You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మయన్మార్: కొత్త రాజధాని ‘దెయ్యాల నగరం’ ఎందుకయ్యిందంటే..
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఈ నగరంలోకి అడుగుపెట్టగానే అత్యద్భుతంగా తీర్చిదిద్దిన 20 వరుసల రహదారులు, వందకుపైగా విలాసవంతమైన హోటళ్లు స్వాగతం పలుకుతాయి. కానీ, ఎక్కడా జనాలు పెద్దగా కనిపించరు.
ఇది వేల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన మియన్మార్ నూతన రాజధాని నేపీడా పరిస్థితి.
విశాలమైన గోల్ఫ్ కోర్స్ , ఎటు చూసినా ఆహ్లాదకరమైన పచ్చని పార్కులను అభివృద్ధి చేశారు.
జూ పార్కులో ముచ్చటగొలిపే పెంగ్విన్ పక్షులున్నాయి. ఇన్ని సౌకర్యాలు కల్పించినా జనాలు మాత్రం అటువైపు వెళ్లడంలేదు.
ఇక్కడ ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యం, రణగొణ ధ్వనులు అన్నమాటే లేదు. అందుకే కొందరు "దెయ్యాల నగరం" అని అంటుంటారు.
దాదాపు 400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో చక్కగా డిజైన్ చేసి నిర్మించిన ఈ నగరం నిర్మాణం కోసం దాదాపు 26,000 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు.
గతంలో మయన్మార్(బర్మా) రాజధానిగా యాంగాన్ ఉండేది. అయితే, రెండో ఇరాక్ యుద్ధం ప్రారంభానికి ముందు సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న తమ దేశ రాజధానిపై విదేశీ దళాలు సులువుగా దాడికి పాల్పడే అవకాశం ఉందని మయన్మార్ ఆర్మీ అధికారులు భావించారు.
దాంతో దూరంగా కొత్త రాజధానిని నిర్మించాలని నిర్ణయించారు.
నగర నిర్మాణం పూర్తయి దాదాపు 15 ఏళ్ల గడిచింది. 2006 నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి.
అన్ని మంత్రిత్వ శాఖల భవనాలు, సుప్రీంకోర్టు ఇక్కడే ఉన్నాయి.
సామాన్య జనాలు మాత్రం ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపడంలేదు.
విదేశీ రాయబార కార్యాలయాలు సైతం యాంగాన్ నుంచి ఇక్కడికి తరలేందుకు విముఖత చూపుతున్నాయి.
పర్యటకులను ఆకర్షించేందుకు ఎన్నో రకాల ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. దాదాపు వెయ్యి ఎకరాలకు పైగా విస్తీర్ణంలో మిలిటరీ మ్యూజియం ఏర్పాటు చేశారు.
అందులో కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొన్న రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి విమానాలు, హెలికాప్టర్లను ఉంచారు.
అయినా పర్యటకుల నుంచి ఆశించినంత స్పందన కనిపించడంలేదు.
ఇప్పటికీ దేశ ఆర్థిక రాజధానిగా యాంగాన్ నగరమే కొనసాగుతోంది.
అయితే, ఇక్కడ కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. పార్లమెంటు సమీపంలో వీడియోలు, ఫొటోలు చిత్రీకరించడానికి అనుమతి లేదు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)