You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లారెన్స్ - రుద్రుడు రివ్యూ: బలమైన సంఘ విద్రోహ శక్తిపై ఓ సామాన్యుడి తిరుగుబాటు ఎలా ఉంది?
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
రాఘవ లారెన్స్‌కు ప్రత్యేకమైన అభిమానగణం ఉంది.
డాన్సర్‌గా ఉన్నప్పటి నుంచీ ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన తరవాత హీరో అయ్యారు. డైరెక్షన్ చేశారు. గంగ, కాంచన సినిమాలతో హిట్ కొట్టారు. చాలా కాలం తరవాత, 'రుద్రుడు'గా ముందుకొచ్చారు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజీ ఇచ్చే లారెన్స్ ఈ సినిమాతో ఏం చెప్పారు? రుద్రుడిగా లారెన్స్ అభినయం ఎలా ఉంది?
రుద్రుడు కథేమిటి?
కథేంటో క్లుప్తంగా చెప్పుకుందాం.
రుద్ర (లారెన్స్) ఓ అల్లరి కుర్రాడు. అమ్మా,నాన్నలంటే ప్రాణం. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అనన్య (ప్రియా భవాని)ని ఇష్టపడి పెళ్లి చేసుకొంటాడు. అప్పుడే రుద్ర జీవితంలో అనుకోని ఘటనలు జరుగుతాయి.
భూమి (శరత్ కుమార్) అనే ఓ డాన్‌తో తలపడాల్సి వస్తుంది. భూమి అనుచరుల్ని ఒకొక్కడిగా హతమారుస్తుంటాడు రుద్ర.
ఓ సామాన్యుడు, అల్లరి అబ్బాయి కత్తి ఎందుకు పట్టాల్సివచ్చింది? భూమిపై ఎందుకు యుద్ధం ప్రకటించాల్సివచ్చింది? ఇదే 'రుద్రుడు' కథ.
కథగా చెప్పుకోవాలంటే ఇదో రివైంజ్ స్టోరీ. బలమైన సంఘ విద్రోహ శక్తిపై ఓ సామాన్యుడి తిరుగుబాటు.
ఇలాంటి కథలు గతంలో చాలా వచ్చాయి. తన కుటుంబానికి జరిగిన అన్యాయానికి హీరో ప్రతీకారం తీర్చుకోవడం అలవాటైన ఫార్ములానే. లారెన్స్ మళ్లీ అలాంటి జోనర్‌లోకి వెళ్లారు.
సంపాదన పేరుతో అమ్మానాన్నల్ని వదిలేసి, విదేశాలకు వెళ్లి స్థిరపడే వారసులకు ఈ సినిమాతో ఓ భయంకరమైన నిజాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అమ్మానాన్నల్ని అనాథలుగా వదిలేస్తే ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో కళ్లకు కట్టారు.
బహుశా, ఈ పాయింట్ నచ్చే, రొటీన్, కమర్షియల్ ఫార్ములా అయినా లారెన్స్ ఈ జోనర్‌లో సినిమా చేసి ఉంటారు.
లవ్ ట్రాక్ ఎలా ఉంది?
భూమి పాత్రలో శరత్ కుమార్‌ను భారీ ఎలివేషన్లతో పరిచయం చేయడం దగ్గర నుంచి కథ మొదలవుతుంది.
ఆ వెంటనే ఓ ఫైట్. ఈసారి హీరో (లారెన్స్) ఎంట్రీ ఇస్తాడు. భూమి అనుచరుడిని కిరాతకంగా చంపేస్తాడు. అక్కడ్నుంచి రుద్ర ఎవరు? అనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీ మొదలవుతుంది.
ఈ ఫ్లాష్ బ్యాక్‌లో రుద్రగా లారెన్స్ అల్లరి, కుటుంబంతో తనకున్న అనుబంధం, ప్రేమ కథ.. ఇవన్నీ చూపిద్దామనుకొన్నారు దర్శకుడు కదిరేశన్.
ఆ సన్నివేశాలు ఎంత సరదాగా ఉంటే, ఎంత ఎమోషన్ పండితే అంతగా హీరో ప్రతీకారంతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కానీ, సదరు సన్నివేశాలు ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలా ఉంటాయి.
కామెడీ సీన్లు కాస్తా వెకిలిగా మారిపోయాయి. అమ్మానాన్నలతో ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, వాళ్లతోనూ మాట్లాడకూడని కొన్ని విషయాలు ఉంటాయి. వాటిని ప్రధాన పాత్రలతో మాట్లాడించి, ముతక డైలాగులు చెప్పించి, దాన్ని కామెడీ అనుకోమన్నారు.
హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ రొటీన్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్స్‌లా అనిపిస్తుంది. కొంత ఫ్లాష్ బ్యాక్, ఇంకొంత ప్రజెంట్.. ఇలా కథని ముక్కలు ముక్కలుగా చేసేశారు.
హీరోకు ఓ తీరని అన్యాయం జరిగిందన్న విషయం ఆడియన్స్‌కు అర్థమవుతూనే ఉంటుంది. దానికి భూమి (శరత్ కుమార్) కారణం అనే సంగతీ తెలుస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు హీరో జీవితంలో వచ్చిన ఆ కుదుపు ఏమిటో ప్రేక్షకులకు వీలైనంత త్వరగా చెప్పగలగాలి. కానీ అసలు కథను క్లైమాక్స్ ముందు వరకూ దాచేశారు.
ఈ మధ్యలో వచ్చిపోయే సన్నివేశాలు ప్రేక్షకుల మదిని తాకవు.
