీఎస్ శ్రీనివాస్ ని కలిసి ఆయన ఇచ్చే సూచనలను అనుసరించాలని చెప్పడం జరిగింది’’ అని ఎంవీపీ ఇచ్చిన వాంగ్మూలంలో ఉందని ఐటీ శాఖ నోటీసుల్లో రాసింది.
‘‘ఆ తర్వాత శ్రీనివాస్ ను కలిస్తే విక్కీ జైన్, వినయ్ నంగాలియాను నాకు పరిచయం చేశారు.
శ్రీనివాస్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనులను వాళ్లు చెప్పిన నవోలిన్, ఎవెరెట్, హయగ్రీవ అన్నై, షలక వంటి కంపెనీలకు సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. వర్క్ ఆర్డర్లకు తగ్గట్టుగా పేమెంట్స్ చేశాం’’ అని ఎంవీపీ తన వాంగ్మూలంలో చెప్పారని ఐటీ శాఖ చెబుతోంది. ఈ కంపెనీలకు డబ్బులు ఏ విధంగా వస్తున్నాయనే విషయం తనకు తెలియదని మాత్రం చెప్పారు.
వాట్సాప్ చాట్లు, ఈమెయిల్స్
ఆయా కంపెనీల నుంచి డబ్బులు మళ్లింపు తీరును ఐటీ శాఖ తన నోటీసుల్లో రాసుకొచ్చింది. కొన్ని వాట్సాప్ చాట్‌లను నోటీసులకు జత చేసింది.
ఐటీ శాఖ నోటీసుల్లోని పేరా 7.6.6లో దుబాయిలో పేమెంట్స్ జరిగినట్లు రాసింది.
ఎంవీపీకి చెందిన ముంబాయిలోని రితూ అపార్టుమెంట్స్ ఫ్లాట్ నం.11 లభించిన డాక్యుమెంట్ల ప్రకారం.. 54 ప్రశ్నలో వాంగ్మూలం రికార్డు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
‘‘ఈ విషయంపై కచ్చితమైన సమాచారం నా వద్ద లేదు. కొన్ని పేమెంట్స్ దిరామ్స్‌లో జరిగినట్లుగా ఉన్నాయి’’ అని ఎంవీపీ చెప్పినట్లు ఐటీ శాఖ చెప్పింది.
2017-18 మధ్య ఎంవీపీ చేసిన లావాదేవీలపై కొన్ని ఈ మెయిల్స్ గుర్తించినట్లు ఐటీ శాఖ పేర్కొంది. 7.9 పేరాలో ఈ వివరాలు రాసుకొచ్చింది.
‘‘సీబీఎన్ స్టీల్ ఇన్ టన్స్’’ అనే సబ్జక్ట్‌తో మనోజ్ వాసుదేవ్ పార్థసానీ, ఇ-మెయిల్ పంపించుకున్నాడని నోటీసులలో రాసింది.
దీనికి సంబంధించి 2018 జనవరిలో ఇ-మెయిల్ స్క్రీన్ షాట్ తీసినట్లు ప్రస్తావించింది.
చంద్రబాబు అభ్యంతరం
మనోజ్ వాసుదేవ్ పార్థసానీ నుంచి సేకరించిన వాంగ్మూలం, ఎక్సెల్ షీట్లలో చంద్రబాబు పేరు ప్రస్తావన వచ్చిందంటూ సెప్టెంబరు 30, 2022లో ఐటీ శాఖ తొలిసారి నోటీసులు ఇచ్చింది. వాటికి అదే ఏడాది అక్టోబరు 10న చంద్రబాబు సమాధానం ఇచ్చారు.
ఇందులో చంద్రబాబు ఇచ్చిన సమాధానం ఏమిటన్నది వెల్లడించలేదు.
కానీ, ఐటీ శాఖ ఆగస్టు 4న ఇచ్చిన నోటీసుల ప్రకారం పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది.
తనకు నోటీసులు ఇచ్చే పరిధి హైదరాబాద్‌లోని ఐటీ శాఖ కార్యాలయానికి లేదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.
