ఫిరాయింపుల నిరోధక చట్టం: ఏపీ, తెలంగాణ నేతలు అనర్హత వేటు నుంచి ఎలా తప్పించుకున్నారు

    • రచయిత, హరికృష్ణ పులుగు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

2023, జులై 2వ తేదీ. ముంబయిలోని రాజ్‌భవన్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

సరిగ్గా అదే సమయంలో ఏక్‌నాథ్ శిందే నాయకత్వంలోని పాలక ఎన్డీయే కూటమికి చెందిన నేతలూ రాజ్‌భవన్‌కు వచ్చారు.

ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏదో సంచలనం జరగబోతోందన్న ఊహాగానాలు సాగాయి. మహారాష్ట్ర రాజకీయాలకు ఇలాంటివి కొత్త కాదు కూడా.

చివరికి అది, శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార ఎన్డీయే కూటమిలో చేరి మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేసే కార్యక్రమానికి వేదిక అన్న విషయం ఆ తర్వాత కాసేపటికే అందరికీ అర్ధమైంది.

శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ పవార్ సహా 9 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

అజిత్ పవార్ నాయకత్వంలోని ఈ తిరుగుబాటు గ్రూపు తమ వెంట 40మందికి పైగా ఎమ్మెల్యేలున్నారని ప్రకటించుకుంది. అటు శరద్ పవార్ వర్గం కూడా మెజారిటీ సభ్యులు తమవైపే ఉన్నారని చెప్పుకుంటోంది.

అంతకు సరిగ్గా ఏడాది ముందు మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న శివసేనలో తిరుగుబాటు లేవదీసి, ఆ పార్టీ నుంచి మెజారిటీ సభ్యులను తన వెంట తీసుకెళ్లిన ఏక్‌నాథ్ శిందే, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమిని అధికారం నుంచి పడగొట్టి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎన్సీపీలో తిరుగుబాటు జరిగి అజిత్ పవార్ నాయకత్వంలోని ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమిలో మంత్రులయ్యారు. అయితే, ఈ తరహా ఘటనలు ఒక్క మహారాష్ట్రలోనే కాదు అనేక రాష్ట్రాలలో, తరచూ జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే పెరుగుతున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గోవా, మణిపూర్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్...ఇలా అనేక రాష్ట్రాలలో ప్రజలు ఎన్నుకున్న నేతలు పక్కపార్టీలలోకి ఇట్టే మారిపోగలుగుతున్నారు.

మరి, ప్రజాతీర్పుకు, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని అనర్హులను చేయాలంటూ 38 ఏళ్ల కిందట తీసుకొచ్చిన ఫిరాయింపులు నిరోధక చట్టం ఏం చేస్తోంది?

గంపగుత్త వ్యూహం

సింగిల్ మెంబర్‌గానో, కొద్దిమందిగానో వెళితే ఫిరాయింపుల చట్టం ప్రకారం వేటు పడటం ఖాయం కాబట్టి, పార్టీ మారాలనే ఆలోచన ఉన్న ప్రజాప్రతినిధులంతా కలిసి, మూడింట రెండు వంతులకు సరిపడే సంఖ్యకు చేరుకున్నాక మరోపార్టీలోకి మారడమో, శాసనసభా పక్షంగా విలీనం కావడమో చేస్తున్నారు. ఇది ఒక ట్రెండ్‌గా మారింది.

అది తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్‌ కావచ్చు. కర్ణాటక, గోవా, మణిపూర్..మరేదైనా కావచ్చు. ఇలా పార్టీ మారిన వారు నిరాటంకంగా తమ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవుల్లో కొనసాగుతున్నారు. కొందరు మంత్రులుగా మారుతున్నారు. ఫిరాయింపులను నిరోధించడానికి చట్టం ఉన్నా, అందులోని వెసులుబాటును వినియోగించుకుంటున్న నేతలు సులభంగా పార్టీలు మారిపోతున్నారు.

