లద్దాఖ్‌: జమ్ముకశ్మీర్‌ నుంచి విడిపోయిన ఏడాది కాలంలో ఏం జరిగింది

    • రచయిత, అభిజిత్ శ్రీవాస్తవ్‌
    • హోదా, బీబీసీ ప్రతినిధి

లద్ధాఖ్‌ పేరు వినగానే అక్కడి ప్రకృతి సోయగాలు మనసులో కదలాడుతాయి. భారత దేశానికి నుదుటి తిలకంలా కనిపించే లద్దాఖ్, ఏడాది కిందటి వరకు జమ్ముకశ్మీర్‌లో అంతర్భాగం.

గత ఏడాది ఆగస్టు 5న భారత పార్లమెంటు ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో జమ్ముకశ్మీర్‌కి ఉన్న ప్రత్యేక హోదా పోయింది. ఈ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం విడదీసింది.

ఈ విభజన తర్వాత జమ్ముతోపాటు, భారత ఆధీనంలో ఉన్నకశ్మీర్‌లో పరిస్థితి వేరుగా ఉన్నా.. లద్ధాఖ్‌లో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. గత 70 ఏళ్లుగా చేస్తున్న తమ డిమాండ్‌లో 50 శాతమైనా నెరవేరినందుకు ఇక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

మరి వాళ్ల డిమాండ్‌ 50 శాతమే ఎందుకు నెరవేరింది ?

జమ్ముకశ్మీర్ నుంచి తమను వేరు చేయాలని లద్దాఖీలు చేస్తున్న డిమాండ్ చాలా పాతది. కానీ దానితోపాటు వారు శాసన సభను ఇవ్వాలని కోరారు. కానీ కేంద్రం ఆ పని చేయలేదు. ఆర్టికల్ 370 రద్దు చేసి ఏడాది గడిచినా అక్కడి ప్రజలు పూర్తిస్థాయిలో సంతోషం వ్యక్తం చేయకపోవడానికి కారణం ఇదే. మిగతా సమస్యలు కూడా దీనితో ముడిపడి ఉన్నాయి.

గడిచిన ఏడాది కాలంగా లద్దాఖీలు తాము కోరుకున్నది పొందగలిగారా? దేశంలోనే అతి పెద్ద లోక్‌సభ నియోజకవర్గం తన కలను నిజం చేసుకోగలిగిందా ? అక్కడి ప్రజల ఆకాంక్షలు ఏంటి? వారు కేంద్రం నుంచి ఏం కోరుతున్నారు? వీటిపై బీబీసీ పరిశీలన చేసింది.

కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత అక్కడి ప్రజలు తమకు మంచి రోజులు వస్తాయని చాలా ఆశాభావంతో ఉన్నారు.

లద్దాఖ్ అనగానే అందమైన ప్రకృతి దృశ్యం కళ్ల ముందు కదలాడుతుందని ముందే అనుకున్నాం. ఇప్పుడు లదాఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. కానీ ఈ ఏడాది జూన్‌కు ముందు, అంటే కరోనా మహమ్మారికి ముందు అక్కడికి వెళ్లిన, వెళ్లాలనుకున్న పర్యటకుల దృష్టిలో లద్దాఖ్ అంటే ఏమిటి ?

పర్యటకుల దృష్టిలో లద్దాఖ్‌ అంటే లేహ్‌. అందరూ దాన్ని లేహ్‌-లద్దాఖ్ అని పిలుస్తుంటారు కూడా. కానీ కార్గిల్‌ను లేహ్‌తో కలిపి ఎప్పుడూ ప్రస్తావించరు.

అలాగే పర్యటకుల్లో ఎక్కువ మంది లేహ్‌కు వెళుతుంటారు. ఇప్పుడు ప్రతి కార్గిల్‌‌వాసిని బాధపెడుతున్న అంశం ఇదే.

సమాన భాగస్వామ్యం కోసం కార్గిల్ డిమాండ్‌

2011 జనాభా లెక్కల ప్రకారం లద్దాఖ్‌లో 46.4 శాతం ముస్లింలు ఉన్నారు. జనాభా 3 లక్షలు. ఇక్కడ లేహ్‌, కార్గిల్ రెండు జిల్లాలు. లేహ్‌ బౌద్ధుల మెజారిటీ ప్రాంతం కాగా, కార్గిల్‌లో ముస్లింలు ఎక్కువగా ఉంటారు.

