You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డాన్సింగ్ ఆన్ ది గ్రేవ్: ఆస్తి కోసం భార్యను సజీవంగా సమాధి చేసిన భర్త కథ
"మూడేళ్ల కిందట జరిగిన ఒక మహిళ మర్డర్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. కమీషనర్ ఈ రోజు మమ్మల్ని (మీడియా) పిలిచారు. అందుకే ఆఫీసుకు రావడం కాస్త ఆలస్యమైంది’’ అని ఒక జర్నలిస్టు అర్ధరాత్రి తన బ్యూరోలోకి ప్రవేశిస్తూ తన బ్యూరో చీఫ్‌కు చెప్పారు.
అది మార్చి 28, 1994. బెంగళూరులోని ఒక న్యూస్‌రూమ్.
ఆ విలేఖరి కేసుకు సంబంధించి మరింత సమాచారం ఇవ్వడంతో, ఈ క్రైమ్ కథ ఎంత పెద్దదో బ్యూరో చీఫ్‌కు అర్ధమవుతోంది.
"ఆమె మైసూర్ దివాన్ గారి మనవరాలు" అని ఊరికి కొత్తగా వచ్చిన ఆ రిపోర్టర్ బ్యూరో చీఫ్‌తో అన్నారు.
ఏ దివాన్ ? బ్యూరో చీఫ్ ప్రశ్నించారు.
"సర్ మీర్జా ఇస్మాయిల్" అని రిపోర్టర్ బదులిచ్చారు.
ఎవరీ మైసూర్ దివాన్?
సర్ మీర్జా ఇస్మాయిల్ 1926-41 మధ్యకాలంలో మైసూర్ దివాన్‌గా పనిచేశారు. బెంగుళూరు, మైసూర్‌లను అందంగా రూపు దిద్దడం వెనక ఆయన కృషి ఉంది. 1942-46 మధ్య పర్యాటక రంగం కోసం అనేక మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నం చేశారాయన.
పాకిస్తాన్‌తో ఉన్న అనుబంధంపై నిజాం రాజుతో ఏర్పడిన అభిప్రాయభేదాలు సంస్థానంలో దివాన్‌గా ఆయన వృత్తి నుంచి వైదొలగేలా చేసింది.
ఈ దివాన్‌కు షకీరే ఖలీలీ అనే మనవరాలు ఉండేది. ఆమె గతంలో ఇరాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు భారత రాయబారిగా, హైకమిషనర్‌గా ముఖ్యమైన పదవులను నిర్వహించిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి అక్బర్ ఖలీలీని పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడాకులు తీసుకుని స్వామీ శ్రద్ధానంద్‌ను వివాహమాడారు.
మూడేళ్ల పాటు మిస్సింగ్
షకీరే కుమార్తె సబా ఖలీలీ మూడేళ్ల కిందట ఇచ్చిన మిస్సింగ్ కేసును తాము ఛేదించామని పోలీసులు ప్రకటించారు.
‘‘మిస్సింగ్ కేసు మీద ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఆగ్రహంగా అరుస్తూ నా కార్యాలయానికి వచ్చినప్పుడు నేను ఆమెను మొదటిసారి చూశాను’’ అని షకీరే కూతురు సబా ఖలీలీ గురించి పోలీసు కమిషనర్ కోదండరామయ్య మీడియాతో చెప్పారు.
కాస్త శాంత పరిచిన తర్వాత, ఈ మిస్సింగ్ కేసు విషయంలో మూడు సంవత్సరాలుగా తాను ఎలా తిరుగుతున్నానో సబా ఖలీలీ వివరించారు.
1991 ఏప్రిల్ 13న షకీరే ఖలీలీ తన తల్లి గౌహర్ తాజ్ నమాజీని కలుసుకున్నారు. ఆరు రోజుల తర్వాత సబా ఖలీలీ కూడా తల్లి షకీరేను కలిశారు. ఆ తర్వాత ఏప్రిల్ 19 సబా ఖలీలీ తన తల్లితో ఫోన్లో మాట్లాడారు.
మే 28, 1991న, షకీరేకు ఇంటి పనిలో సహాయపడే జోసెఫిన్, మరో పనిమనిషి రాజు ఆమెను చివరిసారిగా చూశామని చెప్పారు.
