స్వలింగ సంపర్కులను రోజూ వెంటాడే భయాలు ఇవే

    • రచయిత, సుశీలా సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

“నేను నా పార్ట్‌నర్‌తో సహజీవనం చేస్తున్నాను. అయితే భయం వెంటాడని రోజు ఒక్కటంటే ఒక్కటీ లేదు. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పింది. అయితే ‘అలీఘడ్’ చిత్రంలో చూపించినట్టు ఎవరైనా మా ఇంట్లోకి చొరబడి అల్లరి చేస్తారేమోనని ఇంతకుముందు భయంగా ఉండేది. నన్ను ఏడేళ్లు జైలుకు పంపించినట్టు కూడా కలలు వచ్చేవి.”

- డాక్టర్ ప్రసాద్ రాజ్ దండేకర్ చెబుతున్న మాటలివి. ఆయన 18 ఏళ్లుగా తన పార్ట్‌నర్‌తో కలిసి ముంబయిలో నివసిస్తున్నారు.

స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు 2018లోనే తీర్పు ఇచ్చింది. అయితే స్వలింగ సంపర్కుల వివాహం చట్టబద్ధమా, కాదా అనే విషయం ఇప్పుడు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఉంది.

తన కుటుంబ సభ్యులకు తన పార్ట్‌నర్‌ గురించి తెలుసని, అయితే తనకు ప్రమాదం పొంచి ఉందనే ఆలోచన రోజులో 24 గంటలు తనని తొలిచివేస్తుందని దండేకర్ తెలిపారు.

“పత్రాల్లో నా పార్ట్‌నర్‌ నా స్నేహితుడు. అయితే నాకు ఆరోగ్యం బాగోకపోయినా, లేదా నాకేదైనా ప్రమాదం జరిగినా నాకు సంబంధించి తాను ఆసుపత్రిలో ఏ నిర్ణయమూ తీసుకోలేడు. ఎందుకంటే చట్టం ప్రకారం నా తరపున నిర్ణయం తీసుకోవడానికి తనకు ఎలాంటి హక్కూ లేదు కాబట్టి. మేం ఇన్నేళ్లుగా కలిసి ఉంటున్నాం. నాకూ ఉంటుంది కదా..

నేను ప్రేమించే మనిషి నా బాగోగులు చూసుకోవాలని, నాతో పాటు ఉండాలని. అయితే నా పార్ట్‌నర్‌ అని చెప్పుకోవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఉంది. మా లాంటి వాళ్లకు ఇల్లు అద్దెకు తీసుకోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, పిల్లలను దత్తత తీసుకోవాలన్నా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

భారతదేశంలో మానసిక ఆరోగ్యంపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోందని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) చెబుతోంది.

అయితే స్వలింగ సంపర్కుల మానసిక ఆరోగ్యం గురించి, వారి హక్కుల గురించి తెలుసుకోవటానికి మాత్రం చాలా మంది ఇష్టపడటం లేదని అంటోంది.

స్వలింగ సంపర్కులు అందరిలాగానే సాధారణ లైంగిక జీవులు అని, స్వలింగ సంపర్కమేమీ వ్యాధో లేదా వికృతమైనదో కాదని ఈ సొసైటీ ఈ మధ్య చాలా స్పష్టంగా తెలియజేసింది. స్వలింగ సంపర్కులను ఇతర మనుషుల మాదిరే చూడాలని సూచించింది.

విద్య, ఉపాధి, వసతి, ప్రభుత్వ, సైనిక ఉద్యోగాలు, ఆస్తి, పెళ్లి, దత్తత విషయాల్లో దేశంలోని పౌరులందరికీ ఉన్నట్టే వీరికి కూడా హక్కు ఉండాలని ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలిపింది.

ఈ హక్కులు పొందటంలో స్వలింగ సంపర్కులు వివక్షకు గురవ్వడం వారి మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.

దేశంలోని ఐదు జోన్లకు అంటే తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, మధ్య భారత ప్రాంతాలకు చెందిన సైకియాట్రిక్ వైద్యులు ఈ సొసైటీలో సభ్యులు.

ఈ సొసైటీ భారతదేశంలోనే అతి పెద్ద సైకియాట్రిక్ సొసైటీ. అలాగే ప్రపంచంలో రెండో అతి పెద్ద సొసైటీ. ఇందులో ఎనిమిది వేల మంది సభ్యులు ఉన్నారు.

స్వలింగ సంపర్కాన్ని నేరాల జాబితా నుంచి తొలగించడానికి ఈ సొసైటీ 2018లో పూర్తి మద్ధతు తెలిపింది.

మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

స్వలింగ సంపర్కులు రెండు జీవితాలు జీవించాల్సి వస్తుంది. అది వారి మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని లక్నోకు చెందిన డాక్టర్ అలీం సిద్దిఖీ తెలిపారు.

“పిల్లలు, యువత, ముసలి, స్వలింగ సంపర్కులు సహా సమాజంలోని ప్రతి వర్గం మానసిక ఆరోగ్యం గురించి ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ పరిశోధన చేస్తుంది. ‘గే’ సముదాయానికి చెందిన వారు తమ ప్రొఫెషనల్ జీవితంలో ఎన్ని శిఖరాలు అధిరోహించినా వాళ్ల వ్యక్తిగత జీవితంలోని కోరికలు మాత్రం తీరకుండానే ఉండిపోతున్నాయని మా పరిశోధనలో తేలింది.

