You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ పోలీసుల ‘రహస్య’ కేసు: ఐపీఎస్‌లకు పాఠాలు చెప్పిన ప్రొఫెసర్ పై తీవ్రవాదం కేసు ఏమిటీ, ఎందుకు వెనక్కు తగ్గారు?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘‘కొట్లాడితే కేసు..నిలబడితే కేసు.. ఊ అంటే కేసు...’’ అంటూ ముఖ్యమంత్రి కాకముందు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రభుత్వ వైఖరిపై కేసీఆర్ చేసిన విమర్శ ఇది.
తెలంగాణ వస్తే మానవ, పౌర హక్కులకు పెద్దపీట వేస్తాననీ, తానే ఒక హక్కుల సంఘం నాయకుడిలా వ్యవహరిస్తానని అప్పట్లో అన్నారు కేసీఆర్. కానీ ఇప్పుడు తెలంగాణలో అందుకు విరుద్ధంగా జరుగుతున్నట్లు కనిపిస్తోందని హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ – ఈ ముగ్గురు ప్రొఫెసర్లు సహా మొత్తం 152 మందిపై ఒక రహస్య కేసు పెట్టారు తెలంగాణ పోలీసులు.
సాధారణంగా వామపక్ష భావజాలంతో చురుగ్గా పనిచేస్తోన్నవారిపై ప్రభుత్వాలు కేసులు పెట్టడం సాధరణమే కానీ, ఏకంగా ఆయుధాల కేసులు పెట్టడం మాత్రం ఇదే మొదటిసారి.
ఇప్పటికే ఏడు ఉపా (UAPA- Unlawful Activities Prevention Act) కేసులు ఎదుర్కొంటోన్న లక్ష్మణ్ మీద కూడా మొదటిసారి ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. సివిల్ సొసైటీలో కీలకంగా వ్యవహరించే హరగోపాల్, పద్మజా షా వంటి వారు, కోర్టుల్లో కేసులు వాదించే ప్రభాకర్, రవీందర్ వంటి వారిపై అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసు పెట్టారు. చిక్కుడు ప్రభాకర్, బళ్ల రవీందర్, నలమాస కృష్ణ, ఖాసిం, పినాకపాణి వంటి పేర్లు ఈ కేసులో ఉన్నాయి.
వీరందరిలో ముఖ్యంగా హరగోపాల్, పద్మజా షాల పేర్లు కేసులో ఉండడంతో ఇది ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది.
అయితే, ప్రొఫెసర్లపై ఆయుధాల కేసు పెట్టడంపై మేధావి వర్గాల నుంచి విస్మయం వ్యక్తం కావడంతో తెలంగాణ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాడ్వాయి కుట్ర కేసులోని ముగ్గురు ప్రొఫెసర్లతో పాటూ ఆరుగురిపై కేసు వెనక్కు తీసుకున్నట్టు ములుగు జిల్లా పోలీసులు శనివారం ప్రకటించారు. అయితే మిగిలిన 146 మందిపై కేసు కొనసాగుతుంది.
‘‘అక్కడ దొరికిన పత్రాల ఆధారంగానే మావోయిస్టు పార్టీ నాయకులు, సానుభూతిపరులు, ఇతరులపై కేసు నమోదు చేశాం. తరువాత విచరాణ చేపట్టాము. విచారణలో భాగంగా పలువురు సాక్షులను విచారించాం. ఆధారాలు సేకరించాం. ఇఫ్పటి వరకూ జరిగిన విచారణలో హరగోపాల్, పద్మజ షా, వి.రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటు రవీందర్, సురేశ్ కుమార్ లకు ఈ కేసులో పాత్ర ఉన్నట్టు ఆధారాలేవీ దొరకలేదు. దీంతో కేసు నుంచి వీరు పేర్లు తప్పించమని కోరుతూ కోర్టులో మెమో దాఖలు చేస్తాం. ఈ కేసులో మిగిలిన విచారణ కొనసాగుతుంది.’’ అని ప్రకటనలో రాశారు.
