You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ ఏడాది వంద మందికిపైగా విదేశీయులకు మరణ శిక్ష అమలు చేసిన సౌదీ అరేబియా, అందులో భారతీయులు ఎంత మంది ఉన్నారంటే..
సౌదీ అరేబియా ఈ ఏడాది ఇప్పటి వరకు 100 మందికి పైగా విదేశీయులకు మరణ శిక్ష అమలు చేసింది. వార్తా సంస్థ ఏఎఫ్‌పీ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. తాజాగా డ్రగ్స్ రవాణా కేసులో దోషిగా తేలిన ఓ యెమెన్ పౌరుడికి సౌదీలో మరణ శిక్ష అమలు చేశారు.
సౌదీ అరేబియాలో పెరుగుతున్న మరణ శిక్షల పట్ల అమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2024 సెప్టెంబర్‌లో ఆందోళన వ్యక్తం చేసింది.
వార్తా సంస్థ ఏఎఫ్‌పీ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 101 మంది విదేశీయులకు మరణశిక్ష అమలు చేశారు.
2022, 2023లతో పోల్చుకుంటే ఈ సంఖ్య మూడు రెట్లు అధికం అని ఆ నివేదిక తెలిపింది. సౌదీ అరేబియాలో 2022లో 34 మందికి, 2023లో 34 మంది విదేశీయులకు మరణ శిక్ష అమలు చేశారు.
మరణ శిక్షల విషయంలో సౌదీ అరేబియా తీరుపై మానవహక్కుల సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చైనా, ఇరాన్ తర్వాత...
2023లో చైనా, ఇరాన్ తర్వాత సౌదీ అరేబియా ఎక్కువ సంఖ్యలో మరణ శిక్షలు అమలు చేసినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ చెబుతోంది.
సౌదీ అరేబియా తీరుకు వ్యతిరేకంగా మానవ హక్కుల సంస్థలు, హ్యూమన్ రైట్స్ వాచ్ అనేక సందర్బాల్లో నిరసన వ్యక్తం చేశాయి.
సౌదీ అరేబియా 1995లో 192 మందికి (విదేశీయులు, స్వదేశీయులు కలిపి), 2022లో 196 మందికి మరణ శిక్ష విధించింది. 2024లో ఈ సంఖ్య దాటిపోయింది.
“సౌదీ అరేబియాలో మరణ శిక్షల సంఖ్య పెరగడం చూస్తే ఆందోళన కలుగుతోంది. సౌదీ అరేబియా ప్రెస్ ఏజన్సీ లెక్కల ప్రకారం, 2024 సంవత్సరంలో తొలి 9 నెలల్లోనే దాదాపు 200 మందిని ఉరి తీసినట్లు తేలింది. ఇది మూడు దశాబ్దాల్లోనే అత్యధికం” అని అక్టోబర్‌లో మానవ హక్కుల సంస్థలతో కలిసి హ్యూమన్ రైట్స్ వాచ్ ప్రకటించింది.
ఈ ప్రకటన మీద సంతకం చేసిన సంస్థల్లో అమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా ఉంది.
“సౌదీ అరేబియా మానవహక్కుల్ని గౌరవించకుండా మరణ శిక్షలు అమలు చేస్తోంది” అని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రతినిధి ఏగ్నెస్ కల్లామర్డ్ అన్నారు.
“మరణ శిక్ష అనేది అనాగరిక, అమానవీయ శిక్ష. సౌదీ అరేబియా రాజకీయ అసమ్మతివాదులు, డ్రగ్స్ రవాణా చేసిన వారితో సహా అనేక నేరాలకు మరణశిక్షను అమలు చేస్తోంది. తక్షణమే మరణశిక్షను రద్దు చేయాలి. దోషులకు మరణశిక్ష విధించకుండా అంతర్జాతీయ నియమావళి ప్రకారం నిందితులను మళ్లీ విచారించాలి” అని ఆయన అన్నారు.
సౌదీలో ఇప్పటి వరకు మొత్తం 274 మందికి మరణ శిక్ష
సౌదీ అరేబియాలో ఈ ఏడాది మరణశిక్షలు పెరిగాయి. 2024లో ఇప్పటి వరకు మొత్తం 274 మందికి మరణ శిక్షలు అమలు చేశారని ఏఎఫ్‌పీ నివేదిక వెల్లడించింది. వీరిలో విదేశీయులు కూడా ఉన్నారని తెలిపింది.
