మెదడుకు కరెంట్ షాక్ ఇస్తే మెమరీ పెరుగుతుందా?

    • రచయిత, జేమ్స్ గలఘర్
    • హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాండెంట్

విద్యుత్‌ను ఉపయోగించి మెదడులోని భాగాలకు ఎలాంటి హాని కలుగకుండా ప్రేరేపించడం ద్వారా కనీసం ఒక నెల పాటు ప్రజల జ్ఞాపకశక్తిని పెంచవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

వర్డ్ మెమోరైజేషన్ ఆటల్లో వాలంటీర్లు ఉత్తమ ప్రదర్శన కనబరిచినట్లు నిపుణులు తెలుసుకున్నారు.

అయితే, రోజూవారీ జీవితంలో దీని ఫలితం ఎలా ఉంటుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇలా మెదడులోని భాగాలను ఉత్తేజితం చేసే ప్రక్రియను... బ్రెయిన్‌లోని భాగాలను వేరుచేయడానికి, పెంచడానికి దోహదపడే భిన్నమైన విధానంగా బోస్టన్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ రాబర్ట్ రీన్‌హార్ట్ అభివర్ణించారు.

ఈ ట్రయల్‌లో పాల్గొన్న వాలంటీర్లు తలకు ఎలక్ట్రోడ్లతో నిండిన క్యాప్‌ను ధరించారు. దీని ద్వారా నియంత్రిత విధానంలో విద్యుత్‌ను మెదడులో ఎంపిక చేసిన ప్రదేశాల్లో క్రమపద్ధతిలో తరంగాలను సృష్టించేందుకు వాడారు. ఈ నియంత్రిత్ విద్యుత్ వల్ల దురద లేదా జలదరింపు భావన మాత్రమే కలుగుతుంది.

వాలంటీర్ల మెదడును వరుసగా నాలుగు రోజులు 20 నిమిషాల పాటు ఈ విధంగా నియంత్రిత విద్యుత్ ద్వారా ప్రేరేపించారు. ఈ అధ్యయనంలో వాలంటీర్లు కొన్ని పదాల జాబితాను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ పదాలను నెల రోజుల తర్వాత మళ్లీ అప్పచెప్పాల్సిందిగా వారిని అడిగారు.

ఈ చికిత్స వల్ల కనీసం ఒక నెలపాటు జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుందని డాక్టర్ రీన్‌హార్ట్ చెప్పారు.

ఈ ప్రయోగం ప్రారంభంలో మెమొరీ గేమ్స్‌లో ఇబ్బందులు పడిన వాలంటీర్ల జ్ఞాపకశక్తి ఆ తర్వాత బాగా మెరుగుపడినట్లు నేచర్ న్యూరోసైన్స్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఫలితాలు చూపుతున్నాయి.

ఇది ఎలా పనిచేస్తుంది

మెదడులో లక్ష్యంగా చేసుకున్న ప్రదేశంలో బ్రెయిన్ తరంగాల లయను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ మార్చాయి.

నాలుగు రౌండ్ల పాటు ప్రేరేపించడం వల్ల మెదడులోని ఆ తరంగాలు బలోపేతం అయ్యాయని, ఇది మెదడు పనితీరులో మెరుగుదలకు దారితీసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అని పిలుస్తారు.

''ఇది ఒక రకమైన అనుసంధాన ప్రక్రియ. ఈ విధానంలో విద్యుత్ ప్రేరణల ద్వారా మెదడు తనకు తానే మెరుగుపడుతుంది'' డాక్టర్ రీన్‌హార్ట్ చెప్పారు.

వివిధ రకాల జ్ఞాపకశక్తులను పెంచడానికి వివిధ రకాల ప్రేరేపణలు అవసరం.

వర్కింగ్ మెమొరీని పెంచడానికి బ్రెయిన్ ముందు భాగంలోని ప్రిఫ్రంటల్ కార్టెక్స్‌ను తక్కువ పౌన:పున్యంతో ప్రేరేపించాలి.

లాంగ్ టర్మ్ మెమొరీ కోసం మెదడు వెనుక భాగంలో పరీటల్ కార్టెక్స్‌పై ఎక్కువ ఫ్రీక్వెన్సీతో ఉద్దీపన కలిగించాలి.

ఈ ట్రయల్‌లో పాల్గొన్న150 మంది వాలంటీర్లు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఇందులో 65 నుంచి 88 ఏళ్ల వ్యక్తులు ఉన్నారు.

అల్జీమర్స్ వ్యాధిలో మెదడు కణాలను రక్షించడానికి, స్కిజోఫ్రేనియా వ్యాధి కోసం కోసం ఈ సాంకేతికతను ఉపయోగించవచ్చా అనే దానిపై పరిశోధకులు ప్రయోగాలు చేస్తున్నారు.

''బ్రెయిన్‌ను ప్రేరేపించే ఇలాంటి సాంకేతిక పద్ధతులు డెమెంటిమా అనే వ్యాధులకు ఉపయోగపడే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో లేదో మాకు తెలియదు. కానీ, ఈ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి'' అని యూకేలోని అల్జీమర్స్ రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ సుసన్ కోల్హాస్ అన్నారు.

ప్రస్తుతం వాడుతున్న ఈ పద్ధతి కేవలం ప్రయోగశాలల్లో మాత్రమే సాధ్యమవుతుంది.

క్రాస్ వర్డ్స్, సుడొకు వంటి సంప్రదాయ మెదడుకు పదునుపెట్టే పద్ధతులతో పాటు ఈ సాంకేతికను ఇలా చూడగలమని రీసెర్చర్ శ్రేయ్ గ్రోవర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)