You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వడదెబ్బ ఇంట్లో ఉన్నా ఎలా తగులుతుంది... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. హీట్‌వేవ్ పరిస్థితుల వలన చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు.
ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో బయటకు వెళ్లేటప్పుడు ఎలాంటి రక్షణ లేకుండా వెళ్లవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆహారం విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
హీట్ వేవ్ అంటే ఏమిటి?
ఏప్రిల్, మే, జూన్ నెలలలో హీట్ వేవ్ ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ఈ పరిస్థితులను ప్రజలు చవిచూస్తున్నారని తెలిపారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉండే హీట్ వేవ్ జూలై నెలలో కూడా కొనసాగే అవకాశముందని తెలిపారు.
హీట్ వేవ్‌ను మనం వడగాల్పులు అంటాం. ఏటా వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుండటం మనం చూస్తున్నామని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ సీవీ నాయుడు బీబీసీతో చెప్పారు.
“ఎండా కాలంలో సాధారణంగా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే 4 నుంచి 5.4 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదైతే ఆ పరిస్థితులను హీట్ వేవ్ అంటాం. కొన్నిసార్లు అది 6.4 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉంటుంది. దీనిని స్ట్రాంగ్ హీట్ వేవ్ అంటాం. ఉదాహరణకు ఏప్రిల్ మూడో వారంలో విశాఖ తీర ప్రాంతాల్లో సరాసరి 37 డిగ్రీల సెల్సియస్ నమోదవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు విశాఖలో 41.4 డిగ్రీలు నమోదైంది. అంటే విశాఖ వాసులు హీట్ వేవ్ పరిస్థితులను అనుభవిస్తున్నారని అర్థం” అని వివరించారు ప్రొఫెసర్ సీవీ నాయుడు.
ఈ ఎండల్లో తిరగొచ్చా?
సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ బారిన పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ ఎండలో తిరిగి వడదెబ్బ తగిలితే శరీరంలో నియంత్రణ వ్యవస్థ దెబ్బతింటుందని, దాని వల్ల శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. అది కొన్నిసార్లు ప్రాణాపాయంగా మారే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు.
చిన్నపిల్లలు ముఖ్యంగా ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలు, 60 ఏళ్ల పైబడిన వారు, గర్భిణులు ఎండకాలంలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువని విశాఖకు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ లలిత బీబీసీతో చెప్పారు.
“ఎక్కువగా శరీరక శ్రమ చేసే కూలీలు, క్రీడాకారులు అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వ్యాయమాలు ఎక్కువగా చేసేవారు తగినంత నీరు తాగుతూ ఉండాలి. లేదంటే కిడ్నీలు, లివర్ దెబ్బతినే ప్రమాదం ఉంది. నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు తేలికపాటి ఆహారం తీసుకోవాలి. ఎండల్లో ఎక్కువగా తిరగక్కుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదు” అని డాక్టర్ లలిత చెప్పారు.
ఆమె ఇంకా ఆమె ఏం చెప్పారంటే...
- తల్లిపాలు తాగే పసిపిల్లలకు ఇబ్బంది ఉండదు. కానీ వారి శరీరం వేడిగా మారితే మాత్రం ఎండిన ఖర్జూరాలు రాత్రి పూట నీటిలో నానబెట్టి, ఉదయం ఆ నీటిని తాగిస్తే మంచింది.
- వేసవిలో గర్భిణులు వీలైనంత నీరు తాగాలి. లేకపోతే మూత్ర సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.
- వేసవిలో పిల్లల శరీరం వేడిగా ఉంటే అది జ్వరం అనుకోకూడదు. అలాంటప్పుడు తలమీద, పొట్టమీద తడిగుడ్డ వేయాలి. క్రమంగా వేడి తగ్గుతుంది.
- వేసవి సెలవులు కాబ్టటి పిల్లలు ఆటలాడేందుకు ఎండల్లో బయటకు వెళ్తారు. వాళ్లని ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు బయటకు వెళ్లకుండా నిలువరించాలి.
వడదెబ్బ తగిలితే ఏం జరుగుతుంది?
