మరణ శిక్షను ఏయే పద్ధతుల్లో అమలు చేస్తున్నారు?

అమెరికాలో హత్య కేసులో దోషికి నైట్రోజన్ గ్యాస్‌ ఉపయోగించి మరణ శిక్షను అమలు చేశారు. ఇలా నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్ష అనుభవించిన మొదటి వ్యక్తి ఆయనే.

అలబామా రాష్ట్రంలో కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే ఈ ఖైదీకి నైట్రోజన్ గ్యాస్‌ను వినియోగించి ప్రభుత్వం ఈ శిక్షను అమలు చేసింది.

1998 నాటి హత్య కేసులో కెన్నెత్ యూజిన్ స్మిత్ మరణ శిక్ష పడింది.

జపాన్‌కు చెందిన ఓ వ్యక్తికి 36 మందిని కాల్చి చంపినందుకు ఉరి శిక్ష పడింది.

అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల సంఖ్య పెరుగుతోంది.

ఎన్నిదేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది?

  • 55 దేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది.
  • అందులో 9 దేశాల్లో ఎక్కువ మందిని హత్యచేయడం, యుద్ధ నేరాలకు పాల్పడడం వంటి అతితీవ్ర నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధిస్తున్నారు.
  • మరో 23 దేశాల్లో మరణశిక్ష ఉన్నప్పటికీ, గత పదేళ్లలో ఎవరికీ విధించలేదు.

ఏటా ఎంత మందికి అమలు చేస్తున్నారు?

అధికారిక గణాంకాలు, మీడియా కథనాలు, మరణశిక్ష పడిన వ్యక్తులు, వారి కుటుంబ సభ్యులు, వారి ప్రతినిధుల నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఈ గణాంకాలు రూపొందించింది.

మరణ శిక్షల అమల్లో చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉందని ఆ సంస్థ చెబుతోంది. అయితే, మరణశిక్షలకు సంబంధించి చైనా అధికారికంగా వివరాలు విడుదల చేయకపోవడం వల్ల ఆ సంఖ్య ఎంత ఉంటుందనేది చెప్పడం సాధ్యం కాదు.

చైనాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా 2022లో 883 మరణశిక్షలు అమలైనట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది. 2017 నుంచి ఇప్పటివరకు మరణశిక్షల అమలులో ఇదే అత్యధికం.

2022లో ప్రపంచవ్యాప్తంగా 52 దేశాల్లో 2,016 మందికి మరణశిక్ష పడినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

మరణశిక్ష అమలుకు ముందు చాలా మంది ఖైదీలు ఏళ్ల తరబడి, కొన్నిసార్లు దశాబ్దాలుగా జైళ్లలోనే గడుపుతున్నారు.

ఏయే దేశాలు ఎక్కువగా మరణ శిక్ష విధిస్తున్నాయి?

2021లో 18 దేశాలు మరణ శిక్షలు అమలు చేస్తే, 2022లో 20 దేశాలు మరణశిక్షను అమలు చేశాయి.

అధిక సంఖ్యలో మరణ శిక్ష అమలు చేసిన దేశాల్లో చైనాతోపాటు ఇరాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, అమెరికా ఉన్నాయి.

2022లో ఇరాన్ ముగ్గురికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ తెలిపింది.

నేరాలకు పాల్పడినప్పుడు 18 ఏళ్లలోపు వయసు ఉన్న ఐదుగురికి ఇరాన్ మరణశిక్ష అమలు చేసిందని పేర్కొంది.

ఆ 11 దేశాల్లో ఎలా ఉంది?

ప్రపంచంలోని 11 దేశాలు ప్రతి సంవత్సరం మరణశిక్షను అమలు చేస్తున్నాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రధానంగా పేర్కొంది.

అందులో చైనా, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, అమెరికా, వియత్నాం, యెమెన్ ఉన్నాయి.