ఈ సముదాయానికి చెందిన వారు తమ లైంగిక జీవితం గురించి తమ తల్లితండ్రులతో చెప్పుకోలేరు. చెప్పటానికి ప్రయత్నించినప్పుడు వారి నోరు మూయించటమో, లేదా వారిని అసలే పట్టించుకోకపోవడమో జరుగుతుంది” అని డాక్టర్ సిద్దిఖీ చెప్పారు.

మానసిక ఆరోగ్య సమస్యలతో తమ దగ్గరకు వచ్చే స్వలింగ సంపర్కులు మూడు నాలుగు సార్లు కలిసిన తర్వాత తమ నిజమైన బాధను పంచుకొంటారని ఆయన తెలిపారు.

తమ నిజమైన సమస్య తమ అస్తిత్వమేనని, తమ అస్తిత్వాన్ని ఎవరూ అంగీకరించకపోవడమే తమ సమస్య అని వారు చెబుతారని అలీం సిద్ధిఖీ వివరించారు.

“ఈ సముదాయానికి చెందిన వారు వివక్ష బాధితులు. నిత్యం అవమానాలకు, వెక్కిరింపులకు గురవుతారు. అలాంటి పరిస్థితుల్లో వారి గురించి వారు బయటకు వచ్చి చెప్పినప్పుడు మిగతావాళ్లు వారినే తప్పుపడుతున్నారు” అని డాక్టర్ అల్కా సుబ్రమణ్యం చెప్పారు.

అలాంటి పరిస్థితుల్లో వీరు అణిచివేతకు గురవుతారని, కుంగుబాటకు లోనవుతారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయని, అయితే ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు తగ్గుముఖం పట్టిందని వివరించారు.

“భారతదేశ యువతలో అవగాహన పెరుగుతోంది. స్వలింగ సంపర్కులకు చాలా సంస్థలు ‘భిన్నత్వం (డైవర్సిటీ)’ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఇలాంటి ప్రగతిశీల చర్యలు సమాజానికి చాలా అవసరం” అని ఆల్కా సుబ్రమణ్యం తెలిపారు.

దత్తత తీసుకొనే హక్కు

స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకొనే హక్కు ఉండాలా, లేదా అనే అంశంపై తమ సొసైటీ నెల పాటు చర్చించిందని ఐపీఎస్ ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీ కాంత్ రాఠీ తెలిపారు.

పిల్లలను దత్తత తీసుకునే హక్కు గురించి స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు వచ్చాక మాట్లాడటం సబబని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో రెండు అంశాల గురించి చర్చించాల్సిన అవసరం ఉందన్నారు.

“స్వలింగ సంపర్కుల పెళ్లి హక్కును గుర్తిస్తే ఆ పెళ్లి బంధం కనీసం మూడు సంవత్సరాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ పిల్లలను దత్తత తీసుకునే హక్కును కూడా గుర్తిస్తే ఏ కారణం వల్లయినా పెళ్లి బంధం నిలబడకపోయినా, పిల్లలు ఏ కారణం వల్ల అనాథలు అయినా ఆ సముదాయనికి చెందిన ఇంకొకరు ఆ పిల్లల ఆలనా పాలనా చూస్తారనే హామీ ఆ సముదాయం నుంచి ఒకరు ఇవ్వాలి” అని ఆయన సూచించారు.

చాలా సందర్భాల్లో హోమోసెక్సువల్ సముదాయనికి చెందిన వారితో బంధువులు తెగదెంపులు చేసుకుంటారని, అయితే ఈ సముదాయంలో ఒకరి ఒకరికి మధ్య సంబంధాలు చాలా గట్టిగా ఉంటాయని డాక్టర్ లక్ష్మీకాంత్ చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పిల్లల పెంపకం మీద ఎలాంటి ప్రభావం పడకుండా ఉండటానికి ఈ సముదాయం నుంచి ఒకరి హామీ అవసరమని అభిప్రాయపడ్డారు.

స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకునే, పిల్లలను దత్తత తీసుకునే హక్కు ఉన్న కెనడా, అమెరికా లాంటి దేశాల్లో తాము పరిశోధన చేశామని డాక్టర్ అల్కా సుబ్రమణ్యం చెప్పారు. స్వలింగ సంపర్కులకు ఈ హక్కులను కల్పించడం వల్ల పిల్లల మీదగానీ, సమాజం మీదగానీ దుష్ప్రభావం పడుతుందనే దానికి ఆధారాల్లేవన్నారు.

30కి పైగా దేశాల్లో వివాహ హక్కు

ప్రపంచంలో స్వలింగ సంపర్కుల వివాహ హక్కును గుర్తించిన తొలి దేశం నెదర్లాండ్స్.

ఇప్పుడు 30కి పైగా దేశాల్లో స్వలింగ సంపర్కుల వివాహ హక్కుకు గుర్తింపు ఉంది. ఈ జాబితాలో అమెరికా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, స్విట్జర్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్, బెల్జియం, తైవాన్, ఇతర దేశాలు ఉన్నాయి.

కొన్ని దేశాల్లో ఈ హక్కుకు న్యాయస్థానాల ద్వారా గుర్తింపు లభించగా, మరికొన్ని దేశాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా లభించింది.

తైవాన్‌లో స్వలింగ సంపర్కుల వివాహాన్ని నేరాల జాబితా నుంచి ఇటీవలే తొలగించారు. ఆసియాలో అలా జరగడం ఇదే తొలి సారి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)