చనిపోయిన తమ కొడుకుల వీర్యంతో మనవలను కోరుకుంటున్న తల్లిదండ్రులు, ఎక్కడంటే....

    • రచయిత, మైఖేల్ షువల్, అయెషా ఖైరల్లా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

2024 ఏప్రిల్ 6న గాజాస్ట్రిప్‌లో జరుగుతున్న యుద్ధంలో తమ 20 ఏళ్ల కొడుకు రీఫ్ చనిపోయిన విషయం గురించి వివరిస్తున్నప్పుడు ఆయన తండ్రి ఎవి హరుష్ గొంతు వణికింది.

ఈ సమాచారం చెప్పేందుకు ఆయన ఇంటికి వచ్చిన సైనిక అధికారులు ఆయనకు ఓ విషయంలో సలహా కూడా ఇచ్చారు. రీఫ్ శరీరం నుంచి వీర్యాన్ని తీసేందుకు ఇంకా అవకాశం ఉందని, అందుకు ఆయన కుటుంబం సిద్ధమేనా? అని అడిగారు.

ఈ ప్రశ్నకు ఎవి చాలా వేగంగా స్పందించారు. "ఇది మాకు పూడ్చలేని లోటు అయినప్పటికీ అతను బతికి ఉండాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.

"రీఫ్‌కు పిల్లలంటే ఇష్టం. అతనికి పుట్టిన పిల్లలు మాకు కావాలి. ఇందులో మరో మాటకు తావు లేదు" అని ఆయన చెప్పారు.

రీఫ్‌కు పెళ్లి కాలేదు. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అయితే ఎవి తన కుమారుడి కథ గురించి చెప్పగానే రీఫ్ వీర్యంతో బిడ్డను కనేందుకు తాము సిద్ధమంటూ అనేక మంది మహిళలు ఆయనను సంప్రదించారు.

ప్రస్తుతం ఇది తన ‘జీవిత ఆశయం’ అని ఆయన చెప్పారు.

అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి తర్వాత మొదలైన యుద్ధంలో చనిపోయిన సైనికుల వీర్యాన్ని శీతలీకరించి భద్రపరచాలని అడుగుతున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారిలో రీఫ్ కుటుంబం ఒకటి.

గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో ఇప్పటి వరకు 39వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ చెబుతోంది. ఈ యుద్ధంలో 400 మంది ఇజ్రాయెలీలు మరణించారు.

గతేడాది అక్టోబర్ 7 తర్వాత 170 మంది యువకుల నుంచి ఇలా వీర్యాన్ని సేకరించారు. ఇందులో సాధారణ పౌరులతో పాటు సైనికులు కూడా ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ తెలిపింది. అంతకు ముందుతో పోల్చితే ఈ సంఖ్య 15 రెట్లు ఎక్కువ.

ఈ ప్రక్రియలో వృషణాలకు కోత పెట్టి లోపల నుంచి చిన్న కణజాలాన్ని బయటకు తీస్తారు. ఇందులో నుంచి వీర్య కణాలను వేరు చేసి వాటిని ఘనీభవింపజేసి భద్రపరుస్తారు.

వ్యక్తి చనిపోయిన 72 గంటల వరకు అతనిలో వీర్య కణాలు సజీవంగా ఉంటాయి. అయితే 24 గంటలలోపు ఈ కణాలు బయటకు తీస్తే వాటికి సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది.

ఈ ప్రక్రియ అంతా నిర్వహించడానికి చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రులు కోర్టు ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే గతేడాది అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ నిబంధన తొలగించింది.

ఇటీవలి కాలంలో సైన్యంలో ఉన్న తమ పిల్లల్ని కోల్పోయిన కుటుంబాలు ఈ ప్రక్రియకు ముందుకు వస్తున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.

వీర్యకణాలను శీతలీకరించి భద్రపరచడం తేలికే అయినా, భర్తను పోగొట్టుకున్న మహిళలు లేదా బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులు చనిపోయిన వ్యక్తి వీర్య కణాలతో బిడ్డను కనడానికి ముందుకు వచ్చినప్పుడు, చనిపోయిన వ్యక్తి నిజంగానే పిల్లలు కావాలని కోరుకున్నట్లు కోర్టులో నిరూపించుకోవాలి. ఈ వ్యవహారం అంతా కొన్నేళ్ల పాటు సాగుతూ ఉండటంతో పిల్లల్ని పోగొట్టుకున్న కుటుంబాలకు ఇదొక పెద్ద సమస్యగా మారింది.

