You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వాహన బీమా పాలసీ ఎలా ఉంటే మీకు మేలు?
- రచయిత, ఐవీబీ కార్తికేయ
- హోదా, బీబీసీ కోసం
వ్యక్తిగత జీవిత బీమా, ఆరోగ్య బీమాతోపాటు వాహన బీమా చాలా ముఖ్యమైనది.
కోవిడ్ పరిస్థితుల వల్ల చాలా కుటుంబాలు వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణానికి మొగ్గు చూపుతున్నాయి. ఈ కారణంగా గత రెండేళ్ళల్లో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి.
ఇతర కారణాలను కూడా పరిగణలోకి తీసుకుంటే, వచ్చే పదేళ్లలో వ్యక్తిగత వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
వాహనాలతోపాటు బీమా తప్పనిసరి. ఈ నేపథ్యంలో బీమా కంపెనీల నిబంధనలు, బీమా తీసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల అవగాహన చాలా ముఖ్యం.
వాహన బీమాలో ముఖ్యమైన అంశాలు
దురదృష్టవశాత్తు వాహన బీమాను క్లెయిం చేసుకునే అవసరం అంటూ వస్తే అతి తక్కువ ఖర్చుతో వాహనాన్ని తిరిగి పొందేలా జాగ్రత్త పడాలి. బీమా సౌకర్యం అటు ప్రమాదాలకు, ఇటు చోరీకి గురైన వాహనాలకూ వర్తిస్తుంది.
చిన్నపాటి ప్రమాదాల నుంచి పెద్ద ప్రమాదాల వరకు సరిపోయేలా కవరేజ్ తీసుకోవాలి. ముఖ్యంగా ‘బంపర్ టు బంపర్ కవరేజ్’ ఉండటం చాలా ముఖ్యం. కొన్ని పాలసీలలో ఇలాంటి వెసులుబాటు ఉండదు.
ప్రీమియం కొంచెం ఎక్కువ అయినా ఏడాదికి కనీసం రెండు సార్లు క్లెయిం చేసుకునే అవకాశం ఉన్న పాలసీ తీసుకోవడం మేలు.
ఏటా వాహనం విలువతోపాటు కవరేజ్ కూడా తగ్గుతుంది. ఈ విషయంలో తగిన రైడర్ చూసుకుని పాలసీ తీసుకోవాలి.
కొన్ని బీమా పాలసీల్లో దెబ్బతిన్న భాగాలకు కేవలం 50 శాతం మాత్రమే పాలసీ ద్వారా అందుతుంది. మిగిలిన మొత్తం పాలసీదారు చెల్లించాలి.
ఇలాంటి విషయాల్లో జాగ్రత్త పడితే ఏదైనా అనుకోని ఘటనలు జరిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో బయటపడవచ్చు.
థర్డ్ పార్టీ బీమా
థర్డ్ పార్టీ బీమా అంటే మన వాహనం వల్ల ఇంకొక వాహనానికి లేదా వ్యక్తికి జరిగిన నష్టాన్ని సదరు బీమా పాలసీ భరిస్తుంది.
భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం కార్ లాంటి పెద్ద వాహనాలకు థర్డ్ పార్టీ బీమా తప్పనిసరి.
కార్ విక్రయించే సమయంలో డీలర్లు ఈ అంశాన్ని పరిగణించి రిజిస్ట్రేషన్ ఖర్చుతో కలిపి బీమా ప్రీమియం కూడా కార్ ఓనర్ దగ్గర తీసుకుంటారు.
ఈ బీమా పాలసీదారు సొంత వాహనానికి జరిగిన నష్టానికి వర్తించదు. అందుకే సొంత వాహనానికి కలిగే నష్టాన్ని భరించేందుకు ప్రత్యేకంగా ఒక బీమా తీసుకోవాలి.
ట్రాఫిక్ పోలీసులు కార్ పత్రాలు తనీఖీ చేసే సమయంలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఎమిషన్ సర్టిఫికెట్ కాకుండా ఈ రెండు పత్రాలు కచ్చితంగా చూపించాలి.
అందువల్ల ప్రమాదాల పరంగా మాత్రమే కాకుండా ట్రాఫిక్ అపరాధ రుసుం లేకుండా ఉండేందుకు థర్డ్ పార్టీ బీమా, సొంత వాహన బీమా రెండూ తప్పకుండా తీసుకోవాలి.
ఐడీవీ అంటే ఏమిటి?
ఇన్సూరెన్స్ డిక్లేర్డ్ వాల్యూ(ఐడీవీ) అని పిలిచే ఈ అంశం వాహన బీమాలో అతి ముఖ్యమైనది. ఇది వాహనం చోరీకి గురైనప్పుడు కూడా ఉపయోగపడుతుంది.
