'రావ‌ణాసుర' రివ్యూ: ర‌వితేజ హీరోనా? విల‌నా?

    • రచయిత, సాహితీ
    • హోదా, బీబీసీ కోసం

రివైంజ్ డ్రామా అనేది తెలుగు సినిమా పుట్టిన‌ప్ప‌టి నుంచీ ఉన్న‌దే. అది హిట్ ఫార్ములా కూడా.

ర‌వితేజ కూడా.. ఇలాంటి క‌థ‌ల్ని చాలా చేసేశాడు. మ‌ళ్లీ.. ఈ జోన‌ర్‌పై ప్రేమ పుట్టిందేమో.., `రావ‌ణాసుర‌` అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేశాడు. మ‌రి ఈసారి ఈ ప్ర‌తీకారం ఎవ‌రిపై? ఎందుకోసం?

ర‌వీంద్ర (ర‌వితేజ) ఓ జూనియ‌ర్ లాయ‌ర్‌. క‌న‌క‌మ‌హాల‌క్ష్మి (ఫ‌రియా అబ్దుల్లా) ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేస్తుంటాడు. హారిక (మేఘా ఆకాశ్‌) ఓ కేసు నిమిత్తం.. క‌న‌క‌మ‌హాల‌క్ష్మి ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది. కానీ ఆ కేసుని క‌న‌క‌మ‌హాల‌క్ష్మి టేక‌ప్ చేయ‌దు. హారిక‌ని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోయిన‌.. ర‌వీంద్ర ఈ కేసుని త‌న భుజాల‌పై వేసుకొంటాడు.

హారిక తండ్రి (సంప‌త్‌రాజ్‌) ఓ ఫార్మా కంపెనీ య‌జ‌మాని. త‌ను ఓ హ‌త్య కేసులో ముద్దాయి. సాక్ష్యాల‌న్నీ త‌న‌కు వ్య‌తిరేకంగా ఉంటాయి. ఈ ఒక్క‌టే కాదు. సిటీలో ఒకే ప్యాట్ర‌న్‌లో చాలా హ‌త్య‌లు జ‌రుగుతుంటాయి. వాట‌న్నింటికీ హారిక కేసుకీ ఉన్న లింకేమిటి? ఈ కేసుని ర‌వీంద్ర ఛేదించాడా, లేదా? ఇది కేవ‌లం క‌థ‌లో ఓ భాగం మాత్ర‌మే.

మిస్సయిన థ్రిల్

క్లుప్తంగా చెప్పాలంటే... ఇదోరివేంజ్ డ్రామా. హీరో ప్ర‌తీకార గాథ‌. దాన్ని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగా మార్చారు. మ‌ర్డ‌ర్ ఎపిసోడ్ తో క‌థ‌ని చాలా ఆస‌క్తిగా మొద‌లెట్టారు. ఆ వెంట‌నే.. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ మొద‌లైపోతుంది.

ర‌వితేజ ఇమేజ్‌నీ, బాడీ లాంగ్వేజ్‌నీ వాడుకొంటూ రాసుకొన్న స‌న్నివేశాలు చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాలో అవి లేక‌పోయినా పెద్ద‌గా ఇబ్బందేం ఉండ‌దు. నిజానికి మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని మ‌ర్డ‌ర్ మిస్ట‌రీగానే చెప్పాలి. హీరో కోసం క‌మ‌ర్షియ‌ల్ హంగులు జోడించుకొంటూ పోతే.. ఆ థ్రిల్ మిస్స‌వుతుంది.

`రావ‌ణాసుర‌`లో కూడా అదే క‌నిపించింది. ర‌వితేజ కోస‌మే రాసుకొన్న కొన్ని సీన్లు.. తెర‌పై చూస్తున్న‌ప్పుడు బాగానే ఉన్నా ఈ క‌థ‌కు మాత్రం న‌ప్ప‌లేదు. మ‌ర్డ‌ర్ ఎలిమెంట్స్ వ‌స్తున్న‌ప్పుడు ఉన్న ఆస‌క్తి.. ర‌వితేజ సీన్లు చూస్తున్న‌ప్పుడు ఉండ‌దు.

పాటలే మైనస్!

అభిమానుల కోస‌మో, హీరో ఇమేజ్ కోస‌మో కొన్ని స‌న్నివేశాల్ని, పాట‌ల్నీ జోడించాల్సి వ‌స్తుంది. అవి ఏమాత్రం అత‌క్క‌పోయినా అస‌లు క‌థ ప‌క్క దోవ ప‌ట్ట‌డ‌మే కాకుండా, ద‌ర్శ‌కుడి ల‌క్ష్యం దెబ్బ‌తింటుంది.

