ఆరోగ్యం: యాంటీబయాటిక్స్‌కు లొంగని బాక్టీరియాతో దేశంలో కొత్త సంక్షోభం

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేడు యాంటీబయాటిక్స్‌కు కొన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు లొంగడం లేదు.

కాలక్రమంలో పరిణామం చెందుతూ యాంటీబయాటిక్స్‌ను ఎదిరించి జీవించగల శక్తి సామర్థ్యాలను అవి పెంచుకుంటున్నాయి. ఇలాంటి వాటిని 'సూపర్‌బగ్స్' అంటారు.

ఇలా రెసిస్టెన్స్ పవర్‌ అంటే యాంటీబయాటిక్స్‌ను తట్టుకొని నిలబడగల శక్తి ఉన్న సూపర్‌బగ్స్ ఇతర అనారోగ్యసమస్యలకు దారి తీస్తున్నాయి.

మహారాష్ట్రలోని కస్తూర్బా హాస్పిటల్‌లో సూపర్‌బగ్స్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు చికిత్స చేయడంలో డాక్టర్లు తలమునకలవుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2019లో సుమారు 12.7 లక్షల మంది సూపర్‌బగ్స్ వల్ల చనిపోయారని మెడికల్ జర్నల్ 'ది లాన్సెట్' చెబుతోంది. అనారోగ్యం తలెత్తినప్పుడు ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా లేదా వైరస్ మీద దాడి చేసేది యాంటీబయాటిక్స్. కానీ ఈ కేసులో చాలా వరకు యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని అవి నిలబడ్డాయి.

ఈ సమస్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. సూపర్‌బగ్స్‌కు ఉండే రెసిస్టెన్స్ శక్తి వల్ల నవజాత శిశువుల్లో ఆరోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. ప్రతి ఏడాది సుమారు 60వేల మంది ఇలా చనిపోతున్నారు.

ఇ-కోలాయ్, సాల్మోనెల్లా వంటి 5 రకాల బ్యాక్టీరియాలు ప్రధానంగా మనుషులకు అనారోగ్యాన్ని కలిగిస్తుంటాయి. వీటి మీద యాంటీబయాటిక్స్ ఎలా పని చేస్తున్నాయో కస్తూర్బా హాస్పిటల్ వైద్యులు పరిశీలించారు. కానీ చాలా వరకు యాంటీబయాటిక్స్ ఆ బ్యాక్టీరియాలను అడ్డుకోలేక పోయాయి.

మనుషులు, జంతువుల పేగుల్లో 'ఇ-కోలాయ్' బ్యాక్టీరియా కనిపిస్తుంది. ఊపిరితిత్తులకు సోకే 'క్లెబ్సియల్లా న్యుమోనియా' వల్ల న్యుమోనియా సోకుతుంది. గాలి ద్వారా సోకే స్టాఫిలోకాకస్ బ్యాక్టీరియా కూడా ప్రాణాంతకమైనది.

ఈ సూపర్‌బగ్స్‌ వల్ల కలిగే వ్యాధులను ట్రీట్ చేయడంలో యాంటీబయాటిక్స్ ప్రభావం 15శాతం కంటే తక్కువగా ఉన్నట్లు డాక్టర్లు తమ పరిశోధనలో గుర్తించారు. ఐసినెటోబాక్టర్ బౌమానీ అనే బ్యాక్టీరియా అనేక రకాల యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని నిలబడేలా పరిణామం చెందడం ఆందోళన కలిగించే విషయం.

వెంటిలేటర్ మీద ఉండే రోగుల ఊపిరితిత్తుల్లో చేరి శ్వాస తీసుకోకుండా చేస్తుంది ఐసినెటోబాక్టర్.

'మా వద్ద చేరే రోగుల్లో దాదాపుగా అందరూ ఎక్కువ శక్తి గల యాంటీబయాటిక్స్‌ను కొనే స్థోమత లేని వాళ్లు. ఐసీయూలో ఉన్నప్పుడు వెంటిలేటర్ సంబంధిత న్యుమోనియా వస్తే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది' అని కస్తూర్బా గాంధీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌పీ కలాంత్రీ అన్నారు.

కార్బాపెనమ్ వంటి శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌కు బ్యాక్టీరియా, వైరస్‌లు తట్టుకుని నిలబడగలుగుతున్నాయని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పరిశోధనలో తేలింది. గత ఏడాదిలో వాటి శక్తి 10శాతం పెరిగింది.

'ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. సెప్సిస్ వంటి ప్రమాదకర వ్యాధులను కార్బాపెనమ్ చాలా శక్తిమంతంగా ఎదుర్కొంటుంది' అని ఐసీఎంఆర్‌కు చెందిన డాక్టర్ కమినీ వాలియా తెలిపారు.