జమ్ముకశ్మీర్ రాష్ట్రం ముస్లిం మెజారిటీ ప్రాంతమని, తమను ఎవరూ పట్టించుకోవడంలేదని ఇంతకు ముందు బౌద్ధులు వాదించేవారు. కానీ ఇప్పుడు లద్దాఖ్ బౌద్ధుల మెజారిటీ ప్రాంతమని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాదించేందుకు కార్గిల్‌ ప్రజలు అంటున్నారు.

లేహ్‌తోపాటు అభివృద్ధిలో తమకు సమాన వాటా కావాలని కార్గిల్‌వాసులు డిమాండ్‌ చేస్తున్నారు. రెండు ప్రాంతాలలో సమాన జనాభా ఉన్నప్పుడు అభివృద్ధిలో కూడా సమాన వాటా ఇవ్వాలని వారు కోరుతున్నారు.

లేహ్‌లో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా, తమకు కూడా అది ఇవ్వాలని కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేతలు కూడా డిమాండ్‌ చేస్తున్నారు. "ఇక్కడ విమానాశ్రయం విస్తరణ జరగకపోవడం పెద్ద సమస్య. పెద్ద విమనాలు దిగడానికి కూడా ఏర్పాట్లు చేయాలి. విమానాలు రావడం కుదరక కేంద్ర మంత్రులెవరూ ఇక్కడకు రావడం లేదు. కార్గిల్‌ నుంచి లేహ్‌కు 250 కిలోమీటర్లు. ఆరేడు గంటలకు ఎక్కడ ప్రయాణిస్తామని మంత్రులెవరూ ఇక్కడకు రావడం లేదు '' కార్గిల్‌లో బీజేపీ నేత హాజీ అనాయత్‌ అలీ అన్నారు.

భారత దేశంలోని అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గమైన లద్దాఖ్ భౌగోళిక స్వరూపం గురించి మాట్లాడినప్పుడు ఎవరూ కార్గిల్ గురించి ప్రస్తావించడం లేదని, అందరూ లేహ్‌ గురించే మాట్లాడుతున్నారని కార్గిల్‌లో కాంగ్రెస్‌ నేత నసీర్ మున్షి అన్నారు.

నెరవేరని జాయింట్ యాక్షన్‌ కమిటీ డిమండ్‌లు

లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చినప్పుడు కార్గిల్‌లో నిరసనలు వినిపించాయి.

ఓసారి గవర్నర్ సత్యపాల్‌ మలిక్ ఇక్కడికి వచ్చారు. అప్పుడు బీజేపీ లేకుండా.. కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫెరెన్స్‌, ఇతర మత సంస్థలు జాయింట్ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి 14 పాయింట్ల మెమొరాండాన్ని గవర్నర్‌కు సమర్పించాయి.

కానీ ఆ మెమొరాండంలో ఉన్న ఏ ఒక్క డిమాండ్‌ కూడా ఇంతవరకు నెరవేరలేదని బీజేపీ నేత హాజీ అనాయత్ అలీ అన్నారు.

"లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేశాక, గవర్నర్‌ కార్గిల్‌ వచ్చినప్పుడు లేహ్‌ నుంచి ఆరు నెలలు, లద్దాఖ్‌ నుంచి ఆరు నెలలు పరిపాలన సాగాలని జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. రాజ్‌భవన్, సెక్రటేరియట్, పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ లేహ్‌లో, కార్గిల్‌లో రెండుచోట్లా నిర్మిస్తామని గవర్నర్‌ హామీ ఇచ్చారు. కానీ ఇంత వరకు ఏమీ జరగలేదు" అని కార్గిల్‌లో కాంగ్రెస్‌ నేత నాసిర్‌ మున్షి అన్నారు. ఏడాదిలో ఏమీ జరగకపోగా ఇంకా నష్టపోయామని స్థానికులు అంటున్నారు.

"ఆర్టికల్‌ 370, 35ఏలను మేం సమర్థించాం. ఎందుకంటే అది మాకు రక్షణ కవచంలా ఉండేది. ఉపాధి లభించేంది. ఇక్కడి ఉద్యోగాలు స్థానిక ప్రజలకు మాత్రమే ఇచ్చేవారు.

కానీ దాన్ని రద్దు చేశాక ఏడాది కాలంగా కొత్త నియామకాలు లేవు. ప్రతిదీ అవుట్‌ సోర్స్‌ చేస్తున్నారు.

ప్రైవేట్ ఏజెన్సీ దిల్లీ నుంచి వచ్చింది. వాళ్లకు ఇష్టమైన వాళ్లనే ఉద్యోగాలలో నియమించుకుంటారు.

