వైఎస్‌ఆర్ వాహనమిత్ర: ఆటో డ్రైవ‌ర్ల‌కు ఏటా రూ.10 వేలు ఇచ్చే ప‌థ‌కం.. దరఖాస్తు ఇలా

    • రచయిత, ఎ.కిశోర్‌బాబు
    • హోదా, బీబీసీ కోసం

ఆటోలు, ట్యాక్సీలు న‌డుపుకొంటూ స్వ‌యం ఉపాధి పొందుతున్న వారి సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం వైఎస్సార్ వాహ‌న మిత్ర‌ పథకాన్ని అమలు చేస్తోంది.

వారికి ఇన్సూరెన్స్, రిపేర్లు, స‌ర్వీసింగు.. ఇలా చాలా ఖ‌ర్చులు ఉంటాయి. ఈ ఖ‌ర్చుల‌ నుంచి కాస్త ఉపశమనం ఇచ్చేలా ఏటా రూ.10 వేలు సాయం అందిస్తోంది.

ఈ ప‌థ‌కం కింద లబ్ధిదారుల ఎంపిక ఎలా ఉంటుంది? ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డ‌మెలా? ఇలాంటి వివ‌రాలు తెలుసుకుందాం.

ఏమిటీ వాహ‌న మిత్ర‌?

పేద ఆటో, క్యాబ్ కార్మికుల‌కు చేయూత‌నిచ్చే ఉద్దేశంతో అమ‌లు చేస్తున్న ప‌థ‌క‌మే ఈ వైఎస్సార్ వాహ‌న మిత్ర.

2019 అక్టోబ‌ర్ 4న ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌మోహ‌న్‌ రెడ్డి ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. తొలి ఏడాది 2,36,334 మంది ల‌బ్ధిదారుల‌కు ఒక్కొక్క‌రికి రూ.10 వేల చొప్పున ప్ర‌భుత్వం వారి ఖాతాల్లో డ‌బ్బు జమ చేసింది.

2020-21 సంవత్స‌రంలో 2,73,985 మందికి ఆర్థిక సాయం చేసింది. 80 శాతం మందికి పైగా ల‌బ్ధిదారులు బ‌ల‌హీన వ‌ర్గాలవారు, ద‌ళితులు.

ఎవ‌రు అర్హులు?

  • సొంతంగా ఆటో, లేదా ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ క‌లిగి ఉన్న డ్రైవ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
  • ల‌బ్ధిదారుకు 18 ఏళ్ల వ‌య‌సు నిండి ఉండాలి.
  • త‌ప్ప‌నిస‌రిగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన‌వారై ఉండాలి.
  • ఆటో కార్మికుడు లేదా కార్మికురాలి పేరు త‌ప్ప‌నిస‌రిగా తెల్ల రేష‌న్ కార్డులో ఉండాలి.
  • ల‌బ్ధిదారు త‌ప్ప‌నిస‌రిగా దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారై ఉండాలి.
  • ల‌బ్ధిదారుకు ఆటో, క్యాబ్, ట్యక్సీ డ్రైవింగ్ చేయ‌డం తెలుసుండాలి.

ఒక కుటుంబంలో రెండు ఆటోలుంటే రెండింటికీ ఇస్తారా?

ఇవ్వ‌రు. ఒక కుటుంబంలో ఒక‌రికి మాత్ర‌మే ఈ అవ‌కాశం క‌ల్పిస్తారు.

ఇర‌త రాష్ట్రాల్లో వాహ‌న రిజిస్ట్రేష‌న్ క‌లిగిన వాహ‌నాల‌కూ ఇస్తారా?

ఇవ్వ‌రు. అలాంటి వాహ‌నాలున్న‌వారు వెంట‌నే ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేష‌న్‌కు వాటిని బ‌ద‌లాయించుకోవాలి.

ఇంట్లో ఎవ‌రి పేరిటైనా వాహ‌నం ఉండొచ్చా?

