రోహింజ్యాల మారణహోమం ఆరోపణలు అవాస్తవం.. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఆంగ్ సాన్ సూచీ

రోహింజ్యాలపై మియన్మార్ మారణహోమానికి పాల్పడిందన్న ఆరోపణలను ఆ దేశ నాయకురాలు ఆంగ్ సాన్ సూచీ అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే)లో ఖండించారు.

ఈ విషయంలో మియన్మార్‌పై ఉన్న కేసు ఇంకా పూర్తికాలేదని, అది తప్పుడు కేసని చెబుతూ ఆమె తన వాదన వినిపించారు.

బౌద్ధులు ఎక్కువగా ఉండే మియన్మార్ లో 2017లో సైన్యం జరిపిన అణచివేత చర్యల్లో వేలాది మంది రోహింజ్యాలు చనిపోయారు. దాదాపు ఏడు లక్షల మంది పొరుగుదేశమైన బంగ్లాదేశ్‌కు పారిపోయారు.

ఆఫ్రికా దేశమైన గాంబియా, ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) దృష్టికి తీసుకొచ్చింది.

ఐసీజేలో మూడు రోజులపాటు రోహింజ్యాల మారణహోమంపై విచారణ జరగనుంది.

రఖైన్ రాష్ట్రంలో ఉగ్రవాద ముప్పు నివారణే సైన్యం చర్య తీసుకుందని మియన్మార్ మొదటి నుంచి చెబుతోంది. సూచీ కూడా అదే వైఖరికి కట్టుబడ్డారు.

ఒకప్పుడు ప్రపంచమంతా ప్రజాస్వామ్య ప్రతీకగా కొనియాడిన సూచీ 2016 ఏప్రిల్‌లో మియన్మార్‌కు డి ఫ్యాక్టో స్టేట్ కౌన్సిలరయ్యారు. డిఫ్యాక్టో నేతగా రాజ్యాంగపరంగా సైన్యంపై నియంత్రణ ఉండదు ఆమెకు. కానీ, మారణహోమం ఆరోపణలను ఆమె ఎదుర్కొంటున్నారు.

కాగా, ఒకప్పుడు ఎన్నో ఏళ్లపాటు తనను గృహ నిర్బంధంలో ఉంచిన సైన్యాన్నే ఇప్పుడు సూచీ వెనకేసుకొస్తున్నారు.

రఖైన్ నుంచి వెళ్లిపోయిన మియన్మార్ ప్రజలను స్వదేశానికి రప్పించడానికి కట్టుబడి ఉన్నామని ఐజేసీలో చెప్పిన ఆమె.. ఈ సంక్షోభాన్ని మరింత రగిల్చేలా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని కోర్టును ఆమె కోరారు.

రోహింజ్యాలేమంటున్నారు

బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్‌‌లో రోహింజ్యా శరణార్థులు ఉన్న కుటుపాలాంగ్ వద్ద సూచీ విచారణ దృశ్యాలను టీవీల్లో చూస్తూ ‘అబద్ధాలకోరు’ అంటూ నినాదాలు చేశారు.

హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట కూడా రోహింజ్యాలకు మద్దతుగా ఒక బృందం నిరసన తెలిపింది.

అసలేమిటీ వివాదం

2017 వరకు, దాదాపు 10 లక్షల మంది రోహింజ్యాలు మియన్మార్ లోని రఖైన్ రాష్ట్రంలో నివసించేవారు.

అయితే, మియన్మార్ ప్రభుత్వం వారిని అక్రమ వలసదారులుగా గుర్తించి, పౌరసత్వం ఇవ్వడానికి నిరాకరించింది.

రోహింజ్యాలు ఎన్నో ఏళ్లుగా వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2017లో మిలటరీ ప్రభుత్వం రఖైన్ రాష్ట్రంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది.

ఐసీజే పత్రాల ప్రకారం, అక్టోబర్ 2016 నుంచి ఆగస్టు 2017 వరకు రోహింజ్యాలను పూర్తిగా, ఒక క్రమపద్ధతి ప్రకారం తుడిచిపెట్టే చర్యలకు సైన్యం పాల్పడిందని ఆరోపణలు వచ్చాయి.

హత్యలు, అత్యాచారాలు, గృహదహనాలతో రోహింజ్యాలను సామూహికంగా విధ్వంసం చేశారని మియన్మార్ సైన్యంపై ఆరోపణలు వచ్చాయి.

ఐక్యరాజ్య సమితి నిజనిర్ధారణ సంస్థ ఇలా వచ్చిన అనేక ఆరోపణలను ధ్రువీకరించింది. ఆగస్టులో వెలవడిన ఒక నివేదిక, ''మహిళలు, బాలికలు, బాలురు, పురుషులు, ట్రాన్స్ జెండర్లపై సైన్యం అత్యాచారం, సామూహిక అత్యాచారం, ఇతర హింసాత్మక చర్యలకు పాల్పడింది'' అని ఆరోపించింది.

మేలో 10 మంది రోహింజ్యాలను చంపినందుకు జైలు శిక్ష పడిని ఏడుగురు మియన్మార్ సైనికులు ఇటీవల విడుదలయ్యారు.