ఉదాహ‌ర‌ణ‌కు `రావ‌ణాసుర‌`లో పెళ్లి పాట‌, టీజింగ్ పాట‌, చివ‌ర్లో ఐటెమ్ సాంగ్‌... ఇవి మూడూ అన‌వ‌స‌ర‌మే. వాటి వ‌ల్ల క‌థనంలో వేగం త‌గ్గింది. ఆ కాసేపూ.. సినిమా ప‌క్క‌దోవ ప‌ట్టింది.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీలో అసలైన ఆస‌క్తి.. ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? అనే దానిపై ఉండ‌దు. ఆ హ‌త్య నుంచి హీరో తెలివిగా ఎలా తప్పించుకొన్నాడు? అనేదానిపైనే ఉంటుంది. దర్శ‌కుడి తెలివి తేట‌లు కూడా ఇక్క‌డే క‌నిపిస్తాయి. కానీ.. ఇక్క‌డ హ‌త్య‌లు చేసి, త‌ప్పించుకొనే ఎపిసోడ్లు.. చాలా పేల‌వంగా ఉన్నాయి.

హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్న పోలీస్ ఆఫీస‌ర్ (జ‌య‌రామ్)కి తెలుసు. కానీ ఆయ‌న మాత్రం ఏం చేయ‌లేడు. అప్ప‌టి వ‌ర‌కూ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్‌గా చూపించిన జ‌య‌రామ్‌... స‌ద‌రు హీరో చేష్ట‌ల‌కు స్ట‌న్ అయిపోవ‌డం చూస్తే.. ద‌ర్శ‌కుడిపై జాలేస్తుంది.

సాకేత్‌గా కనిపించిన సుశాంత్‌ది కథలో కీలకమైన పాత్రే. ఇలాంటి పాత్రల్లో కనిపించడం ఆయనకి కొత్త. తనపాత్ర వరకూ చక్కని అభినయం కనబరిచాడు. అయితే ఈ పాత్రని ఇంకాస్త బలంగా మలిచే అవకాశం వుంది. ఆ పాత్ర ప్రాధాన్యత పెరిగుంటేమరింత థ్రిల్ ఎలిమెంట్ కలిసొచ్చేది.

అలా వచ్చి ఇలా వెళ్లిన ఆ 'ఐదుగురు'

ఈరోజుల్లో ప్రేక్ష‌కులు.. `ఇలా ఎందుకు జ‌రిగింది? అలా ఎందుకు జ‌ర‌గ‌లేదు` అని వంద లాజిక్కులు తీస్తారు. అలా తీస్తే.. `రావ‌ణాసుర‌` ఏమాత్రం నిల‌బ‌డ‌ని క‌థ‌. ఈ సినిమాకి ఏదైతే బ‌ల‌మైన అంశం అని భావించారో.. దాన్ని తెర‌పై స‌మ‌ర్థ‌వంతంగా ఆవిష్క‌రించ‌డంలో ద‌ర్శ‌కుడు నూటికి నూరుపాళ్లూ విఫ‌లం అయ్యాడు.

క‌థ‌లో అస‌లైన ట్విస్ట్ రివీల్ చేస్తున్న‌ప్పుడు `ఇలా జ‌రిగిందా?` అని ప్రేక్ష‌కుడు ఆశ్చ‌ర్య‌పోవాలి. ఇక్క‌డ `ఇది మేం ఊహించిందే క‌దా` అంటూ ఆ సీన్ వ‌చ్చిన‌ప్పుడు కూడా ప్రేక్ష‌కుడు రిలాక్స్ అయిపోతాడు. దాన్ని బ‌ట్టి ట్విస్టు రివీల్ చేసే విధానం ఎంత పేల‌వంగా ఉందో అర్థం చేసుకోవొచ్చు.

నిజానికి క‌థ‌లోని అస‌లైన మ‌లుపు తెలిసేలోగా.. సినిమా పూర్త‌యిపోవాలి. ఎందుకంటే.. ఆ ట్విస్ట్ తెలిసిపోతే, అక్క‌డి నుంచి ప్రేక్ష‌కుల గెస్సింగులు మొద‌లైపోతాయి. క్లైమాక్స్ ఏమిటో ప్రేక్ష‌కులు ఊహించేలోగా శుభం కార్డు ప‌డిపోవాలి. కానీ.. `రావ‌ణాసుర‌` అది కూడా జ‌ర‌గ‌లేదు. అస‌లైన ట్విస్ట్ ఇంట్ర‌వెల్ ముందే వ‌చ్చేస్తుంది. అక్క‌డి నుంచి.. ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడు ఈజీగా గెస్ చేయ‌గ‌ల‌డు. ప‌తాక స‌న్నివేశాలు సైతం ఊహాతీతంగా ఏం లేవు.

