You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మంత్రగాళ్లంటూ 11మందికి ఉరిశిక్ష - 370 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తీర్మానించిన చట్టసభ
- రచయిత, బెర్నార్డ్ డెబుష్‌మన్ జూనియర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్ర సెనెట్ ఇటీవల ఒక తీర్మానంపై ఓటేసింది. అమెరికా వలస రాజ్యంగా ఉన్న కాలంలో క్షుద్రవిద్యలకు పాల్పడ్డారంటూ శిక్షకు గురైన 12మంది నిర్దోషులని ఈ తీర్మానం పేర్కొంది.
ఆ 12 మందిలో 11మందికి ఉరిశిక్ష పడింది. ఇప్పటికి 370 సంవత్సరాల కిందట ఈ ఘటన జరిగింది.
‘‘అప్పట్లో జరిగింది న్యాయానికి అన్యాయం’’ అంటూ ఈ శిక్షలను కనెక్టికట్ సెనెట్ తన తీర్మానంలో అభివర్ణించింది.
శిక్షలకు గురైనవారి వారసులు, తమ వారిపై అన్యాయంగా ఆరోపణలు చేశారని, మంత్రగాళ్ల జాబితా నుంచి వారి పేర్లను తొలగించాలని సుదీర్ఘ కాలంగా పోరాటం చేస్తున్నారు.
17శతాబ్ధంలో అమెరికాలో అనేమందిని మంత్రగాళ్లు, మంత్రగత్తెలన్న నెపంతో ఉరి తీశారు.
గురువారం కనెక్టికట్ సెనేట్ క్రీ.శ.1600ల మధ్య నుండి 1700 వరకు, అప్పటి ప్రభుత్వాల విచారణలో క్షుద్రవిద్యాలకు పాల్పడిన దోషులుగా తేలిన వారందరూ నిర్దోషులేనని ప్రకటించడానికి ఓటింగ్ నిర్వహించింది. ఈ తీర్మానం 33-1 ఓట్లతో విజయం సాధించింది.
ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన సెనేటర్ రాబ్ సాంప్సన్, "గతంలో మనకు తెలియని కాలంలో ఏం జరిగిందో, ఏది తప్పో, ఏది ఒప్పో ఇప్పుడు నిర్ణయించడం తప్పు అని నేను నమ్ముతున్నా’’ అని అన్నారు.
‘‘అమెరికా చరిత్రను చెడుగా చూపించడానికి ప్రయత్నించే ఇలాంటి తీర్మానాలు నాకు ఇష్టం లేదు’’అని ఆయన అసోసియేటెడ్ ప్రెస్‌తో అన్నారు. ‘‘మన భవిష్యత్తు గురించి నేను ఫోకస్ చేయాలనుకుంటున్నా’’ అన్నారాయన.
కనెక్టికట్ ప్రతినిధుల సభ అంతకు ముందే ఈ తీర్మానాన్ని ఆమోదించింది. ఇందులో 121 ఓట్లు అనుకూలంగా, 30 ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయి.
మంత్రగాళ్ల నెపంతో ఉరిశిక్షకు గురైన వారి వారసులు సీటీ విచ్ ట్రయల్ ఎక్సోనరేషన్ ప్రాజెక్ట్ పేరుతో 2005లో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థ దాదాపు రెండు దశాబ్దాల లాబీయింగ్ తర్వాత ఈ తీర్మానం ఆమోదానికి నోచుకుంది.
న్యూ ఇంగ్లండ్( అమెరికా)లో మొదటి మంత్రగత్తెని ఉరితీసిన 376వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం తమకు ఎంతో సంతోషాన్నిచ్చిందని ఈ సంస్థ సభ్యులు వెల్లడించారు.
"ఈ అధికారిక తీర్మానాన్ని సాధ్యం చేసిన బాధితుల వారసులు, న్యాయవాదులు, చరిత్రకారులు, రెండు పార్టీల శాసనసభ్యులు, ఇంకా అనేకమందికి మా కృతజ్ఞతలు’’ అని సంస్థ సభ్యులు అన్నారు.