ఇజ్రాయెల్‌లో తమ కుమారుడి వీర్య కణాలను భద్రపరుచుకున్న తొలి కుటుంబంగా రాచెల్, యాకోవ్ కొహెన్ దంపతులు గుర్తింపు పొందారు. వారి కుమారుడు కీవన్ 2002లో గాజా స్ట్రిప్‌లో పని చేస్తున్నప్పుడు ఓ పాలస్తీనీయన్ స్నైపర్ అతడిని కాల్చి చంపాడని ఇజ్రాయెల్ ఆర్మీ చెబుతోంది.

వారి మనవరాలు ప్రస్తుతం పదేళ్ల వయసున్న ఓషర్ అతని వీర్య కణాల ద్వారా జన్మించింది.

కెవిన్ చనిపోయిన తర్వాత కొన్ని క్షణాల గురించి ఆమె వర్ణించారు. అతడు అక్కడే ఉన్నట్లు తనకు అనిపించిందన్నారు. "నేను మా వాడి వార్డ్ రోబ్ వద్దకు వెళ్లాను. వాడి వాసన కనుక్కునేందుకు ప్రయత్నించారు. వాడి బూట్లు కూడా వాసన చూశాను" అని ఆమె చెప్పారు.

"వాడు ఫోటో నుంచి నాతో మాట్లాడాడు. వాడి వీర్యంతో పిల్లల్ని కనేలా చర్యలు చేపట్టాలని చెప్పాడు. నేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా వ్యతిరేకత వచ్చింది. అయితే తర్వాత కోర్టు చారిత్రక నిర్ణయం తీసుకోవడంతో బిడ్డను కనేందుకు తల్లి కావాలని ప్రకటన ఇచ్చాను." అని ఆమె అన్నారు.

ఇదే అంశంపై స్పందించిన వందల మంది మహిళల్లో ఐరిట్ కూడా ఒకరు. తన కుటుంబ గోప్యతను కాపాడేందుకు ఆమె తన ఇంటి పేరు చెప్పలేదు.

ఆమె ప్రస్తుతం ఒంటరి. తనను ఒక సైకాలజిస్టు, ఒక సామాజిక కార్యకర్త పరీక్షించారని చెప్పారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో గర్భం దాల్చేందుకు చికిత్స తీసుకున్నట్లు తెలిపారు.

"కొంతమంది దైవ నిర్ణయంతో ఆడుకుంటున్నావని అన్నారు. అయితే అదొక పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు." అని ఆమె అన్నారు.

"ఒక పిల్లవాడు తన తండ్రి ద్వారా పుట్టాడా లేక స్పెర్మ్ బ్యాంక్ ‌డొనేషన్ ద్వారా పుట్టాడా అని తెలుసుకోవడానికి కచ్చితంగా తేడా ఉంటుంది." అని ఆమె అన్నారు.

తన తండ్రి సైన్యంలో పని చేస్తూ చనిపోయాడని ఓషర్‌కు తెలుసు. ఆమె గది అంతా డాల్ఫిన్లతో అలంకరించారు. ఆయనకు డాల్ఫిన్లు అంటే ఇష్టమనే విషయం తనకు తెలుసని ఆమె చెప్పారు.

"వాళ్లు ఆయన వీర్యం తీసుకుని ఒక తల్లిని కనుక్కుని నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకు వచ్చారనే విషయం నాకు తెలుసు." అని ఓషర్‌ అన్నారు.

ఓషర్‌కు తల్లిదండ్రుల తరఫు నుంచి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు, మామయ్యలు, అన్నలు ఉన్నారని ఐరిట్ చెప్పారు. తాము ఓషర్‌ను మామూలు వ్యక్తిగానే పెంచుతున్నానని, ఒక సజీవ జ్ఞాపక చిహ్నంగా పెంచడం లేదని ఐరిట్ అన్నారు.

చనిపోయిన సైనికుల వీర్యాన్ని భద్రపరచాలని వారి కుటుంబీకులు కోరుకోవడంలో తప్పేమీ లేదని షమీర్ మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ ఇటాయ్ గట్ చెప్పారు. ఆయన చనిపోయిన వారి నుంచి వీర్యాన్ని సేకరించే సర్జరీలు చేస్తున్నారు.

"చనిపోయిన వ్యక్తి తన వారసత్వాన్ని కొనసాగించడానికి, సంతానాన్ని కనడానికి ఇది ఆఖరి అవకాశం" అని ఆయన చెప్పారు.

ఇటీవలి కాలంలో ఈ ప్రక్రియ పట్ల సమాజంలో సానుకూలత కనిపిస్తోందని ఆయన అన్నారు. అయితే చనిపోయిన వ్యక్తి తల్లిదండ్రుల్లో తండ్రి ఒక్కరే ఉంటే న్యాయపరంగా కొన్ని వివాదాలు ఎదురవుతున్నాయి.