‘‘విలీనం క్లాజ్‌ను తప్పుగా అన్వయిస్తున్నారు. ఒరిజినల్ పార్టీలో చీలిక లేకపోయినా, లెజిస్లేచర్ పార్టీ చీలికనే ఒరిజినల్ పార్టీ చీలికగా అన్వయిస్తున్నారు. అది ఫిరాయింపుల చట్టానికి వక్రీకరణ. దీన్ని సుప్రీం కోర్టు సరి చేయాల్సి ఉంది’’ అని మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

మహారాష్ట్రంలో ఎన్సీపీని చీల్చిన అజిత్ పవార్, మరొక పార్టీలో చేరకపోయినా ఎన్డీయే ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి అయ్యారు. మిగిలిన 8మంది మంత్రులయ్యారు.

ఇదే తరహాలో 2019లో గోవాలో కాంగ్రెస్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. స్పీకర్ ఈ ఫిరాయింపును చట్ట ప్రకారం సమర్ధించాల్సి వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం వీరిపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాలేదు.

తెలుగు రాష్ట్రాలలో ఫిరాయింపులు

తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఫిరాయింపులు కొత్త విషయమేమీ కాదు.

2014లో రెండు రాష్ట్రాలు విడిపోయి, సరిపడా ఎమ్మెల్యేలతో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు ఏర్పడినా, అధికార పార్టీలు ఇతర పార్టీల నుంచి ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నుంచి ఫిరాయింపులను ఆహ్వానించాయి.

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 66 మంది ఎమ్మెల్యేలలో 23 మందిని తమవైపు తిప్పుకొంది.

2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే, టీడీపీ ఎమ్మెల్యేలు కొందరు వైసీపీ పార్టీలో చేరకపోయినా, వైసీపీ ప్రభుత్వానికి మద్ధతుగా మాట్లాడుతున్నారు.

ఇటు తెలంగాణలో 2014లో అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి, 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది.

మొదట ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు వెళ్లగా, ఆ తర్వాత 10మంది ఎమ్మెల్యేలు టీడీపీ శాసన సభా పక్షాన్ని టీఆర్ఎస్ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్‌ను కోరడం, ఆయన దాన్ని ఆమోదించడం చకచకా జరిపోయాయి.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ నుంచి చివరకు రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య మాత్రమే టీడీపీ ఎమ్మెల్యేలుగా మిగిలారు.

తెలంగాణలో 2018 ఎన్నికల తర్వాత ఎన్నికైన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు( సండ్ర వెంకట వీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు ) కూడా తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా టీఆర్ఎస్‌ను కోరగా ఆ విలీనం కూడా జరిగిపోయింది.

అదే ఊపులో కాంగ్రెస్ పక్షం నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోయారు. 2018 ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య కేవలం ముగ్గురే ( శ్రీధర్ బాబు, పోడెం వీరయ్య, మల్లు భట్టి విక్రమార్క).

ఇక తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ ఎంపీలు పార్టీని చీల్చి బీజేపీలో విలీనం కావడం కూడా ఇటీవలి చరిత్రే. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు వై.ఎస్.చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, గరికపాటి మోహన్ రావులు భారతీయ జనతా పార్టీలో చేరారు.

ఆరుగురు సభ్యులున్న రాజ్యసభలో నలుగురు మెజారిటీ కాబట్టి తమని ప్రత్యేక వర్గంగా గుర్తించి భారతీయ జనతాపార్టీలో విలీనమయ్యేందుకు అంగీకరించాలని వారు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. తర్వాత వారు బీజేపీలో చేరారు.

స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్ల నుంచే

ఒకప్పుడు పార్టీ ఫిరాయించడమంటే ఒకరిద్దరు ఎమ్మెల్యేలో, ఎంపీలో వేరే పార్టీలోకి మారిపోవడం లేదంటే, మద్ధతుపలకడం ఉండేది. పార్టీ ఫిరాయింపుల చట్టం వచ్చే వరకు అలాంటి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉండేది కాదు. 1960ల నాటికి ఈ ధోరణి బాగా పెరిగిపోయి వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాల అస్థిరత అనే సమస్య తీవ్రమైంది.