కేసులపై విమర్శలు
భావజాల పరంగా మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండేవారిపై కేసులు పెట్టడం సహజమే కానీ, ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూనే, నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తులు.. అందునా అకడమిక్ రంగంలో పేరున్న హరగోపాల్, పద్మజల పేర్లు కూడా చేర్చడంపై ఆగ్రహం వ్యక్తమైంది.
ప్రొఫెసర్ హరగోపాల్ ఐపీఎస్ లకు శిక్షణ ఇచ్చే సర్దార్ పటేల్ పోలీస్ అకాడమీ సహా అనేక ప్రభుత్వ సంస్థల్లో కూడా ప్రసంగాలు ఇస్తుంటారు. ఆయనపై కూడా అక్రమ ఆయుధాలు కేసు పెట్టడం మొత్తం వ్యవహారం తీవ్రతను పెంచింది.
సాధారణంగా ఆయుధాల చట్టం కేసులు తీవ్రమైనవి. నిత్యం ప్రజల్లో కనిపించే హరగోపాల్, పద్మజల వంటి వారిపై అక్రమ ఆయుధాల కేసు పెట్టి, కనీసం పది నెలల వరకూ వారికి సమాచారం ఇవ్వకపోవడంలోనే కేసు ఉద్దేశాలు అర్ధమవుతున్నాయని మానవ హక్కుల సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం కావడంతో ప్రొఫెసర్ హరగోపాల్ పై కేసు వెనక్కు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ కి చెప్పినట్టు ప్రధాన మీడియాలో వార్తలు వచ్చాయి. ఇందుకు అనుగుణంగానే ములుగు జిల్లా పోలీసులు ప్రొఫెసర్ హరగోపాల్‌తోపాటు మరో అయిదుగురిపై కేసులను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
అసలు కేసు ఏంటి?
ఈ ఫిర్యాదు 2022 ఆగస్టు 19న ములుగు జిల్లా తాడ్వాయి స్టేషన్లో నమోదయింది. అప్పటి పస్ర స్టేషన్ సీఐ ఫిర్యాదుతో దీన్ని నమోదు చేశారు.
‘‘తానూ కొందరు కానిస్టేబుళ్లూ కలసి తెలంగాణ మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తూండగా, ఉదయం 10 గంటల సమయంలో మావోయిస్టు పార్టీ సభ్యులు ఆలివ్ గ్రీన్ దుస్తులు ధరించి కనిపించారు. పోలీసుల ముందు లొంగిపొమ్మని అడిగినప్పటికీ వారు మా మాట వినకుండా అడవిలోకి పారిపోయారు. వారు సమావేశమైన చోట వివిధ వస్తువులతో పాటూ కొన్ని పుస్తకాలు, నిషేధిత సాహిత్యం దొరికాయి. ఆ పుస్తకంలో మావోయిస్టు పార్టీ అజెండాకు అనుగుణంగా, చురుగ్గా పనిచేస్తోనన్న ప్రజా సంఘాల నాయకులు (ప్రాక్షన్ కమిటీ మెంబర్ల) పేర్లు ఉన్నాయి’’ అంటూ ఫిర్యాదులో రాశారు సీఐ.
సాధారణంగా కేసు పెట్టిన తరువాత విచారణకు పిలుస్తారు. లేదా నోటీసులు ఇస్తారు. లేదా కనీసం కేసు పెట్టినట్టు తెలుస్తుంది. కానీ ఈ కేసు మాత్రం నమోదయి దాదాపు 10 నెలల వరకూ రహస్యంగా ఉండిపోయింది.
