You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: ఇక వాహనం కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్.. అదనంగా చార్జీలు ఏమైనా చెల్లించాలా?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణ ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారీ వెసులుబాటు కల్పించింది. ఇకపై వీటి రిజిస్ట్రేషన్ షోరూమ్ వద్దే చేసేలా ఆదేశాలు ఇచ్చింది.
ఈ పక్రియ తెలంగాణవ్యాప్తంగా జనవరి 24 నుంచి అమల్లోకి వచ్చింది. దీనివల్ల కొత్తగా వాహనాలు కొనుగోలుచేసినవారు రిజిస్ట్రేషన్ కోసం రవాణాశాఖ కార్యాలయాల వద్ద పడిగాపులు పడే పని తప్పనుంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సహా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ సౌకర్యం ఉండగా, తాజాగా తెలంగాణలో అందుబాటులోకి వచ్చింది. కానీ ఎలాంటి అవగాహ కల్పించకుండా నేరుగా ఈ ప్రక్రియను మొదలుపెట్టడంపై ఆటోమొబైల్ డీలర్లు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అసలు షోరూమ్ వద్ద రిజిస్ట్రేషన్లు ఎలా చేస్తారు, ఏయే వాహనాలకు చేస్తారు, ఫైనాన్స్‌లో వాహనం కొనుగోలుచేసేవారికి కూడా ఈ విధానం వర్తిస్తుందా ఇలాంటి పలు సందేహాలపై తెలంగాణ రవాణాశాఖ జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ ఎం.చంద్రశేఖర్ గౌడ్ బీబీసీతో మాట్లాడారు.
సందేహాలు -సమాధానాలు
- కొత్త విధానం ఏ వాహనాలకు వర్తిస్తుంది?
వ్యక్తిగత వాహనాలు అంటే బైకులు, కార్లకు మాత్రమే షోరూమ్‌ల వద్ద రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
- రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారు?
రవాణా శాఖ నుంచి అనుమతి పొందిన డీలర్లందరూ ఈ కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ చేస్తారని జాయింట్ ట్రాన్స్ పోర్టు కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు.
ఇందుకోసం రవాణా శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసింది.
- అదనంగా డాక్యుమెంట్లు సమర్పించాలా?
ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌కు ఏయే పత్రాలు సమర్పిస్తున్నారో అవే సరిపోతాయి. కొత్తవి ఏవీ సమర్పించక్కరలేదు.
షోరూమ్‌లో డీలరు తరఫున వాహనానికి సంబంధించి ఫామ్ 21(సేల్స్ సర్టిఫికెట్), ఫామ్ 22(రోడ్ వర్తీనెస్ సర్టిఫికెట్), ఇన్సూరెన్స్, వాహన కొనుగోలుదారుడి చిరునామా ధ్రువీకరణపత్రం, వాహనం ఫొటోలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఈ పత్రాలను డీలరు నుంచి నేరుగా ఆర్టీఏ కార్యాలయాల్లో సమర్పించాలని అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే రిజిస్ట్రేషన్ నంబరు కేటాయిస్తారు.
ఫైనాన్స్‌లో వాహనాలు కొనుగోలుచేసేవారు ''వాహనం ఫైనాన్స్ పత్రాలపై వాహనదారు సంతకం చేయాలి. అందుకే పత్రాలు నేరుగా సమర్పించాలనే నిబంధన విధించాం. త్వరలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ అయ్యాక ఈ నిబంధనను రవాణాశాఖ సడలించే అవకాశం ఉంది'' అని చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం తీసుసుకువచ్చిన 'వాహన్' పోర్టల్ లో తెలంగాణ చేరాక సమస్యలు పూర్తిగా తొలగిపోయే వీలుందని చెప్పారు.
- ఆర్‌సీ ఎక్కడ ఇస్తారు?
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం మళ్లీ షోరూమ్‌కో లేదా ఆర్టీఏ కార్యాలయానికో వెళ్లక్కర్లేదు. ఆన్‌లైన్‌లో వచ్చిన పత్రాలు పరిశీలించి వెహికల్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను నేరుగా స్పీడ్ పోస్టు ద్వారా వాహనదారుల అడ్రస్‌కు పంపిస్తారు.
కొన్నరోజే రిజిస్ట్రేషన్ పూర్తవుతుందా?