1969నాటి చవాన్ కమిటీ నివేదిక, నాలుగో సార్వత్రిక ఎన్నికల తరువాత, మార్చి 1967, ఫిబ్రవరి 1968 మధ్య ఉన్న ఏడాదిలోపు కాలంలో అనేక రాష్ట్రాలలో శాసనసభ్యులు పెద్ద సంఖ్యలో పార్టీని ధిక్కరించినట్లు పేర్కొంది.

మొదటి సార్వత్రిక ఎన్నిల నాటి నుంచి నాలుగో సార్వత్రిక ఎన్నికల నాటికి సుమారు రెండు దశాబ్దాల కాలంలో 542 ఫిరాయింపు సంఘటనలు జరిగితే, కేవలం 1967-68 మధ్య కాలంలోనే కనీసం 438 ఫిరాయింపులు జరిగినట్లు చవాన్ కమిటీ గుర్తించింది.

ఈ రెండు దశాబ్దాలలో 376 మంది ఇండిపెండెంట్ సభ్యుల్లో 157 మంది వేరే పార్టీలకు మారారు. పదవులను ఆశించి ఎక్కువమంది ఫిరాయింపులకు పాల్పడ్డారని కూడా ఈ కమిటీ పేర్కొంది. ఈ కాలంలో వివిధ రాష్ట్రాలలో ఫిరాయించిన 210 మంది శాసనసభ్యులలో 116 మందికి మంత్రి పదవులు దక్కాయి. 1967 నుంచి 1971 మధ్య 142మంది ఎంపీలు, 1900 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారారని రాజ్యసభ టీవీ కథనం ఒకటి పేర్కొంది.

హరియాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన గయాలాల్ అనే ఎమ్మెల్యే వారం రోజుల వ్యవధిలో నాలుగు పార్టీలు మారడం, అందులో ఓకే రోజు మూడు పార్టీలు మారినట్లు తేలడం పార్టీ ఫిరాయింపుల తీవ్రతకు అద్ధం పట్టింది. అప్పటి నుంచే ‘ఆయా రామ్, గయా రామ్’ అనే నానుడి దేశ రాజకీయాల్లో బాగా ప్రసిద్ధి పొందింది.

చట్టానికి మూలాలు

ఫిరాయింపుల సమస్య అరికట్టాల్సిన అవసరాన్ని ఒక ప్రైవేట్ మెంబర్ తీర్మానం వెలుగులోకి తెచ్చింది. 1967 ఆగస్టు 11న అప్పటి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ పెండేకంటి వెంకటసుబ్బయ్య తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ఈ తీర్మానం పార్లమెంటులో ఉండగానే, దిల్లీలో జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌ ( సభాపతుల సదస్సు )లో కూడా ఇదే అంశంపై చర్చ జరిగింది.

ఒక పార్టీ నుంచి ఎన్నికైన శాసన సభ్యులు మరొక పార్టీకి మారడం, దీని కారణంగా ప్రభుత్వాలు అస్థిరంగా మారే పరిస్థితి రావడం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై ఇది చూపించే ప్రభావం మీద ఈ సదస్సులో చర్చించారు.

చివరకు ఇలాంటి వాటిపై చర్యలు తీసుకునే బాధ్యతను, రాజకీయ పార్టీలకు, ప్రభుత్వానికే కట్టబెడుతూ స్పీకర్ల సదస్సు తీర్మానించింది.

చివరకు వెంకటసుబ్బయ్య ప్రవేశపెట్టిన తీర్మానంపై1967 నవంబర్ 24, డిసెంబర్ 8వ తేదీలలో లోక్‌సభలో చర్చ జరిగింది. డిసెంబర్ 8 వ తేదీనే ఈ తీర్మానాన్ని ప్రభుత్వం ఆమోదించింది. ఫిరాయింపుల సమస్యను పరిష్కరించే క్రమంలో సిఫార్సులు చేయడానికి రాజకీయ ప్రతినిధులు, రాజ్యాంగ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ తీర్మానంలో పేర్కొన్నారు.

ఆ తర్వాత అప్పటి కేంద్ర హోంమంత్రి శ్రీ వై.బి. చవాన్ అధ్యక్షతన ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో వెంకటసుబ్బయ్య కూడా ఒక సభ్యుడు. ఈ కమిటీ 1969 ఫిబ్రవరి 18న లోక్‌సభకు తన సిఫార్సులను అందించింది.

