You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పిల్లలను కిటికీలోంచి విసిరేసిన జంటకు మరణ శిక్ష వేసిన చైనా
- రచయిత, ఫాన్ వ్యాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
ఇద్దరు పిల్లల్ని అపార్ట్‌మెంట్ కిటికీలోంచి విసిరేసి దారుణంగా చంపేసిన ఘటనలో ఒక జంటకు చైనా మరణ శిక్ష విధించింది.
పిల్లల తండ్రి జాంగ్ బో, యె చెంగ్‌చెన్ 2020లో రెండేళ్ల వయసున్న పాపను, ఏడాది వయసున్న బాబును చంపేసిన కేసులో దోషులుగా తేలారు.
యె చెంగ్‌చెన్‌తో జాంగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఆ తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చారు. అప్పటి నుంచి తన పిల్లల్ని చంపేందుకు కుట్ర పన్నాని కోర్టు విచారణలో తేలింది.
ఈ జంట ‘క్రూరమైన విధానాలను’ ఎత్తిచూపుతూ, వీరి ఉద్దేశాలు అత్యంత హానికరమైనవని చైనా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
నైరుతి నగరమైన చాంగ్వింగ్‌లో ఈ జంటకు మరణ శిక్ష విధించారు. అయితే, వీరికి మరణ శిక్ష ఏ విధంగా వేశారన్నది ఇంకా తెలియదు.
చైనాలో చాలా వరకు మరణ శిక్షలను విషపూరిత ఇంజెక్షన్ లేదా సైనికులతో కాల్చి చంపించడం ద్వారా అమలుపరుస్తుంటారు.
జాంగ్ తనకు పెళ్లయిందని, పిల్లలున్నారనే విషయాన్ని దాచిపెట్టి చెంగ్‌చెన్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. నిజం తెలిసినప్పటికీ చెంగ్‌చెన్ ఆ సంబంధాన్ని కొనసాగించారని కోర్టు విచారణలో తేలింది.
‘‘జాంగ్ 2020 ఫిబ్రవరిలో తన భార్యకు విడాకులు ఇచ్చినప్పటికీ, పిల్లల్ని అడ్డంకిగా చెంగ్‌చెన్ భావించారు. జాంగ్‌తో పెళ్లికి, వారి భవిష్యత్తుకు ఈ పిల్లలు అడ్డంకి అని చెంగ్‌చెన్ అనుకున్నారు. దీంతో పిల్లల్ని చంపేయాలని చాలాసార్లు జాంగ్‌పై ఒత్తిడి తెచ్చారు. దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రీకరించాలనుకున్నారు. 2020 నవంబర్ 2న జాంగ్ తన పిల్లల్ని 15వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ కిటికీ నుంచి కిందకు విసిరేశారు. దీంతో, పిల్లలు చనిపోయారు’’ అని కోర్టు విచారణలో తెలిసింది.
వారికి మరణ శిక్ష విధించిన వార్త బయటకు రాగానే చైనా సోషల్ మీడియా సైట్ వైబోలో బాగా ట్రెండ్ అయింది. లక్షల మంది ఈ వార్తను చదివారు, దీనిపై స్పందించారు.
‘‘వారు చేసిన నేరానికి ఇది తగిన శిక్ష’’ అని ఒకరు కామెంట్ చేశారు. 30 వేల సార్లకు పైగా ఈ కామెంట్‌ను లైక్ చేశారు.
‘‘ఈ పిల్లలకు వచ్చే జీవితంలోనైనా శాంతి, సంతోషం దక్కుతాయని ఆశిద్దాం’’ అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
మూడేళ్లకు పైగా తమ కుటుంబాన్ని హింసిస్తూ, నరకం చూపించిన వారు ఎట్టకేలకు ఈ లోకం నుంచి కనుమరుగయ్యారని ఆ ఇద్దరు పిల్లల తల్లి చెన్ మీలిన్ అన్నారు.
జాంగ్ బో, యె చెంగ్‌చెన్‌లకు మరణ శిక్ష అమలు చేసిన రోజే ఒక యూనివర్సిటీ విద్యార్థి వు క్సియియూకి కూడా ఈ శిక్ష అమలు చేశారు. ఈ విద్యార్థి 2015లో తన తల్లిని పదేపదే డంబెల్‌తో కొట్టి చంపేశారని విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి:
- జ్ఞానవాపి మసీదు ప్రాంగణం: వ్యాస్ బేస్మెంట్లో హిందువుల పూజలు.. ఇంతకూ ఇది ఎక్కడుంది? ఈ వివాదం ఎలా మొదలైంది?
- ఇమ్రాన్ ఖాన్‌తోపాటు జైలు శిక్ష పడ్డ మూడో భార్య బుస్రా బీబీ ఎవరు? ఆమె గురించి పాకిస్తాన్లో జరిగే చర్చ ఏమిటి?
- Cervical Cancer: నిర్మల సీతారామన్ 2024 బడ్జెట్లో ప్రస్తావించిన ఈ వ్యాధి ఏమిటి? ఎవరికి వస్తుంది? వ్యాక్సీన్‌తో పూర్తిగా తగ్గించవచ్చా
- చంపయీ సోరెన్: ఝార్ఖండ్ సీఎం అభ్యర్థిగా ఈ నిరాడంబర ఎమ్మెల్యేకు అవకాశం ఎలా వచ్చింది
- వెన్నునొప్పి తగ్గడానికి పనికొచ్చే చికిత్సలేమిటి? ఫలితమివ్వని పద్ధతులేమిటి? నడుముకు బెల్ట్ వాడడం వల్ల ప్రయోజనం లేదా
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)