ఐసీయూలో ఉండే 10 మంది పేషెంట్లలో ఆరుగురు డ్రగ్ రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నట్లు ఏఎంఆర్‌ఐ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సస్వతీ సిన్హా తెలిపారు. 'పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఇటువంటి రోగులకు చికిత్స అందించడానికి మన దగ్గర ఉన్న అవకాశాలు తగ్గిపోతున్నాయి' అని ఆందోళనవ్యక్తం చేశారు.

గ్రామాలు, చిన్నచిన్న పట్టణాల నుంచి న్యుమోనియా, మూత్రసంబంధిత ఇన్ఫెక్షన్లతో వచ్చే అవుట్ పేషెంట్లలోనూ ఈ సూపర్‌బగ్స్ కనిపిస్తున్నట్లు కస్తూర్బా హాస్పిటల్ వైద్యులు చెబుతున్నారు. వీరిలో చాలా మంది అంతకు ముందు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తీసుకురారు. లేదా వారి వద్ద ఉండదు. ఏ మందులు వాడారో కూడా కొందరికి తెలియదు. అందువల్ల ఇటువంటి ఇన్ఫెక్షన్లకు ట్రీట్ చేయడం కష్టంగా మారుతోందని డాక్టర్స్ అంటున్నారు.

ప్రిస్క్రిప్షన్లు వంటివి లేకపోవడం వల్ల పేషెంట్లు రకరకాల యాంటీబయాటిక్స్ ఎక్కువగా వాడుతున్నారు. భారత్‌లో డాక్టర్లు విచక్షణా రహితంగా యాంటీబయాటిక్స్ రాస్తున్నారు అని ప్రభుత్వ వైద్యనిపుణులు అంటున్నారు.

జ్వరం, జలుబు వంటి వాటిని యాంటీబయాటిక్స్ నయం చేయలేవు.

డెంగ్యూ, వైరల్ ఇన్ఫెక్షన్, మలేరియా వంటి కేసుల్లో మాత్రమే యాంటీబయాటిక్స్ ఇస్తారు. డయేరియా, కొన్నిరకాల శ్వాసకోశ ఇబ్బందుల్లోనూ వాడతారు.

కరోనా సంక్షోభంలో డాక్టర్లు విపరీతంగా యాంటీబయాటిక్స్‌ను రోగులకు వాడారు. ఇది చాలా ప్రభావం చూపింది. ఐసీఎంఆర్ పరిశోధన ప్రకారం 17,534 మంది కరోనా పేషెంట్లలో సగం మంది సూపర్‌బగ్స్ వల్ల చనిపోయారు.

'అయితే ఈ విషయంలో డాక్టర్లను మాత్రమే తప్పు పట్టలేం. భారత్‌లోని ప్రభుత్వ ఆసుపత్రులకు భారీ సంఖ్యలో రోగులు వస్తుంటారు. వారిని సరిగ్గా చూసి, జబ్బుకు కారణాలను కనుగొనే సమయం డాక్టర్లకు ఉండదు' అని డాక్టర్ కలాంత్రీ అన్నారు.

గ్రామాల్లోని వారికి యాంటీబయాటిక్స్‌ను విపరీతంగా వాడటం వల్ల కలిగే చెడు ప్రభావాల గురించి తెలియదు. కానీ చదువుకున్న వాళ్లు, ధనవంతులు ప్రతిదానికి యాంటీబయాటిక్స్ వాడుతున్నారు. అవి రాయాల్సిందిగా డాక్టర్లను ఒత్తిడి చేస్తున్నారు.

నేడు యాంటీబయాటిక్స్ మందుల ధరలు బాగా తగ్గి అందుబాటులోకి వచ్చాయి. అదే సమయంలో డయాగ్నసిస్ టెస్టుల ఖరీదు బాగా పెరిగింది. అందువల్ల టెస్టులు రాయడం కంటే యాంటీబయాటిక్స్ రాసేందుకు డాక్టర్లు మొగ్గు చూపుతున్నారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తోంది.

'భారత్‌లో ఇదొక పెద్ద ఉపద్రవం. ఒకవైపు అవసరం ఉన్నా లేకున్నా యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు. మరొకవైపు ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. వాటిని కంట్రోల్ చేసే మార్గాలు తగ్గిపోతున్నాయి' అని ఒన్ హెల్త్ ట్రస్ట్ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ ఆందోళన వ్యక్తం చేశారు.

డయాగ్నస్టిక్ ల్యాబ్స్ సంఖ్యను భారత్ పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆసుపత్రుల ద్వారా సోకే ఇన్ఫెక్షన్లను తగ్గించడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అందుకు తగిన మందులు రాసేలా డాక్టర్లకు అవగాహన కల్పించడం వంటివి చేపట్టాలని చెబుతున్నారు.

'బ్యాక్టీరియా, వైరస్ వంటివి యాంటీబయాటిక్స్‌ను తట్టుకుని నిలబడుతున్న తీరు భవిష్యత్తులో పెద్ద ఆరోగ్య సంక్షోభానికి దారి తీయొచ్చు' అని డాక్టర్ వాలియా హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)