ఫిరాయింపులను అడ్డుకునేందుకు అవసరమైన నిబంధనావళిని తయారు చేసేందుకు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీలలోని పార్టీల ప్రతినిధులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది.

1984 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలయింది. 1985 జనవరిలో రాజ్యాంగ 52 వ సవరణ బిల్లుగా లోక్‌సభ ముందుకొచ్చింది. రాజీవ్ గాంధీ హయాంలో రెండు సభల్లో పాయింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదం రావడంతో చట్టమయింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం మార్చి 18 నుంచి అమలులోకి వచ్చింది.

‘‘ఒక పార్టీ నుంచి ఎన్నికైన వ్యక్తి అదే పార్టీకి, దాని సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలన్నది. ఒక రకంగా రాజకీయంగా జవాబుదారీతనం ఉండాలన్నది ఈ చట్టం తీసుకురావడం వెనక ఉన్న ప్రధాన ఉద్దేశం’’ అని ఉస్మానియా యూనివర్సిటీ లా డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్ జీబీ రెడ్డి అన్నారు.

పార్టీ ఫిరాయించిన వ్యక్తి తాను రాజీనామా చేసిన రోజు నుంచి ఏడాది వరకు, లేదంటే అతను రాజీనామా చేసి తిరిగి ఎన్నికయ్యే వరకు ఆ వ్యక్తి మంత్రి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాల నుంచి, ప్రభుత్వ సంస్థల నుంచి జీతం తీసుకునే ఏ పదవినీ నిర్వహించకుండా అనర్హుడిగా ప్రకటించాలన్నదానితో సహా ఈ చట్టంలో పలు నిబంధనలున్నాయి.

ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ప్రధాన నిబంధనలు

అనర్హత ఎప్పుడు పడుతుందంటే

  • ఒక పార్టీకి చెందిన సభ్యుడు తనంతట తానుగా పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నప్పుడు
  • పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా సభలో జరిగిన ఓటింగ్‌లో ఓటు వేసినప్పుడు
  • ఎన్నికల తర్వాత ఒక ఇండిపెండెండ్ సభ్యుడు వేరే పార్టీలో చేరినప్పుడు
  • ఒక నామినేటెడ్ సభ్యుడు, తాను నామినేట్ అయిన ఆరు నెలల తర్వాత ఏదైనా పార్టీలో చేరినప్పుడు

అనర్హత వేటు ఎప్పుడు ఉండదంటే...

  • ఒక పార్టీ నుంచి మూడింట ఒకవంతు వర్గం విడిపోయి వేరే వర్గంగా మారితే...
  • ఒక పార్టీ మొత్తం మరొక పార్టీలో విలీనమైతే, లేదంటే కొత్త పార్టీగా ఆవిర్భవించినప్పుడు అందులో సభ్యులపై
  • ఒకపార్టీ విడిపోయి ఒక వర్గం వేరొక పార్టీలో చేరుతున్నప్పుడు, అందులో చేరడానికి ఇష్టపడక, ప్రత్యేక వర్గంగా కొనసాగదలుచుకున్న సభ్యులపై
  • ఓటింగ్‌లో పాల్గొనడానికి 15 రోజుల ముందు పార్టీ అనుమతి తీసుకుని, ఆ ఓటింగ్‌కు దూరంగా ఉన్న సభ్యులపై

అనర్హత ఫిర్యాదుపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు స్పీకర్‌, చైర్మన్‌లకు ఈ చట్టం కట్టబెట్టింది.

2003 సవరణలు

పదో షెడ్యులు ద్వారా చేర్చిన ఫిరాయింపుల చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ 2003లో ఎన్డీయే ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.

దీని ప్రకారం మూడింట ఒక వంతు సభ్యుల బలంతో ఒక పార్టీ నుంచి విడివర్గం(Split) మారడానికి అవకాశమిచ్చే నిబంధనను తొలగించింది.

అలాగే ఇంకొక పార్టీలో విలీనం కావడానికి కనీసం మూడింట రెండు వంతుల సభ్యులు సుముఖంగా ఉండాలన్న నిబంధనను చేర్చింది.