''ఇప్పటివరకు వాహనం కొన్న తర్వాత షోరూంలో టెంపరరీ రిజిస్ట్రేషన్ (టీఆర్) ఇచ్చేవారు. వారం తర్వాత నుంచి 30 రోజుల్లోగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు'' అని హైదరాబాద్‌కు చెందిన వీవీసీ మోటార్స్ షోరూమ్ డీలరు రాజేంద్రప్రసాద్ బీబీసీతో చెప్పారు.
ఇప్పటికే టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించే విధానం బంద్ అయిందని వెల్లడించారు.
వాహనం కొన్నరోజే రిజిస్ట్రేషన్ చేయడమనేది సాధ్యమేనని చంద్రశేఖర్ గౌడ్ వివరించారు.
''వాహనం కొన్నరోజే ఆన్‌లైన్‌లో పత్రాలు ఆప్‌లోడ్ చేసి, వాటిని వ్యక్తిగతంగానూ తీసుకువచ్చి సబ్‌మిట్ చేస్తే అదేరోజు రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వీలుంది, లేదంటే ఒకట్రెండు రోజులు పట్టే అవకాశం ఉంది'' అని తెలిపారు.
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాక, మళ్లీ వ్యక్తిగతంగా వాటిని సమర్పించడం ఎందుకు అనే ప్రశ్నకు ‘‘ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో బేరీజు వేసుకుని, వాటిని సరిచేశాక, ఇలా వ్యక్తిగతంగా పత్రాల సమర్పణను నిలిపివేస్తామని’’ రవాణాశాఖాధికారులు చెబుతున్నారు.
- ఫ్యాన్సీ నంబర్లు బుక్ చేసుకోవచ్చా?
కొత్త విధానంలో ఫ్యాన్సీ నంబర్లను కూడా షోరూమ్‌లో బుక్ చేసుకునే వీలుందని చెప్పారు చంద్రశేఖర్ గౌడ్. మీకు ఫ్యాన్సీ నంబరు కావాలా, రెగ్యులర్ నంబరు కావాలా అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఎంచుకునే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు.
అయితే ఫ్యాన్సీ నంబరును వేలంలో దక్కించుకునే వరకు వేచిఉండాల్సి ఉంటుంది. అప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇందుకు రవాణాశాఖ 20 రోజుల కాలపరిమితిని నిర్ణయించింది. ఈలోగా కొత్త విధానంలో టీఆర్ నంబరును కేటాయిస్తారు.
ఇతర రాష్ట్రాల్లో కొంటే..?
ఇతర రాష్ట్రంలో కొన్న వాహనాలకు ఇక్కడి షోరూమ్ ద్వారా రిజిస్ట్రేషన్‌కు వీలుండదని రవాణా శాఖ చెబుతోంది. అలాంటి సందర్భాల్లో నేరుగా రవాణా శాఖ కార్యాలయాలకే వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
- షోరూమ్‌లో అదనపు ఛార్జీలు కట్టాలా?
షోరూమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం అదనపు ఛార్జీలు కట్టాల్సిన అవసరంలేదని తెలంగాణ రవాణాశాఖ స్పష్టం చేసింది.
రిజిస్ట్రేషన్‌కు చార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చంద్రశేఖర్ గౌడ్ చెప్పారు.
''షోరూమ్‌లో అదనపు చార్జీల వసూలుకు అవకాశం ఉంటుంది. దీని కట్టడికి ఆకస్మిక తనిఖీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది'' అని ఆర్టీఏ అధికారి ఒకరు చెప్పారు.
- సెకండ్ హ్యాండ్ కార్లు, బైకుల రిజిస్ట్రేషన్ షోరూంలో చేయించుకోవచ్చా?
సెకండ్ హ్యాండ్ కార్లు, బైకులు కొనుగోలు చేస్తే కచ్చితంగా ఆర్టీఏ కార్యాలయాలకే వెళ్లి యాజమాన్య వివరాలు మార్పిడి చేయించుకోవాలి. షోరూమ్‌లో సాధ్యం కాదంటోంది రవాణాశాఖ.
ఇక కొత్త విధానాన్ని కొన్నిరోజులు పైలట్ ప్రాతిపదికన అమలు చేసి, తర్వాత పూర్తి స్థాయిలో తీసుకువస్తే బాగుండేదని రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.
''వాహనదారులు ఎక్కడా ఇబ్బంది పడకుండా పూర్తిగా ఆన్‌లైన్ చేయాలి. దళారుల ప్రమేయాన్ని పూర్తిగా నియంత్రించాలి. ఇందుకు ఇంకాస్త సమయం పట్టొచ్చు'' అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)