ధన్యవాదాలు
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
విధి నిర్వహణలో ఉండగా రాజేశ్ దాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఒకరు 2021లో ఆరోపించారు.
బీబీసీ తెలుగు లైవ్ పేజ్ ఇంతటితో సమాప్తం. మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తా విశేషాలతో రేపు మళ్లీ కలుద్దాం...గుడ్ నైట్
లైంగిక ఆరోపణల కేసులో సస్పెండైన తమిళనాడు స్పెషల్ డీజీపీ రాజేష్ దాస్‌ను విల్లుపురం చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు దోషిగా నిర్ధరించింది. ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.
తీర్పు అనంతరం కోర్టు రాజేష్ దాస్‌కు బెయిల్ మంజూరు చేసింది. తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి 30 రోజుల గడువు ఇచ్చింది.
విధి నిర్వహణలో ఉండగా రాజేశ్ దాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని మహిళా ఐపీఎస్ అధికారి ఒకరు 2021లో ఆరోపించారు. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది.
ఈ కేసును విచారించిన కోర్టు రాజేశ్ దాస్‌ను దోషిగా తేల్చింది.
బాపట్ల జిల్లా రాజోలులో ట్యూషన్ కి వెళ్లి వస్తున్న విద్యార్థిపై మరో యువకుడు దాడి చేశాడు. పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాధితుడి హాహాకారాలు విని స్థానికులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
చెరుకుపల్లి పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం మండలంలోని ఉప్పలవారిపాలెం గ్రామానికి చెందిన అమర్నాథ్ అనే విద్యార్థికి, వెంకటేశ్వర్ రెడ్డితో కొంతకాలంగా వివాదం ఉంది. అమర్నాథ్ సోదరిని వెంకటేశ్వర్ రెడ్డి వేధిస్తున్నాడంటూ నిలదీయడంతో ఇది మొదలయ్యిందని మృతుడి బంధువులు చెబుతున్నారు.
అప్పటి నుంచి కక్షపెట్టుకుని శుక్రవారం ఉదయం ట్యూషన్ కి వెళ్లి వస్తున్న అమర్నాథ్‌ని రెడ్లపాలెం వద్ద ఆపి, మరికొంతమంది తన స్నేహితులతో కలిసి వెంకటేశ్వర్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయారు.
బాధితుడి కేకలు విని అక్కడికి వచ్చిన స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే తీవ్ర గాయాలు కావడంతో గుంటూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా ప్రాణాలు విడిచాడు.
ఈ ఘటనపై చెరుకుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. అమర్నాథ్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (ఎన్‌ఎంఎంఎల్) పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పేరు మార్పు విషయాన్ని తెలియజేస్తూ పీఐబీ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ ప్రత్యేక సమావేశంలో ఈ మెమోరియల్ పేరును ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ సొసైటీకి వైస్ చైర్మన్ అయిన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం జరిగింది’’ అని పత్రికా ప్రకటనలో తెలిపింది.
‘తీన్ మూర్తి కాంపౌండ్‌లో ప్రధానమంత్రులందరికీ అంకితం చేసేలా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి ప్రతిపాదించారు. 2016 నవంబర్ 25న ఈ ప్రతిపాదనను ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదించారు. ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియాన్ని సందర్శించేందుకు 2022 ఏప్రిల్ 21న ప్రజలకు అనుమతి కల్పిస్తున్నారు’ అని తెలుపుతూ పీఐబీ తన ప్రకటనను విడుదల చేసింది.
ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం ప్రజాస్వామ్య విలువలకు దేశం కట్టుబడి ఉందన్న విషయాన్ని తెలియజేస్తుందన్నారు.
అయితే, పేరు మార్పుపై కాంగ్రెస్ పార్టీ నేత జైరామ్ రమేశ్ తీవ్రంగా స్పందించారు. నిత్యం అభద్రతాభావంతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఈ మ్యూజియానికి ఉన్న నెహ్రూ పేరును తొలగించడం ద్వారా తన సంకుచిత మనస్తత్వాన్ని చాటుకున్నారని ట్విటర్ లో విమర్శించారు.
మరో కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. నెహ్రూ చరిత్రను తుడిచేసే ప్రయత్నమని విమర్శించారు.
అయితే, పేరు మార్పును కొందరు సమర్ధించారు. ఇందులో ఎవరి చరిత్రను తుడిచేసే ప్రయత్నం ఉండకపోవచ్చని, విశాల దృక్పథంలో ఈ పేరు మార్పు చేయాల్సి వచ్చి ఉంటుందని దిల్లీ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సంగీత్ రాగి అన్నారు.
మణిపుర్‌లో హింస కొనసాగుతోంది. భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ ఇంటిని గురువారం రాత్రి దుండగులు తగులబెట్టినట్లు ఏఎన్‌ఐ తెలిపింది.