కాంట్రాక్టు పద్ధతిలో స్థానిక ప్రజలకు ఉద్యోగాలు ఇస్తున్నారు. బయటి నుంచి వచ్చిన వారితో పోలిస్తే స్థానికులకు సగం జీతమే ఇస్తున్నారు" అన్నారు.

ఇక్కడి ఉద్యోగాలలో 45% ఉద్యోగాలు షెడ్యూలు తెగలకే కేటాయిస్తామని గవర్నర్‌ ఇటీవల చెప్పారు. అయితే లద్దాఖ్‌ మొత్తం షెడ్యూల్ తెగల ప్రాంతం కిందికి వస్తుందని, ఇక్కడ స్థానికత చట్టాలు ఏవీ లేనప్పుడు బయటి నుంచి షెడ్యూల్ కులాల వారు పెద్ద ఎత్తున లద్దాఖ్‌లోకి వచ్చే అవకాశం ఉందని నాసిర్‌ మున్షీ అంటున్నారు. స్థానికత చట్టం ఒకటి ఉండాలని బీజేపీ నేత హాజీ అనాయత్‌ అలీ డిమాండ్‌ చేస్తున్నారు.

"ఉద్యోగాల కోసం మేం ఎలా డిమాండ్‌ చేయాలో అర్ధం కావడం లేదు. కేంద్ర పాలిత ప్రాంతం కావడానికి ముందు ఇక్కడి నుంచి నాలుగైదు వందలమంది సైనికులు వెళ్లేవారు'' అని చెప్పారు. "నియమకాలు చేపట్టారు కానీ ఫలితాలు ఇంకా రాలేదు. ఫలితాలను డిమాండ్‌ చేస్తూ గత వారం పలురాజకీయ పార్టీలు, విద్యార్ది సంఘాలు ఒక రోజు సమ్మె నిర్వహించాయి. ఇక్కడ ఇప్పుడు అధికారులదే రాజ్యం" అని ఆయన అన్నారు.

హిల్‌ కౌన్సిల్‌ బలోపేతానికి డిమాండ్‌

లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్.. లేహ్‌, కార్గిల్‌ రెండు ప్రాంతాలలోనూ బలమైన రాజకీయ వ్యవస్థ. రెండు చోట్లా ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. ఈ ఏడాది లేహ్‌లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, కార్గిల్‌ హిల్ కౌన్సిల్ ఎన్నికలు మూడేళ్ల తర్వాత జరుగుతాయి. హిల్‌ కౌన్సిల్‌ ప్రభుత్వానికి చెందినదేనని కానీ దానితో ప్రయోజనం లేదని హాజీ అనయత్ అలీ అన్నారు.

స్థానిక లద్దాఖ్‌ అటానమస్‌ హిల్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌లో మొత్తం 30మంది కౌన్సిలర్లు ఉన్నారని హాజీ అనాయత్‌ అలీ చెప్పారు. వీరిలో 26మంది ఎన్నికైనవారు కాగా, నలుగురు నామినేటెడ్ సభ్యులు. వీరి నుంచి ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్, నలుగురు ఎగ్జిక్యూటివ్ కౌన్సిలర్లను నియమిస్తారు. దీనికి కేబినెట్ మాదిరిగానే అధికారం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి అది చాలా బలహీనంగా ఉంది. రాజకీయపార్టీల ప్రభావం లేని చోటే హిల్‌ కౌన్సిల్‌ పేరు వినిపిస్తుందని అనాయత్‌ అలీ అన్నారు.

నాసిర్‌ మున్షీ కూడా అనాయత్‌ అలీ వాదననే వినిపించారు. జమ్మూకశ్మీర్‌ నుంచి కార్గిల్‌ను వేరు చేయడంతో శాసనమండలిలో దాని ప్రాతినిథ్యం ముగిసింది.ఇప్పుడు హిల్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ నుంచే కార్గిల్‌కు ప్రాతినిధ్యం ఉంది.

బలహీనంగా హిల్‌ కౌన్సిల్‌

అధికారులు తమ నిర్ణయాలతో హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ను బలహీనపరిచారని, ఇక్కడ ప్రజాస్వామిక వ్యవస్థ అంతమైందని కాంగ్రెస్‌, బీజేపీ రెండూ ఆరోపించాయి.

"స్థానికంగా ఉపాధి, భూమి, గుర్తింపు, సంస్కృతి పరిరక్షణకు మమ్మల్ని రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నాం.

అది జరగకపోగా హిల్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్ అధికారాలను కూడా తగ్గించారు. కౌన్సిల్‌కు ఒక ఫండ్‌ ఉంది.

