బిల్కిస్ బానో కేసు: 11 మంది దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదు, 2 వారాల్లో వాళ్లంతా జైలుకు వెళ్లాల్సిందే: సుప్రీం కోర్టు

గుజరాత్ అల్లర్ల బాధితురాలు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్, కుటుంబ సభ్యుల హత్య కేసులో దోషులను విడుదల చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దోషులను విడుదల చేస్తూ గతంలో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.

2002లో గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురిని హత్య చేసిన కేసులో దోషులుగా శిక్షకు గురైన వారిని విడుదల చేయడాన్ని బిల్కిస్ బానోతోపాటు పలువురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

ఈ పిటిషన్‌లను విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్వల్ భుయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం గత ఏడాది అక్టోబర్ 12న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

దీనిపై ఇవాళ తీర్పు చెప్పిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఒక పార్టీ అయిన గుజరాత్ ప్రభుత్వానికి దోషులను విడుదల చేసే అధికారం లేదని తెలిపింది.

ఈ కేసును విచారించి, శిక్షలు విధించిన మహారాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే వారిని విడుదల చేసే అధికారం ఉంటుందని స్పష్టం చేసింది.

నిందితులందరూ 2 వారాల్లో జైలు అధికారులను సంప్రదించాల్సిందిగా ఆదేశించింది.

అసలేంటి ఈ కేసు

గుజరాత్‌లో హిందూ-ముస్లింల మధ్య 2002లో చోటుచేసుకున్న ఘర్షణల్లో బిల్కిస్ బానో, ఆమె కుటుంబంపై ఓ హిందూ మూక దాడి చేసింది. ఈ కేసులో నిందితులను కోర్టు దోషులుగా కూడా నిర్ధరించింది.

అత్యాచారం, హత్య కేసుల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆ దోషులు గత ఏడాది విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. వీరికి కొందరు ఆహ్వానం పలకడంతోపాటు వీరిని హీరోలుగా కొనియాడటంపై పెద్దయెత్తున అప్పట్లో నిరసన వ్యక్తమైంది.

75వ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న మహిళలను గౌరవించాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించిన కొన్ని గంటలకే ఈ దోషులను బయటకు విడిచిపెట్టారు.

గోద్రా జైలు వెలుపల ఆ దోషులకు కొందరు స్వాగతం పలకడంతోపాటు స్వీట్లు తినిపించుకోవడం, దోషుల మెడలో దండలు వేయడం లాంటి దృశ్యాలు అప్పట్లో ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యాయి.

క్షమాభిక్ష కోసం దోషులు పెట్టుకున్న అభ్యర్థనకు ఓ ప్రభుత్వ కమిటీ ఆమోదం తెలిపినట్లు దోషుల విడుదల సమయంలో ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

వీరిని 2008లోనే తొలిసారి కోర్టు దోషులుగా నిర్ధరించిందని, జైలులో ఇప్పటికే 14 ఏళ్లకుపైనే వారు గడిపారని, వయసు సత్ప్రవర్తన లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని వారి అభ్యర్థనకు ఆమోదం తెలిపినట్లు కమిటీ వెల్లడించింది.

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్‌లు

దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కలిపి ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణ చేట్టింది. కేసులు దాఖలు చేసిన వారిలో బిల్కిస్ బానో, తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రాలాంటి వారు అనేక మంది ఉన్నారు.

దోషులను విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత బిల్కిస్ బానో ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ఆ నేరస్థులను విడుదల చేయడమనేది చాలా అన్యాయమైన చర్య. దీని వల్ల మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం పూర్తిగా పోయింది’’అని ఆమె అన్నారు.

‘‘నా కుటుంబాన్ని, నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన దోషులు స్వేచ్ఛగా బయటకు వచ్చేశారనే వార్త విన్నప్పుడు షాక్‌కు గురయ్యాను. అసలు ఇప్పటికీ ఏం మాట్లాడాలో తెలియక చాలాసార్లు మౌనంగా ఉండిపోతున్నాను’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

‘‘అసలు ఇలాంటి చర్యలతో ఏ మహిళకైనా ఎలా న్యాయం జరుగుతుంది? మన దేశంలోని కోర్టులను నేను నమ్మాను. ఇక్కడి వ్యవస్థలపై విశ్వాసం ఉంచాను. బాధను అనుభవిస్తూ జీవితం ఎలా గడపాలో నెమ్మదిగా నేర్చుకున్నాను. కానీ, ఇప్పుడు ఆ దోషులను వదిలిపెట్టారనే వార్త న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది’’అని ఆమె వివరించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు. ఎలాంటి భయం లేకుండా, మనశ్శాంతితో జీవించే హక్కును తనకు ప్రసాదించాలని కోరారు.

జీవిత ఖైదు ఎన్ని సంవత్సరాలు?

వాస్తవానికి, జీవిత ఖైదు శిక్ష పడిన ఖైదీ కనీసం 14 సంవత్సరాలు జైలులో గడపాలి. పద్నాలుగేళ్ల తర్వాత నిందితుల ఫైలు పరిశీలనకు వస్తుంది. వయస్సు, నేర స్వభావం, జైలులో ప్రవర్తన మొదలైన వాటి ఆధారంగా వారి శిక్షను తగ్గించవచ్చు.

ఖైదీ తన నేరానికి తగినంత శిక్షను అనుభవించినట్లు ప్రభుత్వం భావిస్తే, అతన్ని విడుదల చేయవచ్చు. చాలా సార్లు ఖైదీలు తీవ్ర అనారోగ్యం కారణాల వల్ల కూడా విడుదలవుతుంటారు.

జీవిత ఖైదు శిక్ష పడిన నేరస్తులకు, వారు చేసిన నేరం చిన్నదైతే ముందుగా విడుదల చేస్తారు. తీవ్రమైన నేరాలలో ఇలాంటివి జరగవు.

బిల్కిస్ బానో కేసులో నిందితులను విడుదల చేయాలంటూ అప్పట్లో గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. అయినా, ప్రభుత్వం వారిని విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)