You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కేరళ: ఏ తప్పూ చేయకున్నా 54 రోజులు జైలు... వ్యక్తి జీవితంతో ఆడుకున్న 'సీసీటీవీ ఫోటో'
- రచయిత, అష్రఫ్ పదన్న
- హోదా, బీబీసీ ప్రతినిధి
కేరళకు చెందిన ఓ వ్యక్తి దొంగతనం కేసులో 54 రోజులు జైలు జీవితం గడిపాడు. తర్వాత కోర్టులో అతను నిర్దోషిగా నిరూపణ అయినప్పటికీ, అప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నారు. తనకు జరిగిన నష్టానికి ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్నారు.
2018లో కేరళకు చెందిన వీకే తాజుద్దీన్‌ను పోలీసులు సీసీటీవీ ఫోటో ఆధారంగా నెక్లెస్ దొంగగా భావించి అరెస్ట్ చేశారు.
నేరం జరిగిన సమయంలో తాజుద్దీన్ ఆ ప్రదేశంలో లేడని తెలిసినప్పటికీ, ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు నిజమైన నేరస్థుడిని పట్టుకుని ఆయనను నిర్ధోషిగా నిరూపించుకోగలిగారు.
తాజుద్దీన్ కేసు అసాధారణమైతే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌లో ఒక రోజువారీ కూలీ మరణానికి పోలీసుల చిత్రహింసలే కారణమనే ఆరోపణలున్నాయి.
బహుశా అస్పష్టమైన సీసీటీవీ ఫుటేజీల కారణంగా కూలీ అరెస్టయ్యిండొచ్చు. (పోలీసులు ఈ ఆరోపణలను ఖండించారు).
కూలీ మృతి సంఘటన ఆగ్రహాన్ని రేకెత్తించింది. అదే సమయంలో ఇండియాలో భద్రతా కెమెరాలు, ఇతర నిఘా సాధనాల వినియోగం వేగంగా పెరగడం చర్చలకు తావిచ్చింది.
నేరాలను ఛేదించేందుకు చట్టాన్ని అమలు చేసే సంస్థలు సీసీటీవీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఆశ్రయిస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరిగే అవకాశం ఉందని కార్యకర్తలు హెచ్చరించారు.
తాజుద్దీన్ ఎదుర్కొన్న ఘటనలు ఆయన్ను చిదిమేశాయి. తాజుద్దీన్ నిర్దోషి అని తేలడంతో, ఆయన్ను అరెస్టు చేసిన పోలీసు అధికారిని బదిలీ చేశారు. జీతం పెంపుదలను నిలిపివేశారు. అయితే ఈ శిక్షపై తాజుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు పరిహారం ఇవ్వాలని కోర్టులో తాజుద్దీన్ పోరాడుతున్నారు.
ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ షెవ్లిన్ సెబాస్టియన్‌తో తన కథను ఆయన పంచుకున్నారు. తాజుద్దీన్ కథ విని, పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నట్లు సెబాస్టియన్ చెప్పారు.
"అతనికి అలా జరిగితే, నాకు కూడా జరుగుతుందని అనుకున్నా'' అని తెలిపారు సెబాస్టియన్. దీంతో తాజుద్దీన్ కథను సెబాస్టియన్ సహ రచయితగా పుస్తకం రాశారు.
అసలేం జరిగింది?
తాజుద్దీన్ ఖతార్‌లోని దోహాలో రెంట్-ఎ-కార్ వ్యాపారం చేస్తున్నారు. కూతురి పెళ్లి కోసం 15 రోజులు సెలవుపై కేరళ వచ్చారు.
అయితే తాజుద్దీన్ కష్టాలు తన కుమార్తె వివాహం జరిగిన రెండు రోజుల అనంతరం 2018 జూలై 10న జరిగిన విందులో పాల్గొని కుటుంబంతో కలిసి ఇంటికి వస్తున్నప్పుడు ప్రారంభమయ్యాయి.
"ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరగడంతో నేను సంతోషంలో మునిగితేలాను, కానీ అకస్మాత్తుగా జీవితం నరకంగా మారింది" అని తాజుద్దీన్ గుర్తుచేసుకున్నారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి సమీపంలో చేరుకోగానే తాజుద్దీన్ కోసం పోలీసులు వేచి ఉన్నారు.
తాజుద్దీన్‌ను కారు నుంచి బయటకి దిగాలని పోలీసులు అడిగారు. అదే సమయంలో సీసీటీవీ ఇమేజ్‌లో ఉన్న వ్యక్తిని గుర్తించాలంటూ తాజుద్దీన్ భార్య నసీరాను పోలీసులు కోరారు.
"బయట చీకటిగా ఉంది. నసీరా గందరగోళ పడింది" అని తాజుద్దీన్ గుర్తుచేసుకున్నారు.
"ఆయన మాదిరే ఉన్నారని పోలీసులకు చెప్పింది" అని తాజుద్దీన్ తెలిపారు.
పోలీసులు వెంటనే ఆయనను తమ వాహనంలో ఎక్కించుకొని స్టేషన్‌కు తీసుకెళ్లారు.
తాజుద్దీన్‌ను దొంగగా నిరూపించేలా భార్య సాక్ష్యం..
"నా భార్య, పిల్లలు ఏం జరుగుతుందో నమ్మలేకపోయారు" అని తాజుద్దీన్ చెప్పారు.
ఒక మహిళ మెడలోని బంగారు హారాన్ని(నెక్లెస్) దొంగిలించారని నిరూపించేందుకు నసీరా వాంగ్మూలాన్ని సాక్ష్యంగా ఉపయోగిస్తున్నారని కుటుంబసభ్యులు తర్వాత గ్రహించారు.