ర‌వితేజ‌కు ఇది కొత్త త‌ర‌హా పాత్ర కావొచ్చు. కానీ ప్రేక్ష‌కుల‌కు కాదు. నెగిటీవ్ ట‌చ్ ఉన్న పాత్ర పోషించాల‌న్న ఆశ ఉంటే... దానికి క‌ట్టుబ‌డి పోవాలి. కానీ అభిమానుల కోస‌మో, త‌న ఇమేజ్ కోస‌మో చూసుకొని, లెక్క‌లేసుకొని, వాటి కోసం కొన్ని స‌న్నివేశాల్ని ఇరికించాల‌న్న ప్ర‌య‌త్నం చేయ‌కూడ‌దు. కానీ.. రావ‌ణాసుర‌లో అవ‌న్నీ జ‌రిగిపోయాయి.

ఈ సినిమాలో ఐదుగురు క‌థానాయిక‌లు ఉన్నారు. కానీ... ఎవ‌రికీ స‌రైన పాత్రే దొర‌క‌లేదు. క‌నీసం.. ఏ పాత్ర‌కీ స‌రైన ఆరంభం, ముగింపు లేవు. అను ఇమ్మానియేల్ పాత్ర రెండు మూడు సీన్ల‌కు మించ‌దు. ఆ పాత్ర‌ని పేల‌వంగా ముగించారు.

కంచం, మంచం.. అంటూ హీరోతో ప‌లికించిన సంభాష‌ణ అభ్యంత‌ర క‌రంగా ఉంది. అందుకే సెన్సార్ కూడా అక్క‌డ బీప్ వేసింది. జ‌య‌రామ్ పాత్ర‌ని ప్రారంభంలో బాగానే ఎలివేట్ చేశారు కానీ.. రాను రాను... ఆ పాత్ర సిల్లీగా మారిపోయింది. రావు ర‌మేశ్ యాస ఈసారి అత‌క‌లేద‌నిపించింది.

సినిమాలో క్వాలిటీ చూపించిన దర్శకుడు

సూర్య ఐపీఎస్‌లో సూప‌ర్ హిట్ గీతం ‘‘వెయిన్నొక్క జిల్లాల వ‌ర‌కూ వింటున్నాను నీ కీర్తినే..’’ పాట‌ని ఈ సినిమా కోసం రీమిక్స్ చేశారు. ఆ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో కానీ, స‌మ‌యం సంద‌ర్భం లేని రీమిక్స్ ఇది. ఈ పాట‌ని ఆధునీక‌రించిన ప‌ద్ధ‌తీ బాగోలేదు. పెళ్లి పాట‌లో హుషారు లేదు. ఐటెమ్ గీతం కూడా అల‌రించ‌లేక‌పోయింది.

టెక్నిక‌ల్ గా ఈ సినిమా బాగానే ఉంది. త‌క్కువ బ‌డ్జెట్ లో మంచి క్వాలిటీ మేకింగ్ చేయ‌గ‌ల‌న‌ని `స్వామి రారా`తో నిరూపించాడు సుధీర్ వ‌ర్మ‌. అలాంటి ద‌ర్శ‌కుడికి ఇంత బ‌డ్జెట్ ఇస్తే క‌చ్చితంగా క్వాలిటీ చూపిస్తాడు. అందులో అనుమానం ఏం లేదు.

ఈ సినిమా టైటిల్స్ లో క‌థ‌, మాట‌లు శ్రీ‌కాంత్ విస్సా అని క‌నిపించింది. అయితే ఈ క‌థ‌కు మూలం.. ఓ బెంగాలీ సినిమా. ఆ సినిమా రైట్స్ కొని అధికారికంగా రీమేక్ చేసిన‌ప్పుడు టైటిల్ కార్డులో `క‌థ‌` అని ఎందుకు వేసుకోవాల్సివ‌చ్చిందో. మాట‌లు కూడా గుర్తు పెట్టుకొనే స్థాయిలో ఏం లేవు. `రావ‌ణాసుర‌` ఏ విష‌యంలోనూ మెప్పించ‌లేక‌పోయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)