ఆ తర్వాత ఆమె కనిపించ లేదు. తల్లిని చూసేందుకు సబా ఖలీలీ అనేక ప్రయత్నాలు చేశారు. కానీ, ఆ ప్రయత్నాలను స్వామి శ్రద్ధానంద్ అలియాస్ మురళీ మనోహర్ మిశ్రా పదే పదే అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
అక్బర్ ఖలీలీతో విడాకులు తీసుకున్న తర్వాత శ్రద్ధానంద్‌ను వివాహం చేసుకున్నారు షకీరే ఖలీలీ.
కథలు అల్లిన శ్రద్ధానంద్
ముంబై నుంచి ఎప్పుడు ఫోన్ చేసినా సబా ఖలీలీకి ఏదో ఒక కథ చెప్పేవాడు శ్రద్ధానంద్ . షకీరే ఓ పెద్ద వజ్రాల వ్యాపారి ఇంట పెళ్లికి వెళ్లిందని ఒకసారి, అమెరికాలోని ప్రముఖ ఆసుపత్రికి వెళ్లిందని మరోసారి చెబుతుండేవారు. వారికి చాలా ఆస్తులు ఉండటంతో అప్పుడప్పుడు వాటితో లింకు పెట్టి అబద్ధాలు చెప్పేవారు. ఆదాయపు పన్ను శాఖకు భయపడి అజ్ఞాతంలో ఉందని చెప్పేవారు.
కొన్నాళ్ల తర్వాత సబా ఖలీలీకి శ్రద్ధానంద్ పై అనుమానం మొదలైంది. తన తల్లి కనిపించకపోవడానికి ఆయనే కారణమని నమ్మింది. దీంతో ఆమె తన తల్లి కనిపించడం లేదంటూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ లో జూన్ 10, 1992వ తేదీన కేసు రిజిస్టర్ చేశారు.
తండ్రి అక్బర్ ఖలీలీ నుంచి తన తల్లి విడాకులు తీసుకున్నాక , ఆమెను తరచూ కలవడానికి బెంగళూరు వచ్చే కుమార్తె సబా మాత్రమే. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత షకీరే తన నలుగురు కుమార్తెలతో, కుటుంబంతో సంబంధాలను తెంచుకున్నారు.
బేగం ఆఫ్ రాంపూర్ మొదటిసారి శ్రద్ధానంద్‌ను ఖలీలీ కుటుంబానికి పరిచయం చేశారు. రాంపూర్ బేగంకు చెందిన రిచ్‌మండ్ బంగ్లాలో ఆయన నివాసం ఉండేవారు. వారి ఆస్తి వ్యవహారాలను చూసుకునేవారు. కొన్ని వివాదాలను కూడా పరిష్కరించారు.
ఆ రోజుల్లో అక్బర్ ఖలీలీ ఇరాన్‌లో పనిచేస్తుండే వారు. చాలా మంది దౌత్యవేత్తలు ఆ దేశాలలోని పరిస్థితుల కారణంగా వారి కుటుంబాలను తమతో తీసుకెళ్లలేని స్థితి ఉండేది. ఇదే సమయంలో శ్రద్ధానంద్ షకీరేకు దగ్గరయ్యారు. షకీరేకు కొడుకు కావాలనే కోరిక ఉందనే బలహీనతను ఆయన గ్రహించారు. ఇది సాధ్యమయ్యే కొన్ని శక్తులు తన దగ్గర ఉన్నాయని ఆయన షకీరేను నమ్మించారు.
షకీరే మిస్సింగ్ కేసును పోలీస్ కమిషనర్ కోదండరామయ్య సీసీబీ (సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్) అప్పగించడంతో దాంట్లో కాస్త పురోగతి కనిపించింది.
విచారణలో సీసీబీ కష్టాలు
ఈ కేసు దర్యాప్తును ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో, ఎలా ముగించాలో సీసీబీకి మొదట అర్ధం కాలేదు.
మీ టీమ్‌లో ఈ కేసును ఛేదించింది ఎవరు ? ఈ ప్రశ్నకు పోలీసు కమిషనర్ కోదండరామయ్య ఫోన్‌లో ఈ రిపోర్టర్‌తో నవ్వుతూ.. ‘మీడియాలోని మీ సహచరులు నన్ను చంపేస్తారు’ అన్నారు.
ఆధారాల కోసం సీసీబీ బృందం చాలా కాలం శ్రమించింది. పోలీసు కానిస్టేబుల్ మహదేవ్ ఒక పాత ట్రిక్ సాయంతో క్లూ కోసం ప్రయత్నించారు.
