కొకైన్ గాడ్ మదర్: ముగ్గురు భర్తలను చంపిన ఈ క్రూరమైన మహిళ కథేంటి?

    • రచయిత, యాస్మిన్ రూఫో
    • హోదా, బీబీసీ న్యూస్

"నేను ఎప్పుడైనా ఎవరికైనా భయపడితే, అది గ్రిసెల్డా బ్లాంకోకు మాత్రమే" ఈ మాటలు అన్నది కొలంబియాలో పేరుమోసిన డ్రగ్ మాఫియా లీడర్ పాబ్లో ఎస్కోబార్.

గ్రిసెల్డా బ్లాంకో చాలా క్రూరమైన క్రిమినల్ మైండెడ్ మహిళ. 1970, 80లలో మయామి ప్రాంతాన్ని హడలెత్తించిన వ్యక్తులలో ఆమె ఒకరు. ఆమెకు నచ్చని వ్యక్తులను చంపేసేవారు.

ముగ్గురు భర్తలను చంపిన ఈ 'కొకైన్ గాడ్ మదర్' నిజమైన కథ ఇప్పటికీ మిస్టరీనే. ఇంతకీ ఆమె అంత క్రూరంగా ఎలా మారారు?

1943లో కొలంబియాలో జన్మించిన బ్లాంకో చిన్నతనంలోనే నేర కార్యకలాపాలలో పాల్గొన్నారు.

ఒక ధనవంతుల పిల్లాడిని కిడ్నాప్ చేసి, అతని తల్లిదండ్రులు డబ్బులివ్వకపోవడంతో బాలుడిని చంపేశారని బ్లాంకోపై ఆరోపణలున్నాయి. ఆ సమయంలో గ్రిసెల్డా బ్లాంకో వయస్సు 11 ఏళ్లు.

1964లో 21 ఏళ్ల వయస్సులో బ్లాంకో తన ముగ్గురు పిల్లలు, భర్తతో కలిసి అక్రమంగా న్యూయార్క్‌లో ప్రవేశించారు. అక్కడ గంజాయి అమ్మడం మొదలు పెట్టారు.

1970 నాటికి వచ్చిన పవర్ ఆమెను క్రూరురాలిని చేసింది. గ్రిసెల్డా తన మొదటి భర్తను చంపి, మయామికి వెళ్లారు.

అక్కడ ఆమె తన రెండో భర్త, డ్రగ్ ట్రాఫికర్ అయిన అల్బెర్టో బ్రావోను కలుసుకున్నారు. ఆయన మాదక ద్రవ్యాల అండర్ వరల్డ్‌లోని మరింత లోతులను గ్రిసెల్డాకు పరిచయం చేశారు.

గ్రిసెల్డా క్రూరంగా ప్రవర్తించే తీరు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో ఆమె దుందుడుకు పోకడలు చూసిన వాళ్లకు ఆమె కొద్దిరోజుల్లోనే ఈ మొత్తం నేర సామ్రాజ్యాన్ని నడపగలదని అర్థమైంది.

కొలంబియా నుంచి అమెరికాకు యువతుల బ్రా, లోదుస్తులలో కొకైన్‌ దాచిపెట్టి స్మగ్లింగ్ చేయించేవారు గ్రిసెల్డా.

మయామీ డ్రగ్స్ వ్యాపారంలో మాఫియా మధ్య గొడవల కారణంగా గ్రిసెల్డా మరింత క్రూరంగా మారారు.

భర్త అల్బెర్టో తన డబ్బును దొంగిలిస్తున్నారని గ్రిసెల్డా అనుమానించారు. దీంతో ఆమె 1975లో తన రెండో భర్తను కాల్చి చంపారు.

1983లో తనకు తెలియకుండా కొడుకు మైఖేల్ కార్లియోన్‌తో కలిసి మయామీని విడిచి వెళ్లినందుకు మూడో భర్తను చంపారు.

క్రూరమైన ప్రవర్తన కారణంగా బ్లాంకోను 'బ్లాక్ విడో' అని పిలిచేవారు. 'బ్లాక్ విడో' అనేది సాలీడు జాతికి చెందినది. ఇందులో ఆడ సాలీడు మగ సాలీడును తింటుంది.

1980ల ప్రారంభం నాటికి గ్రిసెల్డా ప్రపంచంలోని అత్యంత ధనవంతురాలైన, క్రూరమైన మహిళల్లో ఒకరు. ప్రతి నెలా అమెరికాకు 1.5 టన్నుల కొకైన్ అక్రమ రవాణా ఆమె కనుసన్నల్లోనే జరిగేది.