బీమా కంపెనీ ప్రకారం మన వాహనం ప్రస్తుత విలువ ఎంత అనే విషయం ఐడీవీ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ మన వాహనం రిపెయిర్ చేసే స్థితిని దాటేంతగా దెబ్బతింటే అప్పుడు బీమా కంపెనీ ఐడీవీగా లెక్కించిన మొత్తాన్ని మనకు అందజేస్తుంది.
అలాగే మన వాహనం దొంగతనానికి గురైతే బీమా కంపెనీ గరిష్ఠంగా మనకు అందించే మొత్తం ఐడీవీ. అందుకే మార్కెట్లో మన వాహనం విలువ ఎంత అనేది అర్థం చేసుకుని అందుకు తగిన ఐడీవి ఇచ్చే పాలసీ చూసుకోవాలి.
ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వస్తున్న పాలసీలలో ఈ విషయం స్పష్టంగా ఉంటుంది. సాధారణంగా ఐడీవీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కానీ అశ్రద్ధ చేయకుండా జాగ్రత్త వహించడం ముఖ్యం.
నో క్లెయిం బోనస్ అంటే ఏమిటి?
బీమా పాలసీలన్నీ వార్షిక పాలసీలే. ఏదైనా ఏడాది బీమా క్లెయిం లేని పక్షంలో మరుసటి ఏడాది చెల్లించవలసిన ప్రీమియంలో రాయితీ వస్తుంది. దీన్నే ‘నో క్లెయిం బోనస్’ అంటారు.
వివిధ పాలసీల్లో 10% నుంచి గరిష్ఠంగా 25% వరకు నో క్లెయిం బోనస్ అందుబాటులో ఉంటుంది. క్లెయిం లేని పాలసీల్లో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం కూడా సులభం.
నో క్లెయిం బోనస్ ఉన్న పాలసీ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మనం చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది.
గరిష్ఠంగా నో క్లెయిం బోనస్ ఇచ్చే పాలసీలకు ప్రీమియం కొంత అధికంగా ఉంటుంది. చిన్న చిన్న ప్రమాదాలకు బీమా క్లెయిం అవసరం లేకుండా, వాహనదారులు సొంత ఖర్చుతో రిపెయిర్ చేయించుకోవడం ద్వారా నో క్లెయిం బోనస్ పొందవచ్చు.
రైడర్లు తెలుసుకోండి
వాహన బీమాతోపాటు అనేక సేవలను కంపెనీలు అందిస్తున్నాయి. ఇవన్నీ బీమా పాలసీ తీసుకునే ముందు అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కొన్ని కంపెనీలు కేవలం తాము గుర్తించిన సర్వీస్ సెంటర్ ద్వారా మాత్రమే బీమా మొత్తాన్ని క్యాష్ లెస్ రూపంలో అందిస్తాయి.
ఇది కొన్ని సార్లు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వాహనం ఎక్కడైనా ఆగిపోతే సర్వీస్ సెంటర్ దాకా తీసుకువచ్చే విషయంలో కంపెనీలకూ సర్వీస్ సెంటర్ వారికి ఒప్పందాలు ఉంటాయి. ఇవి కూడా పూర్తిగా తెలుసుకుని వాహన బీమా పాలసీ తీసుకోవాలి.
ప్రస్తుతం భారత దేశంలో 32 కంపెనీలు వాహన బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎర్గో, బజాజ్ అలయన్స్, రాయల్ సుందరం లాంటివి బీమా అందించే కొన్ని ప్రముఖ కంపెనీలు.
(గమనిక: ఈ కథనం నిర్దిష్టమైన అంశంపై స్థూలమైన అవగాహన కోసం మాత్రమే. నిర్ణయాలు మీ వ్యక్తిగత ఆర్థిక సలహాదారును సంప్రదించి తీసుకోవాలి.)
ఇవి కూడా చదవండి:
- ‘ఈసీ’ కోళ్లఫారాలు ఎలా పెడతారు? ఒక్కసారి రూ.కోటి పెట్టుబడి పెడితే ఏటా 35 లక్షల వరకు ఆదాయం వస్తుందా?
- ఇజ్రాయెల్ పక్షాన ఉంటూ గాజాకు సాయం చేయడంలో మోదీ ఆంతర్యం ఏమిటి?
- ఎలక్షన్ కోడ్: రూ.50 వేలకు మించి తీసుకెళ్లలేకపోతున్నారా? సీజ్ చేసిన డబ్బు తిరిగి పొందడం ఎలా?
- మొహమ్మద్ షమీ: మా బౌలింగ్ తుపానుకు కారణమదే
- అఫ్గానిస్తాన్: అంతర్యుద్ధం, పేదరికంతో అల్లాడుతున్న తాలిబాన్ల పాలనలో క్రికెట్ ఎలా వికసించింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)