ఉండొచ్చు. ల‌బ్ధిదారుకు డ్రైవింగ్ లైసెన్సు త‌ప్ప‌నిస‌రి. దాంతో పాటు లబ్ధిదారు పేరిట వాహ‌నం రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్ (ఆర్సీ పుస్త‌కం) కూడా ఉండాలి.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఎలా?

ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రాష్ట్ర ప్ర‌భుత్వ ర‌వాణా శాఖ ఈ ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌ధాన నోడ‌ల్ ఏజెన్సీగా ఉంటుంది.

ర‌వాణ శాఖ ఆన్‌లైన్ పోర్ట‌ల్‌ను సంద‌ర్శిస్తే అందులో ఈ ద‌ర‌ఖాస్తు ఉంటుంది.

దాన్ని డౌన్‌లోడు చేసుకోవాలి

ఖాళీ ద‌ర‌ఖాస్తు ఫారాన్నీ పూర్తి చేసి దాన్ని మీకు ద‌గ్గ‌ర్లోని గ్రామ స‌చివాల‌యంలో స‌మ‌ర్పించాలి.

ఎన్ని ద‌శ‌ల్లో ద‌ర‌ఖాస్తును ప‌రిశీలిస్తారు?

ఆరు ద‌శ‌ల్లో ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించి చివ‌ర‌కు ల‌బ్ధిదారును ఎంపిక చేస్తారు.

మీరు ఇచ్చిన వివ‌రాలు స‌రైన‌వా కావా అనేది ప‌రిశీలిస్తారు.

గ్రామ వాలంటీరు, వార్డు వాలంటీరు ద్వారా క్షేత్ర‌స్థాయి ప‌రిశీల‌న కూడా చేయిస్తారు.

ఆర్టీఏ అధికారులు కూడా ప‌రిశీల‌న చేస్తారు.

చివరగా ల‌బ్ధిదారుల తుది జాబితాను ఎంపిక చేస్తారు.

ఏయే ప‌త్రాలు ఇవ్వాలి?

  • ఆధార్‌కార్డు
  • ఆధార్ కార్డు అనుసంధానిత మీ రేష‌న్ కార్డు
  • ద‌ర‌ఖాస్తుదారు ఆదాయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం
  • ద‌ర‌ఖాస్తుదారు పేరు తెల్ల‌రేష‌న్ కార్డులోనూ, మీసేవ కేంద్రం ఇచ్చే స‌ర్టిఫికేట్‌లోనూ ఒకేవిధంగా ఉండాలి
  • వాహ‌న రిజిస్ట్రేష‌న్ పుస్త‌కం(ఆర్సీ)
  • డ్రైవింగ్ లైసెన్సు
  • ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతా నంబరు

ఎప్ప‌టిలోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి?

జులై 7లోగా ద‌ర‌ఖాస్తును ద‌గ్గ‌ర్లోని గ్రామ లేదా వార్డు స‌చివాల‌యానికి తీసుకెళ్లి స‌మ‌ర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు స్థితిని ఎలా తెలుసుకోవాలి?

ద‌ర‌ఖాస్తు చేశాక దాన్ని స‌మ‌ర్పించినట్లుగా అధికారుల నుంచీ ర‌సీదు తీసుకోవాలి.

ద‌ర‌ఖాస్తు ఫారం చివ‌ర్లో ర‌సీదు ఉంటుంది. దానిపైన అధికారుల సంతకం పెట్టించుకొని, స్టాంపు వేయించుకోవాలి.

మీ ద‌ర‌ఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకోవ‌డానికి ఈ ర‌సీదు ఉపయోగ‌ప‌డుతుంది.

ద‌ర‌ఖాస్తును ఈ కింద లింక్ నుంచి డౌన్‌లోడు చేసుకోవ‌చ్చు

https://www.aptransport.org/images/pdf/ysr-vahana-mitra-english-application-in-navasakam.pdf

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)