బంగ్లాదేశ్ వివాహ పత్రాల్లో 'కన్య' అనే మాటను తొలగించిన కోర్టు... మహిళా సంఘాల హర్షం

బంగ్లాదేశ్‌లో పెళ్లి చేసుకొనే మహిళ తాను 'కుమారి'నో, కాదో ఇకపై పెళ్లి నమోదు పత్రాల్లో వెల్లడించనక్కర్లేదు. ఈ మేరకు దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

ఈ పత్రంలో 'కుమారి' స్థానంలో 'అవివాహిత' అనే మాట చేర్చాలని హైకోర్టు ఆదివారం తీర్పు ఇచ్చింది.

ఇప్పటివరకు పత్రంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. అవి- కుమారి/కన్య(వర్జిన్), వితంతు మహిళ(విడో), విడాకులు తీసుకున్న మహిళ (డైవోర్స్డ్).

కోర్టు తీర్పుతో 'కుమారి' స్థానంలో 'అవివాహిత' మాట వచ్చింది. మిగతా రెండు ఆప్షన్లు అలాగే ఉంటాయి.

పత్రంలో 'కుమారి' అనే ఆప్షన్ అవమానకరంగా ఉందని ఇంతకాలం తప్పుబట్టిన మహిళా హక్కుల సంఘాలు, కోర్టు తీర్పును స్వాగతించాయి.

మగవారు కూడా చెప్పాలి

వివాహ నమోదు పత్రాల్లోంచి బెంగాలీ పదం 'కుమారి'ని తొలగించాలని కోర్టు ఆదేశించింది.

'కుమారి' అనే మాటను 'అవివాహిత' మహిళ గురించి చెప్పేటప్పుడు వాడతారు. ఈ పదానికి 'కన్య' అనే అర్థం కూడా ఉంది.

వివాహ నమోదు పత్రాల్లోని 'కుమారి' అనే ఆప్షన్ మహిళలకు అవమానకరంగా ఉండటమే కాకుండా, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందని దీనిని వ్యతిరేకిస్తూ 2014లో కోర్టును ఆశ్రయించినవారి తరపు న్యాయవాదులు వాదించారు.

పెళ్లి చేసుకొనే మగవారూ వైవాహిక స్థితిని వెల్లడించాలని కూడా కోర్టు రూలింగ్ ఇచ్చింది. వారు అవివాహితులా లేక విడాకులు తీసుకొన్నారా లేక భార్య చనిపోయారా అన్నది చెప్పాలని స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్‌లో మెజారిటీ ప్రజలు ముస్లింలు.

దేశంలోని వివాహ చట్టాలు మహిళల పట్ల వివక్ష చూపుతున్నాయని మహిళా హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి.

చాలా మంది అమ్మాయిలకు చిన్న వయసులోనే కుటుంబ సభ్యులు పెళ్లి చేస్తుంటారు.

"ఇక ఆ ప్రశ్న ఎవరూ అడగరు"

కోర్టు తీర్పు అధికారికంగా పూర్తిగా ప్రచురితమయ్యాక కొన్ని నెలల్లో ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశముంది.

ఇది మైలురాయి లాంటి తీర్పు అని కేసులో వాదనలు వినిపించిన న్యాయవాది అయ్‌నున్ నహర్ సిద్దిఖా చెప్పారు.

బంగ్లాదేశ్‌లో మహిళా హక్కులను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ తీర్పు దోహదం చేస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు.

వివాహాలను నమోదు చేసే రిజిస్ట్రార్లలో ఒకరైన మొహమ్మద్ అలీ అక్బర్ సర్కార్ వార్తాసంస్థ 'రాయిటర్స్'తో మాట్లాడుతూ- "ఢాకాలో నేను చాలా పెళ్లిళ్లు జరిపించాను. 'వివాహ స్థితిని వెల్లడించకుండా ఉండడంలో మగవారికి ఉన్న స్వేచ్ఛ మహిళలకు ఎందుకు లేదు' అని నన్ను తరచూ అడుగుతుంటారు. 'ఇది నా చేతుల్లో లేదు' అని నేను సమాధానం చెబుతుంటాను. ఇకపై ఈ ప్రశ్న నన్ను ఎవరూ అడగరనుకొంటున్నా" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)