You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లద్దాఖ్ హింస: అరబ్, జెన్ జడ్ నిరసనలను ప్రస్తావిస్తూ సోనమ్ వాంగ్‌చుక్ హింసను ప్రేరేపించారని కేంద్రం ఆరోపణలు
కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
పోలీసులు నిరసనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో నలుగురు చనిపోయారు. 30 మంది పోలీసులు సహా 59 మంది గాయపడ్డారు.
లేహ్‌లో హింస అనంతరం, 15 రోజులుగా తాను చేపట్టిన నిరాహార దీక్షను విరమిస్తున్నట్లు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రకటించారు.
లద్దాఖ్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని, ఆరో షెడ్యూల్ పొడిగించాలని డిమాండ్ చేస్తూ ఆయన నిరాహార దీక్ష చేపట్టారు.
అయితే, బుధవారం రాత్రి (సెప్టెంబర్ 24) జరిగిన హింసకు సోనమ్ వాంగ్‌చుక్ కారణమని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
కేంద్ర హోంశాఖ ఆరోపణలపై వాంగ్‌చుక్ ఇంకా స్పందించలేదు.
కేంద్రం ఏమందంటే..
లద్దాఖ్ రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ పొడిగింపుపై జరుగుతున్న చర్చలలో పురోగతి పట్ల కొంతమంది సంతోషంగా లేరని, వాటిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది.
ఈ అంశాలపై అక్టోబర్ 6న హై పవర్ కమిటీ సమావేశం జరుగుతుందని, సెప్టెంబర్ 25-26 తేదీలలో లద్దాఖ్ నాయకులతో కూడా సమావేశాలు జరుగుతాయని తెలిపింది.
హింస తర్వాత, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
"ఆరో షెడ్యూల్, లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ అంశాలపై భారత ప్రభుత్వం అపెక్స్ బాడీ లెహ్, కార్గిల్ డెమొక్రటిక్ అలయన్స్‌తో సంప్రదింపులు జరుగుతూనే ఉంది. వారితో వరుస సమావేశాలు జరిగాయి. నాయకులతో కూడా అనధికారిక చర్చలు జరిగాయి. ఇవి గణనీయమైన ఫలితాలను ఇచ్చాయి. కొంతమంది రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చర్చల పురోగతిపై సంతోషంగా లేరు. చర్చల ప్రక్రియను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు" అని ప్రకటన పేర్కొంది.
"వాంగ్‌చుక్ నిరాహార దీక్ష డిమాండ్లు హై పవర్ కమిటీ చర్చలలో ఉన్నాయి. అయితే, నిరాహార దీక్షను ముగించాలని నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ, ఆయన కొనసాగించారు. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసన, నేపాల్‌లో జెన్ జడ్ నిరసనల గురించి ప్రస్తావించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు" అని తెలిపింది.
"సెప్టెంబర్ 24న, ఉదయం 11:30 గంటల ప్రాంతంలో వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాలతో రెచ్చిపోయిన ఒక గుంపు నిరాహార దీక్ష స్థలం నుంచి బయలుదేరి, ఒక రాజకీయ పార్టీ కార్యాలయం, లేహ్‌లోని ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసింది. కార్యాలయాలకు నిప్పు పెట్టింది, భద్రతా సిబ్బందిపై దాడి చేసింది. పోలీసు వాహనాన్ని తగలబెట్టింది" అని కేంద్రం పేర్కొంది.
కాగా, కేంద్రం ప్రకటన ఆశ్చర్యం కలిగించలేదని సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు.
"ప్రభుత్వం నా గొంతు నొక్కాలని అనుకుంటోంది. బుధవారం జరిగిన దానికి నన్ను నిందిస్తున్నారు. ప్రభుత్వం నన్ను జైలులో పెట్టవచ్చు. నా పాఠశాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అనేక ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. దేశద్రోహ అభియోగం కూడా మోపారు. నన్ను లద్దాఖ్‌కు దూరంగా ఉంచాలని వారు కోరుకుంటున్నారు. కాబట్టి వారు పీఎస్‌ఎ విధించడానికి సిద్ధమవుతున్నారు" అని వాంగ్‌చుక్ అన్నారు.
లేహ్‌లో కర్ఫ్యూ
లేహ్ జిల్లాలో కర్ఫ్యూ విధించినట్లు లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తెలిపారు.
తమ పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టారని, లేహ్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని లద్దాఖ్ బీజేపీ అధ్యక్షుడు తాషి గ్యాల్సన్ ఖాచు బీబీసీతో చెప్పారు.