ఈ కేసులో ఉన్న ఒక వ్యక్తిపై ఉన్న అన్ని ఫిర్యాదులూ సమర్పించాలని కోర్టు ఆదేశించినప్పుడు, ఆ పత్రాల్లో ఈ కేసు వ్యవహారం బయటపడింది. తమపై ఈ కేసు పెట్టినట్టుగా ఇందులో కనీసం వందమంది వరకూ తెలీదు.
అంతేకాదు.. తెలంగాణ రాష్ట్రంలో చురుగ్గా పనిచేసే 20 సంఘాల పేర్లను, ఆ సంఘాలు, కమిటీల్లో చురుగ్గా ఉండేవారి పేర్లనూ ఆ ఫిర్యాదులో రాశారు.
ఎవరెవరి పేర్లున్నాయి?
- తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ): మద్దిలేటి, మెంచు సందీప్, వేముల అనుదీప్, నూకల స్వాతి, ఎడ్ల కిషోర్, బండారి వెంకటేశ్
- తెలంగాణ విద్యార్థి సంఘం (టీవీఎస్): కోటా శ్రీనివాస్, యండి సమీర్, రషీద్బన్, పెంచాల సతీష్, చింతోజు శ్రీకాంత్, మొడెం రవి, చింతరి సోమన్న, వేగలపు బాలకృష్ణ, జిల్లాల మహేష్
- డెమొక్రటిక్ స్టూడెంట్ యూనియన్ (డీఎస్‌యు): కంచర్ల భద్ర, ఎల్కటూరి అరుణాంక్, జనార్దన్, మంద రంజిత్, కానెపల్లి సిద్ధార్థ
- తెలంగాణ రైతాంగ సమితి (టీఆర్ఎస్): కొల్లూరు సాయన్న, జక్కుల వెంకటయ్య, ధర్మారపు ఎల్లం, చింతల భూపాల్ రెడ్డి, కొండేటి రాజు
- తెలంగాణ డెమొక్రటిక్ ఫోరం: చిక్కుడు ప్రభాకర్, బండి దుర్గా ప్రసాద్, బల్లా రవీందర్, ప్రొ॥ పద్మజా షా, ప్రొ॥ హరగోపాల్, నక్కల నారాయణ,
- కుల నిర్మూలన పోరాట సమితి: భూర అభినవ్, బండారి లక్ష్మయ్య, జయరాజ్, దాసరి చంద్రశేఖర్, కరసాల విజయకుమార్, కొలిమి రాములు, రమేశ్, లింగన్న, బి.కృష్ణ
- తుడుం దెబ్బ: రమణాల లక్ష్మయ్య, వట్టం ఉపేందర్, అధ్యకుడు, గంటా సత్యం, సోయం చిన్నన్న, గుగ్గిల్ల రామస్వామి, గుంపిడి వెంకటేశ్వర్లు
- తెలంగాణ అసంఘటిత కార్మిక సమాఖ్య (టీఎకెఎస్): చీర రవి, బంటు శ్రీనివాస్, భూమ హనుమంతు, కొమ్మురవి, అమరవేణి నర్సాగౌడ్, గుంటి సామ్రాజ్యం, సుద్దాల నాగరాజు
- చైతన్య మహిళా సంఘం: దుబాషీ స్వప్న, సముద్రాల అనిత, పాక జయ, ఇ. జయ, సిపోరా, బన్నూరి జ్యోతి, రేల రాజేశ్వరి, కొల్లూరు పద్మ, సంధ్య, చుక్కల శిల్ప, దొంగరి దేవేంద్ర, ఆత్మకూరు అన్నపూర్ణ
- తెలంగాణ యూత్ ఫోరం: గూడూరు పాండురంగారెడ్డి, పనీకర మొహన్ రాజ్, భూక్య శ్రీనివాస్ @ పొనుగోడు శ్రీను
- అమరుల బంధుమిత్రుల సంఘం (ఏబీఎన్ఎస్): పద్మకుమారి, బోపిడి, అంజమ్మ, జన్ను శాంత, సత్య, కడమంచి నర్సమ్మ, ఆత్మకూరి భవాని
- ప్రజా కళా మండలి (పీకెఎమ్): దండం జాన్, జంప్వూలూరి కోటేశ్వర్ రావు, రాజు నర్సింహ, కొర్రాయి నీలకంఠ, నాగేశ్వర్ రావు
- పీపుల్స్ డెమొక్రటిక్ మూమెంట్ (పీడీఎమ్): మదన్ గారి రాజేశ్వర్ రెడ్డి @ రాజు, చంద్రమౌళి, వీరస్వామి, వై. వెంకటేశ్వర్లు, వెంకటేష్, దుబాషి దేవేందర్, క్రాంతి కుమార్, అంజన్న
- తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్): నుండి కుసుము రవి చంద్ర, నలమాస కృష్ణ, మెంచు రమేశ్
- సివిల్ లిబర్టీస్ కమిటీ (సీఎల్సీ): వి. రఘునాథ్, గడ్డం లక్ష్మణ్, గుంటి రవీందర్, పిఎమ్ రాజు, మదన కుమారస్వామి, నర పురు కోత్తం రెడ్డి, ఆల్గోట్ రవీందర్, జిల్లా లింగయ్య ఎమ్. తిరుమలయ్య,
- కమిటీ ఫర్ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (సీఆర్పీపీ): దశరథ్, మార్తా రామస్వామి, గొలుసుల జాబిలి, ఐత అనిల్, బల్గా స్రవంతి, తెల్లూరి వెంకటేశ్వర్ రావు, బచ్చలకూర సారంగపాణి
- హిందూ ఫాసిస్టు శక్తుల వ్యతిరేక ఐక్య సంఘటన (FAHFO): బూర అభినవ్, వి. సంధ్య, మోహన్ బైరాగి, బండారి విమల @విమలక్క. బెల్లారపు అనురాధ, నార్ల రవి శర్మ
- విప్లవ రచయితల సంఘం నుండి (విరసం): వేలేటి అరవింద్ @ రివేరా, ఎమ్.ఏ. బాసిత్, చింతకింది ఖాసీం, అరసవెల్లి కృష్ణ, పినాక పాణి
- డెమొక్రటిక్ టీచర్స్ ఫోరం (డీటీఎఫ్): ఎమ్.రఘు శంకర్ రెడ్డి, పి.శంతన్, సోమయ్య, వెంకట్ రాములు, వి.రాజిరెడ్డి, టి. లింగారెడ్డి, మందాల గంగాధర్
- ఇండియన్ అసోషియేన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్: జస్టిస్ (రిటైర్డ్) హెచ్. సురేష్, సుధా భరధ్వాజ్, ఎమ్. వెంకన్న, సురేంద్ర గార్లింగ్, అంకిత్ వేల్, సురేష్ కుమార్, అరుణ్ పెరీరా, ఎస్. దశరథ్, ఆర్థి, అమర్ నాథ్ పాండే, బల్లా రవి, గురునాథం, కె.ఎస్.చలం, మహదేవన్, శివ ప్రసాద్ సింగ్,
‘‘నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ కి చెందిన సెంట్రల్ కమిటీ మెంటర్ పుల్లురి ప్రసాదరావు @ చంద్రన్న ఆధ్వర్యములో అతని ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులపై దాడులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలనీ, మారుమూల ప్రాంతములో ఉన్న అమాయక ఆదివాసి యువతను నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ లో చేర్పించడానికి, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పార్టీ కి నిధులు సమకూర్చాలని, రాజకీయ నాయకులను, పోలీస్ వారిని చంపాలని, అలాగే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కులదోసి తుపాకి గొట్టముతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలని ఉద్దేశముతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయుచున్న పైన తెలిపిన మావోయిస్టు పార్టీ అజ్ఞాత నాయకులు, దళ సభ్యులు, మిలీషియా సభ్యులు, ఇంకా నిషేధిత మావోయిస్ట్ పార్టీ అజెండా కు అనుగుణంగా, చురుకుగా పనిచేయుచున్న పై ప్రజా సంఘాల నాయకులు (ప్రాక్షన్ కమిటి మెంబర్లు) పై చట్టరీత్యా చర్యలు తీసుకోగలరని మనవి’’ అంటూ ఫిర్యాదులో రాశారు.
