You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అర్శమొలలు: మలద్వారం నుంచి రక్తం ఎందుకు వస్తుంది, తగ్గాలంటే ఏం చేయాలి?
- రచయిత, ప్రతిభా లక్ష్మి
- హోదా, బీబీసీ కోసం
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరిని అర్శ మొలల సమస్య వేధిస్తోంది. అయినప్పటికీ, అవగాహన లేకపోవడంతో ఎందరో ప్రజలు దీనితో ఇబ్బంది పడుతున్నారు.
వైద్యులను సంప్రదించడానికి భయపడి, లేక మొహమాట పడి, అశాస్త్రీయ చికిత్సా విధానాలతో రోగులు మరింత కష్టపడుతున్నారు.
మలద్వారం వద్ద రక్తనాళాల వాపు వల్ల అర్శమొలలు ఏర్పడతాయి. ఇది రెండు రకాలు. బయటకు తెలిసేవి (external hemorrhoids), లోపల ఉండేవి (internal hemorrhoids). రక్తనాళాలు చిట్లడం వల్ల మల విసర్జన తరవాత మలద్వారం గుండా రక్తం పోవడం వీటి ప్రధాన లక్షణాల్లో ఒకటి.
కారణాలు ఏంటి?
మలబద్ధకం, ఊబకాయం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, జీవన శైలి లాంటివి అర్శమొలలకు దారితీస్తాయి.
మలబద్దకానికి మళ్ళీ అనేక కారణాలు ఉండొచ్చు. కేవలం ఆహారపు అలవాట్లు కాదు, థైరాయిడ్ వంటి అనారోగ్య సమస్యలు, కొన్ని రకాల మందుల వల్ల కూడా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యంగా అందరూ వాడే కాల్షియం లేక ఐరన్ మాత్రల వల్ల కూడా మలబద్ధకం కలుగవచ్చు. ఆ తర్వాత అది అర్శమొలలకు దారి తీయొచ్చు.
గర్భధారణ సమయంలో కొందరు మహిళలకు అర్శమొలలు కలిగే అవకాశం ఉంది.
మలంలో రక్తం రావడానికి ఇతర కారణాలు
మలవిసర్జన సమయంలో రక్తం పడడానికి ముఖ్య కారణం అర్శమొలలు అయినప్పటికీ, ఇతర కారణాలు కూడా ఉండే అవకాశం ఉంది.
ముఖ్యంగా మలబద్ధకం ఉండే వారిలో ఫిషర్ (fissure) లేక ఫిస్టులా (fistula) ఉండే అవకాశం ఉంది.
ఫిషర్ ఉన్న వ్యక్తులకు, మలవిసర్జన సమయంలో చాలా నొప్పి కలగడం, రక్తపు మరకలు మలానికి అంటుకొని రావడం జరుగుతుంది. ఆ నొప్పి తట్టుకోలేక మలవిసర్జన చేయడానికే భయపడే పరిస్థితి నెలకొంటుంది.
కానీ అర్శమొలల వల్ల నొప్పి ఎక్కువగా ఉండక పోవచ్చు. మల విసర్జన తరవాత చుక్కలు చుక్కలుగా రక్తం పోతుంది. ఫిస్టులా రోగుల్లో మలంలో చీము కనిపించే అవకాశం ఉంది.
రెక్టల్ అల్సర్ అంటే, మలద్వారానికి లోపలి భాగంలో పుండు అయినట్టయితే, నొప్పి చాలా అధికంగా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే, అది క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా ఉంది.
కొన్నిసార్లు పేగులలో ఇన్ఫెక్షన్ కావడం వల్ల, చీము, బంక, రక్తంతో విరేచనాలు అవ్వవచ్చు(dysentery). అప్పుడు మలవిసర్జన సమయంలో కడుపులో నొప్పితో, కొద్ది కొద్దిగా విరేచనాలు అవుతాయి.
చాలా అరుదుగా పేగుల్లో పాలిప్స్ ఉంటే కూడా మలవిసర్జనలో రక్తం పడే అవకాశం ఉంది.
అర్శమొలలతో కలిగే సమస్యలు
అర్శమొలలు చాలావరకు పెద్దగా నొప్పి కలిగించవు. కానీ కొన్ని సార్లు, అందులో రక్తం గడ్డ కట్టి (thrombosed hemorrhoids), తీవ్రమైన నొప్పిని కలిగించే అవకాశం ఉంది. ఫలితంగా ఆ వ్యక్తి ఎక్కడా కూర్చోలేక, సరిగ్గా పడుకొలేక, అధిక సమయం నిలబడలేక ఎంతో ఇబ్బంది పడే అవకాశం ఉంది.