ఇదే విషయంపై 2022 అక్టోబరు,2023 జనవరి, జూన్ లో సైతం చంద్రబాబు లేఖలు రాశారు.
ప్రధానంగా 153సి సెక్షన్ కింద నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపారు.
153సి సెక్షన్ అంటే..
ఆదాయపు పన్ను చట్టంలోని 153 సి సెక్షన్ కింద చంద్రబాబుకు నోటీసులు ఇచ్చినట్లు ఐటీ శాఖ చెబుతోంది.
ఈ 153 సి సెక్షన్ ఏమిటి..? అనే ప్రశ్న వస్తోంది.
వేరొక వ్యక్తికి చెందిన ఆస్తుల అసెస్‌మెంట్ కు సంబంధించిన సెక్షన్ ఇది.
ఉదాహరణకు ఒక వ్యక్తి ఆస్తులపై ఐటీ శాఖ సోదాలు చేసినప్పుడు వేరొక వ్యక్తికి సంబంధించి ప్రస్తావన ఉంటే.. అప్పుడు ఆ వేరొక వ్యక్తికి నోటీసులు జారీ చేసే అధికారం ఐటీ శాఖకు ఉంటుంది.
శ్రీనివాస్ ఇంట్లో సోదాల్లో ఏం తేలింది..?
చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్ ఇంట్లో 2020 ఫిబ్రవరిలో ఐటీ శాఖ సోదాలు చేసింది.
ఈ సోదాల తర్వాల ఫిబ్రవరి 9న శ్రీనివాస్ వద్ద రూ.2.63 లక్షలు దొరికాయని ఐటీ అధికారులు రశీదు ఇచ్చారు.
ఐటీ శాఖ నిబంధనల ప్రకారం చూస్తే ఒక వ్యక్తి వద్ద రూ.౩ లక్షల వరకు ఉంచుకునేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం శ్రీనివాస్ వద్ద కేవలం రూ.2.63లక్షలు దొరకడంతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేశారు. ఆ మేరకు పంచనామా చేసి రశీదును ఐటీ శాఖాధికారులు జారీ చేశారు.
చంద్రబాబుకు నోటీసుల జారీ విషయంపై హైదరాబాద్ సర్కిల్ కార్యాలయాన్ని బీబీసీ ఈ మెయిల్ ద్వారా సంప్రదించింది. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
సమాధానం ఇచ్చేశాం
ఐటీ నోటీసుల విషయంపై ఏపీ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు బీబీసీతో మాట్లాడారు.
‘‘ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులను పెద్దగా పరిగణించాల్సిన అవసరం లేదు.
ఎవరైనా వ్యక్తిపై ఐటీ శాఖ దాడులు చేసి సోదాలు జరిపినప్పుడు ఎవరిపేరునైనా రాసుకుంటే.. సదరు వ్యక్తికి 153 సి కింద నోటీసులు జారీ చేస్తుంది.
వాస్తవానికి ఇది 2021 అసెస్‌మెంట్‌కు సంబంధించింది. ఇది పాత నోటీసు. ఒకవేళ 153 సి నోటీసు ఇవ్వాలనుకుంటే 2021లోనే ఇవ్వాల్సింది. 2022లోనైనా ఇవ్వాలి కదా? మరి ఇప్పుడు ఇవ్వడం ఏమిటి? ఈ నోటీసులకు ఇప్పటికే చంద్రబాబు నుంచి సమాధానం పంపించారు’’ అని ఆయన చెప్పారు.
ఈడీ కూడా రంగంలో దిగాలి: సజ్జల
ఐటీ నోటీసులు, చంద్రబాబు సమాధానాలు సాగుతున్న తరుణంలో తనను కూడా అరెస్ట్ చేస్తారేమో అన్నట్టుగా చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని వైఎస్సార్సీపీ తప్పుబడుతోంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో చంద్రబాబు సూటిగా స్పందించకపోవడంపై అధికార పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈడీ కూడా రంగంలో దిగి విచారణ చేయాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.