గడ్డంతో ఉన్న వ్యక్తి తెల్లటి స్కూటర్‌పై వెళ్తున్నట్లు సీసీటీవీలో కనిపించింది. మొదటిసారి చూసినపుడు తనలాగే అనిపించాడని కూడా తాజుద్దీన్ చెప్పారు.
తన కూతురి పెళ్లికి, ఇల్లు కట్టడానికి డబ్బు అవసరమని (దీని కోసం అతను తన పొదుపును ఉపయోగించానని చెప్పారు) అతను నెక్లెస్‌ను దొంగిలించాడని పోలీసులు ఆరోపించారు.
మరోవైపు నెక్లెస్ అపహరణకు గురైన మహిళ కూడా తాజుద్దీన్‌నే దొంగగా గుర్తించారు.
నేరం జరిగిన సమయంలో తాజుద్దీన్ ఆ ప్రదేశంలో లేడని నిరూపించే బలమైన సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సమయంలో తాజుద్దీన్, అతని కుటుంబం తన బ్యూటీ పార్లర్‌లో ఉన్నారని ఒక మహిళ చెప్పారు.
పట్టుకుంది సరైన వ్యక్తిని కాదని సాక్షి అన్నారు. కానీ పోలీసులు "కేసును మూసివేసే తొందరలో ఉన్నారు" అని తాజుద్దీన్ తెలిపారు.
"నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పోలీస్టేషన్‌లో నన్ను చూడటానికి వచ్చిన నా భార్యాపిల్లలతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు" అని తాజుద్దీన్ గుర్తుచేసుకున్నారు.
తనను స్టేషన్‌లో చిత్రహింసలు పెట్టారని తాజుద్దీన్ ఆరోపించినప్పటికీ, కోర్టులో వాటిని నిరూపించలేకపోయారు. దీంతో 54 రోజులు ఆయన జైల్లో గడిపారు.
తాజుద్దీన్ నిర్దోషి అని ఎలా నిరూపించగలిగారు?
తాజుద్దీన్ ఇంటికి వచ్చినపుడు 23 కేజీలు తగ్గారు. చుట్టుపక్కల వాళ్లు ఏదైనా అంటారని అక్కడి ఇంటి నుంచి మరోచోటికి మారారు.
తన ఏడేళ్ల కొడుకు స్కూలుకు వెళ్లడం మానేశాడు.
సీసీటీవీలో కనిపించే చిత్రం తాజుద్దీన్‌ను పోలినట్లు ఉందని, సొంత కుటుంబ సభ్యులు కూడా అతన్ని దొంగగా గుర్తించారని కోర్టులో ప్రాసిక్యూటర్లు వాదించారు.
ఇక తాజుద్దీన్ ఆశలు వదులుకుంటున్న సమయంలో, ఆయన స్నేహితులు న్యాయం చేయాలంటూ దోహాలో ఆన్‌లైన్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
వారి ప్రయత్నాలు ఫలించి చివరికి అసలు దొంగను గుర్తించగలిగారు. ఆ దొంగ అప్పటికే మరో కేసులో అరెస్టై జైలులో ఉన్నారు.
వెంటనే తాజుద్దీన్ కుటుంబం కేరళ సీఎం, పోలీసు ఉన్నతాధికారులను కలిసి కేసును మరో అధికారితో విచారణ జరిపించాలని కోరారు.
ఆ తర్వాత పోలీసులు దొంగతనానికి ఉపయోగించిన స్కూటర్, నెక్లెస్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రూ. 1.4 కోట్ల నష్ట పరిహారం కోరుతూ కోర్టుకు..
తాజుద్దీన్ నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ, ఆయన్ను పీడకల వెంటాడుతూనే ఉంది.
ఆయన అరెస్టైన ఏడు నెలల తర్వాత మాత్రమే ఖతార్‌కు తిరిగి వెళ్లగలిగారు.
అయితే, అప్పటికే ఆయన కంపెనీ యజమాని "పరారీ" అని ఆరోపిస్తూ కేసుపెట్టారు. దీంతో తాజుద్దీన్‌ను బహిష్కరించి, మళ్లీ ఖతార్‌లోకి ప్రవేశించకుండా నిషేధించారు.
ఇక తాజుద్దీన్, అతని కుటుంబం అవమానాల నుంచి బయటపడటానికి కేరళను విడిచిపెట్టారు.
వారు ఇప్పుడు కర్ణాటకలో నివసిస్తున్నారు. తాజుద్దీన్ బట్టల వ్యాపారం చేస్తున్నారు.
మరోవైపు తనకు రూ. 1.4 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ పోలీసులపై తాజుద్దీన్ కోర్టులో దావా వేశారు.
పోలీసులు తప్పుగా అరెస్టు చేసిన వ్యక్తుల బాధలను కొత్త పుస్తకం అందరి దృష్టికి తీసుకువస్తుందని ఆయన ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అటల్ బిహారీ వాజ్‌పేయి: హిందుత్వ జాతీయవాద రాజకీయాలను ఆమోదయోగ్యంగా మార్చిన నేత
- భారత పార్లమెంట్ కొత్త భవనాన్ని మహాత్మాగాంధీని జీవితాంతం వ్యతిరేకించిన సావర్కర్ జయంతి రోజున ప్రారంభిస్తారా?'
- బిహార్: షేర్షాబాదీ ముస్లిం అమ్మాయిలకు పెళ్ళి చేయడం ఇప్పటికీ చాలా కష్టం, ఎందుకంటే...
- జీ20 సదస్సు: కశ్మీర్లో ఆర్టికల్-370 రద్దు తర్వాత ఈ నాలుగేళ్ళలో ఏం మారింది?
- మానవ శరీరంలో ప్రకృతి చేసిన 'డిజైనింగ్ తప్పులు'
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)