You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వెనిజ్వెలా: ఎన్నికల తర్వాత ఈ దేశం ఎందుకు రగులుతోంది, పోలీసులతో ప్రజల ఘర్షణ ఎందుకు?
వెనిజ్వెలాలో ఎన్నికల ఫలితాలపై నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఆదివారం నాటి వివాదాస్పద ఎన్నికల ఫలితాలను నిరసిస్తూ వీధుల్లో ప్రదర్శనలు చేసిన ప్రజలపై వెనిజ్వెలా భద్రతా బలగాలు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించాయి.
సోమవారం సాయంత్రం సెంట్రల్ కరాకస్‌లో వేలమంది ప్రజలు వీధుల్లోకి రాగా, కొందరు అధ్యక్ష భవనం ఎదుట ప్రదర్శనలు నిర్వహించే ప్రయత్నం చేశారు.
నిరసనకారులను చెదరగొట్టడానికి, అధ్యక్ష భవనం వద్దకు వెళ్లకుండా నిరోధించడానికి కరాకస్ వీధుల్లో భారీ సైనిక, పోలీసు బలగాలను మోహరించారు.
అధ్యక్షుడు నికోలస్ మడూరో విజయం సాధించిన మరుసటి రోజే వెనిజ్వెలా రాజధానిలో నిరసనలు చెలరేగాయి.
ప్రతిపక్షాలు మడూరో ప్రకటనను మోసపూరితమైనదిగా పేర్కొన్నాయి. తమ అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ 73.2% ఓట్లతో గెలుపొందాడని అన్నాయి.
దేశంలోని ఆర్థిక సంక్షోభంపై ప్రజల అసంతృప్తి నేపథ్యంలో, అధ్యక్షుడు మడూరోను పదవి నుంచి తొలగించే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్ష పార్టీలు గొంజాలెజ్ నేతృత్వంలో ఏకమయ్యాయి.
ఎన్నికలకు ముందు జరిగిన ఒపీనియన్ పోల్స్ సైతం గొంజాలెజ్ విజయం సాధిస్తారని సూచించాయి.
నిరసన సెగలు
నిరసనల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో అధ్యక్షుడు మడూరో పోస్టర్లను చింపి టైర్లు, కార్లు, చెత్తను తగులబెట్టారు.
సాయుధ పోలీసులు, మిలిటరీ, పారామిలిటరీ బలగాలు నిరసనకారులతో ఘర్షణ పడ్డాయి. సిటీ సెంటర్ చుట్టూ అనేక రహదారులను దిగ్బంధించాయి.
బుధవారం నుంచి పనామా, డొమినికన్ రిపబ్లిక్‌ల నుంచి తమ దేశానికి వచ్చీ పోయే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు వెనిజ్వెలా ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిరసనల్లో పాల్గొనేందుకు వచ్చిన 41 ఏళ్ల పోలా సర్జాలెజోస్, "మడూరో గెలుపు మోసం. మేము 70% ఓట్లతో గెలిచాం, కానీ వాళ్లు విజయాన్ని మా నుంచి లాగేసుకున్నారు. మా యువతకు, దేశానికి మంచి భవిష్యత్తు కావాలి.’’ అన్నారు.
వెనిజ్వెలా జెండాను కప్పుకుని నిరసనల్లో పాల్గొన్న క్రిస్టోబల్ మార్టినెజ్ అనే ఆందోళనకారుడు ఈ ఎన్నికలు ‘మోసం’ అని నినదించారు.
"ప్రభుత్వం మీద చాలా అసంతృప్తి ఉంది. మెజారిటీ ప్రజలు మార్పు కోరుతున్నారు. మడూరో చాలా కాలం నుంచి పదవిలో ఉన్నా ఎలాటి మార్పులూ లేవు, చావెజ్ మరణించినప్పటి నుంచి పరిస్థితి అధ్వాన్నంగా మారింది." అని అన్నారు.
ప్రతిపక్షాలు తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నాయి: మడూరో
ఫలితాలను వివాదాస్పదం చేయడం ద్వారా ప్రతిపక్షాలు తిరుగుబాటును ప్రోత్సహిస్తున్నాయని మడూరో ఆరోపించారు.
‘‘సత్యాన్ని విని ఓర్పుతో, ప్రశాంతతో భవిష్యత్తుకు సన్నద్ధం కావాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో, హింసను ప్రేరేపించే వారిని ఎలా ఓడించాలో మాకు తెలుసు." అని టీవీ ప్రసంగంలో అన్నారు.
"వాళ్లు వెనిజ్వెలాలో ఫాసిస్ట్, విప్లవ వ్యతిరేక భావాలతో తిరుగుబాటును లేవదీయడానికి ప్రయత్నిస్తున్నారు." అని మడూరో ఆరోపించారు.
నిరసనల పేరుతో రోడ్లను దిగ్బంధించి, నిబంధనలను ఉల్లంఘిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిరసనకారులను ఉద్దేశించి వెనిజ్వెలా అటార్నీ జనరల్ హెచ్చరించారు.
ఎన్నికల సామగ్రిని ధ్వంసం చేయడం, హింసాత్మక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అటార్నీ జనరల్ తెలిపారు.
అనేక పాశ్చాత్య, లాటిన్ అమెరికన్ దేశాలు, అలాగే ఐక్యరాజ్య సమితితో సహా అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తిగత పోలింగ్ స్టేషన్ల నుంచి ఓటింగ్ రికార్డులను విడుదల చేయాలని వెనిజ్వెలా అధికారులను కోరాయి.
మడూరో విజయాన్ని గుర్తించడానికి నిరాకరించిన అర్జెంటీనా తమ దౌత్యవేత్తలను వెనిజ్వెలా నుంచి వెనక్కు రప్పించింది. చిలీ, కోస్టారికా, పనామా, పెరూ, డొమినికన్ రిపబ్లిక్, ఉరుగ్వేలూ ఇదే బాట పట్టాయి.
అమెరికా అధికారులు ఏమన్నారు?
తమకు లభించిన సమాచారం మేరకు ప్రకటించిన ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించడం లేదని, ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని అమెరికా సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అన్నారు.
వెనిజ్వెలా ఎన్నికల అధికారులు వాళ్లు ప్రకటించిన ఫలితాలు నిజమైనవే అనడానికి ఆధారాలు చూపించాలని వారు కోరారు.
ఈ ఫలితాల నేపథ్యంలో వెనిజ్వెలా పై ఆంక్షల విషయంలో అమెరికా ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.
వెనిజ్వెలా ఫలితాలపై బుధవారం తమ శాశ్వత కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ (OAS) సోమవారం ప్రకటించింది.
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)