వడదెబ్బ తగిలినా, ఎక్కువగా ఎండలో తిరిగినా శరీరంలో మార్పులు వస్తాయని విశాఖపట్నానికి చెందిన మరో వైద్యులు జీవీ రావు బీబీసీతో చెప్పారు. ఆ పరిస్థితుల్లో శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయని, వాటిని గుర్తించి చికిత్స అందిచకపోతే ప్రాణాపాయం ఉంటుందని ఆయన చెప్పారు. వడదెబ్బకు గురైనప్పుడు....
- నాడీ వేగంగా కొట్టుకుంటూ శరీరం నుంచి చెమట రావడం నిలిచిపోతుంది.
- చర్మం పొడిబారిపోతుంది. ఇది శరీరంలో నీరు లేదని చెప్తుంది.
- మెదడు సరిగా పని చేయదు. వెంటనే చికిత్స అందించకపోతే ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
- వడదెబ్బ తగిలిన కొందరిలో కొన్ని నిమిషాల్లోనే ఈవన్ని జరిగే ప్రమాదం ఉంది.
- మిగతా అన్ని జబ్బులను నయం చేసుకోడానికి కొంత వ్యవధి ఉంటుంది. కానీ వడదెబ్బ విషయంలో ప్రాణాపాయం జరగడమన్నది ఒక్కోసారి కొన్ని క్షణాలు, కొన్ని నిమిషాల్లో జరిగిపోవచ్చు.
‘ఎండల్లో తిరగకపోయినా హీట్ వేవ్ తప్పదు’
సాధారణంగా ఎండల్లో తిరిగితేనే హీట్ వేవ్ అంటే వడదెబ్బ తగులుతుందని అనుకుంటాం. కానీ ఎండల్లో తిరగకుండా, ఇంట్లో ఉన్నా కూడా హీట్ వేవ్ తగులుతుందని డాక్టర్ జీవీ రావు చెప్పారు.
“దీర్ఘకాలిక వ్యాధులైన డయాబెటిస్, బీపీ వంటివి ఉన్న వారికి నీడలో కూడా వడదెబ్బ తగులుతుంది. వాళ్లు నీడలో, ఇంట్లో ఉన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే వీరు నీరు మాత్రమే కాకుండా ఉప్పు, ఎలక్ట్రోలైట్స్ ఉండే ద్రవాలు సమపాలల్లో తీసుకోకపోతే వాళ్లకు చాలా సమస్యలు వస్తాయి. అందుకని కొబ్బరి నీళ్లు, మజ్జిగ తరుచూ తాగుతుండాలి. ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉన్నవారు ఎండలో తిరగకపోయినా...వాళ్లకు తెలియకుండానే సొమ్మసిల్లి పడిపోతారు. ఆ సమయంలో 105 లేదా 106 డిగ్రీల సెల్సియస్ జ్వరం వస్తుంది. దీనినే హైపర్ పైరెక్సీయ అని అంటారు. అలాంటి సమయాల్లో చల్లటి గుడ్డతో వళ్లంతా తుడిచి, నీరు అందించాలి. నీళ్లు తాగలేని పరిస్థితుల్లో ఉంటే వెంటనే ఆసుపత్రికి తీసుకుని వెళ్లి ప్లూయడ్స్ ఎక్కించాలి” అని డాక్టర్ జీవీ వివరించారు.
ఎండలో తిరిగే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ఎండ, వడదెబ్బ నుంచి కాపాడుకునేందుకు డాక్టర్ లలిత కొన్ని సూచనలు చేశారు....
- ఎండకాలంలో వదులుగా ఉండే దుస్తులే ధరించాలి.
- ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్, తలకు క్యాప్, ముఖానికి స్కార్ఫ్ పెట్టుకోవాలి.
- తరచూ నీళ్లు తాగుతుండాలి.
- మసాలాలు ఉండే పదార్థాలు, నూనె ఎక్కువగా ఉండే పదార్ధాలు తినకూడ ఉంటే మంచింది.
- పళ్ల రసాలు తాగుతూ ఉండాలి.
- ప్రధానంగా శరీరం లవణాలను కోల్పోకుండా కాస్త ఉప్పు వేసిన ద్రవపదార్థాలు తీసుకోవాలి.
- వేసవిలో కూల్ డ్రింక్స్ కాకుండా కొబ్బరి బొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది.
