You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరెంటు, తిండీ లేకుండా సముద్రంలో నెల రోజులు, చివరికి ఎలా బయటపడ్డారు?
180 మందికి పైగా రోహింజ్యా శరణార్థులున్న పడవ నుంచి సోమవారంనాడు ఇండోనేషియా అచే ప్రావిన్స్‌లోని దిగారు. ఆ బోటులో కొద్ది వారాలుగా కరెంటు కూడా లేదు.
గత రెండు రోజుల్లో రోహింజ్యా శరణార్థులతో ఇండోనేషియా తీరానికి చేరుకున్న రెండో బోటు ఇది. ఈ రెండు పడవల్లో కలిపి 237 మందికి పైగా రోహింజ్యాలు ఉన్నారు.
కాగా, మరో 180 మందితో బయలుదేరిన బోటు మునిగిపోయి ఉంటుందని ఎన్‌జీవోలు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.
రోహింజ్యాలు ఎవరు?
రోహింజ్యాలు మియన్మార్‌లోని ఓ వర్గం ప్రజలు. మూడేళ్ల క్రితం మియన్మార్‌లో సైనిక అణచివేత చర్యలు మొదలవడంతో రోహింజ్యాలు ఆ దేశం నుంచి పారిపోయారు.
ఆ సమయంలో పదివేల మందికి పైగా మరణించి ఉంటారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 7 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు.
మియన్మార్ సైన్యం వారిపై చేసిన దాడులను మారణహోమం అని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది.
లక్షలమంది రోహింజ్యాలు పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో కిక్కిరిసిన కాక్స్ బజార్ శరణార్థి శిబిరంలో తలదాచుకుంటున్నారు.
ఎప్పుడు బయలుదేరారు?
రోహింజ్యా పురుషులు, మహిళలు, పిల్లలతో నిండిన చేపల పడవ ఒకటి 2022 నవంబర్ 25న దక్షిణ బంగ్లాదేశ్ నుంచి బయలుదేరింది.
అయితే ఆరు రోజుల తరువాత దాని ఇంజిన్ చెడిపోయింది. దీంతో అది మలేషియా జలాల నుంచి పశ్చిమాన ఇండోనేషియా ఉత్తర కొన వైపుకు కొట్టుకుపోయింది.
అక్కడి నుంచి నికోబార్ దీవులకు ప్రయాణించి దక్షిణాన ఉన్న భారతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులు పడవలో ఉన్నవారికి ఫోన్ కాల్స్ చేయగలిగారు.
వీరి సమాచారం అందుకున్న ఐక్యరాజ్యసమితి తమ శరణార్థుల ఏజెన్సీతో కలిసి సాయం చేయాల్సిందిగా భారత్, ఇండోనేషియాలను కోరింది.
తమలో చాలామంది ఆకలితో అలమటిస్తున్నారని, పలువురు చనిపోయారని బోటులో ఉన్నవారు ఫోన్‌లో చెప్పారు.
అయితే వారికి భారత నౌకాదళం కొంత ఆహారం, నీరు ఇచ్చి, తిరిగి వారిని ఇండోనేషియాకు పంపింది.
అక్కడ వారు ఆరు రోజులు దాదాపు 1900 కి.మీ. దూరం ప్రయాణించి ఎట్టకేలకు ఇండోనేషియా సరిహద్దులకు చేరుకున్నారు.
నెల రోజులు ప్రయాణించిన మరో పడవ..
మరోవైపు అంతకు ముందు మియన్మార్‌కు చెందిన రోహింజ్యా శరణార్థుల బృందం గల భారీ పడవ నెలరోజుల పాటు సముద్రంలో ప్రయాణించి ఆదివారం ఇండోనేషియా పశ్చిమ తీరానికి చేరుకుంది.
ఈ శరణార్థులు వచ్చిన పడవ ఇంజిన్ చెడిపోయిందని స్థానిక అధికారులు తెలిపారు.
అయితే ఒడ్డుకు వచ్చిన ఈ శరణార్థుల బృందంలోని ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్ ప్రతినిధి వినర్ది ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో మాట్లాడుతూ "ఈ పడవ ఇంజిన్ చెడిపోయి ఉంది. గాలి సాయంతో అచే బేసార్ జిల్లాలోని లాడాంగ్ గ్రామం ఒడ్డుకు చేరుకుంది.
అందులో 57 మంది పురుషులు ఉన్నారు. ఒక నెలపాటు సముద్రంలో తిరిగి ఇక్కడికి చేరుకున్నామని వాళ్లు చెప్పారు''అని అన్నారు.
శరణార్థులను ప్రస్తుతానికి ప్రభుత్వ భవనంలో ఉంచుతామని స్థానిక ఇమ్మిగ్రేషన్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ శరణార్థులు ఎక్కడి నుంచి తమ ప్రయాణాన్ని ప్రారంభించారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియలేదు.
మరో బోటు ఏమైంది?
మరొక పడవలోని 180 మంది శరణార్థులు బహుశా మరణించి ఉండవచ్చని ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఏజెన్సీ అభిప్రాయపడింది.
పడవ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని అందులో ప్రయాణిస్తున్న వారు బంధువులకు చెప్పినట్లు ఏజెన్సీ ప్రతినిధి బాబర్ బలోచ్ చెప్పారు.
వారాల తరబడి ఎలాంటి ఆహారం, నీరు లేకుండా మలేషియా, ఇండోనేషియాలకు వెళుతున్న శరణార్థుల పడవల గురించి తాము ఇంతకు ముందే అలర్ట్ చేశామని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది.
భారత్‌లో రోహింజ్యాల పరిస్థితి ఏంటి?
భారత్‌లో 10,000 నుంచి 40,000 మంది రోహింజ్యాలు జీవిస్తున్నారని అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ అంచనాలను ఒక్కో సంస్థ ఒక్కోలా చెబుతోంది.
2012 నుంచీ చాలా మంది రోహింజ్యాలు భారత్‌లో ఉంటున్నారు.
కొంతకాలం ముందు వరకు రోహింజ్యాల విషయంలో ఎలాంటి వివాదం ఏర్పడలేదు.
అయితే, దిల్లీలోని రోహింజ్యా శరణార్థులకు ఇళ్లు, వసతులు, పోలీసుల భద్రత కల్పిస్తామని ఒక కేంద్ర మంత్రి అప్పట్లో ట్వీట్ చేశారు. దీంతో మళ్లీ రోహింజ్యాల పేరు వార్తల్లోకి వచ్చింది.
ఆ కేంద్ర మంత్రి ప్రకటనకు గంటల వ్యవధిలోనే కేంద్రంలో అధికారంలోనున్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తాము రోహింజ్యా ముస్లింలక ఎలాంటి వసతులను కల్పించబోవడం లేదని పేర్కొంది.
మరోవైపు వారిని ‘‘అక్రమ వలసదారులు’’గా అభివర్ణించింది. వారిని వారి స్వదేశానికి లేదా నిర్బంధ కేంద్రాలకు పంపిస్తామని స్పష్టంచేసింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)