‘‘షకీరే ఇంట్లో పని చేసే ఓ వ్యక్తిని మా కానిస్టేబుల్ మహదేవ్ బ్రిగేడ్ రోడ్డులోని ఓ ఫేమస్ ప్లేస్‌కు తీసుకెళ్లాడు.( అప్పట్లో నాటుసారను అరక్ అనే వాళ్లు. అప్పట్లో ఆ ప్రదేశం నాటుసారాకు ఫేమస్). ఇక్కడే ఈ కేసులో శ్రద్ధానంద్ ప్రమేయం ఉండొచ్చన్న అనుమానానికి ఆధారం దొరికింది. దీంతో మేం నిఘా పెట్టాం’’ అని కోదండరామయ్య వివరించారు.
విపరీతంగా మద్యం సేవించిన రాజు, బంగ్లా వెనుక ఉన్న ఓ చిన్న ఇంటి బెడ్‌రూమ్ ముందు గొయ్యి తవ్వినట్లు పోలీసు కానిస్టేబుల్ మహదేవ్‌తో చెప్పాడు. నీటి తొట్టి ఆకారంలో దాన్ని తవ్వినట్లు చెప్పాడు.
దీంతోపాటు శివాజీనగర్‌లో పెద్ద పెట్టె తయారు చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఈ పెట్టెకు చక్రాలను అమర్చారు. దానిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా తరలించడానికి వీలుగా అలా తయారు చేశారు.
"గెస్ట్ హౌస్ నుండి ఆ బాక్స్ తీసుకురావడానికి నలుగురిని పిలిపించా" అని కొన్నాళ్ల తర్వాత రాజు తన సహోద్యోగితో మాటల సందర్భంలో చెప్పాడు.
సెయింట్ మార్క్స్ రోడ్‌లో ఉన్న బ్యాంక్ లాకర్లను యాక్సెస్ చేయడానికి షకీరే ఇచ్చిన జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని శ్రద్ధానంద్ ఉపయోగించుకున్నారని దర్యాప్తు అధికారి వీరయ్య ఈ విలేఖరితో చెప్పారు.
"అతను చాలాసార్లు బ్యాంకుకు వెళ్ళాడు. అతని ఉద్దేశాలపై అనుమానం రావడంతో 1991 మే నెలలో తన ఆస్తులన్నింటికి సంబంధించిన జాయింట్ అకౌంట్ హోల్డర్ గా శ్రద్ధానంద్ పేరును షకీరే తొలగించారు. ఆమె అదృశ్యం కావడానికి కొన్నాళ్ల ముందే ఇది జరిగింది" అని వీరయ్య వెల్లడించారు.
ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా బెంగళూరుకు చెందిన ప్రముఖ క్రిమినల్ లాయర్ సీవీ నగేష్‌ను నియమించారు. అప్పుడు ఈ విలేఖరితో మాట్లాడుతూ, "సబాతో పాటు ఇతర కుమార్తెలతో షకీరే సన్నిహితంగా మెలగడం శ్రద్ధానంద్‌కు ఇబ్బందిగా మారింది" అని ఆయన అన్నారు.
షకీరే నివసించే ఇల్లు మినహా మిగిలిన అన్ని ఆస్తులను భారీ మొత్తానికి విక్రయించేందుకు శ్రద్ధానంద్ అగ్రిమెంట్లు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
‘ఈ డీల్ ఎంతకు జరిగింది’’ అని ఈ రిపోర్టర్ అడిగారు.
‘‘దాదాపు రూ. 7 కోట్లు’’ అని కోదండ రామయ్య వివరించారు. (అప్పటికే బెంగళూరులో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే, ఇది మూడు దశాబ్దాల కిందటి మాట)
శ్రద్ధానంద్‌ను పోలీసులు విచారించగా, తాను షకీరేను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.
సజీవంగా సమాధి
హత్యను అంగీకరించిన తరువాత, శ్రద్ధానంద్ పోలీసులను నేరం జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లారు.
‘‘చక్రాలు ఉన్న చెక్క పెట్టెను దాచిన ప్రదేశాన్ని చూపించాడు. రోజూ భార్యకు టీ చేసి ఆ టీలో నిద్రమాత్రలు కలిపేవాడు’’ అని వీరయ్య చెప్పారు.