అయినా, ఫిరాయింపులు ఆగకపోగా, ఫిరాయించే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.

అడ్డుకట్ట వేయలేమా?

ఫిరాయింపులను నిరోధించడమే లక్ష్యంగా తీసుకొచ్చిన చట్టాలు కూడా నిరుపయోగంగా కనిపిస్తున్న దశలో ఈ వ్యవహారంలో సంస్కరణలు అవసరమన్న మాట వినిపిస్తోంది. అయితే, అటు రాజకీయ పార్టీలు, ఇటు సభాపతులు నైతిక నిబద్ధతలకు కట్టుబడి ఉండకపోవడం పెద్ద సమస్యగా మారిందని నిపుణులు అంటున్నారు.

ఫిరాయించిన వారిని ప్రోత్సహించేలా పార్టీలు వ్యవహరించడం, అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం సర్వాధికారాలు ఉన్న సభాపతులు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేయడం ఫిరాయింపుల నిరోధానికి ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు.

‘‘స్పీకర్ దగ్గరకు కంప్లయింట్ వచ్చినప్పుడు దానిపై వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇలాంటి ఫిరాయింపులు కొనసాగే పరిస్థితి ఉంది. కొంతమంది స్పీకర్లు సభా కాలం ముగిసే వరకు నిర్ణయాలు తీసుకోని సందర్భాలున్నాయి. అలాంటప్పుడు చట్టం ఉన్నా లాభం లేదన్న అభిప్రాయపడటంతో తప్పులేదు’’ అన్నారు ప్రొఫెసర్ జీబీ రెడ్డి

‘‘ఫిరాయింపులపై చర్యలకు కాలపరిమితి అంటూ లేకపోవడం, సంకీర్ణ రాజకీయాల కాలంలో సభాపతులు ఏదో ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరించే పరిస్థితులు సమస్యను పెంచుతున్నాయి. అలాగే స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం కూడా కల్పించాల్సి ఉంది’’ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు.

ఫిరాయింపులపై నిర్ణయాలు తీసుకోవడంలో స్పీకర్‌కు బదులు శాసనసభకు చెందిన వారితోనే ఒక కమిటీని ఏర్పాటు చేసి, సత్వర నిర్ణయాలు తీసుకోవడం అవసరమని ప్రొఫెసర్ జీబీ రెడ్డి అన్నారు. లేదంటే ఎన్నికల కమీషన్‌కు ఈ బాధ్యతను అప్పజెప్పడం వల్ల కూడా ఈ సమస్యను పరిష్కరించవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఈ చట్టం ప్రజాస్వామ్య విరుద్ధం’

లోక్‌సత్తా ఉద్యమ నాయకుడు, ఫోరం ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ ఈ చట్టంపై భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది పార్టీ ఫిరాయింపులను ఆపడానికి కాదని, అధినేతల మాటలకు గుడ్డిగా తల ఊపేలా చేసే అప్రజాస్వామిక చట్టమని ఆయన విమర్శించారు.

‘‘అమెరికాలో, బ్రిటన్‌లో కనిపించని ఈ చట్టం ఇక్కడే ఎందుకు ఉంది? పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఇష్టం లేకపోతే అధినేతలు పదవుల నుంచి దింపే తెగువ, ప్రజాస్వామ్య స్ఫూర్తి మన దేశంలో ఉన్నాయా? అధినేతలు పార్టీ పై తమ అదుపును కాపాడుకునేందుకు తయారు చేసిన అప్రజాస్వామిక చట్టం ఇది’’ అని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్న భ్రమలు అవసరం లేదన్నారు.

షాబానో కేసు విషయంలో సొంత పార్టీలో అసంతృప్తిని కూడా అణచివేసి రాజీవ్ గాంధీ నిర్ణయాలు తీసుకున్నారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈ చట్టం అమలులో స్పీకర్లు కీలకపాత్ర పోషించాలని, వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం దని జేపీ అన్నారు. స్పీకర్లు పార్టీ మనుషులుగా ఉన్నంతకాలం ఈ చట్టం అమలు సవ్యంగా సాగదని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)