దానికి కేంద్రం రాష్ట్రాల నుంచి నిధులు వస్తాయి. వాటిని ఖర్చుపెట్టుకునే అధికారం ఉంది. జనవరి నుంచి ఈ అధికారాలను రద్దు చేశారు. ఈ రెండు జిల్లాల అభివృద్ధికి ఇంతకు ముందు అన్ని నిర్ణయాలు తీసుకునే శక్తి కౌన్సిల్‌కు ఉండేది. కానీ ఇప్పుడు వాటిని బాగా తగ్గించారు" అని కాంగ్రెస్‌ నేత నాసిర్‌ మున్షి అన్నారు.

బీజేపీ నేత హాజీ అనాయత్‌ అలీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

"లద్దాఖ్‌కు వచ్చే డివిజనల్‌ కమీషనర్‌కు, కమిషనర్‌కు, ఇతర అధికార్లకు ఇక్కడి పరిస్థితులు తెలియవు. వారు కేంద్రంలో కూర్చుని లద్దాఖ్‌ ప్రజలను సంప్రదించకుండానే పాలసీలు తయారు చేస్తారు. లద్దాఖ్‌ వాతావరణం, సంస్కృతి భిన్నంగా ఉంటాయి. శీతాకాలంలో ఎలాంటి సమస్యలుంటాయో, వేసవిలో ఏం ఇబ్బందులుంటాయో బయటి నుంచి వచ్చే బ్యూరోక్రాట్‌లకు ఏం తెలుసు? లేహ్‌లో కూర్చున్న కమిషనర్‌కు ఇక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది? మమ్మల్ని అడక్కుండానే పాలసీలు సిద్ధం చేస్తారు. అవి మాకు అనుకూలంగా ఉండవు'' అని అనాయత్‌ అలీ అన్నారు.

"ఇక్కడి ప్రజలకు భూమి విషయంలో, ఉపాధి విషయంలో భద్రత లేదు. అంతా గందరగోళంగా తయారైంది. గవర్నర్‌ స్థాయిలోగానీ, డివిజనల్‌ కమిషనర్‌ స్థాయిలోగాని స్పష్టత లేదు. అనేకమంది అధికారులు ఉన్నారు. వారి మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎవరి పాత్ర ఏంటో ఎవరి బాధ్యత ఏంటో వారికి కూడా తెలియదు" అన్నారు అనాయత్‌ అలీ.

లేహ్‌ హిల్ కౌన్సిల్ బలోపేతానికి డిమాండ్‌

కార్గిల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు నేతలు హిల్‌ కౌన్సిల్‌కు అధికారం ఇవ్వాలని నొక్కి చెప్పారు. ప్రభుత్వంలో ప్రాతినిథ్యం దొరికే వరకు ప్రజల వాణిని వినిపించే అవకాశం ఉండాలని వారు అన్నారు. ఇదే వాదన లేహ్ నుంచి కూడా వినిపిస్తోంది

లద్దాఖ్‌లో అత్యంత శక్తివంతమైన సామాజిక మత సంస్థల్లో ఒకటైన బుద్ధిస్ట్ అసోసియేషన్‌ ఆఫ్‌ లద్దాఖ్‌ అధ్యక్షుడైన పి.టి. కున్జాంగ్‌ను బీబీసీ కలిసింది. "రాజకీయ పార్టీలు, మత సంస్థల మద్దతుతో లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని మేం 1949 నుంచి కోరుతున్నాం. 70 సంవత్సరాల తర్వాత మా కోరిక నెరవేరింది. ప్రధనమంత్రి నరేంద్ర మోదీకి, హోంమంత్రి అమిత్‌ షాకు మా ధన్యవాదాలు''అని కున్జాంగ్‌ అన్నారు.

"అయితే లద్దాఖ్‌కు సరైన రాజ్యాంగ రక్షణలు కల్పించలేదన్న భయం ప్రజలలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం అయ్యాక తమ ప్రాంతానికి భూమి, ఉపాధి, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక గుర్తింపులేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది'' అని ఆయన అన్నారు.

"గత ఏడది ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని తొలగించి, లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో అభివృద్ధి పనులు చేయడానికి అవకాశం దొరకలేదు. అక్టోబర్‌ 31 నుంచి కేంద్ర పాలిత ప్రాంతంగా లద్దాఖ్‌ మనుగడలోకి వచ్చింది. తర్వాత శీతాకాలం రావడం, ఆ తర్వాత కరోనావైరస్‌ కారణంగా అభివృద్ధి పనులుసాగలేదు'' అని కున్జాంగ్‌ అన్నారు.