"అతను ఆమెను పరుపుతో పాటు పెట్టెలోకి నెట్టి, పైన మూత బిగించాడు. బెడ్‌రూమ్‌లోని కిటికీకి దిగువన ఉన్న గోడను ఆయనే పగలగొట్టాడు, ఆపై బాక్స్‌ను గోతిలో పడేశాడు. ఇందుకోసం ఆయన ఈ గొయ్యిని ముందే సిద్ధం చేసి పెట్టుకున్నాడు’’ అని వీరయ్య వివరించారు.
షకీరేను శ్రద్ధానంద్ సజీవంగా పాతిపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఫోరెన్సిక్ బృందం గుర్తించింది.
రెండు రోజుల తర్వాత శ్రద్ధానంద్‌ను ఇంటికి తీసుకెళ్లారు. పెట్టెను పాతిపెట్టిన ప్రదేశాన్ని చూపించారు.
పోలీసు బృందం అక్కడ తవ్వగా, అందులో ఒక పెట్టె, పుర్రెతో కూడిన అస్థిపంజరం కనిపించింది. ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి ఇది కీలకమైన సాక్ష్యం.
క్రానియోఫేషియల్ టెక్నిక్( పుర్రె ఆధారంగా ముఖాన్ని గుర్తించేలా చేసే ) నుంచి డీఎన్ఏ, వేలి ముద్రలు సహా అన్నీ ఆమె షకీరే అనడానికి ఆధారంగా నిలిచాయి.
షకీరే చేతి వేళ్లకు ఉన్న ఉంగరాలను ఆమె తల్లి గౌహర్ తాజ్ నమాజీ గుర్తించారు.
నగరంలోని అగ్రశ్రేణి క్రిమినల్ లాయర్లలో ఒకరైన సివి నగేష్‌ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కర్ణాటక ప్రభుత్వం నియమించింది.
మే 21, 2005న సెషన్స్ కోర్టు ఈ కేసుపై తీర్పు ఇచ్చింది.
ప్రాసిక్యూషన్ చేసిన వాదనలను అంగీకరించిన న్యాయమూర్తి నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేశారని కోర్టు వెలుపల సీవీ నగేష్ విలేఖరులకు చెప్పారు.
‘‘ఇది మా అమ్మ మరణానికి పరిహారం కాదు..మా అమ్మను తిరిగి పొందలేను..కానీ, న్యాయం జరిగింది..’’ అంటూ సబా కన్నీరుమున్నీరయ్యారు.
కర్ణాటక హైకోర్టు 2005 సెప్టెంబర్ 20న మరణశిక్షను నిర్ధరించింది.
"నిందితుడి ఉద్దేశం స్పష్టంగా ఉంది. భార్యను చంపడం వెనకున్న ఏకైక లక్ష్యం ఆమె ఆస్తులను పొందడమే. నా అభిప్రాయం ప్రకారం, ఈ కేసు అరుదైన కేసులలో ఒకటి’’ అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లను కూడా సుప్రీంకోర్టులోని రెండు బెంచ్‌లు విచారించాయి. మొత్తం ఎనిమిది మంది న్యాయమూర్తులు ఈ కేసును విచారించి నిందితులను దోషులుగా నిర్ధారించారు. చివరి దశకు వెళితే, మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చవచ్చని ఒక న్యాయమూర్తి భావించారు. అయితే శ్రద్ధానంద్ జీవితాంతం జైలు నుండి విడుదల కారాదని ఆయన అన్నారు.
ప్రస్తుతం జైలులో ఉన్న 82 ఏళ్ల శ్రద్ధానంద్, పెరోల్ కోసం చేసిన ప్రయత్నాలను ఇటీవల జస్టిస్ కె.ఎం.జోసెఫ్, బి.వి. నాగరత్న, అషానుద్దీన్ అమానుల్లాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
షకీరే ఖలీలీ కథ ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ‘డాన్సింగ్ ఆన్ ది గ్రేవ్’ పేరుతో క్రైమ్ డాక్యుమెంటరీగా విడుదలైంది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నాసిరకం ఆయుధాలు అమ్మిందా, యుక్రెయిన్ ఏం చెప్పింది?
- స్పైడర్ వెయిన్స్: కాళ్లపై కనిపించే ఈ నరాలు చిట్లిపోతాయా... వీటికి చికిత్స ఏమిటి?
- తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ ఎందుకు అంటోంది?
- మహిళా రెజ్లర్ల నిరసన: WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెండు ఎఫ్ఐఆర్లు నమోదు
- టూత్‌పేస్ట్ ట్యూబ్లలో డ్రగ్స్ స్మగ్లింగ్... 65 మంది అరెస్ట్
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)