చనిపోయిన వ్యక్తులు తమ వీర్యం ద్వారానే పిల్లలు కనాలని చెప్పినట్లు కోర్టులో నిరూపించడం కష్టంగా మారుతోంది.

"బిడ్డల్ని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవాళ్లు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడం చాలా కష్టం. వారి పిల్లల వీర్యం భద్రపరిచి ఉన్నప్పటికీ కోర్టు అనుమతి లేకుండా వారు దాన్ని సంతానం కోసం ఉపయోగించలేరు." అని డాక్టర్ గట్ చెప్పారు.

"మనం పునరుత్పత్తి గురించి చర్చిస్తున్నాం. ఈ ప్రపంచంలోకి ఒక బాబు లేక పాపను తీసుకు వస్తున్నాం. అది ఒక్కోసారి అనాధ కావచ్చు లేక తండ్రి లేని బిడ్డ కావచ్చు" అని ఆయన అన్నారు.

చనిపోయిన వ్యక్తి స్పష్టంగా తన వీర్యంతో బిడ్డల్ని కనాలని చెప్పినట్లు పక్కాగా ఆధారాలు ఉంటే తప్ప వారి వీర్య కణాలు భద్రపరించేందుకు తాను గతంలో అంగీకరించలేదని డాక్టర్ గట్ తెలిపారు. అయితే ప్రస్తుత యుద్ధంలో బిడ్డల్ని కోల్పోయిన కుటుంబాలను చూసిన తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నానని ఆయన అన్నారు.

"ఇది వారి జీవితాలకు ఒక అర్థాన్ని తీసుకువస్తుంది. కొన్ని సందర్భాల్లో చాలా ఉపశమనం కలిగిస్తుంది." అని చెప్పారు.

టెల్ అవివ్‌లో యూదులకు విలువలు నేర్పే ట్జోహర్ సెంటర్ నడుపుతున్న సంప్రదాయ గురువు యువల్ షెర్లో కూడా చనిపోయిన వ్యక్తి అంగీకారం ముఖ్యమని చెబుతున్నారు.

ఇందులో రెండు ముఖ్యమైన సూత్రాలు ఇమిడి ఉన్నాయని ఆయన వివరించారు. యూదులలో ఒక మనిషి చనిపోయినప్పుడు అతడి శరీరం నుంచి ఏమీ తొలగించకుండా అలాగే పూడ్చి పెట్టడం అందులో ఒకటని చెప్పారు.

వంశ వారసత్వాన్ని కొనసాగించడం ముఖ్యమే అయినా అది శరీరంలో కణజాలాన్ని పాడు చేస్తుందని కొంతమంది మత గురువులు చెబుతున్నారు. అనేక మంది మతపరమైన ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు షెర్లో చెప్పారు.

చనిపోయిన వ్యక్తుల వీర్యం ద్వారా బిడ్డల్న కనడంపై సంపూర్ణ నిబంధనలతో స్పష్టమైన బిల్లును తయారు చేసేందుకు ఇజ్రాయెల్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు చేశారు. అయితే ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి.

వీర్యం ద్వారా బిడ్డల్ని కనే విషయంలో చనిపోయిన వ్యక్తి అంగీకారాన్ని స్పష్టంగా చెప్పాలా లేదా అనే దానిపైన, యుద్ధంలో పోరాడుతూ చనిపోయిన సైనికుడి పిల్లలకు ఇచ్చే ప్రయోజనాలు, ఇలా పుట్టిన వారికి ఇవ్వడంపైనా బిల్లు రూపకర్తల్లో అభిప్రాయభేదాలు వచ్చాయని ఈ ప్రక్రియలో పాల్గొన్న కొంతమంది బీబీసీతో చెప్పారు.

చనిపోయిన వ్యక్తి వీర్యంపై హక్కులు తల్లిదండ్రులకు ఉంటాయా లేక భార్యకు ఉంటాయా అనే దానిపైన, చనిపోయిన వ్యక్తి భార్యకు పిల్లల్ని కనే ఉద్దేశం లేకపోతే పరిస్థితి ఏంటనే దానిపై ఇజ్రాయెల్ మీడియాలో కథనాలు వచ్చాయి.

కొత్త చట్టం అమల్లోకి వస్తే, అది భవిష్యత్‌ అవసరాలకు ఉపయోగపడుతుందని, ప్రస్తుత నిబంధనల ప్రకారం సుదీర్ఘకాలం కోర్టుల్లో పోరాడుతున్న తమ పరిస్థితి ఏంటని ఇప్పటికే తమ పిల్లల వీర్యాన్ని భద్రపరిచిన తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఏది ఏమైనా తన కొడుకు రీఫ్ వీర్యంతో బిడ్డను పొందేవరకు తాను విశ్రమించబోనని ఆయన చెప్పారు.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)