శరీరంలో నీరు తక్కువగా ఉండకుండా ఎప్పటికప్పుడు నీటిని తాగుతూ ఉండాలి. ఎప్పుడైతే శరీరంలో తగినంత నీరు లేదో రక్తం సాంద్రత పెరుగుతుంది. ఇది క్రమంగా రక్త ప్రసరణకు ఇబ్బంది కలిగించే క్లాట్స్ (అడ్డంకి) తయారయ్యేందుకు దోహదపడుతుంది. రక్తంలో క్లాట్స్ తయారైతే...అది మెల్లగా కిడ్నీలు, రక్త నాళాలపై ప్రభావం చూపుతూ కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. అలాగే మూత్త సంబంధిత వ్యాధులు వస్తాయి. అందుకే శరీరంలో నీటి పరిమాణాన్ని తగ్గకుండా చూసుకోవాలని డాక్టర్ లలిత హెచ్చరించారు.
వేసవి సెలవులు...ప్రయాణాలు
పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలా మంది సొంత ఊర్లకి, టూర్లకి బయలు దేరుతారు. దురదృష్టవశాత్తు హీట్ వేవ్ కండిషన్స్ ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే సాధారణంగా ఈ టూర్లను ఎక్కువగా ప్లాన్ చేస్తారు. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ జీవీ రావు తెలిపారు.
“వేసవిలో ప్రయాణాలు చేసే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తమతో పాటు కావలసినంత నీరు ఉండేటట్లు చూసుకోవాలి. ఒక వేళ నీటిని తీసుకుని వెళ్లడం మర్చిపోయినా, తీసుకెళ్లిన నీరు అయిపోయినా వెంటనే ఓఆర్ఎస్, ఎలక్ట్రాల్ పౌడర్ వంటివి కొనుక్కోవాలి. ప్రయాణాల్లో కచ్చితంగా కొబ్బరి బొండాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే వీటిలో లవణాలు లభ్యమవుతాయి. మసాలా ఉండే ఆహారపదార్థాల జోలికి ప్రయాణాల్లో వెళ్లకపోవడమే మంచింది" అని డాక్టర్ జీవీ రావు బీబీసీతో చెప్పారు.
తీర ప్రాంతాల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
తీర ప్రాంతాల్లో ఉన్న వారు వేసవిలో చల్లదనం కోసం సాయంత్రం వేళల్లో బీచ్‌లకు వెళ్తుంటారు. కానీ వేసవిలో తీర ప్రాంత వాసులు హ్యుమిడిటీ కారణంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఏయూ వాతావరణ విభాగాధిపతి ప్రొఫెసర్ సీవీ నాయుడు చెప్పారు. తీర ప్రాంత వాసులు చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు.
“సాధారణంగా విశాఖలో ఏప్రిల్ మాసంలో సరాసరి 37 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. కానీ ఇప్పుడు అది 41 లేదా 42 డిగ్రీల సెల్సియస్‌కు చేరింది. ఉష్ణోగ్రతలకు తోడు తేమశాతం కూడా అధికంగా ఉండటంతో విశాఖలో ఎండలు భరించలేనట్లుగా ఉన్నాయి. తీర ప్రాంతంలో ఉన్న నగరాల అన్నింటి పరిస్థితి ఇంతే. తీరంలో తేమ కారణంగా చెమటతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. శరీరంపై ఉప్పు పేరుకుపోతుంటుంది. స్థానికులు అలవాటైపోతారు కానీ, బయట నుంచి వచ్చే సందర్శకులకు వేసవిలో తీర ప్రాంతాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి” అని ప్రొఫెసర్ సీవీ నాయుడు బీబీసీతో చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- స్వధార్ గృహ: కష్టాల్లో ఉన్న మహిళలకు ఆసరాగా నిలిచే ఈ పథకం ఎలా పని చేస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ విషయంలో కేంద్రం పదే పదే ఎందుకు మాట మారుస్తోంది...
- రామప్ప ఆలయం: ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన ఈ గుడి ప్రత్యేకతలేంటి
- సుప్రీంకోర్టు: స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లను అనుమతిస్తుందా, ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ ఆశ ఏంటి?
- సూడాన్‌లో ఏం జరుగుతోంది? మిలిటరీ, పారా మిలిటరీ మధ్య యుద్ధం ఎందుకు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)