లేహ్‌,కార్గిల్‌ జిల్లాలతో కలిపి కేవలం 3 లక్షలకన్నా జనాభా ఉందని, అందులో 98శాతంమంది గిరిజనులేనని, వారి ప్రయోజనాలకు రాజ్యాంగ రక్షణ అవసరమని కున్జాంగ్‌ అన్నారు.

"లేహ్‌ను శాసనసభతో కూడిన కేంద్ర ప్రాలిత ప్రాంతంగా మార్చాలని మేం గతంలో కోరాం. కానీ అది జరగలేదు. అందుకే మేం హిల్‌ కౌన్సిల్‌కు చట్టాలు చేసే అధికారాన్ని కేంద్రం ఇవ్వాలని ఈ ఏడాది పిబ్రవరి 17న ప్రధాన మంత్రికి విజ్జప్తి చేశాం'' అని కున్జాంగ్‌ అన్నారు.

అయితే ఉపాధి ఆవకాశాల గురించి కార్గిల్, లేహ్ ప్రజలలో ఆందోళన ఉందని కున్జాంగ్‌ స్పష్టం చేశారు.

ఈ ప్రదేశంలోని యువత గెజిటెడ్ ఆఫీసర్లు కావడానికి లద్దాఖ్‌లో స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ ఏర్పాటు చేయాలని లేహ్ ప్రెస్‌ క్లబ్ వైస్‌ ప్రెసిడెంట్, రీచ్ లద్ధాఖ్‌ బులెటిన్ ఎడిటర్ స్టాన్జిన్ డాసల్‌ అన్నారు.

లద్దాఖ్‌ స్టూడెంట్‌ యూనియన్‌ ఏమంటోంది?

లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలన్న కేంద్ర నిర్ణయాన్ని గత ఏడాదే స్వాగతించామని లద్దాఖ్‌ స్టూడెంట్స్ యూనియన్ లీఫ్ అధ్యక్షుడు జిగ్మెత్‌ పాల్జోర్ అన్నారు.

"ఈ నిర్ణయం నుండి లద్దాఖ్‌ చాలా ఆశించింది. భూమి, పర్యావరణం, ఉపాధి, సంస్కృతులకు రాజ్యాంగ రక్షణలుంటాయని భావించింది. కానీ ఏడాది కాలంగా ఎటువంటి నిర్ణయాలు జరగలేదు. మేం రాజ్యాంగ రక్షణ ఉండాలని డిమాండ్‌ చేస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఇతర నేతల మాదిరిగానే లద్దాఖ్‌ అటానమస్ హిల్‌ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను బలోపేతం చేయాలని పాల్జోర్ కోరుతున్నారు. ప్రజాస్వామ్య స్వరాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

"లేహ్‌, కార్గిల్‌లోని ఈ కౌన్సిల్‌ను బలోపేతం చేయాలి. ఇది ఏర్పడినప్పటి నుండి 2019 వరకు చాలా సవరణలు జరిగాయి. వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలి"అని పాల్జోత్‌ అన్నారు. యువతకు ఉపాధి లభిస్తుందని తాము ఆశించామని పాల్జోర్‌ అన్నారు. గత ఏడాది కాలంగా ఈ ఆశయం నెరవేరలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో యువతకు ఉపాధి లభిస్తుందని, ఇందుకోసం ఇక్కడ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉన్నత విద్యకు సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడి యువత బయటికి వెళ్ళవలసి వస్తోందని, రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వం దీనిపై దృష్టి పెడుతుందని తాము ఆశిస్తుస్తున్నట్లు పాల్జోర్‌ చెప్పారు.

లద్దాఖ్‌లో సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించబోతున్నట్లు ఇటీవల కేంద్రం ప్రకటించింది. కొత్త వ్యవస్థలు ఏర్పాటు చేసే బదులు ఉన్న వ్యవస్థలను ముందు బలోపేతం చేయడం మంచిదని పాల్జోర్‌ అభిప్రాయపడ్డారు. ఇక్కడ లద్దాఖ్‌ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్ బుద్ధిస్ట్‌ స్టడీస్‌ ఉన్నాయని, వాటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని పాల్జోర్‌ అన్నారు.

ఇవన్నీ లద్దాఖ్‌లోని యువత ఆకాంక్షలనీ, వీటిని నెరవేర్చడం ద్వారా ఈ కేంద్ర పాలితప్రాంతం అందరికీ ఆదర్శంగా నిలవాలని ఇక్కడి వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)