దీంతో వీరిపై కేసు నమోదు చేశారు. క్రైం నంబర్ 15/2022 ఎఫ్ఐఆర్ ప్రకారం ఐపీసీలో 120బీ, 147, 148, రెడ్ విత్ 149, ఉపా చట్టం 10, 13, 18, 20, 38 సెక్షన్లు, ఆయుధాల చట్టం 25 (1-బీ)(ఏ) కింద కేసులు పెట్టారు సదరు ఎస్సై.
తాజాగా వీరిలో ఆరుగురు పేర్లను కేసు నుంచి తొలగించారు.
అసలేంటీ కుట్ర కేసులు:
పూర్వం బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో స్వతంత్ర ఉద్యమకారులపై ఎక్కువగా ఈ కేసులు పెట్టేవారు. స్వతంత్రం వచ్చిన తరువాత మావోయిస్టు ఉద్యమంలో పనిచేసేవారు, వారికి మద్దతిచ్చే వారిపై ఈ కేసులు పెడుతున్నారు.
ప్రభుత్వాన్ని కూల్చడానికి లేదా అస్థిరపరచడాని లేకపోతే ప్రభుత్వంలోని పెద్ద పెద్ద, కీలక వ్యక్తులను చంపడానికి వ్యూహం పన్నడాన్ని కుట్రగా చెబుతారు
ఐపీసీలో ఇందుకు అనుగుణంగా బ్రిటిష్ కాలం నుంచీ ఉన్న సెక్షన్లు కొనసాగుతున్నాయి.
వాటికి అదనంగా త్రీవవాద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆయుధాల చట్టాలను కూడా కలిపి కేసులు నమోదు చేస్తుంటారు పోలీసులు.
అయితే, చాలా సందర్భాల్లో పోలీసులు ఈ సెక్షన్లను కొందరిని అదుపు చేయడానికి ఉపయోగిస్తున్నారని పౌర హక్కుల సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఆ క్రమంలోనే పోలీసులు పెట్టిన చాలా కుట్ర కేసులు వీగిపోతూ ఉంటాయి.
వామపక్ష ఉద్యమాలు, వాటికి మద్దతుగా ఉండేవారిపై పదుల సంఖ్యలో వ్యక్తులపై ఒకేసారి కేసు పెట్టడం ఈ కుట్ర కేసుల లక్షణం. పాత రోజుల్లో పార్వతీపురం కుట్రకేసు (1970), సికిందరాబాద్ కుట్ర కేసు (1974), రాంనగర్ కుట్ర కేసు (1986), ఔరంగాబాద్ కుట్ర కేసు వంటివి చాలా ప్రసిద్ధిగాంచిన కుట్ర కేసులు.
వీటిల్లో ఒక్కో కేసులో వందేసి మంది పేర్లను పోలీసులు రాస్తారని, వారికి సంబంధం ఉందా లేదా అన్నది కూడా లెక్క ఉండదనీ, తరువాత ఏళ్ల తరబడి కోర్టుల్లో తిరిగాక అప్పుడు కేసులు తేలతాయని ప్రజాసంఘాల నాయకులు అంటున్నారు.