1980ల ప్రారంభంలో బ్లాంకో తన సామ్రాజ్యాన్ని విడిచిపెట్టడానికి ప్రత్యర్థి ముఠా దాదాపు రూ. 124 కోట్లు ఆఫర్ చేసినా ఆమె తీసుకోలేదని చెబుతారు.

పురుషాధిక్యత ప్రపంచంలో..

పురుషాధిపత్య పరిశ్రమలో మహిళ పనిచేయడం కష్టం. ఆమె స్థానిక మాదకద్రవ్యాల వ్యాపారులతో డీల్ మాట్లాడటానికి ఒక వ్యక్తిని నియమించుకున్నారు.

ఎందుకంటే అప్పట్లో పురుషుడైతేనే అక్కడ డీల్ ఆమోదం పొందేది.

హత్య కేసులో ఆ వ్యక్తి అరెస్టు కావడంతో ఇక వ్యాపారాన్ని తనే ముందుండి నడిపించాలని గ్రిసెల్డా నిర్ణయించుకున్నారు.

1980 ఏప్రిల్, సెప్టెంబర్ మధ్య దాదాపు 1,35000 క్యూబన్లు అమెరికాకు వలస వచ్చారు. వాళ్లను మారిలిటోస్ అని పిలిచేవారు. వీరిలో కొందరు అప్పటికే క్రిమినల్ గ్యాంగ్స్, మాదక ద్రవ్యాల రవాణా, కాంట్రాక్టు హత్యలకు పాల్పడ్డారు.

గ్రిసెల్డా వారి అవసరాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. వారందరినీ తన గ్యాంగ్‌లో చేర్చుకున్నారు.

వీరితో గ్రిసెల్డా హిట్‌మెన్, పిస్టోలెరోస్ అనే గ్యాంగ్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లు మోటార్ సైకిళ్లపై వచ్చి హత్యలు చేయడంలో ప్రసిద్ధి చెందారు.

"గ్రిసెల్డా ఒక బయటి వ్యక్తి , పనిలోకి బయటి వ్యక్తులనే తీసుకున్నారు. సంపాదించి పెట్టడం, నమ్మకంగా ఉండటం కష్టతరమైన వ్యాపారంలో ఏం సాధించాలనుకుంటున్నారో ఆమెకు ఖచ్చితంగా తెలుసు" అని గ్రిసెల్డాపై నిర్మించిన సిరీస్ సహ-దర్శకుడు ఆండ్రెస్ బేజ్ అన్నారు.

"వాళ్లంతా రకరకాల మనుషులు. సమాజం నిర్దేశించిన ప్రమాణాలకు వాళ్లు సరిపోరు. గ్రిసెల్డాకు అది తెలుసు. కాబట్టి వాళ్లను తన గ్యాంగ్‌లో భాగస్వామ్యం చేశారు" అని అభిప్రాయపడ్డారు.

బ్లాంకో కథ ఎలా ముగిసింది?

1985 ఫిబ్రవరి 17న కొకైన్‌ను తయారీ, దిగుమతి, సరఫరా చేయడం వంటి ఆరోపణలపై గ్రిసెల్డాను ఆమె ఇంటి వద్ద అరెస్టు చేశారు.

ఆమెపై మూడు అభియోగాలు మోపారు. దోషిగా నిర్దరణ కావడంతో, రెండు దశాబ్దాల పాటు జైలు జీవితం గడిపారు గ్రిసెల్డా.

గ్రిసెల్డా జైలులో ఉండగా ఆమె నలుగురు పిల్లలలో ముగ్గురు హత్యకు గురయ్యారు. 2004లో విడుదలయ్యాక ఆమెను కొలంబియాకు తిరిగి పంపారు. గ్రిసెల్డా తన తదుపరి జీవితాన్ని ప్రశాంతంగా గడిపారు.

2012 సెప్టెంబర్ 3న 69 ఏళ్ల వయస్సున్న ఆమెను మెడెలిన్‌లో మోటారు సైకిలిస్టులు కాల్చి చంపారు. తన సామ్రాజ్యంలో హత్యలు ఎలా చేయించేదో అలాగే ఆమె హత్యా జరిగింది.

"2012లో గ్రిసెల్డా ఎవరికీ హాని తలపెట్టని ఒక మహిళ. ఒంటరిగానే బతికారు. ఆమె నలుగురు పిల్లలలో ముగ్గురు చనిపోయారు. ఏమీ లేని పరిస్థితి నుంచి చాలా ఎత్తుకు ఎదిగారు. కానీ, చివరకు ఆమె కథ విషాదాంతమైంది" అని గ్రిసెల్డాపై సిరీస్ రూపకర్త ఎరిక్ న్యూమాన్ బీబీసీతో అన్నారు.

అయితే, చరిత్ర పుస్తకాలలో ఆమెకు ఎక్కువగా స్థానం దక్కలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)