ఉత్తర కొరియా కూడా మరణ శిక్షను ఏటా అమలు చేసే అవకాశం ఉందని ఆమ్నెస్టీ తెలిపింది. కానీ ఈ విషయాన్ని స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.

సౌదీ అరేబియా గత 30 ఏళ్లలో కంటే, 2022లో ఎక్కువ మందికి మరణశిక్ష అమలు చేసింది.

గత కొన్నేళ్లుగా మరణశిక్ష విధించని ఐదు దేశాలు - బహ్రెయిన్, కొమొరోస్, లావోస్, నైగర్, దక్షిణ కొరియా 2022లో మరణశిక్ష విధించాయి.

2021 నుంచి అమెరికాలో మరణశిక్షల అమలు సంఖ్య పెరిగినప్పటికీ, 1999లో నమోదైన గరిష్ఠ సంఖ్య కంటే తక్కువే.

డ్రగ్స్ నేరాల్లో ఎంత మంది?

2022లో ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ నేరాల్లో 325 మందికి మరణశిక్ష అమలు చేసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.

  • ఇరాన్ - 255 మందికి
  • సౌదీ అరేబియా - 57 మందికి
  • సింగపూర్ - 11 మందికి

దాదాపు 20 ఏళ్ల తర్వాత సింగపూర్‌లో, 2023లో ఒక మహిళకు మరణశిక్ష అమలు చేశారు. సరిడెవి డిజామన్ అనే ఆ మహిళ 2018లో హెరాయిన్ ట్రాఫికింగ్ కేసులో దోషిగా తేలారు.

ఎన్నిదేశాలు మరణశిక్షను రద్దు చేశాయి?

ప్రస్తుతం 112 దేశాల్లో మరణశిక్ష అమల్లో లేదు. ఇలాంటి దేశాల సంఖ్య 1991లో 48గా ఉండేది.

2022లో ఆరు దేశాలు మరణశిక్షను పూర్తిగా, లేదా పాక్షికంగా రద్దు చేశాయి.

కజకిస్తాన్, పపువా న్యూ గినియా, సియెర్రా లియోన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ మరణశిక్షను పూర్తిగా రద్దు చేశాయి.

అతితీవ్ర నేరాలకు మాత్రమే మరణశిక్ష అమలు చేస్తామని ఈక్వటోరియల్ గినియా, జాంబియా తెలిపాయి.

హత్య, ఉగ్రవాదం వంటి అతితీవ్రమైన 11 నేరాలకు తప్పనిసరి మరణశిక్షను ఎత్తివేస్తూ 2023 ఏప్రిల్‌లో మలేషియన్ పార్లమెంట్ నిర్ణయించింది.

2023 జులైలో మరణశిక్షను పూర్తిగా రద్దు చేయాలని ఘనా పార్లమెంట్ తీర్మానించింది.

ఏయే దేశాల్లో మరణశిక్ష ఎలా అమలవుతోంది?

2022‌ డేటా ప్రకారం, తలనరికి మరణశిక్షను అమలు చేసే ఏకైక దేశం సౌదీ అరేబియా. దానితోపాటు ఉరితీయడం, విషపు ఇంజెక్షన్ ఇవ్వడం, కాల్చి చంపడం వంటి పద్ధతులు కూడా అక్కడ అమల్లో ఉన్నాయి.

అమెరికాలోని అలబామా స్టేట్ నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి కెన్నెత్ స్మిత్‌కు మరణశిక్ష అమలు చేసింది.

అలబామాతో పాటు అమెరికాలోని మరో రెండు రాష్ట్రాలు నైట్రోజన్ గ్యాస్ వినియోగాన్ని ఆమోదించాయి. ఎందుకంటే, విషపు ఇంజెక్షన్లలో వినియోగించే మందులను సమకూర్చుకోవడం కష్టతరంగా మారింది.

అమెరికాలో మరణశిక్షల అమలు తగ్గేందుకు మందుల కొరత దోహదం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)