ఇక ఫైట్లు... వన్ సైడ్ వారే. హీరో కొడితే రౌడీ మూక ఎగిరెగిరి పడాలి అనే మూస పద్ధతే. హీరోకు అడ్డూ అదుపూ ఉండదు. హీరో తెలివితేటలకు పని ఉండదు. కేవలం భుజ బలం మాత్రమే చూపిస్తాడు. పతాక సన్నివేశాల్లో శత్రు సంహారంతో మరింత సాదాసీదాగా ముగింపు కార్డు వేసేశారు.
ఫైట్లలో ఆ దరువులతో చెవులకు పట్టిన తుప్పు వదిలిపోతుంది.
పాయింట్ బాగుంది కానీ...
డబ్బు వ్యామోహంలోనో, సంపాదించాలన్న ధ్యేయంతోనో, అవసరాల కోసమో అమ్మానాన్నల్ని వదిలి విదేశాలకు వెళ్లిపోతున్నారు బిడ్డలు. సొంతూర్లో పిల్లల కోసం ఎదురు చూస్తూ అనాథలుగా మారిపోతున్నారు అమ్మానాన్నలు. వాళ్ల చావు, కర్మకాండలు కూడా పిల్లలు ఆన్ లైన్‌లోనే కానిచేస్తున్న సందర్భాలు ఉన్నాయి.
ఇవన్నీ హృదయాన్ని బరువెక్కించే విషయాలే. వాటిని ఎత్తుకొంటూనే, వీటి చుట్టూ జరిగే దందాను కళ్లకు కట్టేప్రయత్నం చేశారు. దాన్ని పతాక సన్నివేశాల ముందు చూపించారు.
కానీ, ఇదే పాయింటుతో కథంతా తిప్పితే బాగుండేది. బలమైన సందేశాన్ని చెప్పే వీలు దక్కేది.
హీరో మిస్టరీని ఎలా ఛేదించాడు? ఎలా ఆ ముఠాని పట్టుకొన్నాడు? అనేది అసలు పాయింట్ అయితే రుద్రుడు కథ మరో స్థాయిలో ఉండేది. కేవలం ఈ పాయింట్‌ను రేఖామాత్రంగా వాడుకొన్నారు.
ఆ పాటలో ఉన్నది ఏ భాషో!
ఇది డబ్బింగ్ సినిమా. అనువాద చిత్రాల్లోనూ మంచి పాటలు ఈ మధ్య వినిపిస్తున్నాయి. కానీ రుద్రుడు ఆ అదృష్టాన్నీ కల్పించలేదు.
తొలి పాటలో వినిపించే పదాలు తెలుగా, సంస్కృతమా, హిందీనా లేదంటే అవన్నీ మిక్స్ చేసి సృష్టించిన కొత్త భాషా అనేది అర్థం కాదు. `ఫ్రైడ్ రైస్` అనే పదం ఒక్కటే. తెలిసిన పదంలా వినిపించింది. రెండో పాటా అంతే. అమ్మ పాట మాత్రమే అర్థమయ్యేలా ఉంది.
వివిధ సన్నివేశాల్లో లారెన్స్ అవతారం, అతని చూపుల్లో, హారర్ సినిమాల ఎఫెక్టులు కనిపిస్తాయి. బహుశా కాంచన, గంగ లాంటి సినిమాలు చేసీ, చేసీ అలవాటైపోయిందేమో. ఇక డాన్సుల విషయానికి వస్తే ఆయన తనదైన మార్క్ చూపించారు.
ప్రియా భవానీ నటన అంతంతే
శరత్ కుమార్ పాత్ర ఎలివేషన్లకు మాత్రమే పరిమితమైపోయింది. తొలి సగంలో, కారులోంచి దిగి, శవాల వరకూ నడుచుకొంటూ రావడం తప్ప ఆ పాత్ర పెద్దగా కష్టపడిందేం లేదు.
నాజర్‌ను రెండు మూడు సీన్లకే పరిమితం చేశారు.
అనన్యగా కనిపించిన ప్రియా భవానీ నటన, స్క్రీన్ ప్రెజెన్స్ అంతంత మాత్రమే. మిగిలిన వాళ్ల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.
దర్శకుడు కదిరేశన్ ఓ మామూలు రెగ్యులర్ రివైంజ్ ఫార్ములా రాసుకొన్నారు. అమ్మానాన్నలు అనే పాయింట్ తప్ప, ఈ కథలో కొత్తగా ఏం లేదు. ఆ పాయింట్‌నూ బలంగా, ఆకట్టుకొనేలా చెప్పలేకపోయారు.
రుద్రుడు నిర్మాణ విలువలు పర్లేదన్నట్టుగా ఉన్నాయి.
లారెన్స్ అంటే విపరీతమైన అభిమానం ఉండి, హీరో కొడితే రౌడీలు గాల్లో ఎగిరిపోయే రొటీన్ ఫైట్లు చూడాలనుకొనే వాళ్లకు 'రుద్రుడు' ఓ మాదిరిగానే నచ్చుతాడు.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం మునిగిపోయినప్పుడు ఏం జరిగింది?
- సింగపూర్ చంగీ ఎయిర్పోర్ట్: ప్రపంచంలోనే ఇది అత్యుత్తమ విమానాశ్రయమని ఎందుకు అంటున్నారు?
- ముకరం జా: ఈ ఏడో నిజాం వారసుడి రూ.4,000 కోట్ల సంపద ఎలా ఆవిరైంది?
- విశాఖ రుషికొండపై నిర్మాణాలు: హైకోర్టు కమిటీ ఏం తేల్చింది, తెలుగు మీడియా కథనాలు ఏం చెబుతున్నాయి?
- ఎలాన్ మస్క్‌తో బీబీసీ ఇంటర్వ్యూ: ట్విటర్ అమ్మకం, బ్లూటిక్‌ల తొలగింపుపై ఆయన ఏమన్నారు?