"చంద్రబాబు చట్టానికి అతీతులు కాదు. ఇప్పటికే ఈడీ రంగంలో దిగి ఆయన్ని అరెస్ట్ చేసి ఉండాల్సింది. ముడుపులన్నీ ఆయన ఇంటికే చేరినట్టు ఐటీ నోటీసులో పేర్కొంది. రూ. 118 కోట్లు లంచం తీసుకున్నట్టు ఐటీ శాఖ తేల్చింది. చంద్రబాబు చేసిన నేరాలు, అవినీతి ఆయన్ని భయపెడుతున్నాయి. ఇన్నాళ్లుగా సాంకేతిక అంశాలు చూపి తప్పించుకున్నారు. పాపం పండినప్పుడు అరెస్ట్ ఖాయం" అంటూ సజ్జల వ్యాఖ్యానించారు.
వైఎస్సార్సీపీ వాదనను టీడీపీ తోసిపుచ్చుతోంది. నోటీసులు ఇచ్చినంత మాత్రాన నేరం చేసినట్టు కాదని గుర్తుంచుకోవాలంటూ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమా అన్నారు.
"చంద్రబాబు పీఎస్ ఇంట్లో జరిపిన సోదాల్లో కూడా ఎటువంటి తప్పు జరగలేదని తేలింది. అయినప్పటికీ జగన్ రెడ్డి దిల్లీలో లాబియింగ్ చేసి తప్పుడు నోటీసులు ఇప్పించారు. వాటికి చంద్రబాబు సమాధానం ఇచ్చేశారు. అయినా పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దేశంలోనే అవినీతి సామ్రాట్ జగన్ అన్నది అందరికీ తెలుసు. తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దుష్ప్రచారానికి పూనుకున్నారంటూ" ఉమా మండిపడ్డారు.
ఇప్పుడేం జరుగుతుంది
చంద్రబాబుకు సెక్షన్ 153 కింద నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తదుపరి ఐటీ శాఖ ఎలాంటి చర్యలకు పూనుకుంటుందన్నది కీలకంగా మారింది.
ఇప్పటికే నోటీసులకు సమాధానం పంపించినట్టు చంద్రబాబు చెబుతున్నారు. కానీ రూ. 118 కోట్ల వ్యవహారంలో ఐటీ మాత్రం పట్టుదలగా వ్యవహరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చని రిటైర్డ్ అధికారులు అంటున్నారు.
"చట్టం ప్రకారం లెక్కతేలని మొత్తానికి అరెస్ట్ వరకూ వెళ్లడం ఉండదు. కేవలం పెనాల్టీ వేస్తారు. కానీ, ఒకసారి అంత పెద్ద మొత్తానికి పెనాల్టీ చెల్లించేందుకు ఎవరైనా అంగీకరిస్తే ఇతర రూపాల్లో సమస్యలు వస్తాయి. ఇతర డిపార్ట్‌మెంట్ల జోక్యం ఉంటుంది. బిజినెస్‌కు సంబంధించి బిల్డర్స్ చేసుకునే అనధికారిక ఒప్పందాలకు సంబంధించిన చిన్న అంశమైనా ఐటీకి దొరికితే అది సీరియస్ అవుతుంది" అంటూ రిటైర్డ్ ఐటీ అధికారి ఎస్ ఆర్కే వసంత్ అన్నారు.
అయితే, ఐటీ శాఖ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది సంబంధిత అధికారుల మీద ఆధారపడి ఉంటుందని ఆయన బీబీసీతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సైబర్ బుల్లీయింగ్ అంటే ఏంటి... పిల్లలు, టీనేజర్లు ఆ వలయంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- ‘మీకో QR Code పంపిస్తాను. అది స్కాన్ చేయగానే మీకు డబ్బులొస్తాయి’
- క్లబ్‌హౌస్: ఈ యాప్‌లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- సైబర్ నేరాల ఆరోపణలతో ఒకే ఊళ్లో 31 మంది అరెస్ట్, మూడు జిల్లాలు సైబర్ మోసాలకు అడ్డాగా మారాయా-గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)