You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: హైదరాబాద్‌లో విపరీతంగా పెరిగిన కార్లు, బైకులు.. వ్యక్తిగత వాహనాలు ఎందుకింతలా పెరుగుతున్నాయి?
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''అబ్బబ్బ.. రోడ్డెక్కితే చాలు వాహనాలు రయ్ రయ్ అంటూ దూసుకెళుతున్నాయి. అసలు రోడ్లు ఖాళీనే లేవు ఇవాళ..''
ఇలాంటి మాటలు వింటుంటాం కదా!
ఈ మాటలు హైదరాబాద్ రోడ్లకు అచ్చుగుద్దినట్లు సరిపోతాయి. కొన్నేళ్లలో హైదరాబాద్ ట్రాఫిక్ అంతగా పెరిగింది మరి!
ఒక్క హైదరాబాద్‌లోనే కాదు, యావత్ తెలంగాణలో రాష్ట్రం ఏర్పడిన నాటితో పోల్చితే వాహనాల సంఖ్య భారీగా పెరిగింది.
2014తో పోల్చితే ఇవి రెండున్నర రెట్లు పెరిగాయి. ఇందులో వ్యక్తిగత వాహనాల వాటానే ఎక్కువ.
వాహనాల పెరుగుదల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుందని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.
వాహనాల పెరుగుదల ఇలా..
ఈ ఏడాది మార్చి 31 నాటికి తెలంగాణలో మొత్తం 1,73,64,507 వాహనాలు ఉన్నట్లుగా తెలంగాణ రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి.
ఇందులో మోటార్ సైకిళ్లు (బైకులు), కార్ల వాటానే ఎక్కువ. కోవిడ్-19 తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం బాగా పెరిగిందని రవాణా శాఖాధికారులు చెబుతున్నారు.
ఇవి కాకుండా గూడ్స్ రవాణా వాహనాలు 6,56,413, ట్రాక్టర్లు, ట్రైలర్లు కలిపి 7,74,659 ఉన్నాయి. వీటికి స్కూలు బస్సులు, స్టేజ్ క్యారియర్లు, ఇతర వాహనాలు అదనం.
2014తో పోల్చితే రెండున్నర రెట్లు పెరుగుదల
ఈ వాహనాల సంఖ్యను 2014లో గమనిస్తే 71,52,803గానే ఉంది. గడచిన 11 ఏళ్లలో ఈ సంఖ్య రెండున్నర రెట్లు పెరిగింది.
ఇందులో కార్లు, మోటార్ సైకిళ్ల పెరుగుదలే ఎక్కువ. కార్లు దాదాపు 8 రెట్లు పెరగ్గా, మోటారు సైకిళ్లు, ఆటో రిక్షాలు, క్యాబ్‌లు కూడా సుమారు రెండున్నర రెట్లు చొప్పున పెరిగాయి.
మన వద్ద ప్రజా రవాణా ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలన్నారు రవాణా రంగ నిపుణులు సీఎల్ఎన్ గాంధీ.
''నగరంలో ఆర్టీసీ బస్సులు సుమారు 9 వేలు మాత్రమే ఉన్నాయి. మెట్రో రైల్ వంటి వ్యవస్థ వచ్చినా అది మూడు రూట్లకే పరిమితమైంది'' అని బీబీసీతో చెప్పారు.
ఆ ప్రభావంతో ప్రజలు వ్యక్తిగత వాహనాలవైపు మళ్లుతున్నారని ఆయన చెప్పారు.
సులువుగా ఫైనాన్స్ లభిస్తుండడంతో వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు గాంధీ.
వ్యక్తిగత వాహనాలు పెరగడం ప్రజా రవాణాపైనా ప్రభావం చూపిందని చెప్పాలి.
హైదరాబాద్ మహా నగరాభివృద్ది సంస్థ (హెచ్ఎండీఏ) 2011 నుంచి 2024 మధ్య నగరంలో రోజూ వాహనాల ట్రిప్పులపై అధ్యయనం చేసింది.
కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్‌లో భాగంగా చేసిన ఈ అధ్యయనంలో ప్రజా రవాణాలో ప్రయాణాలు తగ్గినట్లుగా తేలింది.
గత 14 ఏళ్ల కాలంలో ప్రైవేటు వాహనాలు పెరగగా, ప్రజా రవాణా వాహనాలలో ప్రయాణాలు అదే స్థాయిలో పెరగలేదని హెచ్ఎండీఏ లెక్కలు చెబుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నాటి నుంచి మొదలుకుని తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లలో రవాణా సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, నగరవాసుల రోజువారీ వ్యక్తిగత ప్రయాణాల సంఖ్య ఎలా ఉందనే అంశంపై ఈ అధ్యయనం జరిగింది.
ఇందులో భాగంగా 2011, 2016, 2024లో ప్రజల రోజువారీ వ్యక్తిగత ప్రయాణాలను హెచ్ఎండీఏ లెక్కగట్టింది.
బస్సు ప్రయాణాల పరంగా 2011లో 37.6 లక్షల రోజువారీ వ్యక్తిగత ప్రయాణాలు ఉండగా 2016లో అది 36 లక్షల ట్రిప్పులుగా తేలింది. 2024లో 38 లక్షల ట్రిప్పులుగా ఉంది.
బస్సు ప్రయాణాలు పెరగడంపై తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ప్రభావం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు రవాణా శాఖకు చెందిన అధికారి ఒకరు.
మరోవైపు, 2011, 2016, 2024 మధ్య కారులో వ్యక్తిగత ప్రయాణాల సంఖ్య లేదా ట్రిప్పుల సంఖ్య నాలుగింతలు పెరిగింది. కారుల్లో ప్రయాణాలు చేసేవారు ఎక్కువయ్యారని అధ్యయనంలో తేలింది.
2011లో రోజూ 4 లక్షల రోజువారీ ప్రయాణాలను నగరవాసులు కారుల్లో చేస్తుండగా, 2016 నాటికి ఇది 7.7 లక్షలకు పెరిగింది. అదే 2024 నాటికి 24.3 లక్షలకు పెరిగింది.
మోటారు సైకిళ్లు (బైకులు) పరంగా రోజువారీ ప్రయాణాలు 2011లో 33.4 లక్షలుగా ఉండగా, 2016 నాటికి 51.7 లక్షలకు చేరుకుంది. అదే 2024 నాటికి 69.2 లక్షలకు చేరింది.
''కార్లు కొన్నప్పటికీ మోటారు సైకిళ్లు కొనేవారున్నారు. ఒక మోటారు సైకిల్ ఉన్నా మరో మోటారు సైకిల్ కొనుగోలు చేస్తున్నారు'' అని గాంధీ చెప్పారు.
దానివల్ల ప్రయాణాల సంఖ్య కూడా భారీగా పెరిగిందని చెప్పారు.
హైదరాబాద్ మెట్రో రైల్ 2017 నుంచి అందుబాటులోకి వచ్చింది. నిరుడు 4.8 లక్షల మంది రోజూ మెట్రో ప్రయాణాలు సాగించినట్లుగా హెచ్ఎండీఏ అధ్యయనంలో తేలింది.
జనాభాతో పోల్చితే తగ్గిన బస్సు సేవలు
కార్లు, మోటారు సైకిళ్లు పెరగడంతో ప్రజా రవాణాపై ప్రభావం పడింది. వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడం కారణంగా ప్రజా రవాణాను ఎక్కువ మంది వినియోగించుకోలేదని అధ్యయనం స్పష్టం చేస్తోంది. మొత్తం జనాభాతో పోల్చితే ప్రజా రవాణా (బస్సులు) వినియోగించుకున్న ప్రయాణికుల శాతం తగ్గుతూ వచ్చింది.
2011లో హైదరాబాద్ నగర జనాభాలో 42 శాతం మందికి ఆర్టీసీ బస్సులు సేవలందించగా, 2016 నాటికి 33శాతానికి పడిపోయింది. 2024 నాటికి 25 శాతానికే పరిమితమైందని హెచ్ఎండీఏ అధ్యయనంలో తేలింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)