లేహ్‌లో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. జిల్లాలో ఐదుగురు.. అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడడంపై ఆంక్షలు విధించినట్లు ఏఎన్ఐ తెలిపింది.
ముందస్తు అనుమతి లేకుండా లేహ్‌లో ఎవరూ ఎలాంటి ఊరేగింపులు, నిరసన ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలు ఏవీ చేపట్టకూడదని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
హింసకు దారితీసిన పరిస్థితులు
సెప్టెంబర్ 10 నుంచి నిరాహార దీక్ష చేస్తున్న 15 మందిలో ఇద్దరి పరిస్థితి మంగళవారం సాయంత్రం క్షీణించడంతో లద్దాఖ్ అపెక్స్ బాడీ యువజన విభాగం బంద్‌కు పిలుపునిచ్చింది.
దీంతో బుధవారం(సెప్టెంబర్ 24) ఉదయం లద్దాఖ్ రాజధాని లేహ్ వీధుల్లోకి వందల మంది వచ్చారు.
మధ్యాహ్నం నుంచి హింసాత్మక ఘటనలు జరిగాయి. లేహ్‌లోని బీజేపీ కార్యాలయానికి నిప్పటించారు. కొన్ని పోలీసు, సీఆర్‌పీఎఫ్ వాహనాలను తగలబెట్టారు.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.
నిరాహార దీక్ష స్థలంలో, రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకుడు ఫుంట్సోగ్ స్టాన్జిన్‌పై కేసు నమోదైంది.
బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పీన్స్ లాంటి పరిస్థితిని లద్దాఖ్‌లో సృష్టించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది
"లద్దాఖ్‌లో జరిగిన కొన్ని నిరసనలకు జెన్ జడ్ నాయకత్వం వహిస్తున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అయితే, అది జెన్ జడ్ నిరసన కాదని.. కాంగ్రెస్ నిరసన అని తేలింది" అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా అన్నారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా, ఆరో షెడ్యూల్ పొడిగింపు, లేహ్, కార్గిల్‌కు ప్రత్యేక లోక్‌సభ సీట్లు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
హింసాత్మక ఘటనల్లో గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది.
1989 ఆగస్టు 27న కేంద్రపాలిత ప్రాంతం హోదా డిమాండ్ చేస్తూ జరిగిన ఉద్యమంలో పోలీసుల కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించినప్పుడు లద్దాఖ్‌లో హింస చెలరేగింది.
ఇది "జెన్ జడ్" విప్లవం - సోనమ్ వాంగ్‌చుక్
హింసాత్మక పరిస్థితులు చెలరేగిన వెంటనే శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూ సోనమ్ వాంగ్‌చుక్ ఎక్స్‌లో ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
"నా నిరాహారదీక్ష పదిహేనో రోజుకి చేరింది. అయితే, ఇవాళ లేహ్ నగరంలో జరిగిన హింస, విధ్వంసం నన్ను బాధించింది. అనేక ఆఫీసులు, పోలీసుల వాహనాలకు నిప్పు పెట్టారు"అని ఆయన ఆ వీడియోలో చెప్పారు.
"వాళ్లకు (యువత) ఐదేళ్లుగా ఉద్యోగాలు లేవు. కుంటిసాకులు చెప్పి వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. లద్దాఖ్‌కు రక్షణ లేదు. ఇక్కడ ప్రజాస్వామ్య వేదిక లేదు" అని వాంగ్‌చుక్ అన్నారు.
అయితే, మరణించిన వారి విషయంలో పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు పాల్పడవద్దని సోనమ్ వాంగ్‌చుక్ యువతకు విజ్ఞప్తి చేశారు.
కేంద్రంపై విమర్శలు
లేహ్‌లో నిరసనలపై కేంద్ర ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ కోరారు.
"2019 నుంచి ఏం మారిందో భారత ప్రభుత్వం నిజాయితీగా పరిశీలన చేసుకోవాలి. ఈ వీడియో అశాంతికి కేంద్రంగా భావించే కశ్మీర్ లోయ నుంచి కాదు, కోపంతో ఉన్న నిరసనకారులు పోలీసులు వాహనాలు, బీజేపీ ఆఫీసుకు నిప్పంటించిన లద్దాఖ్ నుంచి వచ్చింది" అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
"లేహ్‌లో చాలాకాలంగా శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలు ఇప్పుడు ప్రమాదకరమైన హింసాత్మక మలుపు తీసుకున్నాయి. హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు సహనం కోల్పోయారు. తమను వంచించారని భావిస్తున్నారు" అని ఆమె అందులో రాశారు.
"లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా హామీ కూడా ఇవ్వలేదు. 2019లో కేంద్ర పాలితహోదా పొందినప్పుడు వేడుక చేసుకున్నారు. అయితే, తమను మోసం చేశారనే కోపంతో ఉన్నారు" అని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు.
"ప్రస్తుతం మనం ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతాయుతంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. మనం ఎంత మోసపోయామో, నిరాశ చెందామో ఊహించుకోండి" అని ఒమర్ అబ్దుల్లా చెప్పారు.
"ఇది చాలా సున్నితమైన ప్రాంతం. చైనా సరిహద్దులో ఉంది. ఇక్కడ పరిస్థితులు విధ్వంసం, పోలీసు వాహనాలకు నిప్పుపెట్టేంత తీవ్రంగా మారింది" అని నేషనల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే అర్జున్ సింగ్ రాజు అన్నారు.
"హింస సమర్థనీయం కాదు. అయితే లేహ్ మనకు, కేంద్ర ప్రభుత్వానికి ఒక పాఠం. అక్కడి ప్రజలు కొన్నేళ్లుగా భూ రక్షణ, ఆరో షెడ్యూల్, పూర్తి రాష్ట్ర హోదాను డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర పాలిత ప్రాంతాన్ని వారిపై బలవంతంగా రుద్దారు" అని ఆయన అన్నారు.
"జమ్మూ కశ్మీర్, లేహ్‌లో శాంతిభద్రతలకు కేంద్రం బాధ్యత వహిస్తుంది. కాబట్టి ప్రస్తుత సంఘటనలకు కేంద్రానిదే బాధ్యత" అని అర్జున్ సింగ్ రాజు ఆరోపించారు.
లద్దాఖ్ ప్రజల డిమాండ్లు
కేంద్రపాలిత ప్రాంతంగా మారడానికి ముందు లద్దాఖ్ ప్రజలు జమ్మూ కశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో గెజిటెడ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు. అయితే ఇప్పుడది ఆగిపోయింది.
2019 కి ముందు జమ్మూ కశ్మీర్ సర్వీస్ సెలక్షన్ బోర్డు చేపట్టే నాన్-గెజిటెడ్ ఉద్యోగ నియామకాల్లో లద్దాఖ్ అభ్యర్థులు కూడా పాల్గొనేవారు. ఇప్పుడీ నియామకాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహిస్తోంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం తరఫున సెలక్షన్ చేపట్టే రాజ్యాంగబద్దమైన సంస్థ.
కేంద్ర పాలిత ప్రాంతంగా మారినప్పటి నుంచి లద్దాఖ్‌లో చెప్పుకోదగ్గ నాన్-గెజిటెడ్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ఏదీ జరగలేదు. ఇది లద్దాఖ్ యువతలో ఆగ్రహం రేకెత్తించింది.
కేంద్రపాలిత ప్రాంతంలో నియామక ప్రక్రియ ప్రారంభమైందని లద్దాఖ్ అడ్మినిస్ట్రేషన్ 2023 ఆక్టోబర్‌లో ప్రకటించింది.
కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడిన తర్వాత లద్దాఖ్‌కు అసెంబ్లీతో పాటు రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ కింద రక్షణ లభిస్తుందని స్థానికులు భావించారు.
2019 ఎన్నికల మేనిఫెస్టోలోనూ గతేడాది లద్దాఖ్ హిల్ కౌన్సిల్ ఎన్నికల సమయంలోనూ లద్దాఖ్‌కు రాష్ట్ర హోదాతో పాటు ఆరో షెడ్యూల్‌లో చేరుస్తామనే బీజేపీ హామీ ఇచ్చింది.
భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అసంతృప్తిని నిరసనల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 244(2) కింద ఆరో షెడ్యూల్ ప్రకారం, ఒక రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తి మండళ్లు ఏర్పాటు చేయవచ్చు.
వీటికి శాసన, న్యాయ, పాలనాపరమైన స్వేచ్ఛ ఉంటుంది.
ఈ మండళ్లలో మొత్తం 30 మంది సభ్యులు ఉంటారు. వీరిలో నలుగురిని గవర్నర్ నియమిస్తారు.
ఆరవ షెడ్యూల్ ప్రకారం, మండలి అనుమతితో మాత్రమే ఆ ప్రాంతంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)