మంత్రగాళ్ల విచారణలో బాధితులైన వారి కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, చరిత్రను అందరికీ తెలిపేందుకు ప్రయత్నిస్తామని వారు తెలిపారు. ఈ సంస్థలోని కొందరు సభ్యులు జెనాలజీ టెస్టుల ద్వారా తమ బాధితులైన తమ బంధువులతో ఉన్న సంబంధాన్ని గుర్తించారు.
‘‘ఇది గతంలో చేసిన తప్పులను తెలుసుకునే దశ’’ అని కొందరు కుటుంబం సభ్యులు అన్నారు. ఈ తీర్మానం సెనెట్‌లో ప్రవేశపెట్టడంతో కీలక పాత్ర పోషించిన సౌద్ అన్వర్, తన పూర్వీకులు మంత్రగాళ్ల విచారణ బాధితులని వెల్లడించారు.
గతలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు, "భయం, స్త్రీద్వేషం, మూఢనమ్మకాల కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఇప్పటికీ మంత్రగాళ్లపై జరుగుతున్న ఘోరమైన దాడుల" గురించి ఈ తీర్మానం వల్ల ప్రపంచానికి అవగాహన కలుగుతుందని విచ్ ట్రయల్ ఎక్సోనరేషన్ ప్రాజెక్ట్ భావిస్తోంది.
వలసకాలంలో కనెక్టికట్ ప్రాంతంలో 45మందిపై క్షుద్రవిద్యకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ లెక్కలు తప్పని విచ్ ట్రయల్ ఎక్సోనరేషన్ ప్రాజెక్ట్ రికార్డ్ వాదిస్తోంది.
మసాచుసెట్స్‌లో సేలం విచ్ ట్రయల్స్‌లో సుమారు 200 మందిని నిందితులుగా గుర్తించారు. ఇది 25 మంది ఉరి తీతకు కారణమైంది.
గత ఆగస్టులో ఎలిజబెత్ జాన్సన్ అనే వ్యక్తిని మసాచుసెట్స్ రాష్ట్రం అధికారికంగా నిర్దోషి అని ప్రకటించింది. సేలం విచ్ ట్రయల్స్ లో దోషిగా నిర్ధరణకు గురైన ఆఖరి వ్యక్తి ఎలిజబెత్ జాన్సన్.
అప్పట్లో ఆమెకు మరణశిక్ష విధించగా, తర్వాత ఆ శిక్షను తగ్గించారు. ఆ తర్వాత ఆమె 77 సంవత్సరాలు జీవించింది. ఎలిజబెత్ జాన్సన్ మానసిక వైకల్యంతో బాధపడేవారని చరిత్రకారులు ఇప్పుడు విశ్వసిస్తున్నారు.
క్షుద్రవిద్యాలకు పాల్పడుతున్నారన్న పేరుతో అన్యాయంగా హింసకు, శిక్షలకు గురైన వ్యక్తులను గుర్తించడానికి గతంలో ఇతర దేశాలు కూడా ప్రయత్నించాయి.
1563, 1736 మధ్య క్షుద్రవిద్య ఆరోపణలు ఎదుర్కొన్న 4,000 మంది స్కాట్‌లకు, అందులోనూ ఎక్కువగా మహిళలకు అప్పటి స్కాట్లాండ్ ప్రధాన మంత్రి నికోలా స్టర్జన్ అధికారికంగా క్షమాపణలు చెప్పారు.
అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో దాదాపు 2,500 మందిని ఉరితీశారు.
ఇవి కూడా చదవండి:
- వాత్స్యాయన కామసూత్రాలు: సెక్స్ సమయంలో మీ భాగస్వామిని ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- అరగంటలో అయిదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని సావర్కర్తో ముడిపెట్టారా?
- ICYMI: ఈ వారం తప్పకుండా చదవాల్సిన కథనాలివి
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)