అయితే, రోహింజ్యా ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకొని తమ సైన్యం దాడులు చేసిందని మియన్మార్ గతంలో స్పష్టం చేసింది.

మియన్మార్ పై ఎవరు ఆరోపణలు చేస్తున్నారు?

ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రధాన న్యాయ విభాగం అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే). దీని ప్రధాన కార్యాలయం ది హేగ్‌లో ఉంది. ఇందులోని సభ్య దేశాలు కేసు వేయవచ్చు. రోహింజ్యా మారణహోమంపై మియన్మార్ పై ఆఫ్రికాలోని ముస్లిం దేశం గాంబియా కేసు వేసింది.

ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఐవోసీ)లోని 57 సభ్య దేశాలు, అంతర్జాతీయ న్యాయవాదుల బృందం ఈ పిటిషన్‌కు మద్దతు తెలిపాయి.

అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌లోని రోహింజ్యా శరణార్థి శిబిరాలను సందర్శించి, సామూహిక హత్యలు, వేధింపులు, అత్యాచారాలు గురించి తెలుసుకున్న తర్వాత గాంబియా అటోర్నీ జనరల్, న్యాయ మంత్రి అబుబాకర్ బీబీసీతో మాట్లాడారు.

ఆంగ్ సాన్ సూచీ పాత్ర ఏమిటి?

వాస్తవానికి, ఈ కేసు పెట్టింది సూచీ మీద కాదు, మియన్మార్ మీద. అలాగే, ఐసీజే వ్యక్తులను శిక్షించదు. అయితే, రోహింజ్యా మారణహోమం విషయంలో సూచీపై ఆరోపణలు చేయడానికి కారణం ఆమె 2016 ఏప్రిల్ నుంచి దేశానికి వాస్తవ పరిపాలకురాలిగా ఉండటం. సైన్యంపై అదుపు లేకపోయినప్పటికీ మిలటరీ చర్యల్లో సూచీకి భాగం ఉందని ఐక్యరాజ్యసమితి పరిశోధన బృందం ఆరోపణలు చేసింది.

''మీ కళ్లు తెరవండని వేడుకుంటున్నాను... మరింత ఆలస్యం కాకముందే దయచేసి మీ నైతిక అధికారాన్ని వినియోగించుకోండి'' అని సూచీని ఉద్దేశిస్తూ గత సెప్టెంబర్‌లో యాంగ్జీ లీ పేర్కొన్నారు.

ది హెగ్‌లో జరిగిన విచారణకు విదేశాంగ శాఖ మంత్రిగా తానే హాజరవుతానని సూచీ నవంబర్‌లో ప్రకటించారు.

ఈ కేసులో ఎలాంటి తీర్పురావొచ్చు?

ప్రస్తుతానికైతే, రోహింజ్యాలపై ఇకముందు దాడులు జరగకుండా వారికి భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని మాత్రమే జాంబియా అంతర్జాతీయ కోర్టును కోరుతోంది.

అయితే, కోర్టు తీర్పురావడానికి చాలా ఏళ్లు పట్టొచ్చు. చర్యలు తీసుకునే అవకాశం కూడా ఐసీజేకు లేదు. కానీ, మియన్మార్ నేరం చేసినట్లు తీర్పు వస్తే ఆ దేశ ప్రతిష్ట అంతర్జాతీయంగా దిగజారుతుంది. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది.

ఇప్పుడు రోహింజ్యాల పరిస్థితి ఏంటి?

మిలటరీ ఆపరేషన్ ప్రారంభంకాగానే, మియన్మార్ నుంచి వేలాదిమంది రోహింజ్యాలు పారిపోయారు.

సెప్టెంబర్ 30 వరకు ఉన్న వివరాలను గమనిస్తే, బంగ్లాదేశ్‌లోని వివిధ క్యాంపుల్లో దాదాపు పది లక్షల మంది రోహింజ్యాలు ఉన్నారు.

దాదాపు 80 శాతం మంది రోహింజ్యాలు 2017 ఆగస్టు, డిసెంబర్ మధ్యకాలంలోనే ఇక్కడికి వచ్చారు. ఇకపై తమ దేశంలోకి రోహింజ్యాలను అనుమతించేది లేదని మార్చిలో బంగ్లాదేశ్ ప్రకటించింది.

తమ దేశంలో ఉన్న రోహింజ్యాలు మియన్మార్ కు స్వచ్ఛందంగా వెళ్లేందుకు వీలుగా ఆగస్టులో బంగ్లాదేశ్ ఒక పథకాన్ని ప్రారంభించింది. కానీ, ఒక్క రోహింజ్యా కూడా బంగ్లాను విడిచివెళ్లలేదు.

తమ దేశంలో ఉన్న పది లక్షల మంది రోహింజ్యాలను బంగాళాఖాతంలోని భాషన్ దీవుల్లోకి తరలించేందుకు బంగ్లాదేశ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే, స్వచ్ఛంద సంస్థలు ఈ ఆలోచనను వ్యతిరేకిస్తున్నాయి.

గతంలో రోహింజ్యాలు నివాసమున్న గ్రామాల్లో మయన్మార్ సైన్యం శిబిరాలను నిర్మిస్తోందని బీబీసీ ప్రతినిధి జోనాథన్ హెడ్ సెప్టెంబర్‌లో నివేదించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)