‘‘ప్రజా సంఘాలు అసలు ఉండకూడదు అనేది ప్రభుత్వాల ఉద్దేశం. మోదీ వచ్చాక కొత్తగా అర్బన్ నక్సల్ అనే ముద్ర వేశాడు. తెలంగాణలో కేసీఆర్ కూడా అంతే. తెలంగాణ రాగానే 2015లో గద్వాలలో నాగరాజు నుంచి మొదలు ఇప్పటి వరకూ ఇలాంటి కుట్ర కేసులు ఎన్నో పెడుతూనే ఉన్నారు. అమిత్ షా ఒక అడుగు ముందుకేసి అసలు 2024 ఎన్నికల నాటికి ఛత్తీస్‌గఢ్‌లో ప్రజ సంఘాలను లేకుండా చేస్తానని ఈ జనవరిలో బహిరంగంగా ప్రకటించారు.
నిర్బంధం విషయంలో మోదీ-కేసీఆర్ ఒకటే. అసలు ఈ ఉపా (తీవ్రవాద నిరోధ చట్టం) కేసుల్లో శిక్ష పడేది కేవలం 1 శాతమే. అయినా కావాలని బెదిరించడానికి, జైల్లో ఉంచడానికి దీన్ని వాడుతున్నారు. వరవరరావును నిర్బంధించి ఐదేళ్లు అవుతోంది. నా మీదే ఏడు ఉపా కేసులు ఉన్నాయి’’ అని ప్రొఫెసర్ లక్ష్మణ్ చెప్పారు.
బెదిరింపులే కాదు....అరెస్టులూ జరిగాయి:
అయితే ఇది కేవలం బెదిరించే, అదుపులో ఉంచే కేసే కాదు. ఇదే కేసులో అరెస్టులు కూడా చూపించారు పోలీసులు. దీనిపై ములుగు ఎస్పీ గౌస్ ఆలం బీబీసీతో మాట్లాడారు.
‘‘మాకు కూంబింగ్ సమయంలో దొరికిన పత్రాల ఆధారంగానే కేసు పెట్టాం. వాటిని పరిశీలించినప్పుడు పలువురు వ్యక్తులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, వారికి సాయం చేస్తున్నారనీ తెలిసింది. అందుకే కేసు పెట్టాం. కేసు విచారణ సాగుతోంది. అందులో ఆధారాలు దొరికి కొందరిని ఇప్పటికే అరెస్టు చేశాం. ఈ కేసులో అరెస్టు అయిన వారంతా దాదాపు పీటీ వారెంట్ మీద అరెస్టయిన వారే. మిగతా వారిమీద విచారణ సాగుతోంది’’ అని ఎస్పీ గౌస్ ఆలం అన్నారు.
కేసు పెట్టినట్టు కేసులో ఉన్న వారికి సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించినప్పుడు ‘‘మాకు మావోయిస్టుల దగ్గర దొరికిన పత్రాల్లో పేర్లు తెలిశాయి. ఇంకా విచారణ చేయాలి. వారంతా ఎక్కడుంటారు, వారి కాంటాక్టు నంబర్లు మాకు ఇంకా తెలియవు. అన్ని వివరాలూ ఉండటానికి ఇది ఎవరో వచ్చి ఇచ్చిన ఫిర్యాదు కాదు కదా’’ అన్నారు ఎస్పీ గౌస్.
ప్రొఫెసర్ హరగోపాల్ సహా ప్రొఫెసర్లపై ఆయుధాల చట్టం కింద, తీవ్రవాద నియంత్రణ చట్టం కింద కేసు పెట్టడం గురించి బీబీసీ గౌస్ వద్ద ప్రస్తావించింది.
‘‘అక్కడ దొరికిన పత్రాల్లో ఉన్న పేర్లే మేం పెట్టాం. అక్కడ ఎవరి పేరు ఉంటే కేసులో వారి పేరు పెట్టాం. మాకు ప్రత్యేకంగా ఏ ప్రొఫెసర్ గురించీ తెలియదు. విచారణలో తేలిన విషయాన్ని బట్టి చర్యలుంటాయి’’ అన్నారాయన.
ఇవి కూడా చదవండి
- కెనడాలో భారతీయ విద్యార్థులు ఎలా మోసపోయారు... విదేశాల్లో చదువుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి
- ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)