మణిపుర్ రాజధాని ఇంఫాల్‌లోని కొంగ్బాలోని మంత్రి నివాసంలోకి చొరబడిన దుండగులు ఇంటికి నిప్పంటించారు.
అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో మంత్రి కేరళ పర్యటనలో ఉన్నట్లు తెలిపింది.
''రాత్రి జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. రాత్రి 10 గంటల సమయంలో దుండగులు నా ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేసినట్లు తెలిసింది. ఈ దాడిలో కింది అంతస్తు, మొదటి అంతస్తు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో నేను, నా కుటుంబ సభ్యులు ఇంట్లో లేము. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు.'' అని మంత్రి రంజన్ సింగ్ చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
''రాష్ట్రంలో జరుగుతున్న హింస చాలా బాధాకరం. అందరూ శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నా. మానవత్వం లేని వారే ఇలాంటి హింసాత్మక దాడులకు పాల్పడతారు'' అని మంత్రి అన్నారని ఏఎన్‌ఐ పేర్కొంది.
బీబీసీ డాక్యుమెంటరీపై మోదీ ప్రభుత్వం నిషేధం విధించేందుకు గల కారణాలను తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే, విచిత్రమైన సమాధానం వచ్చిందని తృణమూల్ కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే తెలిపారు.
'ఇండియా: ది మోదీ క్వశ్చన్' పేరుతో బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీపై 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
ఐటీ రూల్స్‌లోని 16వ రూల్ ప్రకారం, ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ (ఐడీసీ) సిఫార్సుల మేరకు నిషేధం విధించినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చిందని గోఖలే తెలిపారు.
''అత్యవసర సమయాల్లో మాత్రమే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డిజిటల్ కంటెంట్‌ను ప్రసారం కాకుండా అడ్డుకోవచ్చని రూల్ 16 చెబుతోంది. ఆ తర్వాత ఆ నిషేధంపై సమీక్షించేందుకు ఇంటర్ డిపార్ట్‌మెంటల్ కమిటీ (ఐడీసీ)ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఐడీసీ కేవలం సిఫార్సులు మాత్రమే చేయగలదని, ఆదేశాలు ఇవ్వలేదు'' అని టీఎంసీ నేత ట్వీట్ చేశారు.
ఐడీసీ సమీక్ష, ఆ కమిటీ చేసిన సిఫార్సులకు సంబంధించిన రికార్డులను మంత్రిత్వ శాఖ నిర్వహించాల్సి ఉంటుందని, సమాచార హక్కు చట్టం ప్రకారం ఆ రికార్డులు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని ఆయన తెలిపారు.
ప్రధాని మోదీపై బీబీసీ డాక్యుమెంటరీని నిషేధించడం వెనక ఉన్న కారణాలను తెలియజేసేందుకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిరాకరించిందని గోఖలే పేర్కొన్నారు.
''డాక్యుమెంటరీ భారతదేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉందని చెబుతున్నారు.'' అయితే, ప్రధాని మోదీని విమర్శించడం దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీయడం, జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
ఐడీసీ సిఫార్సులను ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలని రూల్ 17 చెబుతోందని, తక్షణమే ఐడీసీ మార్గదర్శకాలను బహిర్గతం చేసేలా మంత్రిత్వ శాఖను ఆదేశించాలని పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సాకేత్ గోఖలే తెలిపారు.
బిపర్‌జోయ్ తుపాను బీభత్సంతో గుజరాత్‌లో 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు సహాయక చర్యల కమిషనర్ అలోక్ పాండే చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.
ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదని ఆయన తెలిపారు. ''తుపాను కారణంగా 22 మంది గాయాలపాలయ్యారు. ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. 23 పశువులు మృతి చెందాయి. 524 చెట్లు నేలకూలాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తుపాను కారణంగా 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.'' అని అలోక్ పాండే చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
గుజరాత్‌లోని తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా నడిచే 99 రైళ్లను జూన్ 18 వరకూ రద్దు చేస్తున్నట్లు వెస్టర్న్ రైల్వే తెలిపినట్లు ఏఎన్ఐ తెలిపింది.
బలమైన గాలులు వీయడంతో మోర్బి జిల్లాలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 45 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మాలియా పరిధిలోని 45 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు విద్యుత్ సరఫరా సంస్థ పశ్చిమ గుజరాత్ విజ్ కో లిమిటెడ్ (పీజీవీసీఎల్), మోర్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జేసీ గోస్వామి చెప్పినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ఇప్పటి వరకూ 9 గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని, మిగిలిన గ్రామాల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని ఈఈ గోస్వామి చెప్పినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ వార్తలను ఎప్పటికప్పుడు ఈ లైవ్ పేజీలో చూడండి.