మల విసర్జన తరవాత శుభ్రం చేసుకునే సమయంలో మల ద్వారం వద్ద వాపు లాగా తగిలే అవకాశం ఉంది. కొన్ని సార్లు అర్శమొలలలో ఇన్ఫెక్షన్ అయ్యి, దురద పెట్టడం, పుండు కావడం లాంటివి జరుగుతుంటాయి.
ముఖ్యంగా అర్శమొలలు లోపల ఉన్నప్పుడు, (internal hemorrhoids) తెలియకుండా రక్తస్రావం అధికంగా అయ్యే ప్రమాదం ఉంది.
అప్పుడు రక్తనాళాలను గుర్తించి వాటిని మూసివేయాలి. అధికంగా రక్తం పోవడం వల్ల, రక్తహీనత కలిగే అవకాశం ఉంది. దాని వల్ల నీరసం పెరిగి, గుండె మీద ఒత్తిడి కలుగుతుంది. దీనివల్ల రక్తం ఎక్కించాల్సిన పరిస్థితి వస్తుంది.
ఏం చేయాలి?
అర్శమొలలు రాకుండా ఉండాలి అంటే, అధికంగా పీచు ఉన్న ఆహార పదార్ధాలు తినాలి. అంటే ప్రతి రోజూ, పండ్లు, కూరగాయలు అధికంగా తీసుకోవాలి.
నీరు బాగా తాగాలి. ముఖ్యంగా ఎండాకాలం, ఒంట్లో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు మలబద్ధకం రాకుండా చూసుకోవాలి.
మలబద్ధకానికి థైరాయిడ్ వంటి సమస్యలు కారణం అయితే, పరీక్ష చేసుకొని, వైద్యుల సలహా మేరకు తగిన మోతాదులో మాత్రలు వేసుకుంటూ, థైరాయిడ్‌ని అదుపులో పెట్టుకోవాలి.
బలవంతంగా అధిక సమయం మల విసర్జనకు ప్రయత్నించకూడదు.
ఊబకాయులు శరీర బరువును నియంత్రించుకునే ప్రయత్నం చేయాలి. రోజూ శరీరానికి తగిన మోతాదులో వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. అధిక సమయం కదలకుండా కూర్చోడం మంచిది కాదు.
చికిత్స ఏమిటి?
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులతో దీన్ని తగ్గించుకోవడం ఉత్తమం అయినప్పటికీ, సమస్య తీవ్రమైనప్పుడు చికిత్స తప్పదు.
ఒక టబ్‌లో గోరు వెచ్చటి నీరు నింపి, అందులో రోజూ కొద్ది సేపు కూర్చోవాలి (sitz bath). దీనితో మల ద్వారం వద్ద కండరాలు రిలాక్స్ అయ్యి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
ఒక వేల అర్శమొలలు తొలి దశలో ఉన్నట్లయితే, మలబద్ధకం ఉండకుండా 'లాక్టులోస్' సిరప్, లేక ఏదైనా మలాన్ని మెత్తబరిచే సిరప్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే ఉదయం మలవిసర్జన తేలిగ్గా అవుతుంది.
నొప్పి తగ్గడానికి, గాయం మానడానికి, ఉబ్బిన రక్తనాళాలు తగ్గడానికి, ఆ ప్రాంతంలో క్రీమ్ లేదా ఆయింట్‌మెంట్ పూసుకోవాలి.
తరుచూ రక్తం పోవడం వంటి లక్షణాలు కనిపించినా లేదా అర్శమొలలు పెద్దగా అనిపించినా శస్త్రచికిత్స ద్వారా వాటి నుండి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. దీనికి లేజర్ చికిత్స కూడా అందుబాటులో ఉంది.
ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, మంచి అలవాట్లతో అర్శమొలను నివారించుకోవడం ఉత్తమం. అవసరమైనపుడు వైద్యుల సలహా మీద తగిన చికిత్స తీసుకోవాలి. చికిత్స ఆలస్యం చేస్తే సమస్య ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.
(రచయిత వైద్యురాలు. ఈ వ్యాసం నిర్దిష్టమైన సమస్య మీద స్థూలమైన అవగాహన కోసం మాత్రమే)
ఇవి కూడా చదవండి
- ఐపీఎల్ 2023: టోర్నీని రసవత్తరంగా మార్చబోతున్న 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ఏంటి?
- సెమాగ్లుటైడ్: బరువు తగ్గించే ఈ ఇంజెక్షన్‌కు అంత డిమాండ్ ఎందుకు?
- తెలంగాణ: ఆదివాసీలు పరిశ్రమలు పెట్టేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొందడం ఎలా?
- ‘‘ఆయన నాలుగేళ్లుగా నీళ్లు పోసుకోలేదు... అడవిలోనే ఒంటరి జీవితం... అటవీ ఏనుగులున్నా భయపడలేదు’’
- 'జీన్ ఎడిటెడ్ ఫుడ్' అంటే ఏంటి? అది తినడం ఆరోగ్యానికి మంచిదేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)