ఇందులో పాకిస్తానీయులు 21 మంది, యెమెన్‌కు చెందిన వారు 20 మంది, నైజీరియన్లు 20 మంది, 14 మంది సిరియన్లు, 9 మంది ఈజిప్టు పౌరులు, జోర్డాన్‌కు చెందిన వారు 8 మంది, ఇథియోపియన్లు ఏడుగురు ఉన్నారు.
వీరితో పాటు సూడాన్, భారత్, ఆఫ్గానిస్తాన్ నుంచి ముగ్గురు చొప్పున, శ్రీలంక, ఎరిత్రియా, ఫిలిప్పీన్స్ నుంచి ఒక్కొక్కరికి మరణశిక్ష అమలు చేశారు.
డ్రగ్స్ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించడంపై సౌదీ అరేబియా 2022లో మూడేళ్ల నిషేధం విధించింది. దాన్ని 2024లో ఎత్తివేశారు. ఈ ఏడాది డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారికి మరణ శిక్షలు విధించడం పెరిగింది.
ఈ ఏడాది మరణశిక్షలు పడిన వారిలో 92 మంది డ్రగ్స్ రవాణాదారులు ఉన్నారు. వీరిలో 69 మంది విదేశీయులు.
విదేశీయుల మీద నమోదైన కేసుల విషయంలో దర్యాప్తు, కోర్టుల్లో విచారణ సరిగ్గా జరగడం లేదని, కోర్టు పత్రాలు వారికి అందడం లేదని మానవహక్కుల కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
సౌదీ అరేబియాలో విదేశీ ప్రాసిక్యూటర్లు చాలా బలహీనులని యూరోపియన్ సౌదీ ఆర్గనైజేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చెబుతోంది.
“విదేశీయులు డ్రగ్ డీలర్ల చేతుల్లో బాధితులుగా మారడమే కాకుండా, అరెస్ట్ నుంచి శిక్ష పడే వరకు వారికి వారి హక్కుల విషయంలోనూ అనేక ఉల్లంఘనలు జరుగుతున్నాయి” అని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు.
2023లో ఏ దేశం ఎన్ని మరణ శిక్షలు అమలు చేసింది?
అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం, 2023లో చైనా, ఇరాన్, సౌదీ అరేబియా, సోమాలియా, అమెరికాలు అత్యధికంగా మరణ శిక్షలను అమలు చేశారు.
ఇందులో కేవలం ఇరాన్‌లోనే 74 శాతం మరణ శిక్షలు అమలయ్యాయి. సౌదీ అరేబియాలో 15 శాతం ఉన్నాయి.
చైనా మాదిరిగానే నార్త్ కొరియా, వియత్నాం, సిరియా, పాలస్తీనా భూభాగాలు, ఆఫ్గానిస్తాన్ నుంచి అధికారిక లెక్కలు అందలేదని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
మరణ శిక్షను ఎన్ని దేశాలు రద్దు చేశాయి?
మరణ శిక్షను రద్దు చేస్తున్న దేశాల సంఖ్య పెరుగుతోంది.
1991 తర్వాత 48 దేశాలు మరణ శిక్షను రద్దు చేసిన దేశాల జాబితాలో చేరాయి. అదే సమయంలో, 2023లో డెత్ పెనాల్టీ రద్దు చేసిన చేసిన దేశాల సంఖ్య 112కి పెరిగింది.
తొమ్మిది దేశాలు మాత్రం తీవ్రమైన నేరాలకు మాత్రమే మరణ శిక్షను అమలు చేస్తున్నాయి. 23 దేశాలు గత పదేళ్లలో ఒక్కసారి కూడా మరణశిక్ష అమలు చేయలేదు.
మరణ శిక్ష అమలుతో నేరాలు తగ్గుతాయా?
“మరణశిక్షల్ని అమలు చేయడం వల్ల నేరాలు తగ్గుతాయనే అపోహ వల్లనే కొన్ని దేశాలలో ఇప్పటికీ డెత్ పెనాల్టీ అమల్లో ఉంది’’ అని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.
నేరాలను నియంత్రించడంలో మరణశిక్ష ప్రభావవంతంగా లేదని అనేక మంది సామాజికవేత్తలు భావిస్తున్నారు.
నేరం చేస్తే పట్టుబడతాం, శిక్షలు పడతాయి అనే భయం వల్లనే నేరాలను నియంత్రించవచ్చని కొంతమంది చెబుతున్నారు.
హత్య కేసులు, మరణశిక్షల మధ్య సంబంధాన్ని నిర్ణయించేందుకు 1988లో ఐక్యరాజ్య సమితి ఒక సర్వే నిర్వహించింది.
దీన్ని 1996లో అప్‌డేట్ చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)